బంగారు తల్లికి ప్రేమతో..!

0
15

(లేఖ కథానికని అందిస్తున్నారు శ్రీ విడదల సాంబశివరావు)

[dropcap]నా[/dropcap] బంగారు తల్లి సుహాసినికి,

ఉభయకుశలోపరి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడు అరచేతిలోనే విశ్వాన్ని తన గుప్పిట బంధించిన ఈ సాంకేతిక యుగంలో.. నేనిలా ‘ఉత్తరం’ రాసినందుకు ఆశ్చర్యపోతున్నావు కదూ! అందుకు బలమైన కారణమే వుంది. కాగితం మీద రాసిన అక్షరాలు హృదయ ఫలకంపై శాశ్వతంగా ముద్రించబడి, నీ జ్ఞాపకాలలో కలకాలం నిలిచి వుంటాయి. ‘వాట్సప్’ లాంటి ఆధునిక సాంకేతిక మాధ్యమం ద్వారా పంపిన సందేశాన్ని, ఏదేని పనుల ఒత్తిడిలో వుండి నువ్వు చూడలేకపోవచ్చు.. లేదా.. చదివిన తర్వాత, నీ ‘మొబైల్ తెర’పై నుండి ‘అదృశ్యం (delete)’ కావచ్చు! పలు కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ లేఖ రాస్తున్నాను. ఈ లేఖ లోని ప్రతి పదాన్ని మనసుతో ఆస్వాదిస్తావని నమ్ముతున్నాను.

మహాశివరాత్రికి.. మీ అమ్మా, నేను గుంటూరు వచ్చినప్పుడు.. మీ ఇంట్లో నీ ప్రవర్తన చూసి, ఈ ఉత్తరం రాయాలనిపించింది. నీ మెట్టినిల్లు గుంటూరు నగరంలోనే వున్నప్పటికీ.. మేము ఎప్పుడూ చొరవగా అక్కడకు రాలేదు. కానీ, గుంటూరుకు దగ్గరలో వున్న ‘కోటప్పకొండ’ పుణ్యక్షేత్రమును చూసి, ఆ దివ్యక్షేత్రంలో కొలువై యున్న ‘శ్రీ త్రికోటేశ్వర స్వామి’ వారిని దర్శించుకోవాలని కొండత కోరికతో గుంటూరు వచ్చాము.

భారతదేశంలో జరిగే ‘తిరుణాళ్ల’లో కోటప్పకొండ తిరుణళ్లకు ఓ ప్రత్యేకత వున్నదని ప్రతీతి. అందుకే, జీవితకాలంలో ఒక్కసారైనా కోటప్పకొండను మహాశివరాత్రి పర్వదినాన సందర్శించి.. స్వామివారిని సేవించి.. తిరునాళ్ళను, అక్కడ కనువిందు చేసే ‘విద్యుత్ ప్రభల’ను తిలకించి తరించాలని, కొందరు మిత్రులు నాకు పలుమార్లు చెప్పారు. అందుకే, మీ అమ్మతో కలిసి మీ ఇంటికి వచ్చాను.

భారతీయ సామాజిక వ్యవస్థలో ‘ఉమ్మడి కుటుంబం’కు ఎంతో ప్రాధాన్యత వుంది. పూర్వకాలంలో.. అంటే, నా చిన్నతనంలో.. చాలా కుటుంబాలు, దాదాపు పదిమంది సంతానంతో కళకళలాడుతూ విలసిల్లేవి. ఐదారుగురు మగపిల్లలు, నలుగురైదుగురు ఆడపిల్లలను.. సంతానంగా కలిగి వుండి, భార్యాభర్తలు సుఖసంతోషాలతో కాపురాలు చేసుకుంటూ వుండేవారు. నేను కూడా అలాంటి కుటుంబ వ్యవస్థ నుండి వచ్చిన వాణ్ణేనని నీకు బాగా తెలుసు.

మగపిల్లలకు పెళ్ళిళ్ళయిన తర్వాత.. ఆ ఇంటికొచ్చిన కోడళ్ళంతా ఆ ఇంట్లోనే అన్యోన్యంగా కలిసి మెలసి వుంటూ.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు జీవం పోసేవారు. పండగలకు, వేడుకలకు పుట్టింటికి వచ్చిన ఆడపడుచులను.. కోడళ్ళు ఆదరించి గౌరవించేవారు. కష్టసుఖాలలో ఒకరికి మరొకరు అండగా నిలిచి ఆదుకునేవారు. డబ్బు ఎంత సంపాదించినా.. కష్టాల ప్రవాహంలో, బాధల సుడిగుండాలలో, కొట్టుకుపోతున్న విపత్కర పరిస్థితులలో.. కన్నీరు తుడిచి ఓదార్చే ఆత్మబంధువులు లేని జీవితం వ్యర్థం! ఆ పరిస్థితులలో, మన దగ్గరున్న ‘కరెన్సీ కట్టలు’ చిత్తు కాగితాలతో సమానమే సుమా!

ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నానో తెలుసా!? ఉమ్మడి కుటుంబంలో ‘కోడలు’ పాత్ర విశిష్టత గురించి నీకు తెలియజేయాలనే సత్సంకల్పంతోనే! మీ మావయ్య గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పదవీ విరమణ చేశారు. మీ అత్తయ్య, భర్త అడుగుజాడలలో నడిచి, బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉత్తమ స్త్రీ మూర్తి! నీ ‘మరిది’ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఓ ఉన్నతమైన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రముఖమైన స్థానంలో స్థిరపడి వున్నాడు. ఇకపోతే.. నీ ఆడపడుచు, తన భర్తతో అమెరికా దేశంలో ఆనందంగా సంసార జీవితాన్ని కొనసాగిస్తోంది.

నీ కుటుంబంలో పెద్ద కొడుకుగా నీ భర్త తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాడు. ఉన్నత విద్యావంతుడైన నీ భర్త.. యోగ్యుడు, గుణవంతుడు, సౌమ్యుడుగా సభ్యసమాజంలో విలువైన గుర్తింపు కలిగి వున్నాడు. అంతే కాదు.. గుంటూరు నగరంలోనే గాకుండా, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, ప్రముఖ యువ పారిశ్రామికవేత్తగా, సమాజ సేవకుడిగా, దానశీలిగా.. నీ భర్త కీర్తి ప్రతిష్ఠలను తన సొంతం చేసుకున్నాడు. అతను మా ‘అల్లుడు’ అని చెప్పుకోవటానికి నేను, మీ అమ్మా ఎంతగానో గర్వపడుతున్నాము.

నువ్వు కాపురం చేస్తోన్న ఆ ఇల్లు ఓ భూలోక స్వర్గం! మా ఒక్కగానొక్క కూతురు మెట్టినింట్లో.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా హాయిగా, సంతోషంగా కాపురం చేసుకుంటోందన్న ఓ వాస్తవం.. నన్నూ, మీ అమ్మను ఆనంద తరంగాలలో ఓలలాడించింది. ఈ సమాజంలో మాలాంటి వృద్ధులైన తల్లిదండ్రులకు ఇంతకంటే తృప్తిని కలిగించే విషయం మరొకటి ఏముంటుంది? కానీ, ఓ పచ్చి నిజాన్ని ప్రత్యక్ష్యంగా గమనించి మానసికంగా వేదన చెందుతున్నాము! అదేఁమిటంటే.. విద్యావంతురాలివైన నువ్వు, నీ అత్తమామల యెడల ప్రేమానురాగాలను చూపించడం లేదనే కఠిన సత్యం!

మేము గుంటూరులో వున్న ఆ నాలుగు రోజుల్లో నీ ప్రవర్తన ద్వారా చాలా విషయాలు గ్రహించి జీర్ణించుకోలేకపోయాము. మీ ఇంటి చుట్టుప్రక్కల నివసించే పెద్దవాళ్ళ నుండి కూడా కొన్ని వివరాలు సేకరించాము.

కానీ, సద్గుణ సంపన్నుడైన మా అల్లుడు మాత్రం నీపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మేము ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అతడి నుండి చిరునవ్వే సమాధానంగా వచ్చింది. అతని తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచిన విధానం.. అల్లుడిగారి ప్రవర్తనలో మాకు అడుగడుగునా కనిపించింది. అతని హృదయంలో భార్యగా నీ స్థానం పవిత్రం! సుసంపన్నం!!

భర్త, అత్తమామలు, ఇద్దరు పసిబిడ్డలు.. ఇదీ నీ అద్భుత ప్రపంచం. ఈ ముచ్చటైన, సుమనోహరమైన లోకంలో నువ్వు అద్భుతాలను ఆవిష్కరించడానికి నీకు ఎన్నో వనరులున్నాయి. సుసంపన్నమైన జీవన గమ్యంలో స్థిరపడటానికి అవకాశాలు మెండుగా వున్నాయి. కానీ, బంగారు తల్లీ! నువ్వు నడవాల్సిన దారిలో సక్రమంగా నడవడం లేదు. విలువైన ఆ రహదారిని కాదనుకొని ముళ్ళబాటను ఎన్నుకున్నావు!

అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా భావించి గౌరవించే వైనాన్ని విస్మరించారు. ఓ కోటీశ్వరుడి భార్యగా సభ్యసమాజంలో విభిన్న వర్గాల ప్రజల చేత గౌరవాన్ని పొందుతూ కూడా.. ఓ సాధారణ యువతిలా ప్రవర్తిస్తున్నావు. నీ భర్త నీ యెడల చూపుతున్న ప్రేమాభిమానాలను, అతని అసమర్థతగా భావించి అహంకారంతో నీ అత్తమామలను నిరంతరమూ ఛీత్కరిస్తున్నావు. ఆ వృద్ధులిద్దరూ.. మీ భార్యాభర్తల ఏకాంతానికి (privacy) అడ్డమనే అభిప్రాయానికి వచ్చావు. నిరంతరమూ అత్తమామలతో కలహించడం నీకు దినచర్యగా మారిపోయింది. వాళ్ళిద్దరూ.. తమంతట తామే ఇల్లు విడిచి వెళ్ళే విధంగా పలు రకాల ఇబ్బందులను సృష్టిస్తున్నావు!

భూలోక స్వర్గం లాంటి నీ మెట్టినింట్లో నువ్వు వ్యవహరించే తీరు.. ఓ అనాగరిక యువతి ప్రవర్తించే విధానాన్ని తలపిస్తోంది. నీ తల్లిదండ్రులుగా సిగ్గుతో తలలు దించుకునే దుస్థితిని మాకు కల్పించావు.

నవంబరు మాసం చలిలో ఆ వృద్ధ జంట స్నానం చేసే సమయాన.. వాళ్ళ బాత్‍రూంలో మాత్రమే ‘గీజర్’ చెడిపోతుంది! ఇది నీ నిర్వాకమేనని వాళ్ళకూ తెలుసు!! ప్రొద్దున్నే పిల్లలు స్కూలుకు వెళ్లడానికి ముందు జరిగే ప్రిపరేషన్.. బ్రేక్‍ఫాస్ట్‌తో సహా.. అంతా ఆ వృద్ధ దంపతులే నిర్వహించాలి. నువ్వు మాత్రం.. పిల్లలు స్కూలుకు వెళ్ళిన తర్వాత మాత్రమే నిద్రలేస్తావు! ఇప్పటికీ, ఆ వృద్ధురాలే వంట చేసి నీకూ, నీ భర్తకూ, నీ పిల్లలకూ వడ్డించాలి. అంతేగాదు.. వంట బాగాలేదని నువ్వు చేసే దెప్పిపొడుపుల్నీ ఆ మహా ఇల్లాలు భరించాలి. సహజంగా కోటీశ్వరుల ఇళ్ళల్లో వంట చేయటం కోసమే ప్రత్యేకంగా పని మనుషులను నియమించడం జరుగుతుంది. కానీ, మీ ఇంట్లో మాత్రం.. వృద్ధురాలైన మీ అత్తయ్య మాత్రమే వంట చేయాలి. ఎందుకంటే.. ‘నీ దెప్పిపొడుపులు భరించలేక, అవమాన భారంతో, నిరంతరమూ కలిసి వుండలేక, ఆ ముసలి దంపతులు తమంత తాముగా ఇల్లు విడిచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకొని బ్రతకాలి.’ ఇదీ నీ శాడిస్టిక్ జీవన విధానంలో ఓ కోణమని తెలుసుకున్నాము. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపి.. ఆ ముసలి హృదయాలను నీ మాటల తూటాలతో గాయం చేస్తున్న నీ దుర్మార్గము వైఖరి గురించి కూడా తెలుసుకున్నాము. నీ రుసరుసలను, నీ అసహన రుగ్మతలను, అకారణంగా నిందించే నీ విచిత్ర వింత దుస్థితిని గురించి తెలుసుకొని.. తప్పనిసరిగా భరిస్తోన్న, నీ అత్తమామల హీనస్థితిపై జాలిపడుతున్నాము. తల్లిదండ్రులను దూరం చేసుకోలేక, నీతో గొడవపడి కాపురాన్ని వీధిలో పడవెయ్యటం ఇష్టం లేక.. నీ దుర్మార్గపు చేష్టలను ఓర్పుగా భరిస్తోన్న మా అల్లుడిగారి హృదయ వైశాల్యాన్ని కీర్తించడానికి తెలుగు భాషలో పదలే దొరకడం లేదు!

చివరిసారిగా.. నాదో విన్నపం. ఆంధ్రా యూనివర్శిటీలో ‘సోషియాలజీ’ సబ్జెక్టుగా ఎం.ఎ. చేశావు. విద్యావంతురాలివైన నీవు.. ఒక్కసారి, నీ భవిష్యత్తును కళ్ళు మూసుకొని, మనోనేత్రాన్ని తెరచి, ఊహించు! రేపటి తరానికి నువ్వూ ఓ ‘అత్త’గా బ్రతుకుబండిలో ప్రయాణం చేయాల్సిందే! నిన్ను విద్యావంతురాలిగా తీర్చిదిద్దానే గానీ.. ఉన్నతమైన నైతిక విలువలతో పెంచలేకపోయాను!

జీవనయానంలో నా ఓటమిని అంగీకరిస్తూ..

నీ

నాన్న

రఘునందనరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here