బంగారు తీగ

62
6

[dropcap]టై[/dropcap]పు ఇన్‌స్టిట్యూట్ ఇంకా తెరవలేదు. వాచి చూసుకున్నాడు రఘు. సమయం ఉదయం ఆరు.. దారి పొడవునా రోడ్‌కు ఇరువైపులా వున్నా కొబ్బరి చెట్ల కొమ్మల మధ్య నుండి ఉదయ భానుడి నీరెండ ఏటవాలుగా ప్రసరిస్తూ నేలను ముద్దాడుతూ ఉంది. ఆ వెచ్చదనానికి గాలిలో మంచు కరిగిపోతూ ఆ కాంతిలో వింత రంగులను కలబోస్తూ ఉంది. దూరంగా పంటపొలాలు, కాలువల మీదనుంచి వస్తున్న చల్లటి గాలి ఒంటికి తాకుతూ ఉంది. దూరంగా ఆ మంచు తెరల మద్య నుండి హేమ అప్సరస లాగ నడుస్తూ రావటం చూస్తున్నాడు రఘు. మల్లెపూవు లాంటి తెలుపు కాటన్ చీరతో వయ్యారంగా వస్తున్న ఆ అమ్మాయి దగ్గర అవుతున్న కొద్దీ అలాగే చూస్తూ ‘ఎవరో ఈ అమ్మాయి బాగుంది, అందంగా’ అనుకున్నాడు.

రఘు టైప్ నేర్చుకోవడం మొదలు పెట్టి పదిహేను రోజులు దాటింది. ఆ అమ్మాయి నుండి దృష్టి మరల్చి లోపలికి అడుగులు వేశాడు రఘు. టైప్ మెషిన్ ముందు కూర్చొని పేపరు సరి చేస్తుండగా పక్క సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపించి తల తిప్పి చూశాడు. ‘అరే! ఇంతకు ముందు బయట చూసిన ఆ అప్సరస!’ అనుకుని టైప్ కొట్టడం మొదలు పెట్టాడు.

కొద్దిసేపటికి పక్క నుండి కోకిల స్వరం వినిపించింది “ఏవండీ ఈ మిషన్ పనిచేయట్లేదు కాస్త చూస్తారా” అని.

ఆ అప్సరస వైపు చూసి చూడనట్టుగా చూసి, మెషీన్‌ను చూశాడు రఘు. ఒకేసారి రెండు మూడు కీస్ కొట్టడం మూలాన అవి ఒకదానికొకటి ఇరుక్కొని ఆగిపోయాయి. కాస్త పక్కగా జరిగి, తన కుడి చెయ్యి చాపి వాటిని సరిచేసి “ఇప్పుడు ట్రై చేయండి” అన్నాడు. అది పని చేయడం మొదలు పెట్టింది.

“థాంక్స్ అండి” అని ఎంతో ముద్దుగా సమాధానం చెప్పింది అప్సరస.

“వెల్కమ్” అని చిరునవ్వు నవ్వి పనిలో మునిగిపోయాడు రఘు.

మర్నాడు ఇలాగే మళ్లీ కోకిల స్వరం వినిపించింది రఘుకు – “ఏవండీ,వీటిని ఎలా టైప్ చేయాలండి” అంటూ.

వాటిని చూసి కాస్త అమ్మాయి దగ్గరకు జరిగి తన కుడిచేతిని ఆ అమ్మాయి చేతుల మీదుగా టైప్ చేయడానికి ట్రై చేస్తుండగా, అటువైపు ఇంకాస్త పక్కగా కూర్చున్న ఇంకొక అమ్మాయి రఘును చూసి – “ఇక్కడ హేమ మిషన్ మీద అక్కర్లేదు. మీ మిషన్ మీద టైప్ చేసి చూపించండి” అని కరుగ్గా చెప్పింది.

ఆ అమ్మాయి గొంతులో కోపం చూసి ఆశ్చర్యపోయాడు రఘు. వారిద్దరినీ ఒక సారి చూసి “మీరు ట్యూటర్ని పిలిచి అడిగితే బాగుంటుంది” అని తన మిషన్ వైపు తిరిగాడు.

ఓహో అయితే ఈ అమ్మాయి పేరు హేమ అన్నమాట. కొంపదీసి హేమమాలిని కాదు కదా అని నవ్వుకున్నాడు.

ఆ రోజు ఇంట్లో వేడి వేడి ఇడ్లీలు తిన్నాక “అమ్మా! ఈ రోజు, నేను రేవతి అక్క ఇంటికి వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి రాను. అక్కడే ఉంటాను. సాయంత్రం వస్తాను” అంటూ అమ్మకు చెప్పి రేవతి ఇంటికి బయలుదేరాడు. రేవతి ఉమెన్స్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేస్తోంది. రఘుకి దూరం చట్టం. అక్క వరస అవుతుంది.

***

మధ్యాహ్నం భోజనం చేసి రేడియో పెట్టుకొని హిందీలో మహమ్మద్ రఫీ పాటలు వింటున్నాడు రఘు. “కాసేపు నేను పడుకుంటాను రా రఘు, నువ్వు కూర్చో” అంటూ రేవతి లోపలికి వెళ్ళింది. కాసేపటికి బయటి తలుపు ముందు అమ్మాయిల గలగలలు, మాటలు వినిపించాయి. “మేడం లోపలికి రావచ్చా?” అని అమ్మాయిలు అడగడం వినిపించింది.

“రండి. లోపలికి రండి. అక్క పడుకుంది లోనికి వెళ్ళండి” అంటూ లేచి దారి చూపించాడు రఘు. అందరి కంటే వెనక వెళ్తున్న అమ్మాయిని చూశాడు. అదే సమయానికి హేమ కూడా తిరిగి వెనక్కి చూసింది. ‘అబ్బో అప్సరస!!! మళ్ళీ ఇక్కడ’ అనుకున్నాడు రఘు.

‘ఈ అబ్బాయి ఏంటి ఇక్కడున్నాడు?’ అనుకుంది హేమ. లోపలికి వెళ్ళిన అమ్మాయిలు అరగంట తర్వాత మళ్ళీ బయటకి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ క్రీగంట రఘును చూసింది హేమ. రఘు పుస్తకం చదువుకుంటున్నాడు.

అతను చదువుతున్న పుస్తకాన్ని చూసింది. పరవాలేదు, హెరాల్డ్ రాబిన్స్ రచనలు చదువుతాడు అన్నమాట అనుకుంది.

పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ తనకున్న సందేహాలను తీర్చుకోవడానికి రేవతి దగ్గరికి తరచుగా వెళ్ళసాగింది హేమ. హేమ వెళ్లగానే రఘు కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళి పోయేవాడు. వెళ్లిన ప్రతిసారి హేమ కళ్ళు రఘు గురించి వెతికేవి. ఒకరోజు ఉండబట్టలేక హేమ, రేవతిని అడిగేసింది “మేడం, అబ్బాయి ఎవరు? మీ స్టూడెంటా?” అని.

“లేదు లేదు హేమ, తను నా తమ్ముడు. కాస్త ఆగు” అని “ఒరేయ్ రఘు! ఇలా రా.” అంటూ లోపల కూర్చున్న రఘుని పిలిచింది రేవతి. “వస్తున్నా అక్కయ్య” అంటూ తెర తీసుకొని బయటకు వచ్చాడు.

“ఇదిగో ఈ అమ్మాయి హేమలత. మా కాలేజీ స్టూడెంట్. వీళ్ళ నాన్నగారు అసిస్టెంట్ కలెక్టర్ ఇక్కడే.” అంది.

“హలో గుడ్ ఈవెనింగ్” అంటూ గంభీరంగా తలతో అభివందనం చేశాడు రఘు.

“మా రఘుకి కెమిస్ట్రీలో మంచి పట్టు ఉంది. నీకు ఏమైనా అనుమానాలు ఉంటే రఘుని కూడా అడిగి నివృత్తి చేసుకోవచ్చు.” అని సలహా ఇచ్చింది రేవతి.

ఆ తర్వాత రఘుని చాలా విషయాలు అడిగేది హేమ. కెమిస్ట్రీలో ఏది అడిగినా ఆ విషయాన్ని అనర్గళంగా చాలా సరళంగా చెప్పడం చూసి ఆశ్చర్యపోయింది హేమ.

దాని తర్వాత టైపు ఇన్‌స్టిట్యూట్‌లో కూడా వారి సాన్నిహిత్యం పెరిగి పోయింది. రేవతి ఇంట్లో ఒక సాయంత్రం తన స్నేహితురాండ్లతో కలిసి పాటలు సాధన చేస్తుండగా రఘు కూడా వచ్చి కూర్చున్నాడు. కాసేపటికి పాటలు ఆపిన తర్వాత రఘు కేసి చూసి “మీ నాన్న గారి పేరేమిటి, ఏమి చేస్తారు” అంది హేమ.

“నాన్న గారి పేరు శర్మ, కలెక్టర్ ఆఫీస్‌లో హెడ్ క్లర్క్”

“అంటే మా నాన్న గారి ఆఫీస్ లోనే?”

“మీ నాన్న గారి పేరేమిటి” అడిగాడు రఘు.’

“భాస్కర్ రావు, అసిస్టెంట్ కలెక్టర్”అంది హేమ.

“ఆమ్మో! అయితే మీరు కలెక్టర్ కూతురు అన్న మాట!!” నవ్వాడు రఘు.

హేమ, రఘు వాళ్ళ తల్లితండ్రులు ఒకరినొకరు ఎన్నో సంవత్సరాలుగా ఎరుగుదురు. కాకపోతే వారి మధ్య రోజువారీ సన్నిహిత సంబంధాలు లేవు.

మరుసటి రోజు ఉదయం అల్మరా తీసి ఈ రోజు ఏ చీర కట్టుకోవాలి అబ్బా అనుకుంటూ రఘు గురించి ఆలోచించసాగింది హేమ.

ఒక రోజు నాన్నను అడిగింది హేమ “నాన్న, మీ ఆఫీస్ లో మధుసూదన్ గారు తెలుసా?”

“అవునమ్మా మా ఆఫీస్ లోనే చిన్న ఉద్యోగి. మా పెళ్లయిన కొత్తలో, తణుకులో మీ నాన్నగారు తాసిల్దార్‌గా ఉన్నప్పుడు వాళ్లు మన ఇంటి పక్కగా ఉండేవారు. ఆ తర్వాత మనం అమలాపురం వచ్చేసాం. వాళ్లు కూడా ఇక్కడే అనుకోకుండా ఒకరోజు కలిసారు వాళ్లది కూడా అమలాపురం అట” అని రఘు కుటుంబం గురించి చెప్పింది హేమ అమ్మ గారు.

ఈ విషయం గురించి రఘు, వాళ్ళ అమ్మ దగ్గర ఆరాతీయగా ఆవిడ కూడా “ఉండేవారు, కానీ వాళ్లకి బాగా డబ్బు పొగరు ఎక్కువ” అని చెప్పింది. రఘుది మధ్య తరగతి కుటుంబం. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న రఘు ప్రభుత్వ ఉద్యోగం కొరకు అన్వేషణలో ఉన్నాడు. రఘు తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు చదువుకుంటున్నారు. ఆ కుటుంబం పైకి రావడానికి తర్వాత బాధ్యతలన్నీ రఘు మీదే ఉన్నాయి.

మరుసటి రోజు ఎప్పటి లాగే ఇన్‌స్టిట్యూట్ ముందు కలుసుకున్నారు ఇద్దరు.

“హలో! హేమ గుడ్ మార్నింగ్! ఇవాళ చాలా త్వరగా వచ్చేసారు, కానీ మన ఇన్‌స్టిట్యూట్ తలుపులు ఇంకా తీయలేదు” అన్నాడు నవ్వుతూ రఘు.

 “అరే అలాగా” అంది ఆశ్చర్యపోతూ కానీ రఘు గురించే త్వరగా వచ్చేసింది హేమ.

“పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పరీక్ష దేనికి అప్లై చేశారు” అడిగింది.

“లేదండీ. దేనికి చేయలేదు. బ్యాంకు పరీక్షలకి, సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నాను” అన్నాడు చిరునవ్వుతో. అతడికి మనసంతా కలచి వేసినట్టు అయ్యింది. తోటి స్నేహితులందరూ కూడా ఎమ్మెస్సీ చదవడానికి వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. తనేమో ఉద్యోగాన్వేషణలో ఉన్నాను అనుకున్నాడు.

***

ప్రతి ఆదివారం వెళ్లినట్టు గానే రఘు ఒక ఆదివారం నాడు అక్కయ్య రేవతి ఇంటికి వెళ్ళాడు.

“కూర్చో రా.. రఘు. పెద్దమ్మ, పెద్దనాన్న బాగున్నారా” అంటూ పలకరించి వంటింట్లోకి వెళ్ళింది.

పెద్ద చదువుల్లో పడి పెళ్లి కాస్త ఆలస్యం అయ్యేటప్పటికీ రేవతికి సంబంధాలు కూడా రావడం ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నాయి. కాసేపటికి ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు నలుగురు వారితోపాటు హేమ గలగలా మాట్లాడుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. లోనికి రాగానే చుట్టూ చూసింది హేమ. అయితే ముందు గదిలో ఎవరూ లేరు. “మేడం! ఉన్నారా!!” అంటూ రెండో గది లోకి ప్రవేశించింది.

అమ్మాయిల అలికిడి విని చటుక్కున లేచి కూర్చున్నాడు రఘు. లోపలి గది తెర తీయగానే రఘును చూసి హేమ మనసు ఉవ్వెత్తున ఎగిరిపడింది. హృదయంలో కలుగుతున్న అలజడి, ఎగిసిపడుతున్న ఆనందం మొహంలో కనిపించకుండా ఎంత జాగ్రత్త పడినప్పటికీ అప్పటికే ఆ గదిలోకి ప్రవేశించిన రేవతికి హేమ మొహం చూడగానే కొద్దిగా అర్థం అయింది.

“ఏంటమ్మా ఇలా అందరూ ఒకటే సారి వచ్చేసారు. రండి, కూర్చోండి” అంది.

అక్కడే ఓ పక్కగా చాప పరుచుకొని అమ్మాయిలందరూ కూర్చున్నారు. వెంటనే రఘు లేచి ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన అందరికీ రఘు ఇంతకుముందే పరిచితుడైన మూలాన అందరూ ఒక్కటై “అది ఏంటి అన్నయ్యా, అలా వెళ్ళిపోతున్నారు, రండి రండి” అంటూ పిలిచారు.

రేవతి వాళ్లని చూపిస్తూ “నీకు వీళ్ళందరూ తెలుసుగా రఘు, కూర్చో పరవాలేదు, రఘు! హేమలత చక్కటి గాయని. చాలా బాగా పాడుతుంది” అని కొత్త విషయాన్ని బయట పెట్టింది.

కాసేపు అమ్మాయిలందరూ రేవతితో రాబోయే కాలేజ్ డే ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నారు.

“అది సరే. హేమలత! నువ్వు ఒక పాట పాడు, విందాం” అంది రేవతి.

“ఏ పాట పాడాలి, మేడం. మీరే చెప్పండి” అంది.

“ఇప్పుడు కాలేజీ ప్రోగ్రాంలో ఏది పాడుదాం అని అనుకుంటున్నావో అదే, ‘వందేమాతరం’ ఆనంద మఠ్ సినిమా లోని పాట పాడు” అన్నారు.

హేమ ఆ పాట పాడటం మొదలు పెట్టింది. హేమ పాడుతూ ఉంటే చుట్టూ ఆర్కెస్ట్రా లేకపోయినప్పటికీ సంగీత వాయిద్యాలన్నీ ఉన్నంత మాధుర్యంగా అనిపించింది. రఘుకు పాటలంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచి గాయని.

ఆ పాట వింటూ అందరు మైమర్చిపోయారు. తన కష్టాలన్నీ మర్చిపోయాడు రఘు. ఇంకొక పాట పాడు ఇంకొక పాట పాడు అంటూ అందరూ హేమను అడిగారు. సరేనంటూ ‘కబీ కబీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’ పాడింది. ఆ పాట ఆపగానే ఈ లోకం లోకి వచ్చి పడ్డాడు రఘు.

“మా తమ్ముడు రఘు హస్తసాముద్రికంలో దిట్ట. చాలా బాగా చెబుతాడు, మీకు తెలుసా” అంటూ ఉత్సాహంగా చెప్పింది రేవతి. దాంతో అమ్మాయిలందరూ లేచి నిలబడి రఘు చుట్టూ మూగారు, చేతులు చూపిస్తు. అదిచూసి తన పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది రేవతి.

ఒకరి తర్వాత ఒకరి అరచేతులు చూస్తూ తనకు తెలిసిన కొద్దిపాటి విద్యతో కొన్ని విషయాలు చెప్పాడు రఘు. అందరూ అయిపోయిన తర్వాత హేమ రఘు ముందు నిలబడి తన అరచేతిని ముందుకు చాచింది. హేమ తన సాన్నిహిత్యం కోరుతుందని రఘు అర్థమైంది. దాంతో కాస్త ఇబ్బందిగా అరచేయి మాత్రం ముట్టుకోకుండా దూరం నుంచి రేఖలు గమనించి కొన్ని విషయాలు చెప్పాడు.

అందరి చేతులు పట్టుకున్నాడు, నాకు మాత్రం దూరం నుండి, ఎందుకో అని నవ్వుకుంది హేమ.

అమ్మాయిలందరూ వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. “మీరు వెళ్ళండి. నేను కాసేపు మేడంతో కూర్చుని వస్తాను” అంటూ వాళ్ళని సాగనంపింది హేమ.

“నేను మళ్ళీ వస్తాను అక్కయ్యా” అంటూ చటుక్కున లేచి రేవతి సమాధానం చెప్పేలోగా బైటికివెళ్ళిపోయాడు రఘు.

బయటకు వచ్చి మనసులో అనుకున్నాడు, ఈ అమ్మాయి మనసును చాల కలవర పెడుతోంది, కాస్త దూరంగా ఉండాలి. పైగా బాగా డబ్బు తాహతు వున్న కుటుంబం. నేను నా లిమిట్స్‌లో ఉండటం మంచిది అనుకుని ఇంటి దారి పట్టాడు.

మరుసటి రోజు టైపు ఇన్‍స్టిట్యూట్ నుండి బయటకు వస్తూ “మీకు వీలైనప్పుడు మా ఇంటికి రండి. మా ఇంట్లో అందరూ మిమ్మల్ని గుర్తుపడతారు” అంది.

“అలాగా వస్తానండీ. ఆ విషయానికి వస్తే మీ గురించి మా అమ్మని అడిగాను. మీరు అందరూ తెలుసట, మీరు కూడా రావచ్చు కదా” అన్నాడు.

అసలు అబ్బాయిలు అంటే ఇలా ఉండాలి ఎంత సౌమ్యంగా ఉంటాడు, పైగా నా అందం ఆకర్షణ కి ఏమాత్రం తొణకడు. నేనంటే ఇష్టమే కానీ బయట పడటం లేదు అని అనుకుంది హేమ.

ఈ అమ్మాయిని చూస్తుంటే అసలు వదల బుద్ధి కావట్లేదు ఈ అమ్మాయిలో ఏముంది అసలు ఆకర్షణా లేక అందమా? ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా నా ఆలోచనల్లో తిరుగుతుంది అనుకున్నాడు రఘు.

మరుసటి ఆదివారం రఘు ఎప్పటిలా రేవతి అక్క దగ్గర కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉన్నాడు. ముందు తలుపుకు ఉన్న కర్టెన్ ప్రక్కకు తోసి లోనికి అడుగు పెట్టింది హేమ “గుడ్ ఈవెనింగ్ రేవతి మేడం” అంటూ.

“ఓకే ఓకే, కూర్చో. ఏంటి ఒక్కదానివే వచ్చావా?ఫ్రెండ్స్ ఎవరు రాలేదా?” అంది.

“అవును మేడమ్ కొన్ని డౌట్స్ ఉంటే వాటిని వాటిని తీర్చుకుందామని వచ్చాను” అంది. కూర్చోబెట్టింది రేవతి.

“ఓకే, మరి నే వెళ్ళనా” అంటూ లేచాడు రఘు.

“ఏమిటి, ఎందుకు తొందర. అలా కూర్చో కూర్చో” అని.

“మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను” అంటూ వంటింట్లోకి వెళ్ళింది రేవతి.

“ఇంత ముందు మీరు నా జ్యోతిష్యం సరిగా చెప్పలేదు ఈసారైనా సరిగా చెప్తారా?” అంటూ ముందుకు వచ్చింది చొరవగా తన చెయ్యి ముందుకు సాచి.

మనసుని అదుపులో పెట్టుకొని హేమ అరచేతి వేళ్లని మృదువుగా పట్టుకున్నాడు రఘు.

హమ్మయ్య మొత్తానికి నా చెయ్యి పట్టుకున్నాడు రా బాబు అనుకుంది హేమ తన మనసులో.

ఎంతో మంది అమ్మాయిల చేయి పట్టుకొని హస్తసాముద్రికం చెప్పినప్పుడు రఘుకు ఏమీ అనిపించలేదు కానీ ఈ హేమ చెయ్యి పట్టుకున్నప్పటినుంచి ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాడు.

హేమ కూడా ఆ విషయం గమనించి పర్వాలేదు అబ్బాయికి కొన్ని కదలికలు మనసులో ఉన్నాయి అనుకుంది.

“మీరు మీ ఇంట్లో ఏమీ ఇంటి పనులు చేయరు కదూ” అన్నాడు రఘు.

“ఎందుకని, ఎందుకలా అనుకుంటున్నారు?”

“మీ అరచేతిలో వేళ్ళు మృదువుగా ఉన్నాయండి, అందుకని”

“నిజమే మా ఇంట్లో పని మనుషులు, వంట మనుషులు అందరూ ఉన్నారు కదా, నాకు ఏమి పని ఉండదు.”

అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఒకరి చేయి ఒకరు, రేవతి గదిలోకి ప్రవేశిం చేవరకు వదిలిపెట్టలేదు.

హేమలత వెళ్లిపోయిన తర్వాత రేవతి రఘు నుద్దేశించి అంది “ఏంట్రా, ఈ అమ్మాయి తెగ వచ్చేస్తూ ఉందీ మధ్య, నువ్వంటే కాస్త అభిమానం ఎక్కువ లాగుంది… అవును ఇంతకీ వీళ్ళు మన వాళ్లే కదా” అని అడిగింది.

“మన వాళ్లే కానీ, ఇష్టం సంగతి తర్వాత ముందు నా కుటుంబ పరిస్థితి, నా బాధ్యతలు, నా ఆర్థిక పరిస్థితి తెలిసిందనుకో మళ్ళీ చెప్పాపెట్టకుండా పది కిలోమీటర్లు, వెనక్కి చూడకుండా పరుగెత్తి పారిపోతుంది” అన్నాడు పగలబడి నవ్వుతూ.

“అదేమీ కాదులే నువ్వూరికే బీద అరుపులు మానెయ్యి” అంది రఘు మనసు తేలిక పడటానికి.

ఇంతలో రఘు అంటే అంత్యంత అభిమానం చూపించే వెంకీ వచ్చాడు.

“ఏరా ఏం చేస్తున్నవిక్కడ నేను నీ గురించి ఇంటికి వెళ్లి వచ్చాను”.

“ఇదుగో ఇప్పుడే,ఇంట్లో ఏమి తోచక ఇటు వచ్చా,”

“రేపు కలక్టరేట్ గ్రౌండ్స్ గర్ల్స్ వన్ డే క్రికెట్ వుంది. మనం అటు వెళ్ళాలి” అన్నాడు వెంకీ..

“సరే ఎన్ని గంటలకు”

“సరిగ్గా ఎనిమిది ఉదయాన్నే నా దగ్గరికి వచ్చేస్తే ఇద్దరం కలిసి నా బండి మీద వెళదాం” అన్నాడు.

“అక్కా మేం వెళ్తున్నాం” అంటూ బయటపడ్డారు. అప్పటికే చీకటి పడింది. ఇంటికి వెళుతూ దారిలో వెంకీ ఇంటి ముందు వున్న ఇసుకలో జారగిలా పడి వెల్లకిలా పడుకొని మౌనంగా చాలా సేపు గడిపారు. ఆకాశంలో మబ్బులు మూసుకుని చంద్రుడు కనపడటం లేదు. చల్లని గాలి వీస్తూ వుంది. వీధిలో జనాలందరూ ఇళ్లకు తిరిగి వెళ్తూ వున్నారు.

“ఏంటి సంగతి. హేమలతతో ఈ మధ్య బాగా కలుస్తున్నట్లున్నావు.” అన్నాడు వెంకీ

“ఏమోరా, నాకు గవర్నమెంట్ వుద్యోగం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మా చెల్లి పెళ్లి చేస్తామో?. నాన్నగారు బాగా బెంగ పెట్టుకున్నారు. ప్రసుత్తం హేమలత గురించి ఆలోచించ లేను. అయినా ఆ అమ్మాయికి నా పరిస్థితి ఏం తెలుసని. పైగా వాళ్ళ నాన్నగారు జిల్లాలో పెద్ద ఉద్యోగి. మన లాంటి మధ్య తరగతి కష్ట జీవులని ఎవరు ఇష్ట పడతారురా. అయితే గియితే ఒక వేళ పడ్డా కూడా పెళ్లి వరకు రారు.” అని ఒక నిరాశతో కూడిన నవ్వు నవ్వాడు.

ఏమీ సమాధానం చెప్పలేదు వెంకీ.

ముకేశ్ పాటలు పాడుకుంటూ అందులో వుండే బాధతో కూడిన అర్థాల గురించి కాసేపు చర్చించుకొని లేచి ఇళ్లకు వెళ్లిపోయారు.

మరుసటి ఉదయం రఘు, వెంకీ ఇద్దరూ కలిసి అమ్మాయిల క్రికెట్ చూడటానికి వెళ్లి టికెట్స్ చూపించి టెంట్స్ కింద కుర్చీలలో కూర్చొని గేమ్ చూడసాగారు. ఇంతలో తెల్లటి స్పోర్ట్స్ డ్రెస్‌లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి రఘు, వెంకీ పక్కన నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి తన స్నేహితురాలితో “మేరె మెహబూబ్ షాయాద్ ఆజ్ నారాజ్ హాయ్ ముఝ్ సె పాట విన్నావా” అని ప్రశ్నించింది.

“లేదు” అంటూ సమాధానం చెప్పింది ఇంకో అమ్మాయి.

ఇదేదో చిర పరిచితమైన స్వరం లాగ వుందే అనుకుంటూ వెనక్కు తిరిగి చూసారు వెంకీ,రఘు. వెనక నిల్చున్న హేమ వీళ్ళను చూసి చిరునవ్వు చిందించింది.

“అరెరే!! మీరేనా, మీరు క్రికెట్ క్లబ్ సభ్యులా” లేచి నించొని ఆశ్చర్యంగా చూసాడు రఘు.

“కాదు. నేను క్లబ్ సెక్రటరీ.” కాస్త చిరుకోపం నటిస్తూ అంది హేమ.

“సారీ. నాకు తెలీదు.” అనునయిస్తూ అన్నాడు రఘు.

“సరే. ఇప్పుడే వస్తాను,కూర్చోండి” అని వెళ్లి కూల్ డ్రింక్స్ పంపించింది హేమ.

“ఒరేయ్ నీ అదృష్టం కూలిపోను, కలెక్టర్ కూతురు, పైగా అంత అందమైన పిల్ల నీ వెంట బడి హిందీ ప్రేమ గీతాలు ఆలపిస్తూ వుంది. వెధవ.” అని అభిమానంతో రఘును చూసాడు వెంకీ.

కాస్త దూరంగా నిలబడి రఘును చూస్తూ ‘ఎంత గంభీరంగా ఉంటాడు, అమ్మాయిలను చూసి తొణకడు, స్వాభిమానం కూడా ఎక్కువే. నిర్మలమైన కట్టి పడేసే నవ్వు, మంచి మనస్సు, తెలివి, అసలు ఇటువంటి అబ్బాయిలు అరుదు’ అనుకుంది హేమ.

ఒక రోజు రేవతి ఇంట్లో కూర్చొని మాట్లాడు తుండగా హేమ అడిగింది “మీ ఇంటి కి పిలవరా, మీ అమ్మను పరిచయం చేయండి.” సూటిగా రఘు కేసి చూస్తూ.

“దానిదేముందండి,మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి.” అన్నాడు రఘు.

“మీరు పిలిస్తే కదా” కొంటెగా చూసింది హేమ.

కాసేపు ఆలోచించి. ఇక తప్పేట్లుగా లేదు అనుకోని ఎలా రావాలో అడ్రస్ చెప్పాడు రఘు.

ఇంటికి వెళ్లి ఆలోచనలో పడింది హేమ. తాను ఎందుకు సంకోచిస్తున్నాడు. నేనంటే చాలా ఇష్టం అని అర్థం అవుతోంది, కానీ వున్నట్లుండి ముభావంగా అయిపోతాడు. తల్లి గురించి మాత్రం ఎంత సేపైనా మాట్లాడటం ఇష్టం. తన ప్రతి మాటలో తల్లి అంటే విపరీతమైన ప్రేమ వ్యక్తం అవుతూ ఉంటుంది. యిలా రకరకాలుగా ఆలోచిస్తూ మొదటగా రఘు తల్లిని కలవటం ముఖ్యం అని నిశ్చయించుకుంది హేమ.

ఉదయాన్నే లేచి డాబా మీద కూర్చుని తడి బారిన కురులను ఆర పెడుతూ అప్పుడప్పుడే ఉదయిస్తున్న ఉదయ భానుడిని చూస్తూ ఈ రోజు రఘు ఇంటికి వెళ్లి తీర వలసిందే అని తీర్మానించుకుంది. రిక్షా తీసుకుని రఘు చెప్పిన సూచనలు మేరకు సరిగ్గా రఘు ఇంటి గేట్ ముందు దిగింది హేమ.

చిన్న పెంకుటిల్లు. ముందు భాగమంతా పూల మొక్కలు, పెద్ద జామ చెట్టుతో అందంగా కనపడుతోంది ఇల్లు. ముందుగా వున్న ఇనుప గేట్ తీసుకుని లోనికి అడుగులు వేసింది. లోపల నుండి లత పాడిన హిందీ పాట రేడియోలో వినిపిస్తూ వుంది. ఇంటి ముఖ ద్వారం ముందు నిలబడి తెరిచి వున్న తలుపు మెల్లిగా తట్టింది.

“ఎవరూ” అంటూ రఘు చెల్లెలు అరుణ ముందు గది లోకి వచ్చి ప్రశ్నార్థకంగా చూసింది.

“ఇది రఘు ఇల్లేనా” కాస్త నవ్వుతూ అడిగింది హేమ

“అవును లోనికి రండి.” అంది రఘు చెల్లెలు.

కూర్చోమని అక్కడున్న మడత కుర్చీ చూపించింది.

“మీరు, అన్నయ్య క్లాస్‌మేట్ అనుకుంటాను?”

“కాదండి నేను ఉమెన్స్ కాలేజీ రేవతి మేడం స్టూడెంట్‌ను. మీ అన్నయ్య నాకు అప్పుడప్పుడూ కెమిస్ట్రీ ట్యూషన్ చెప్తారు.” అంది చిరునవ్వుతో.

అంతలోనే రఘు తల్లి కూడా వచ్చి “ఏం పేరు అమ్మ నీది, ఎక్కడ వుంటారు” అంటూ ఆఫ్యాయంగా పలకరించింది.

“నా పేరు హేమలత, మా నాన్నగారు భాస్కర రావు, అమ్మ ఝాన్సీ, మీరు తెలుసని అమ్మ చెప్పింది.” మొహం నిండా సంతోషం తొణికిస లాడుతుండగా సమాధానం చెప్పింది..

“కాఫీ తాగుతావుగా” అంటూ లోనికి వెళ్ళింది రఘు తల్లి.

ఇల్లంతా పరికించి చూసింది హేమ. గోడ మీద ఒక ఊపు దేవుళ్ళ ఫోటోలు,ఇంకో వేపు క్యాలెండరు తగిలించి వుంది. ఆ గదిలో రెండు టెక్వుడ్ కుర్చీలు ఒక ఇనప కుర్చీ, ఓక్ టేబుల్ వున్నాయి. టేబుల్ మీద చక్కని ఎంబ్రాయిడరి చేసిన బట్టతో రేడియో కప్పి పెట్టారు. ఇంకో మూల చెక్క స్టూల్ మీద ఉష ఫ్యాన్ తిరుగుతూ వుంది. తలుపులకు పూల తోరణాలు కట్టి వున్నాయి. ప్రతి తలుపు వద్ద డోర్ మాట్స్ పెట్టారు. కిటికీలకు చక్కటి తెరలు కట్టి వున్నాయి. ముందు తలుపుకు ఎదురుగా వినాయకుడి విగ్రహం వుంది. నేల పైన ముగ్గులు అందంగా కనపడుతూ వున్నాయి.

బయట నుండి రఘు తమ్ముళ్ళు ఇద్దరూ లోపలి కి పరిగెత్తుకుని వచ్చి అక్కడ కూర్చున్న హేమ ను చూసి చటుక్కున ఆగి పోయి “నమస్తే అండి” అని మర్యాదగా పలకరించి హేమనే చూస్తూ కూర్చుండి పోయారు.

“మీ అమ్మా నాన్న బావున్నారా, ఎన్నో రోజులు అయ్యింది వారిని చూసి, నేను రమ్మన్నానని చెప్పమ్మా” అంది రఘు అమ్మ గారు.

ఇంట్లో అందరూ చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుతుంటే భలేగా, గమ్మత్తుగా అసలు సమయం తెలీకుండా రెండు గంటలు గడిచి పోయింది. వారి ప్రేమ,అభిమానాలు చూపించే విధానం కూడా చాలా సహజంగా అనిపించి హేమకు అక్కడ నుండి లేవాలనిపించ లేదు. కాసేపటికి “ఇక వస్తానండి” అంటూ లేచింది హేమ.

“కూర్చోండి, భోజనం చేసి వెళ్దురుగాని.” అంది రఘు చెల్లెలు

“అది ఇంకొకసారి, ఇప్పుడు లడ్డు ఖారా తిన్నానుగా” నవ్వింది హేమ

అందరూ బయటకు వచ్చి రిక్షా ఎక్కించి టాటా చెప్పారు. చక్కటి ప్రేమ కలిగిన మనసులు, ఎంత హాయిగా ప్రశాంతంగా వున్నారు అనుకుంది, రిక్షాలో నుండీ వెనక్కి తిరిగి వారిని చూస్తూ హేమ.

‘ఇప్పుడు అయ్యగారు ఎలా తప్పించుకుంటాడో చూద్దాం’ అనుకుంది రఘు గురించి ఆలోచిస్తూ.

***

ఇంట్లోకి అడుగు పెడుతూనే ఝాన్సీ ఎదురోచ్చి “ఎటెళ్ళావే ఇంత సేపు” అని ఒకింత అసహనంగా అడిగింది.

“రఘు ఇంటికి వెళ్ళొచ్చాను” చాలా ఆనందంగా అంది హేమ

“వాళ్ళింటికి ఎందుకే, వాళ్ళవి మధ్య తరగతి కుటుంబాలు. అయినా నీకేం స్నేహం వాళ్ళతో, మీ నాన్నగారితో నిలబడే మాట్లాడుతారు వాళ్ళ నాన్న మధుసూదన్.” అంది చిరాకుగా.

“అమ్మా ! కావచ్చు కానీ, వాళ్ళు చాలా మంచివాళ్ళే, పైగా నిన్ను నాన్నను బాగా గుర్తు చేశారు.” అంది హేమ. చిరాకుగా మొహం పెట్టి “సరే సరే! రా భోజనం చేద్దువు” అంటూ లోపలి వెళ్ళిపోయింది ఝాన్సీ. అమ్మ వెళ్లిన వైపే చూస్తూ వుండి పోయింది హేమ.

హేమ వెళ్లిన కాస్సేపటికి ఇంటి ముందు సైకిల్స్ నిలిపి రఘు, వెంకీ, ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి “అమ్మా! అన్నం పెట్టు, వెంకీ కూడా వచ్చాడు” అని పిలిచాడు.

“ఇప్పుడే హేమ, మీ ఫ్రెండ్ వచ్చి వెళ్ళింది” అన్నయ్య కేసి చూసి చెప్పింది అరుణ.

“ఓహో అలాగా, ఏమందేమిటి.” మొహంలో ఏ భావం లేకుండా అడిగాడు రఘు.

“వాళ్ళ అమ్మా నాన్నకు మనం తెలుసట.” అని చెప్పి భోజనం వడ్డించటానికి వెళ్ళింది అరుణ.

“కోటాలో పాగా….. కోటలో రాణి తోటలో పిల్ల” అన్నాడు నవ్వుతూ వెంకీ.

“నోరు మూయరా.” మనసులో సంతోషిస్తూ, బయటకు లేని చిరాకు నటిస్తూ అన్నాడు రఘు.

***

హేమ కాలేజీలో కల్చరల్ డే కార్యక్రమాలు ఆ రోజు ఆదివారం సాయంకాలం మొదలయ్యాయి. రేవతి ఇచ్చిన ఆహ్వాన పత్రికలూ తీసుకుని రఘు, వెంకీ ఉమెన్స్ కాలేజీ గేట్ వద్దకు చేరుకున్నారు. వీరి రాకను గమనించిన హేమ ఎదురు వెళ్లి రఘును అభిమానంతో కూడిన చూపులతో పలకరించి తీసుకెళ్లి ఆహ్వానితుల వరుసలో కూర్చోపెట్టింది. వెంటనే వెళ్లి ఇద్దరికీ మంచి నీరు, టీ పంపించింది.

అది చూసి “అబ్బో! భలే రాచ మర్యాదలు రోయ్, ఇవన్నీ నీ ఇష్క్, ప్యార్, మొహబ్బత్‌తో వచ్చిన మర్యాదలు.” అని ముసిముసిగా నవ్వాడు వెంకీ.

ఇదంతా గమనిస్తున్న వేరే అమ్మాయిలు హేమను పిలిచి ఇంతకూ “ఎవరీ హ్యాండ్సమ్ బాయ్స్??” అని చిలిపిగా అడిగారు.

“రఘు, అని మా అత్త కొడుకు” అని ఒకింత గర్వంతో తల పైకెగిరేసి చెప్పింది హేమ.

“అంతేనా? ఇంకేమి లేదా??” అని కిల కిల నవ్వారు అమ్మాయిలు. ఆ రాత్రి చాల సమయం అయింది ప్రోగ్రాము పూర్తయ్యేసరికి. రేవతిని ఇంటి వరకు దింపటానికి రఘు వెంకీ అక్కడే ఉండిపోయారు.

హేమను తీసుకెళ్ళటానికి ఎవ్వరూ రాలేదు. అది చూసి రేవతి అంది – “రఘు నువ్వు హేమ ఇంటి వరకూ తోడుగా వెళ్ళు, నేను వెంకీ తో వెళతాను”

“సరే.”అంటూ హేమ వేపు చూసాడు రఘు.

రఘును చూసి “పదండి మనకు నడకే శరణ్యం, గుడ్ నైట్ మేడం”అంటూ రఘుతో బాటు అడుగులు వేసింది హేమ.

అప్పటికే ఊరు నిద్ర పోయింది. ఇద్దరూ ఆ చీకట్లో, వెన్నెల వెలుగులలో నిర్మానుష్యంగా వున్న మార్గంలో ఇంటి దారి పట్టారు. ఊరి కుక్కలు అక్కడక్కడా అరుస్తూ వున్నాయి. అంతా నిశ్శబ్దంగా వుంది. వీరిద్దరి అడుగుల సవ్వడి మాత్రమే విన్పిస్తూ వుంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు వున్నారు. ఇద్దరికీ మనసంతా హాయిగా తేలిపోతున్నట్లుగా వుంది. పక్కలో తోడుగా అలా కల్సి నడవటం చాలా తృప్తిగా ఉంది.

“వచ్చే ఆదివారం మెదక్ చర్చి చూడటానికి వెళ్తున్నాం, మీరు తోడుగా వస్తారా” నిశ్శబ్దాన్నిఛేదిస్తూ అంది హేమ.

“మీ అమ్మాయిల మధ్యలో నేనెదుకండీ” మొహమాటంతో అన్నాడు రఘు,.

“మాకు బాడీ గార్డ్‌గా” అంది చిలిపిగా హేమ.

“నెల జీతం ఎంతిస్తారేమిటి” మొదటిసారి కాస్త చనువుగా అడిగాడు రఘు.

“మీకెంత కావాలంటే అంత” అంది తన మనసుని, భావాలను తెలియ పరుస్తూ. సమాధానం చెప్పలేదు రఘు.

“ఒక్క రోజు కాదు, ఇలా ఇలా జీవితమంతా నడుస్తూ ఉంటే అప్పుడు ఎంత కావాలి?” అని ప్రశ్నిస్తూ మెల్లిగా రఘు వేలిని తన వేలితో పట్టుకుంది హేమ.

“నా జీవితం ముళ్ళ బాట, మీకు తెలీదు” అన్నాడు రఘు తన చేయిని సున్నితంగా దూరం పెడుతూ..

“పర్వాలేదు, నే దాన్ని పూల బాటగా మారుస్తా.” అంటూ రఘు చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది హేమ.

మాటలేమీ లేకుండా అలాగే ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ చీకట్లో మౌనంగా నడవ సాగారు.

“అదిగో మీ ఇల్లు, మరి నే ఇక వెళతాను” అన్నాడు రఘు.

“రేపు అప్పన్నపల్లి బాలాజీ గుడికి వెళదామా” కాస్త సందేహిస్తూ అడిగింది హేమ.

“సరే హేమ గారు, ఎవరెవరు వెళ్ళటం?”అడిగాడు

“నేను ఒక మ్రొక్కు తీర్చుకోవాలి,ఇప్పటికే ఆలస్యం అయ్యింది, మీకు వీలు అయితే మనిద్దరం వెళదాం” వెన్నెల వెలుగులో రఘు కేసి చూస్తూ అడిగింది.

మౌనంగా చూసాడు రఘు.

“రేపు సాయంత్రం నాలుగు గంటలకు నేను రేవతి మేడం ఇంటి దగ్గర మిమ్మల్ని కారులో పికప్ చేసుకుంటాను. సరేనా?” అంది కాస్త ఆత్రుత, సంతోషం కలగలసిన స్వరంతో.

“సరేనండి, అలాగే” అన్నాడు రఘు.

చుట్టూ చీకటి, అలాగే కొద్దిసేపు నిలబడిపోయారు ఇద్దరు. ఆకాశంలో చంద్రుడి వెన్నెల వెలుగులో ఇద్దరూ కాసేపు ఒకర్నొకరు చూసుకుంటూ, మౌనంగా భాషించుకున్నారు.

తన ఇంకొక చెయ్యి కూడా ముందుకు చాపి రఘు రెండవ చేతిని పట్టుకుంది హేమ. ఇద్దరికీ మాటలు కరువయ్యాయి.

కొన్ని క్షణాల తర్వాత, ఒక సారి నిట్టూర్చి “మరి ఇక వెళదామా?” అని సౌమ్యంగా అడిగాడు రఘు.

ఒక సారి గుండెల నిండుగా ఊపిరి పీల్చి “సరే గుడ్ నైట్” అని రఘు చేతులు వదిలేసి వడివడిగా తన ఇంటి గేట్ వైపు అడుగులు వేసింది హేమ.

బంగాళా పై అంతస్తులో తన గది కిటికీలోనుండి జరిగిందంతా చూసి తల పంకించి, ఆలోచిస్తూ వెళ్లి మంచం మీద ఒరిగాడు హేమ తండ్రి భాస్కర రావు.

~

మరుసటి రోజు అనుకున్న సమయానికి తన కారులో రేవతి ఇంటికి వచ్చి – ఇంటి ముందు నిలబడి ఎదురు చూస్తున్న రఘు పక్కన ఆపి, డోర్ తీసి “రండి, ఎంత సేపయ్యింది మీరు వచ్చి?” అంది.

“ఇదుగో, ఇప్పుడే!” అని కార్ ఎక్కి కూర్చున్నాడు రఘు. కార్ ముందుకు పరిగెత్తింది.

“డ్రైవర్! కాస్త మెల్లిగా నడుపు, ఏమిటా స్పీడ్?” కోపంగా అంది ముందు వైపు డ్రైవర్‌ను చూస్తూ.

హేమ ప్రక్కన తగలకుండా దూరంగా, సరిగ్గా కూచొని రిలాక్స్ అయ్యాడు రఘు.

“ఇంతకీ రేవతి మేడంకు ఏం చెప్పినట్లు??” అడిగింది హేమ.

 “లోనికి వెళ్లనే లేదుగా అసలు. నేను వస్తూనే మీరు వచ్చేసారు”

“మేడంకు చెప్పకండి” చిలిపిగా చూస్తూ హేమ.

“మా అక్కయ్య కు నేనంటే మంచి అభిప్రాయం వుంది. చెప్పినా తాను అర్థం చేసుకోగలదు” నమ్మకంగా అన్నాడు రఘు.

హేమ పక్కన కూర్చున్న రఘు మనసు ఒక వేపు ఆనంద డోలికల్లో ఊగుతూ వుంది మరొక వేపు కుటుంబ బాధ్యతలు బరువులు బాధిస్తూ వున్నాయి. కార్ గుడి ముందు ఆగింది.

“డ్రైవర్ ఇక్కడే వుండు, ఎటు వెళ్లొద్దు” దర్పంతో అంది హేమ.

గుడిలో జనాలు చాలా తక్కువగా వున్నారు. దర్శనం, పూజ అయింతర్వాత, “అలా గోదావరి గట్టు దగ్గర కూచుందామా కాసేపు?” అంటూ గుడి వెనక గోదావరి మెట్ల వైపు దారి తీసింది హేమ.

గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. “నాకెందుకో ఇలా గోదావరి ఒడ్డున కూర్చోవటం అంటే ఎంతో ఇష్టం.” రఘును చూస్తూ అంది హేమ.

గోదారి అలల చప్పుడు చేస్తూ వుంది.

“మీకు కాటన్ చీరలు బాగా నప్పుతాయి” హేమను ఆరాధనాపూర్వకంగా చూస్తూ అన్నాడు రఘు.

“అంటే మీరు నాకు పట్టు చీరలు అసలే కొని పెట్టరా?” గల గలా నవ్వింది హేమ.

ఆమె ముగ్ధమనోహరమైన నవ్వుతో సమ్మోహితుడయ్యాడు రఘు.

“ఏంటి, సమాధానం లేదు?” రెట్టించింది హేమ.

రఘు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మెత్తటి గోదావరి గాలి ఒంటిని స్పర్శిస్తూ వుంది. చాలా సేపు ఇద్దరూ అలాగే ఒకరి సాన్నిహిత్యాన్ని ఇంకొకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. గుడిలో గంటలు మోగుతూ వున్నాయి. సంధ్యా రాణి కి వీడ్కోలు చెప్తూ చీకటి, చుట్టూ వున్న వెలుగును ఆక్రమించుకోవటం మొదలయ్యింది.

“మీకు సంగీతం ఎలా అబ్బింది?”మౌనాన్ని ఛేదిస్తూ అడిగాడు రఘు.

“మా నాన్న మంచి సంగీత కళాకారుడు ఒకప్పుడు, అది సరే, కానీ మీకు ఈ హిందీ సాహిత్యంలో ప్రవేశం, కబీర్, తులసీదాస్ పద్యాలు,గజల్స్, వీటి అర్థాలు అవన్నీ అంత విపులంగా ఎలా వచ్చు?” కుతూహలంతో కూడిన ఆరాధన భావంతో అంది రఘు అర చెయ్యిని పట్టుకుంటూ.

“అదంతా మా అమ్మ పెట్టిన ప్రసాదం, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇవన్నీ రోజూ చెప్పుతూ వుంది., అది సరే, మీరు ఒక పాట పాడండి” అన్నాడు.

“ఏ పాట పాడమంటారు ?”

“మీ ఇష్టం హేమ, సారీ హేమ గారు” అన్నాడు రఘు.

 హేమ సుమధురంగా వినిపించని రాగాలు అంటూ పాడుతున్న ఆ పాట అప్పుడప్పుడే పరుచుకుంటున్న వెన్నెల లో గోదావరి నది గాలులతో ఇంకాస్త మధురంగా వినిపించ సాగింది.

గోదావరి నది అలల సవ్వడిలో,వెండి వెన్నెలలో, గుడిలోనుండి వినిపిస్తున్న గంటలు మంత్రాల ఘోష లో హేమ, రఘు, ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా సేపు ఉండిపోయారు. కాస్త పక్కకు జరిగి రఘు బుజం పైన తల వాల్చింది హేమ

వాచీలో సమయం చూసుకుని లేచి నిలబడి తన చేయి అందించి లేపాడు రఘు. ఇద్దరూ కారులో కూడా ఏమీ మాట్లాడుకోలేదు. ఒకరి వేళ్ళు ఇంకొకరి వేళ్ళ మధ్యలో ఉంచి మౌనంగా వున్నారు.. రేవతి ఇంటి వద్ద దిగిన రఘు, వేగంగా వెళుతున్న హేమ కారు వేపు చాలా సేపు చూసి తన ఇంటి వేపు తిరిగాడు.

~

“ఇంత చీకటి పడే వరకు బయట ఉండకు తల్లీ” అన్నారు అప్పుడే లోనికి వస్తున్న కూతురుని చూసి భాస్కర రావు.

“సరే నాన్న” అని తండ్రిని ప్రేమగా చూస్తూ తన గదిలోకి వెళ్ళింది హేమ.

“గట్టిగా మందలించమని చెప్పానుగా, మీరేంటి చేసింది” రుస రుసలాడుతూ అంది ఝాన్సీ.

హేమ గదిలోకి వెళ్లి, అప్పుడే డ్రెస్ మార్చుకున్న కూతురిని చూసి “ఇదిగో హేమ ఆ రఘుతో స్నేహం తగ్గించు, నీకు మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, అబ్బాయిలతో స్నేహం ఈ సమయంలో అనవసరమైన ఇబ్బందులు కలిగిస్తాయి. మంచిది కాదు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. నీకేమైనా కష్టమొస్తే నేను తట్టుకోలేను” అని భయంగా మొహం పెట్టి చెప్పింది ఝాన్సీ. తల్లిని వాటేసుకుని నవ్వింది హేమ.

***

వాణి, హేమ ఇంటికి వెళ్లే సరికే హేమ ఇంట్లో లేదు. ఝాన్సీ ఎదురు వచ్చి “రా రా వాణి ! హేమ కాలేజీ నుండి ఇంకా రాలేదు కూర్చో” అంటూ సోఫా వేపు దారి తీసింది.

“పిన్నీ! మన హేమ ఈ మధ్య ఆ రఘు అనే అబ్బాయితో కాస్త ఎక్కువగా చనువుగా ఉంటున్నట్లు తెలిసింది!! ఎప్పుడు చూసినా ఆ రఘు గురించే మాట్లాడుతోంది. కాస్త చూసుకో” అని కాస్త నసుగుతూ హెచ్చరించింది..

“అలాగ, ఎక్కడ కలుసుకుంటారు వాళ్లిద్దరూ” ఏదో ఆలోచిస్తూ అడిగింది ఝాన్సీ.

“ఇంకెక్కడ,ఆ టైపింగ్ నేర్చుకోవటానికి వెళుతోంది కదా? అక్కడే” అక్కసుతో చెప్పింది వాణి.

“సరేలే, నే చూసుకుంటా నువ్వెళ్లు” అంటూ చిరాకుగా చూసింది ఝాన్సీ.

వాణి వెళ్ళిపోయిన కాసేపటికి మెదక్ నుంచి హేమ తన ఇంటికి చేరుకుంది. మనసంతా ఆనందంతో ఉరకలు వేస్తూ వుంది హేమకు. రఘు ఇంట్లో గడిపిన క్షణాలు కళ్ళ ముందు ఇంకా కదులుతూనే వున్నాయి. ఇంట్లోకి వెళ్ళగానే “అమ్మా” అంటూ ప్రేమగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది.

“ఏమిటే, ఈ రోజు ఇంత ప్రేమ” అంటూ నవ్వింది ఝాన్సీ.

“ఏమీ లేదు ఊరకే” అంటూ రివ్వున గుండ్రంగా తిరిగింది హేమ

“సరే కానీ, ఇంకా నీ టైపు ఎన్ని రోజులు” అంది ఝాన్సీ ముభావంగా

“ఇంకానా, ఊ.. ఇంకా ఆరు నెలలు, ఎందుకే” అంటూ లేచి బెడ్ రూమ్‌లోకి పరుగు తీసింది హేమ. కూతుర్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో,ఏం చెయ్యాలో తెలీక నిట్టూర్చింది ఝాన్సీ.

చాలా సార్లు రఘు ఇంటికి వెళ్లినప్పటికీ హేమకు రఘు కలవటం జరగ లేదు. కానీ ఇంట్లో అందరూ హేమ చాలా సేపు కూచుంటే గాని వదలక పోయేవారు.

ఒకానొక శుభ సమయంలో మధ్యాహ్నం రఘు ఇంటి ముందు ‘పోస్ట్’ అంటూ పిలిచాడు పోస్ట్‌మ్యాన్. అరుణ పరుగెత్తుకెళ్లి పోస్ట్‌మ్యాన్ నుండి కవర్ తీసుకుని వచ్చి అన్నయ్య చేతిలో పెట్టింది. అది స్టేట్ బ్యాంకు లెటర్. చాలా ఆత్రుతతో కవర్ చింపి అందులో విషయం చదువుతూ “అమ్మా అమ్మా” అంటూ పెద్దగా సంతోషం పట్టలేక అరిచాడు రఘు.

“ఏంట్రా ఏమైంది” అంటూ కంగారుగా ఆత్రుతతో రఘు తల్లి అడిగింది.

“అమ్మా! యింక మన కష్టాలు తీరిపోయాయి!!, నాకు బ్యాంకులో వుద్యోగం వచ్చింది.”

 అది విని అమ్మా తమ్ముళ్లు, చెల్లెలు, అందరూ సంతోషంతో నవ్వసాగారు. కుటుంబం అంతా ఆనంద డోలికల్లో తేలిపోయింది..

మరుసటి రోజు రఘు హేమ గురించి టైపు ఇన్‌స్టిట్యూట్ ముందు నిలబడి ఆత్రుతతో చూడసాగాడు. సమయం దాటి పోయింది కానీ హేమ రాలేదు. లోనికి వెళ్లి అన్యమనస్కంగా టైపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు రఘు. వారం పాటు హేమ టైపింగ్‌కు రాలేదు. ప్రతీ రోజు టైపింగ్ అయిపోయిన రెండు గంటల పాటు వేచి చూసాడు. హేమ ఎందుకు రావటం లేదు, ఎక్కడికి పోయింది అనే ఆలోచనలతో గడిపాడు.. బ్యాంకు వుద్యోగం వచ్చిన సంతోషం మాయమై పోయింది, హేమ గురించే ఆలోచిస్తూ వారం రోజులు వెంకీతో గడిపాడు. ఒక రోజు సాయం సమయం అవుతుండగా వెంకీను చూస్తూ “వెంకీ, రేవతి అక్కయ్య ఇంటికి వెళదామా” అడిగాడు.

“పద, ఏదైనా స్వీట్ తీసుకుని వెళదాం.”

రేవతి చేతిలో తన బ్యాంకు వుత్తరం చేతిలో పెట్టి అది చదువుతూ మారుతున్నరేవతి ముఖ కవళికలు చూడసాగారు ఇద్దరు, “ఒరేయ్ గాడిద! ఇంత కూల్‌గా వున్నావేంటి, ఇంత హ్యాపీ కబురు చూసి కూడా” అంటూ రఘు వీపు మీద పిడికిలితో దెబ్బలు వేయ సాగింది రేవతి. అక్కడ వున్న మిగిలిన విద్యార్థినులు కూడా చప్పట్లు చరుస్తూ నవ్వ సాగారు.

అందరూ కూచొని స్వీట్స్ తిని, అంత్యాక్షరి పాటలు మొదలు పెట్టారు. అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది.

హేమ లేని లోటు రఘుకు తెలుస్తూ వుంది. రఘు మనసులో అలజడి ఉందో, ఎందుకలా వున్నాడో వెంకీకి తెలుసు.

“రఘు, నీ ప్రాబ్లెమ్ నాకు తెలుసు, వర్రీ కాకు, రేపో మర్నాడో హేమ వస్తుంది లే, డోంట్ వర్రీ, హ్యాపీ గా వుండు” అని రఘు భుజం మీద చెయ్యి వేసి తట్టాడు వెంకీ.

***

ఉమెన్స్ కాలేజీ మధ్యాహ్నం విద్యార్థినిలు అందరూ చెట్ల కింద కొందరు, కాంటీన్‌లో కొందరు టిఫిన్ డబ్బాలు తీసి భోజనాలు మొదలు పెట్టారు.

రేవతి ని వెదుక్కుంటూ హేమ కెమిస్ట్రీ ల్యాబ్ లో కి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద టిఫిన్ బాక్స్ తెరిచి చపాతీలు తినటానికి ఉపక్రమిస్తూ వుంది రేవతి.

హేమను చూసి,”రా హేమ, ఏంటి టిఫిన్ తెచ్చుకోలేదా?”అని హేమ మొహం చూసి “ఏంటి హేమా అలా వున్నావేంటి, ఏమయ్యింది ఎనీ ప్రాబ్లెమ్?” అని ప్రశ్నించింది రేవతి..

“ఏమి లేదండి మేడం, ఈ రోజు సాయంకాలం ఇంటికి వస్తాను, రఘు వుంటారా” అని అడిగి తల దించుకుంది హేమ.

“ఏమోరా, వస్తాడేమో, పోనీ పిలిపించనా.” హేమ దిగులు చూసి అనునయంగా అడిగింది రేవతి.

“అన్నట్టు నీకు తెలుసా రఘుకు బ్యాంకులో వుద్యోగం వచ్చింది” హేమ కళ్ళలోకి చూస్తూ అంది రేవతి..

వెంటనే హేమ కళ్ళలో మెరుపులు స్పష్టంగా చూసింది రేవతి.

అది చూసి నవ్వి “సరే సాయంత్రం ఇంటికి తప్పకుండా రా.” అని చెప్పి హేమ కళ్ళలోకి సూటిగా చూసింది రేవతి.

“సరే మేడం” అంటూ ఆలోచిస్తూ వెళ్ళిపోయింది హేమ.

వెంటనే ల్యాబ్ అబ్బాయిని పిలిచి “మా తమ్ముడు రఘు ఇల్లు తెలుసుగా, వెళ్లి సాయంత్రం మా ఇంటికి తప్పని సరిగా రమ్మని, నే చెప్పానని చెప్పి రా, వెళ్ళు” అని చెప్పి ఊపిరి పీల్చుకుంది రేవతి.

రేవతి ఇంటికి వెళ్ళేసరికే రఘు ఇంటి బయట నించుని వున్నాడు.

కంగారుగా చూస్తూ “ఏంటక్కా ఏమిటి ఏమైనా ప్రోబ్లమా?” అంటూ దగ్గరకు వచ్చాడు రఘు.

“అబ్బెబ్బే కంగారు పడకు, ఊరికే ఏమి తోచక రమ్మన్నాను, రా చెప్తాను లోపలికి” అంటూ తలుపు తాళం తీసి “కూర్చో నేను డ్రెస్ మార్చుకుని వస్తా” అంటూ లోనికి వెళ్ళింది రేవతి.

ఈజీ చైర్‌లో కూర్చొని బ్యాంకులో పోస్టింగ్ ఎక్కడో ఏమో, హేమలత ఎక్కడో అంటూ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు రఘు. కాసేపటికి కళ్ళు తెరిచేససరికి లీలగా హేమలత కళ్ళముందు నవ్వుతూ కనపడింది.

“ఏంటి అక్కడే నిలబడ్డావు? ఎంతసేపు అయింది వచ్చి హేమ!!, ఏరా రఘు… నువ్వైనా కూర్చోమని చెప్పచ్చుగా” అంది రేవతి.

“పర్వాలేదు మేడం ఇప్పుడే వచ్చా” అంది హేమ; రఘును చూసి ఉప్పెనలా పొంగుతున్న మనసును అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ.

రఘు మనసు సంతోషం ఉప్పొంగుతూ వుంది.

“కూర్చో హేమ…. మీరు మాట్లాడుతూ వుండండి” అని వాళ్ళిద్దరికీ ఏకాంతం కలిగించటానికి లోనికి వెళ్ళిపోయింది రేవతి.

“ఎటు వెళ్ళిపోయావు హేమ, ఇన్ని రోజులు?” అన్నాడు బాధగా రఘు.

“వాణి మా అమ్మతో ఏదో వాగింది, నా టైపింగ్ మాన్పించారు అమ్మ” తల వంచుకుంది.

 కొద్దిగా విషయం అర్థం అయ్యి ఏం మాట్లాడాలో తెలీక మౌనంగా వుండిపోయాడు రఘు.

వున్నట్లుండి కళ్ళు పైకెత్తి రఘును చూస్తూ “మీ అమ్మ, నాన్నగారు మా ఇంటికి వచ్చిమాట్లాడగలరా” అంది.

అసలేమాత్రం ఊహించని ప్రశ్నతో ఆశ్చర్య పోయి హేమ కళ్ళలోకి చూసాడు రఘు. అప్పటికే హేమ కళ్ళలో నుండి నీళ్లు గిర్రున తిరుగుతూ వున్నాయి.

“అరె అదేంటి హేమ!, ఏం జరిగింది, ఊరుకో, ఊరుకోండి, ఏడవకండి….. సరే, సరే వస్తాను” అంటూ ఏం చెయ్యాలో తెలీక హేమను చూస్తూ లేచి దగ్గరకి వచ్చాడు రఘు.

ఇక తనను తాను అదుపు చేసుకోలేక బోరున ఏడుస్తూ రఘు చేతులు పట్టుకుంది హేమ.

“నేను ఉండలేను రఘు, నువ్వు లేకుండా యింక కష్టం. ప్లీజ్”, అంటూ రఘు ఎద మీద తల పెట్టి వెక్కి వెక్కి ఏడవ సాగింది హేమ. “మన విషయం తెలిసి నన్ను మా ఇంట్లో నన్ను టైపింగ్ పంపటం కూడా ఆపేసారు. మీ ఇంటికి కూడా వెళ్ళొద్దన్నారు” అంది.

“సరే ధైర్యంగా వుండు. ముందు కళ్ళు తుడుచుకో. ఎలా చెయ్యాలో ఇంట్లో అమ్మతో ఆలోచించి చెప్తాను. ముందు ఏడుపు ఆపు.” అంటూ కళ్ళ నీళ్లు తుడిచాడు రఘు.

ఇవన్నీ లోపలినుండి వింటూ వున్న రేవతి బయటికి వచ్చి “హేమ! చ, చ, ఇప్పుడు ఏమైందని, ఏ అమ్మాయి తల్లి తండ్రులైనా ఇలాగే చేస్తారు, అందులో తప్పేమి లేదు. మేమంతా ఉన్నాంగా వర్రీ కాకు.” అంటూ హేమను దగ్గరికి తీసుకుని తల నిమురుతూ సముదాయించింది. కాసేపు ఇద్దరూ కూచొని బ్యాంకులో రఘు చేయబోయే వుద్యోగం గురించి మాట్లాడి, మనసులు తేలిక పడ్డాక వెళ్లి పోయారు.

***

ఇంట్లో డాబా మీద చీకట్లో పడుకొని హేమ ఆలోచనలతో నిద్ర పట్టక, అమ్మను పిలిచి వొడిలో తల పెట్టుకుని హేమ విషయం కదిలించాడు రఘు.

“మనం మధ్య తరగతి జీవులం రా చిన్నా, వాళ్లమ్మ చస్తే ఒప్పుకోదు. బాగా వున్నవారు.” అని నిరాశగా నిట్టూర్చింది రఘు తల్లి. “మన తాహతును గుర్తించి మనం మన లిమిట్స్‌లో ఉంటే బాగుంటుంది. వాళ్ల ఇంటికి వెళ్ళితే అవమానం తప్పదు. అయినా నీ గురించి వెళతాము.” అని ప్రేమతో రఘు వెంట్రుకల్లో వేళ్ళు కదిలిస్తూ అంది అమ్మ.

“సరే అమ్మా, నువ్ చెప్పింది కూడా నిజమే., ఒక సారి హేమతో మాట్లాడి నే మళ్ళీ చెపుతా.” అన్నాడు.

“అదే బావుంటుంది, బాగా ఆలోచించు” అంది రఘు తల్లి.

~

“ఇంకా ఎన్ని రోజులు అన్నం మీద అలుగుతావే, నే చెప్పింది అర్థం చేసుకో, ఒక్కగానొక్క కూతురివి. నీ మీదే మా ఆశలన్నీ. ఆ అబ్బాయికి ఇప్పుడు వచ్చిన వుద్యోగం తప్ప ఏమీ లేదని తెలిసింది, పైగా బాధ్యతలు బరువులు. ఆ ఇంటి కెళ్ళి ఏం సుఖపడతావు? అర్థం చేసుకో, మేమేం నీకు శత్రువులం కాదు” అంటూ తల పట్టుకుంది ఝాన్సీ.

రెండు అరచేతులు గడ్డానికి పెట్టుకుని ఆలోచించ సాగాడు భాస్కర రావు.

“నీవు చిన్న పిల్లవు, ఇంకా జీవితం పైన అవగాహన లేదు, కాస్త ఆలోచించుకో అమ్మ” అన్నాడు భాస్కర రావు.

“నేను మీరు చెప్పినట్లే వింటా నాన్నా, కానీ నా మనసు, నా ఇష్టం మీకు చెప్పాను, మీరే అలోచించి చేయండి, రఘు మంచి సభ్యత, చదువు, సంస్కారం వున్నవాడు. ఆర్థికంగా వాళ్లు మనకంటే కింది వారు కావచ్చు నాన్న! కానీ మంచి మనసున్న మనిషి, ఇంట్లో అందరూ ప్రేమ గల మనుషులు… ఆ ఇంటికెల్లితే నే బావుంటానని నమ్మకం నాకుంది.” అంది తల వంచుకుని ఎర్ర బారిన కళ్ళతో హేమ.

“బంగారు పల్లకీలో వూరేగించే సంబంధాలు వస్తున్నాయి, అవి కాదని ఇదేమిటే? మేమేలాగు ఎంతో కష్ట పడ్డాము, నీకెందుకు మళ్ళీ అవే బాధలు.” అంది కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ ఝాన్సీ.

కాసేపు ఎవరూ మాట్లాడలేదు.

“నువ్ ఇలా అర్థం చేసుకోకుండా ప్రేమ దోమ అంటే నేను ఉరేసుకుంటానే” అంది ఝాన్సీ ఆఖరు అస్త్రాన్ని ప్రయోగిస్తూ.

“చాలు, పిచ్చి మాటలు వాగకు, నువ్వు ఈ రాత్రి ఇక్కడే అమ్మాయి వద్దే పడుకో” అంటూ లేచాడు భాస్కర రావు.

రాత్రంతా నిద్ర పోవటానికి బాగా ప్రయత్నించింది హేమ. బ్యాంకులో మంచి వుద్యోగం వచ్చింది, కుల గోత్రాల అడ్డు కూడా లేదు, మరి తన తల్లి తండ్రులకు అభ్యంతరం ఎందుకో అర్థం కాక ఆలోచిస్తూ పడుకుంది.

మరుసటి ఉదయం రఘు, నాన్న మధుసూదన్ తో కలిసి టిఫిన్ చేస్తుండగా

“రఘు, నిన్న రాత్రి మీ అమ్మ, నేను చాల సేపు ఆలోచించామురా. ఈ రోజు భాస్కర రావు ఇంటికి వెళ్దామనుకుంటున్నాము.” చాలా విషణ్ణ వదనంతో అన్నాడు మధుసూదన్.

“అంత అవసరం లేదేమో నాన్న ఇప్పుడే.” అన్నాడు రఘు తండ్రి బాధను గమనించి.

“లేదు లే, త్వరగా వెళ్లి రావటం మంచిది ఇటువంటి విషయాలు ఆలస్యం అయితే చెడిపోతాయి.”

“వాళ్ళే మన ఇంటికి వస్తే బావుంటుందేమో నాన్నా”

“అదీ నిజమే వాళ్లకు డబ్బు భేషజం ఎక్కువ. కాని నాకు నా కొడుకు సంతోషం ముఖ్యం.”

“ఆలోచించండి నాన్నా, అక్కడ మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే లేచి వచ్చేయండి. మరేం పర్వాలేదు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది” అంటూ చెయ్యి కడుక్కోవటానికి లేచాడు రఘు.

సాయంకాలం, రఘు తల్లి తండ్రులిద్దరూ కలిసి భాస్కర రావు ఇంట్లోకి అడుగు పెట్టారు. వీరిని చూసిగుర్తుపట్టిన పని అబ్బాయి, వరండా లో వున్న కుర్చీలు చూపించి లోనికి వెళ్ళాడు.

వీళ్ళు వచ్చిన సంగతి విని హేమ తండ్రి తన భార్యను, హేమను ఒక్కసారి వారి మొహం లోని భావాలను పరికించి చూసి లేచాడు. హేమ తల దించుకుని నిలుచుంది. ఝాన్సీ భర్త వెనకాలే అడుగులు వేసింది. భాస్కర రావును చూడగానే లేచి నిలబడ్డారు రఘు తండ్రి.

“రండి లోపలికి” అని చాలా గంభీరంగా లోనికి దారి చూపించాడు భాస్కర రావు.

అందరూ మధ్య హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఎవరు కూడా పది నిమిషాల పాటు మాట్లాడుకోలేదు.

ఇహ ఇలా కూర్చుంటే లాభం లేదనుకుని ఝాన్సీ ఊపిరి పీల్చుకుని “చెప్పండి, మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటి?” అడిగింది.

”జరిగిందంతా అబ్బాయి చెప్పాడు, ఏది ఏమైనా వారి బాగోగులు చూడవలసింది మనమే కదా?.” అనునయిస్తున్నట్లుగా అంది సుజాత.

“మా అమ్మాయికి బాగా చదువుకున్న అబ్బాయిలు, విదేశీ సంబంధాలు వస్తున్నాయి.” కాస్త అసహనంగా అంది ఝాన్సీ.

“మా అబ్బాయికి కూడా మంచి సంబంధాలే వస్తున్నాయి” నిష్ఠూరంగా అంది సుజాత.

“సుజాత! నువ్వూరుకో” అని, ఝాన్సీ వేపు తిరిగి “అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు, అందుకని వచ్చామమ్మ” కొద్దిగా నెమ్మదిగా అన్నాడు మధుసూదన్.

“మా కూతురు భవిష్యత్తు కూడా మాకు ముఖ్యమే కదా” అన్నాడు భాస్కర రావు పైకి చూస్తూ.

“మా అబ్బాయికి వుద్యోగం వచ్చింది, వాడికి ఇంక ఎటువంటి ఇబ్బంది లేదు” సుజాత సమాధానం చెప్పింది.

“ఏది, ఆ బ్యాంకులో ఉద్యోగమేనా?” కాస్త అవహేళన ధ్వనించింది ఝాన్సీ మాటలో.

“ఏమండీ మనమిక వెళ్దామా?” జరిగిన అవమానాన్ని దాచుకుంటూ అంది సుజాత.

“సరే మా ధర్మం మెం పాటించాం, మీరూ ఆలోచించండి” అని లేచి నమస్కారం పెడుతూ అన్నాడు మధుసూదన్.

లోపలి నుండి అన్నీ వింటున్న హేమకు దుఃఖం ఆగలేదు. బోరున విలపించ సాగింది. ఆ ఏడుపు వినిపించి “చూసారుగా మీ అబ్బాయి చేసిన ఘనకార్యం, హాయిగా ఉండేవాళ్ళం…. అయినా మా ఇంటికి వచ్చే ముందు ఆలోచించి రావాలి” అంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఝాన్సీ.

చేసేదేమి లేక రఘు తల్లి తండ్రులు బయటకు వచ్చేసారు.

~

ఇంటికి తిరిగి వచ్చిన తల్లి తండ్రుల మొహంలో బాధను చూడగానే జరిగిందేమిటో అర్థం అయ్యింది రఘుకు. ఎవ్వరూ మాట్లాకుండా రాత్రి భోజనాలు అన్యమనస్కంగా కానిచ్చారు.

అందరూ నిద్రపోయిన తర్వాత తల్లి – డాబా మీద రఘు దగ్గర కొచ్చి కూచొని “రఘు! మనసు మీదికి తీసుకోవద్దు. మనం వాళ్లకు తగిన సమయం ఇవ్వటం మంచిది. అపురూపంగా పెంచుకున్న ఒక్కతే కూతురు, వాళ్ళ కూతురు ఇచ్చిన ఈ షాక్‌ను, ఎదురు చూడని ఈ నిజాన్ని జీర్ణించుకోవటానికి వారికి సమయం పడుతుంది. అంత వరకూ వేచి చూడటం మన విజ్ఞత. నీకు వీలైతే అమ్మాయికి కూడా ఇదే విషయం చెప్పు.” అని చాలా ధీమాగా చెప్పి వెళ్ళిపోయింది.

ఆ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది రఘుకు. ఉదయాన్నే ఇంటికి వచ్చిన వెంకీతో అన్ని విషయాలు చెప్పింది అరుణ. అన్నీ విని “సరే చూద్దాం ఏం జరుగుతుందో?” అని లేచి వెళ్లి ఇంటి ముందు ఆవరణలో చెట్టుకింద మంచం పైన పడుకుని ఆలోచిస్తున్న రఘు పక్కన కూచున్నాడు వెంకీ.

“ఏంట్రా హేమ గురించేనా?” సీరియస్‌గా అడిగాడు వెంకీ.

“అదేం కాదులే గాని, వారం లోగా నేను బెంగుళూరు వెళ్లి బ్యాంకులో జాయిన్ కావాలి, అదెలా అని ఆలోచిస్తున్నా.” అని గంభీరంగా చూసాడు వెంకీని.

“నేనూ వస్తా, ఇద్దరం వెళదాం, ఆ ఏర్పాట్లు నే చేస్తాలే, ఈ మధ్యలో, నే వెళ్లి హేమను కల్సి వస్తా వీలు చూసుకుని” అని లేచాడు వెంకీ. ఏమి మాట్లాడలేదు రఘు.

~

“లోపలి వెళ్ళు బాబు, హేమ బయటకు రావటం లేదు, మాతో ఏమి మాట్లాడటం లేదు, మౌనంగా దాదాపు వారం నుండి అలాగే ఉంటోంది.” అంది హేమ అమ్మగారు వెంకీను చూసి. ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తూ వుంది.

ఆవిడ చూపించిన గది లోకి వెళ్ళాడు రఘు.

హేమ తనను చూసి లేచి “రండి అన్నయ్య” అంది. బాగా ఏడ్చి కళ్లన్నీ వాచిపోయి వున్నాయి.

“నువ్విలా ఉంటే లాభం లేదు హేమ! పెద్ద వాళ్ళను ఒప్పించి మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నువ్వు మాములుగా కాలేజీకి వెళ్ళు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. వాడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోడు, నీకింకేం కావాలి. వాడిది చాలా సున్నిత మైన మనసు. నీకూ తెలుసు. వాడిలాంటి మనిషి కి భగవంతుడు పరీక్ష పెడతాడే కానీ అన్యాయం చెయ్యడు. వాడిని ప్రేమించటం నీ అదృష్టం. నాకే గనక ఒక చెల్లెలు ఉంటే వాడికే ఇచ్చి చేసేవాడిని” అనునయంగా అన్నాడు.

“అదీ గాక రఘు, నేను కాసేపట్లో బెంగుళూరు బయలుదేరాలి. రేపే లాస్ట్ డేట్, వాడు జాయిన్ కావాలి లేదంటే వుద్యోగం పోతుంది. మళ్ళీ ఈ పరిస్థితుల్లో అంత మంచి వుద్యోగం ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ రోజులలో బ్యాంకు ఆఫీసర్ వుద్యోగం రావాలంటే ఎంతో కష్టపడితేనే గాని రాదు. వాడి భవిష్యత్తు ఎలాగో ఏమో మాకంతా భయంగా వుంది. ఇందులో జాయిన్ అయిపోతే మీ ఇద్దరి వివాహానికి చాలా వరకు అడ్డంకులు వుండవు. వాడు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. పైగా ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళితే నువ్వేమయిపోతావో అని నిన్ను వదిలి వాడు వెళ్ళటానికి ఒప్పుకోవటం లేదు. ఇక నువ్వే ఆలోచించు,నాకేం చెయ్యాలో పాలుపోక ఇలా వచ్చాను.” అని తన అసహాయత వెలిబుచ్చాడు వెంకీ.

కాసేపు తల దించుకుని ఆలోచించింది హేమ. ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చటుక్కున లేచి,

“ఇప్పుడెక్కడ వున్నాడు రఘు?” అని చాలా సీరియస్‌గా వెంకీని చూసి “వాళ్లింట్లోనే కదా? మీరు బయటకు వెళ్లి ఆటో పిలవండి, నేను వస్తున్నాను” అని దృఢ నిశ్చయంతో వెంకీ కు చెప్పి చీర మార్చుకోవటానికి వెళ్ళింది.

హేమ తీసుకున్న నిర్ణయం చూసి వెంకీ తనలో తానే చిరు మందహాసం చిందిస్తూ బయటకు నడిచి, గట్టిగా ఊపిరి పీల్చుకుని, మొత్తానికి ఒక ముఖ్య మైన కార్యం పూర్తి చేశాననుకుంటూ నవ్వుకుని “ఆటో!!” అంటూ పిలిచాడు.

తన గదిలోనుంచి బయటకు వెళుతున్న కూతురుని చూసి “ఎక్కడికి వెళ్ళ్తున్నట్టు, నువ్వసలు ఇల్లు కదలాటానికి వీల్లేదు” అంటూ కోపంగా అడ్డం నిలబడింది ఝాన్సీ.

“అమ్మా, నువ్వు జరుగు” అంది నింపాదిగా హేమ.

అప్పుడే వచ్చి ఇదంతా చూస్తున్న తండ్రిని చూసి “నాన్నా, ప్లీజ్,అర్థం చేసుకోండి ఇది నా జీవిత సమస్య” అంది.

“ఝాన్సీ! పక్కకు తప్పుకో, అమ్మాయిని వెళ్లనివ్వు.” నింపాదిగా అన్నాడు భాస్కర రావు.

నీళ్లు నిండిన కళ్ళతో నాన్నను అభిమానంగా చూసి కళ్ళు తుడుచుకుంటూ బయటి గుమ్మం వేపు పరిగెత్తింది హేమ. అలా పరిగెడుతున్న కూతురిని చూసి, తర్వాత భార్యను చూసి నవ్వి “పిల్లలకు రెక్కలు వచ్చాయి” అని నిట్టూర్చి మళ్ళీ భార్యను చూసి, “ఏ పనికి రాని పోరంబోకునో ఎన్నుకోలేదు మన అమ్మాయి. దానికి సంతోషించు. అబ్బాయి గురించి వాకబు చేసాను అతనిలో ఏ లోపాలు లేవు. పైగా మనవాళ్లే. సరే ఏం చేద్దాం మన పిల్లకు అంత ఇష్టమైనప్పుడు తప్పదు కదా. డబ్బు తాహతు, అంటావా మన పెళ్లి జరిగినప్పుడు నాకేం వుంది గనక. హేమ దారి తప్పలేదు. అదీ మన అదృష్టం.” అన్నాడు.

“మీరు భలే చెప్పారు. దానికేం తెలుసనీ, అమాయకురాలు. భవిష్యత్తు ఏం ఉంటుంది ఆ అబ్బాయి చేసే ఉద్యోగంలో.” రుస రస లాడుతూ అంది ఝాన్సీ.

“నీకు సరిగ్గా తెలీదు, ఆ అబ్బాయికి భవిష్యత్తుకేమీ నష్టం తెలీదు. అబ్బాయి మంచివాడని తెలిసింది. చూపులకు కూడ మనమ్మాయికేమీ తీసిపోడు”

“బంగారం లాంటి ఎన్నో సంబంధాలు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే మీరేంటండి నన్ను సముదాయిస్తారు”.

“నీ బాధల్లా అబ్బాయికి ఆస్తిపాస్తులు లేవనే కదా? మనకున్నదంతా మనమ్మాయికే కదా?. అవి చాలవా?” నచ్చచెప్తూ అన్నాడు భాస్కర రావు.

“ఈ ప్రేమలు దోమలు, ఇదంతా అమ్మాయి డబ్బు చూసి ఆడిన నాటకం. ఎలా నమ్ముతారు మీరసలు?”

“నువ్వొకటి గమనించటం లేదు. అమ్మాయికి బాగా నచ్చాడు. ఆ అబ్బాయేమి మన పిల్ల వెంట లేదు. మనమ్మాయి వాళ్ళింటికి చాల సార్లు వెళ్ళి అన్నీ చూసుకుని వచ్చింది. అబ్బాయి చాల మర్యాదస్థుడు, నెమ్మదస్థుడు. ఒక్కసారి అయినా మన ఇంటికి వచ్చాడా? లేదే!! మంచి సంస్కారం వుంది. మన అమ్మాయి అతడితో సుఖపడుతుందని నాకు నమ్మకం. నువ్వింకా ఎలాటి శషభిషలు పెట్టుకోకుండా నాతో రా.” అంటూ భార్య భుజం పైన చేయి వేసి బయటకి దారి తీసాడు భాస్కర్.

ఆటో రఘు ఇంటి ముందు ఆగింది. హేమ, వెంకీ అందులోంచి దిగటం, రఘు కుటుంబం అంతా అయోమయంగా చూడసాగారు. అంతలో హేమ “అత్తయ్యగారు! మీ అబ్బాయికి, ట్రైన్ సమయం ఎక్కువ లేదు, త్వరగా పంపండి”అని నవ్వింది.

హేమ గొంతు విని బయటకు వచ్చిన రఘును చూసి “ఏమండోయ్ శ్రీవారు, వుద్యోగం పురుష లక్షణం, బయలు దేరండి, మీరు లీవ్ పెట్టి వచ్చే వరకూ, ముహుర్తాలు పెట్టుకునే వరకూ, నేను ఇక్కడే మీ ఇంట్లోనే ఉండటం ఇక”అని సూటిగా రఘు కళ్ళ లోకి చూసి ముగ్ధమనోహరంగా నవ్వింది.

ఒక్క క్షణం అలాగే నిలబడిపోయి హేమ కళ్ళలోకి కాసేపు చూసాడు, ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం మాట్లాడుకున్నాయి. మనసు నిండుగా నవ్వేసాడు రఘు.

సూట్ కేసు తీసుకుని తల్లి తండ్రుల పాదాలకు మొక్కి, చెల్లెల్ని, తమ్ముళ్లను దగ్గరకు తీసుకుని, వెళ్లి ఆటోలో ముగ్గురూ కూచోగానే ఆటో కదిలింది.

అప్పుడే ఆగిన కారు నుండి దిగి ఆటో వేపు చూసి, “అమ్మా చెల్లెమ్మ! మరి, మనం చేయవలసిన మిగిలిన కార్యక్రమాలు లోనికి వెళ్లి మాట్లాడుకుందామా” అని నవ్వాడు భాస్కర రావు.

“పదండి అన్నయ్య గారు” అంది ఝాన్సీ మధుసూదన్ ను చూసి.

“రండి లోపలికి” అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు రఘు తల్లీతండ్రి. వాళ్ళను చూస్తూ నవ్వుతూ వెనకాలే వెళ్ళింది అరుణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here