బెంగుళూరు ఆలయాలు-2

0
13

[dropcap]రా[/dropcap]జరాజేశ్వరీ నగర్ లోని బెంగుళూరు విశ్వవిద్యాలయాన్ని చూసి వస్తూ వస్తూ శృంగగిరి షణ్ముఖ ఆలయాన్ని చూశాము. గుడి పై భాగంలో పెద్ద ముఖాలు అలంకరించబడి ఉన్నాయి. చాలా ఎత్తుగా ఉండటం తప్ప మా కారు చాలా దూరం వెళ్ళేదాకా ఆ ముఖాలు కనిపిస్తూనే ఉన్నాయి. శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి, గణపతి ముఖాలున్నాయి. గోపురం పై బాగాన ఉన్న స్ఫటిక కలశం లాగా మెరుస్తూ ఉన్నది. మేము పగటి పూట చూశాము కాబట్టి ఎక్కువగా , మెరుపులు అనిపించలేదు కానీ రాత్రిపూట బాగా కనిపిస్తాయట. కొండలాగా ఎత్తుగా ఉన్నప్రాతంలో గుడి ఉన్నది. ఈ ఆలయానికి రెండు వైపులా మెట్లు ఉన్నాయి చూడటానికి చాలా అందంగా ఎరుపు రంగుతో మెట్లు బాగా వంపులు తిరిగి కనిపిస్తున్నాయి.

సినిమాల్లోని గుడి సన్నివేశాలు చాలా ఇక్కడనే తీశారట. వాకిట్లోనే రెండు పెద్ద నెమలి బొమ్మలు గేటు మీద అమర్చబడి ఉన్నాయి. మేమిక్కడ ఫోటోలతో పాటు చిన్న వీడియో కూడా తీసుకున్నాం. శృంగేరి శారదా పీఠం యొక్క శాఖ కావడం వలన దీనికి శృంగగిరి షణ్ముఖ ఆలయమనే పేరు వచ్చి ఉండవచ్చు. లోపల దాదాపు వెయ్యి దాకా గణపతి ప్రతిమలు ఉండవచ్చు. మొత్తం మూడు గుడుల సముదాయం. ఒకటి శివుడు, ఒకటి గణేష్, ఒకటి షణ్ముఖుడు. గోపురంపై స్పటిక కలశం, త్రిశూలం, శివుని కుటుంబం యొక్క మానవ రూపాలు, చాలా అధ్బుతంగా ఉన్నాయి. దీనికి ఎదురుగా మరో గుడి కూడా ఉన్నది. అక్కడ కూడా పోటోలు తీసుకున్నాము.

మేమున్న ఏరియాకు దగ్గర్లో ఉన్న జయనగర్ లోని రాతి కొండపై ఆంజనేయస్వామి ఆలయం చూశాము. ఈ గుడిని రాగిగుడ్డ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయానికి రాగి యొక్క పెద్ద కప్ప నుండి పేరు వచ్చిందట. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ రాతి కొండపై నివసించాలని అనుకున్నారట. ఆ విధంగా ఇక్కడ కొలుపై ఉన్నారు. ఈ గుడిలో సీత, రాముడు, లక్ష్మణుల విగ్రహాలున్నాయి. మేము వెళ్ళిన సమయానికి మూసి ఉండటం వలన బయట నుంచే దర్శనం చేసుకున్నాం. అందరు దేవుళ్ళ విగ్రహాలున్నా ప్రధానంగా వాయు పుత్రుడైన ఆంజనేయస్వామి దేవాలయం గానే ప్రసిద్ధి చెందినది. 1969లో స్థాపించబడిన ఈ ఆలయంలో 32 అడుగల ఏకశిలలపై విగ్రహాలు చెక్కి ఉంటాయట. ఏప్రిల్‌లో పన్నెండు రోజుల పాటు హనుమంతుని జయంతి ఉత్సవాలు అద్భుతంగా అపూర్వంగా జరుపుతారట.

కోరమంగళ లోని శ్రీకృష్ణ మందిరంలో దసరా నవరాత్రులు బాగా జరిగాయి. బయటి నుంచి లోపటి దాకా సీరియల్ బల్బుల అలంకరణ చేశారు. దుర్గామాత పది చేతులతో ఉన్నా ప్రశాంతంగానే ధర్శనమిస్తుంది. ఈ గుడి బెంగాలీయులది.

ఇందులో ‘సింధూర్ కేలా’ అని అమ్మవారికి పూజ చేశారు. దగ్గరగా ఉండి బాగా దర్శనం చేసుకున్నాం పూజ చేశాము. పోటోలు తీసుకున్నాం. అంతే కాకుండా అక్కడ అమ్మవారి భోగ ప్రసాదం ఆరగించే అవకాశం కలిగింది. మా అపార్టుమెంట్లో ఉండే అనిర్బన్ ఘోష్ గారు ఈ కృష్ణ మందిరం కమిటిలో మెంబరు కావడం వల్ల మాకీ అవకాశం కలిగింది. ఆరెంజ్ కలర్‌లో డ్రెస్సులు వేసుకుని వారంతా దైవ సేవలు చేస్తున్నారు. బెంగాలీ మహిళలందరూ వారి సంప్రదాయ కట్టు బొట్టులతో అమ్మవారిని కొలుచుకుంటుంటే కన్నుల పండుగగా అన్పించింది. అందరినీ క్రమ పద్ధతిలో వరసగా కూర్చోబెట్టి చక్కగా ఆకులు పరిచి భోజనం వడ్డించారు. వేడి వేడి కిచిడి, గెనుసుగడ్డల పులుసు, టమోటా స్వీట్ చట్నీలతో ఆద్ద్భుతమైన రుచిని ఆస్వాదించాం. వెస్ట్ బెంగాలి  ఫైవ్ స్టార్ షెప్‌తో ఈ వంటకాలన్నీ చేయించారట. అమ్మవారి ప్రసన్న రూపాన్ని దర్శించుకోవటమే కాక , బెంగాలీల పూజా విధానాన్ని దగ్గరుండి చూడడం చాలా ఆనందాన్నిచ్చింది.

దసరా నవరాత్రుల్లోని మూలా నక్షత్రం రోజున మేము కెంపెగౌడ నగర్లో ఉన్న బండి మహంకాళి ఆలయానికి వెళ్ళాము. ఇది చాలా పెద్దగా ఉన్నది. మా అపార్టుమెంటు వాళ్ళ అక్కడ భజన బృందంతో భజన చేస్తున్నామని చెపితే వెళ్ళాము. ఇంత పెద్దగా, అపూర్వంగా ఉంటుందని ఊహించలేదు. ఆలయం అల్లంత దూరాన ఉండగానే సీరియల్ బల్బుల తోరణాలతో రోడ్డు, చెట్లు అలంకరించబడి ఉన్నాయి. గుడి దగ్గరకు చేరేసరికి అలంకరణ కళ్ళు మిరుమిట్లు గొల్పితూ ఉన్నది. ప్రధాన ద్వారం దాటగానే ఆలయ గోడకు పొడవునా బండి మహంకాళి ఆలయం అని పేరు చెక్కి ఉన్నది . దీనినే ‘బండే కాళమ్మ గుడి’ అని కూడా అంటారట. లోపల చాలా గుళ్ళున్నాయి.

ఒకచోట చెట్టు కింద చాలా తాళాలు వేయబడి ఉన్నాయి. అదేదో మొక్కు తీర్చుకోవడమనుకుంటాను. నేనెక్కడా చూడలేదు చాలా బిజీగా ఉండటంతో ఎవర్నీ దీని గురించి అడగటం కుదరలేదు. దసరా నవరాత్రులు కాబట్టి భక్తులు ఒకర్ని ఒకరు నేట్టుకునేంతగా ఉన్నారు. ఒక చోట కొండను ఏనుగులా మలిచారు. కొండలు, మెట్లు ఎత్తులు, పల్లాలుతో ఎటుచూసినా భక్త జన సందోహంతో కిటకిటలాడుతున్నది. రష్ చాలా ఉండటంతో మేము ప్రధాన అమ్మవారిని దర్శించుకోనలేదు. చాలా పెద్ద క్యూ ఉన్నది. కనీసం గంటా రెండు గంటల టైము పట్టేలా అనిపించి వచ్చేశాం. ప్రధాన ద్వారం వద్ద పూల బుట్టల్లా అమ్మవారి విగ్రహాలను అలంకరించారు. లోపల, బయట ఎంతో కన్నుల పండువగా ఉన్నది. ఇంకోన్ని ఆలయాలు మరోసారి చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here