బ్యాంకర్ బంగారయ్య

4
12

[dropcap]బ్యాం[/dropcap]క్ కుంభకోణం కేసులో కొండయ్య పరారైపోయాడు. దాదాపు రెండు నెలల నుండి పోలీసుల గాలింపు ముమ్మరంగా సాగుతోంది. కొండయ్య తొంభై ఎకరాల భూస్వామి. అది కాకుండా ఆక్రమించుకున్న ఆస్తులతో కోట్లాది రూపాయలు మూటలు గట్టాడు. కోట్లు సంపాదించినా తృప్తి లేని దురాశాపరుడు.

ఈ రోజుల్లో అప్పు ఎవరికి చేదు. ఎగవేసే వాళ్ళకి అప్పు అమృతమే కదా! అని కొండయ్య కూడా ఇరవై కోట్ల వరకూ బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు. కానీ అప్పును మాత్రం తీర్చాలనిపించలేదు. దానికి అతని దగ్గర కారణాలు కోకొల్లలుగా ఉన్నాయి.

పంటలు బాగా పండలేదనీ, చేతికొచ్చిన పంట కాలి బూడిదై నష్టం వచ్చిందని చెప్పాడు. మిగిలింది తుఫానులో కొట్టుకుపోయిందనీ, “మానవతా దృక్పథంతో రుణమాఫీ చేయమని” అందరితోపాటు బ్యాంకు అధికారులకు అర్జీ ఇచ్చాడు.

ఆ తరువాత తన అతి తెలివితేటలతో ఇన్సూరెన్స్ కంపెనీ నుండీ కోట్లాది రూపాయలను చాకచక్యంగా రాబట్టాడు ద గ్రేట్ కొండయ్య. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల’న్నట్లు తన ఆస్తులను భార్య పేర, కొడుకులు, కూతుళ్ళ పేరిట బదలాయించాడు.

ఇక మన దేశంలో ఉంటే టాక్సులు కట్టవలసి వస్తుందని, సంపదను విదేశీ బ్యాంకుల్లో దాచేశాడు. కానీ ఈ తతంగమంతా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ భూతద్దంతో చూస్తోందని తెలియదు పాపం. అప్పు తీర్చమని బ్యాంకు నోటీసులు జారీ చేసింది. వెంటనే కొండయ్యపై క్రిమినల్ కేసు కూడా రిజిష్టర్ అయ్యింది.

కొండయ్య డబ్బుతో అధికారులకు అడుగడుగునా లంచాలు ఇచ్చి అతి రహస్యంగా దొంగ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల బ్యాంకు ఎక్కౌంట్లు అన్నీ ఫ్రీజ్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే అంత సంపద ఉన్నా ఇంట్లో కనీసం భోజనాలకు, రోజువారీ ఖర్చులకు డబ్బులేక దరిద్రంతో అలమటిస్తున్నారు. బళ్ళు ఓడలు అవటం ఓడలు బళ్ళు అవటం అంటే ఇదేనేమో మరి!

‘తండ్రి చేసిన దుర్మార్గపు పని’ గూర్చి వచ్చిన వార్తలను విని కుములిపోతున్నారు.

కొండయ్య తీసుకున్న అప్పులను తిరిగి బ్యాంక్‌లో జమచేస్తేగానీ రైతులకూ, సామాన్య ఖాతాదారులకూ అప్పులు ఇచ్చే ప్రసక్తే లేదనీ ఖరాఖండీగా చెప్పారు బ్యాంక్ అధికారులు. దాంతో ఇరవై కోట్ల అప్పును సామాన్య ఖాతాదార్ల నుండీ వసూలు చేస్తారనే పుకార్లు వచ్చాయి. అందుకనే ‘ప్రజా బ్యాంకు’ దివాళా తీసే స్థాయికి వచ్చేసింది.

ఇదే తరహాలో ఇంకా ఇద్దరు డైరక్టర్లు కూడా లంచాలు తీసుకొని ఖాతాదార్ల ఎక్కౌంట్లలోని డబ్బును మింగేశారు. వాళ్ళమీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేశారు. రిమాండుకు పంపి కోర్టులో హాజరు పర్చారు. ఇందుకే కదా మన దేశ ఆర్థికాభివృద్ధి రోజురోజుకి పతనమైపోతోందని ప్రజలు ఆగ్రహానికి లోనై ధర్నాలు, బంద్‌లు వంటి ఆందోళనలు ఎక్కువగా చేశారు.

అదే సమయంలో ‘బెగ్గర్స్ అసోసియేషన్’ స్టార్ హోటల్‌లో అత్యవసర సమావేశం అయ్యింది. అధ్యక్షుడు బంగారయ్య మాట్లాడుతూ… “మైడియర్ రెస్పెక్టెడ్ బెగ్గర్స్.. మన దగ్గర బ్యాంకుల్లో ప్రస్తుతం దాదాపు నలభై కోట్ల వరకూ డబ్బు ఉంది. ఆ డబ్బును ఇప్పుడు మనం ఒక మంచి దేశసేవ కొరకు పెట్టుబడిగా పెడదాం. దీనికి మీ అందరి అనుమతి కావాలి” అని అభ్యర్థించాడు. “అయ్యా! బంగారయ్యగారూ, మీ మాట బంగారం, అలాగే మీరు చేసే పనులన్నీ కూడా బంగారంలాంటి పనులే. అసలు మీ మాటను మేము ఎప్పుడైనా కాదన్నామా!” అని చెప్పి తమ అనుమతిని సంతోషంగా తెలియజేశారు.

ఏకవాక్య తీర్మానంతో నలభై కోట్ల రూపాయలను దివాళా తీయబోతున్న ‘ప్రజా బ్యాంకు’కు ఇస్తున్నట్లు ఆర్థికశాఖామంత్రిగారికి వ్రాతపూర్వకంగా ఇచ్చాడు బెగ్గర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగారయ్య.

“మానవతా దృక్పథంతో మీరు ఇస్తున్న ఆర్థిక సహాయం మన దేశాభివృద్ధికి మళ్ళీ జీవం పోస్తున్నది. మీరు మన భారతీయులందరికీ స్ఫూర్తి, ప్రపంచానికే ఆదర్శం” అన్నారు మంత్రి.

విదేశంలో కొండయ్యను ఇంటర్‌పోల్ పోలీసులు అరెస్టు చేశారు. మన దేశంలో బంగారయ్యను ‘ప్రజాబ్యాంక్ డైరక్టర్’గా నియమించింది ప్రభుత్వం.

‘బ్యాంకర్ బంగారయ్య జిందాబాద్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here