బాటసారి-1

0
8

[box type=’note’ fontsize=’16’] బాలబాలికల కోసం a’బాటసారి’ అనే పెద్ద జానపద కథని మూడు భాగాలుగా అందిస్తున్నారు దాసరి శివకుమారి. ఇది మొదటి భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు గుర్రం బాగా అలసిపోయినట్లుంది. త్వరగా ఏదైనా ఒక చోటు చూసుకుని ఆగుదామని తొందరపడుతున్నది. గుర్రమే కాదు, దానిమీద కూర్చుని ప్రయాణం చేస్తున్న వ్యక్తికి కూడా బాగా అలసటగానే వున్నది. ప్రొద్దుటినుంచి ప్రయాణం చేస్తూనే వున్నాడు. దారిలో కొద్దో గొప్పో విశ్రాంతి తీసుకున్నా అలసట మాత్రం తీరలేదు. దారిలో కనబడ్డ ఊళ్ళన్నీ చూసుకుంటూ పరిస్థితులను గమనిస్తూ వస్తున్నాడు. ఎక్కువభాగం రకరకాల ఇబ్బందులు పడుతున్న ప్రజలే కనబడ్డారు.

గుర్రం వేగం మరీ తగ్గింది. అతను ఎక్కడ మకాం చేయాలా అని చూస్తున్నాడు. చీకటి కూడా పడుతున్నది. పరీక్షగా చూశాడు. దూరంగా మినుకు మినుకుమనుకుంటూ దీపపు వెలుతురు కనపడుతున్నది. గుర్రాన్ని ఆ వైపుకు నడిపించాడు. రెల్లుగడ్డితో కప్పిన ఒకమాదిరి ఇల్లు అది. ఆ యింటి ముందున్న ఖాళీలో రెండు మూడు చెట్లున్నాయి. అతను గుర్రాన్ని దిగాడు. ఒక చెట్టుకు దాన్ని కట్టేశాడు. ముందు గుర్రానికి గడ్డీ, నీళ్ళు దొరుకుతాయేమోనని కనుక్కోవాలనుకున్నాడు. గుర్రం సకిలింపు విని లోపలనుంచి ఒక మనిషి వచ్చాడు. అతనికి అరవైయేళ్ళు పైనుంటాయి.

“ఎవరు నాయనా?” అనడిగాడు.

“నా పేరు కమలనాధుడు. నేను చాలాదూరం నుండి వస్తున్నాను తాతా. ఈ రాత్రికి ఇక్కడుండొచ్చా? నేను, నా గుర్రం బాగా అలసిపోయాం” అనడిగాడు.

“తప్పకుండా ఉండొచ్చు నాయనా. మీలాంటి వాళ్ళకోసమే ఈ ధర్మసత్రం ఏర్పడింది. గుర్రానికి కూడా మేత వేద్దాం. ఆ పక్కగా నీళ్ళ గోలెం వున్నది. దాంట్లోని నీళ్ళు గుర్రానికి తాగించు. ఆ తర్వాత ఇటుపక్క గోలెంలోని నీళ్ళలో నువ్వు శుభ్రంగా కాళ్ళుచేతులూ కడుక్కో. వేడినీళ్ళు పొంతకుండలో కాగుతున్నాయి పోసుకుందువుగాని. ఆ తర్వాత తిండి తినొచ్చు” అని చెప్పాడు.

“అమ్మయ్య! ఈ రాత్రికి నాకూ, నా గుర్రానికి వుండటానికి చోటు దొరికింది. తినటానికి తిండి పెడతానంటున్నాడు ఈ తాత. ఈ రాత్రికి ఇలా గడిచిపోతే చాలు. రేపుదయమే లేచి ప్రయాణం చెయ్యొచ్చు” అనుకున్నాడు కమలనాధుడు.

వెంటనే వెళ్ళి తాడు విప్పి గుర్రాన్ని నీళ్ళ గోలెం దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళు తాగించాడు. ఈలోగ తాత అక్కడున్న మూట విప్పి ఆకుల తీగెలూ, పచ్చగడ్డీ తీసుకొచ్చాడు. దాన్నందుకుని గుర్రానికి ముందు వేశాడు. గుర్రం అది మేయసాగింది. కమలనాధుడు లేచి కాళ్ళూ, చేతులు శుభ్రంగా కడుక్కున్నాడు. అక్కడున్న పెద్దరాతి మీద కూర్చున్నాడు. చల్లనిగాలి వంటికి తగిలి హాయిగా వున్నది. తాత లోపలికెళ్ళాడు. లోపలినుంచి మాటలు వినపడుతున్నాయి. అతను చుట్టూ చూశాడు. అది చాలా చిన్న ఊరు. అక్కడో చిన్న ఇల్లు. అక్కడో చిన్న ఇల్లువున్నది. తానీ ధర్మసత్రంలోనికి కాకుండా మరో ఇంట్లోకి వెడితే రానిచ్చేవాళ్ళో కాదో? అప్పుడు తనూ తన గుర్రం ఇబ్బందిపడిపోయే వాళ్ళు అనుకున్నాడు. చీకటి మూలానా పరిసరాలు ఇంకా స్పష్టంగా కనపడటం లేదు. కాని తను వచ్చేటప్పుడు చూశాడు. ఈ ఊరు నగరానికి చాలా దూరంగా వున్నది. కాలిబాటలు తప్పితే సరైన మట్టిరోడ్లు కూడా లేవు. ఇంత మారుమూల ఊళ్ళు కూడా వున్నాయా అనుకున్నాడు. అతని ఆలోచన పూర్తికాకుండానే అక్కడికి మరొక వ్యక్తి వచ్చాడు. వస్తూనే బాగా తెలిసున్నవాడిలాగా నీళ్ళగోలెం దగ్గరకెళ్ళి కాళ్ళు, చేతులూ కడుక్కున్నాడు. ఆ తర్వాత వచ్చి కూర్చుంటూ…

“తాతా!” అని కేకేశాడు.

“వస్తున్నా” నంటూ తాత లోపలినుండి వచ్చాడు.

“నువ్వా లక్ష్మణయ్యా! మళ్ళా ఏదన్నా పనిమీద పోతున్నావా?” అనడిగాడు.

“అవును తాతా! ఈసారి రాజధాని దాకా పోదామని చూస్తున్నాను. ఆ పనిమీదే మా చుట్టాన్ని కలుసుకుని మాట్లాడుతున్నాను. ఆయనకు తెలిసున్నవాళ్ళు మన రాజుగారి కొలువులో పనిచేస్తున్నారు. ఆళ్ళ వివరాలు తెలుసుకుందామని పోయొస్తున్నాను. పెద్దరాజుగారు యువరాజుగారికి రాజ్యాన్ని అప్పగిస్తారట. యువరాజుగారు తన కొలువులోకి కొత్తవాళ్ళను చేర్చుకోవచ్చంట. నేనూ ఎల్దామనుకుంటున్నాను” అని చెప్పాడు.

“తప్పకుండా ఎల్లు. నీకేం లక్ష్మయ్య! నీలాంటి వాళ్ళుంటే రాజుగారికే లాభం. ఎంతో తెగువా ధైర్యం ఉన్నవాడివి. కత్తిపట్టడం నేర్చినవాడివి. పైపెచ్చు మన రాజ్యం, మన ప్రజలు సుఖంగా వుండాలని ఎప్పుడూ ఆలోచన చేత్తా వుంటావు” అంటూ మెచ్చుకున్నాడు తాత.

“అంతేకాదు తాతా! నేను కొలువులో అంటూ చేరితే రాజుగారితో చెప్పి నువ్వు నడిపే ఈ ధర్మసత్రానికి కొంత సొమ్ము సాయంగా ఇవ్వమని అడుగుతాను. అప్పుడెంతో మందికి సాయం అందుతాది. మరెంతోమంది ఆకలి తీరుతుంది. మీ దగ్గర సొమ్మే వుంటే నువ్వూ, అవ్వా ఈ వయసులో విశ్రాంతిగా వుండి, ఈ పనులు చేయటానికి సేవకుల్ని పెట్టుకోవచ్చు” అన్నాడు.

“ఎప్పుడూ అందరికీ మేలు చెయ్యాలని ఆలోచిత్తావుగా లక్ష్మణయ్య. నువ్వు తొందరగా రాజుగారి కొలువులో చేరిపోతే బాగుండును. తిండితిన్నాక కాసేపు మాట్లాడుకుందాం. సానాదూరం ప్రయాణం చేసొచ్చావంటు” కమలనాధుడి వంక తిరిగి “ఎల్లయ్య ఎల్లు ఉడుకునీళ్ళు పోసుకునిరా. అవ్వ జొన్నరొట్టెలు పెట్టుద్ది” అన్నాడు తాత.

అలాగేనంటూ కమలనాధుడు లేచి వేడినీళ్ళతో స్నానం చేసి వచ్చాడు. కొంత బడలిక తీరినట్లయింది. అతను వచ్చేటప్పటికి తాతా లక్ష్మణయ్య మాట్లాడుకుంటూనే వున్నారు.

అవ్వ వచ్చి ముగ్గురికి వేడివేడి జొన్నరొట్టెలు పెట్టింది. దాంట్లో నంజుకునేందుకు శనగబద్దలు, బచ్చలిఆకూ కలిపి చేసిన కూర పెట్టింది. లక్ష్మణయ్య మామూలుగానే తినేస్తున్నాడు కాని కమలనాధునికి మొదట్లో ఆ కూర సహించలేదు. కాని ఆకలిమీదుండి దాన్నే ఇష్టంగా తినేశాడు. లోపల అవ్వ సర్దుకుంటున్నది.

“ముసలమ్మా! ఇంక ఈవేల్టికి ఎవరూ రారులే. నువ్వు కూడా తినేసిరా” అని తాత కేకలేశాడు. వచ్చిన అతిథులిద్దరికీ చెరో నులక మంచం వాల్చి దానిమీద ముతక జంపఖానాలను పరిచాడు తాత. బల్లలాగ పరచిన బారాటి కొండరాళ్ళమీద తాత పడుకున్నాడు.

“లక్ష్మణయ్యా! అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతుంటావుగా. కొత్త ఇసయాలు ఏమన్నా వున్నాయా?” అనడిగాడు తాత.

“ఈ రోజుల్లో ఎక్కడ పడ్డా వచ్చే కొత్తరాజు గారి గురించే మాట్లాడుకుంటున్నారు తాతా. పెద్దరాజుగారు ఎప్పుడూ ఇటువైపుకు రాలేదు. ఇక్కడి సంగతులు ఆయనకు తెలుసో లేదో! మనకు తెలియదు. గ్రామాల్లో ఉండి పంటలు పండించుకుంటున్నారు. ఆ పంటలకు పన్ను కట్టలంటూ రాజుగారి సైనికులొచ్చి బలవంతంగా పన్నులు వసూలుచేసుకొని పోతున్నారు. కట్టలేనివారిని నానాతిప్పలు పెడుతున్నారు. ప్రజల్ని కాపాడాల్సిన రాజే ప్రజలమీద దౌర్జన్యం చేయిస్తే ఆ ప్రజలు ఇంకెవరికి చెప్పుకుంటారు? రాజుగారి కొలువులో చేరి ఇట్టాంటి సంగతులెన్నో అక్కడ సెప్పాలని ఉవ్విళ్ళూరుతున్నాను. కాని రాజుగారి కొలువులోకి తీసుకెళ్ళేవాళ్ళే దొరకటం లేదు. రేపొచ్చే కొత్తరాజుగారైన ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటే బాగుండునని మనవాళ్ళంతా అనుకుంటున్నారు తాతా” అన్నాడు లక్ష్మణయ్య నిట్టూరుస్తూ.

“నిజమేగా లక్ష్మణయ్య! మనమేమో ఈ కొండ దిగువల్లో వుండేటోళ్ళం. ఎండనక, వాననక, చెట్లమ్మటి, పుట్ళమ్మటి తిరిగేటోళ్ళం. బండల్ని పిండిచేసి ఎగుడుదిగుడు రాళ్ళభూమిని చదును చేసుకుంటున్నాం. కొద్దిపాటి జొన్నల్ని, ఎప్పుడన్నా కొర్రల్ని పండించుకుంటున్నాం. దానికే పన్ను కట్టాలా? ఆ జొన్నలునా ఒకేడు పండితే మరో మూడేళ్ళు వరదలో, మిడతలో, పచ్చులో వచ్చి పంటను నాశనం చేత్తుండె. ఏసిన గింజలు నిండా పండి మనచేతికేడ వత్తున్నాయి” అంటూ బాధపడ్డాడు తాత.

“మీకిక్కడ జొన్నలు తప్పితే మరేం పండవా తాతా?” అనడిగాడు కమలనాధుడు.

“అవును నాయనా. ఇదంతా రాళ్ళభూమి. పెద్దగా పంటలేం పండవు. ఇంతకీ నీదేవూరు నాయనా? ఇటెక్కడికి పోతున్నావు?” అనడిగాడు తాత.

“నేను కూడా ఈ రాజ్యంలోని వాడనే. పొరుగురాజ్యంలోని ఒక మనిషితో పనిబడింది. అందుకని దూరం పోతున్నాను. వస్తూ, వస్తూ సాయంకాలం దారి తప్పి ఇటొచ్చాను. అయినా ఫర్వాలేదు. మిమ్మల్ని చూడగలిగాను. నాకూ, నా గుర్రానికి తిండిపెట్టారు. ఈ రాత్రికింత చోటిచ్చారు. అదే పదివేలు. మీ మేలు మర్చిపోను” అన్నాడు కమలనాధుడు ఎంతో అభిమానంగా.

“ఈ తోవన వచ్చినవాళ్ళకూ, దారితప్పిన వాళ్ళకూ ఈ చుట్టుపక్కల మరే ఆదరువూ లేదు. మా ముసల్ది ఉడకేసిన తిండేగతి. మాకైనా భగవంతుడు ఎన్నాళ్ళు ఓపిక ఇత్తాడో?” అన్నాడూ తాత ఆకాశం వంక చూసి చేతులెత్తి దణ్ణంపెడుతూ.

“మీలాంటివాళ్ళు పదికాలాలపాటు చల్లగా వుండాలి తాతా. అటువంటప్పుడే నాలాంటి బాటసారులకు, ఇటువంటి దారితప్పిన వాళ్ళకు ఇంత తిండి దొరుకుతుంది” అన్నాడు లక్ష్మణయ్య.

“అవునవును. తప్పకుండా దేముడు ఇలాంటివాళ్ళకు ఆయుర్దాయం ఎక్కువిస్తాడు. మీరప్పుడే బాగా ముసలివాళైపోలేదు తాతా” అన్నాడు కమలనాధుడు.

ఈలోగా అవ్వ రొట్టెలు తిని వచ్చింది. పచ్చివక్కపలుకు నోట్లో వేసుకుని చప్పడిస్తూ వచ్చి తనకూడా మరో పొడుగాటి బండ మీడపడుకున్నది.

అంతటా నిశ్శబ్దంగా ఉన్నది. చంద్రుడు బాగా పైకి వచ్చి చల్లగాను, కాంతివంతంగానూ వున్నాడు. వెన్నెల కాస్తున్నది. వుండి వుండి దూరంగా చెట్లలోనుండి, కొండల్లోనూ తిరిగే జంతువుల అరుపులు వినపడుతున్నాయి. కమలనాధుడు తలతిప్పి చూశాడు. తన గుర్రం మేతవేయటం ఆపింది. విశ్రాంతిగా తలముందుకు వాల్చుకుని పడుకున్నది. లక్ష్మణయ్య ఏదో ఆలోచనలో వున్నాడు. కమలనాధుడికి తాతనడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలనిపించింది.

“తాతా! నీ చిన్నప్పటినుండి ఇక్కడే వుంటున్నావా?” అనడిగాడు.

“అవున్నాయినా! నా చిన్నతనం నుండి ఇక్కడే వుంటున్నాను. నా తోడబుట్టిన వాళ్ళు, ఈ సుట్టుపక్కనే కాయాకష్టం చేసుకుంటూ బతుకుతున్నాను” అని బదులిచ్చాడు తాత.

“మరి నీ పిల్లలు ఎక్కడున్నారు?” అనడిగాడు మళ్ళీ.

“ఇద్దరాడబొట్టెలకు లగ్గంసేసి పంపేశాను. మగోళ్ళు ఇద్దరున్నారు. పెద్దాడు కొండకవతలిసోట్లో రాతిభూమిని సరుకు చేసి అక్కడే ఇల్లేసుకుని వుంటున్నాడు. చిన్నోడు ఈ ఊళ్ళోనే, ఆ సివర సుట్టిల్లేసుకుని కాయకష్టం చేసుకుంటున్నాడు. ఈ కొండల్ని, ఈ భూవినీ, ఈ నేలనూ నమ్ముకుని బతుకుతున్నాం. మా వాళ్ళంతా ఈడీడే వుంటున్నాం. మాకిక్కడ తప్పితే మరోసోటు తెలియదు. మా ఊరుగుండా ఎప్పుడు ఎవరో ఒకరు అటూఇటూ బాటసారులు తిరుగుతూనే వుంటారు. వాళ్ళే మా ఇంటికొచ్చి వుండి ఈ ఇంటికి ధర్మసత్రవని పేరెట్టారు. మొదటినుండీ మాకున్న దాంట్లో వచ్చినోళ్ళకి లేదనకుండా పెడుతూనే వున్నాం. చీకటిపడితే ఇటొచ్చిన వాళ్ళకు రాత్రిపూట ఆగటానికి మా ఇల్లే ఆదరువు నాయనా” అన్నాడు తాత సంతోషంగా.

“ఇక్కడ ఎవర్నడిగినా ఈ తాతే చూపిస్తారు. నాకు తెలిసినప్పటినుంచీ తాత ఈ దారినబోయేవాళ్ళను పిలిచి పెడుతూనే వున్నాడు” అన్నాడు లక్ష్మణయ్య.

“నీకు తెలిసినప్పటినుండీ ఏంటి నాయనా? నాకు లగ్గం అయి నేనీడకు రాబడినప్పటినుంచీ, నాచేత వండిచ్చి పెడుతూనే వున్నాడు. వరదలొచ్చిన ఏడు మా ఇంట్లోనూ ఏమీ వుండవు. మాకు వున్నా, లేకున్నా, ఎవర్నీ కాదనడు. తిండిగింజలు లేనపుడు గడ్డిగింజలు తెచ్చి పిండి ఇసిరి వుంచుతాను. దాంట్లోకి ఉప్పుగల్లూ, నల్లేరుగుజ్జూ ఏసి కలిపి రొట్టెలు కాల్చి ఇస్తాను. ఈ బచ్చలాకూ, గలిజేరాకూ, కొండపిండిఆకూ, ఏ ఆకు దొరికితే ఆ ఆకుల్తో, చింతాకు కలిపి కూరల్లే వండుతాను. వచ్చినాళ్ళకు ఏదో ఒకటి పెట్టటానికి సానాకష్టాలు పడతాను” అన్నది అవ్వ.

“అవును నాయనా! వచ్చినోళ్ళను పొమ్మనలేకపోతున్నాను. ఆల్లకు తినటానికి, ఏమైనా పెట్టటానికి అవ్వ నానా అగసాట్లు పడుద్ది. వట్టికడుపుతో నీల్లుతాగి పడుకోవటం మా కలవాటయింది. వచ్చినోల్ల కడుపు నింపటం ఎట్టాగా అని సతమతమైపోతాం” అన్నాడు తాత.

“జొన్నలూ, కొర్రలూ కాక ఇంకేమైన గింజల్ని పండించటానికి ప్రయత్నించకపోయారా తాతా?” అన్నాడు కమలనాధుడు.

“రాతి భూమిలో ఇంకేం పండిత్తాం నాయనా? కొండలమీదికెళ్ళి చెట్లకాయిలూ, పళ్ళూ వెదికి తెచ్చుకుంటాం. చిన్నచిన్న ఏట జంతువులేమైనా దొరికితే పట్టుకొచ్చుకుంటాం. తేనె దొరికితే తెచ్చి దాచుకుంటాం. ఏది ఏమైనా వోనలు సకాలంలో పడాలి. అలా పడితేనే జొన్నలైనా పండుద్ది. ఒకేడు వరదొలొచ్చి ఏసిన పంటంతా కుళ్ళిపోతది. ఇంక ఆ ఏటికి ఏం మిగలదు. తినటానికీ గింజలుండవు. అమ్ముకోవటానికి అసలే వుండవు. అమ్ముకోవటం లేదు కాబట్టి చేతిలో ఏగానీ వుండదు. మరో ఏడు మిడతల దండు వచ్చి జొన్న ఆకునీ, కంకుల్నీ తినేసి పోతది. ఆ ఏడూ ఏం కళ్ళజూడం. మరొక ఏడు పచ్చులన్నీ కలిసికూడ గన్నట్లుగా వచ్చి కంకుల్లోని గింజలన్నిటిని తినేసి పోతాయి. ఎన్ని జాగ్రత్తలు పడ్డా, ఎంతగా పంట కాపాడుకుంటున్నా ఒకొక ఏడు ఏమీ దక్కదు. ఆ ఏడూ ఆ చేతుల్లో ఏమీ వుండదు. నేల సదును సేయటానికి మా సేతులకు పడ్డ పుండ్లు మాత్రమే కనపడతాయి. మూడు, నాలుగేళ్ళ కొకసారన్నా జొన్నపండితే తాలు జొన్నమూటల్ని సంతకేసుకెళ్ళి అమ్ముకుంటాం. కొద్దిగానైనా దుడ్లొస్తే మాకు పండుగే. అప్పుడే కావలసినన్ని సంబరాలు కొని తెచ్చుకుంటాం. గోచీ, పాతా కొనుక్కుంటాం. ఈ శనగబద్దలు అట్లా కొనుక్కున్నయ్యే. శానాతిప్పలు పడి కూతుళ్ళ లగ్గాలు చేశానా! కొడుకులకూ లగ్గాలు చేశాం. అందరికీ పిల్లా జెల్లా పుట్టుకొచ్చారు. అప్పటికీ, ఇప్పటికీ మావాళ్ళందరూ నాకు సెప్తానే వుంటారు. ఊరికే దారినబోయే వోళ్ళని పిలవమాకు. ఇంట్లో పస్తులుండి వచ్చినోరికి పెట్టాలనుకోబాకు అని. నేనెవరిమాటా ఇనను. నా ఊపిరి బోయేదాక పిలుత్తానే వుంటా పెడతానే వుంటా. నా సేతిలో కనక శానా దుడ్లుంటే శానా రకాలు తెప్పించి పెడుదును. దారినిబోయే వోళ్ళనేకాదు. ఎప్పుడు వరదొచ్చినా అందరికీ గాపకం వచ్చేది నా ఇల్లే. నా ఇల్లు బాగ మెరకమీద ఏసుకున్నాను. ఒకమాదిరి వరదలకు నా ఇల్లు మునగదు. గింజలు పండినేడు కూడా అన్నీ సంతలో అమ్మినంతగు మాత్రమే అమ్ముతాను. మిగతా వాటిని ఇంట్లోనే బానల్లో పోసి దాపెడతాను. ఎండుపుల్లల్ని పోగుచేసి సోపరాలో వుంచుతాను. వరదలొచ్చినపుడు పిండో, గింజల్నో వుడికించి గెంజికాసి పోత్తాం. అందరూ ఇక్కడే ముడుక్కుని కొనుకుంటారు. వరద తియ్యంగానే ఎవరిల్లకు ఆళ్ళుపోతారు. అట్లా ఎన్నిమార్లో జరుగుద్ది. ఈ సుట్టుపక్కల ఎవురింట్లో లగ్గం జరిగినా నా సెయ్యి లేకుండా వుండదు. ఓపికున్నంతవరకు ఏటేటా కొండరాళ్ళనూ, బండల్ని పిండిసేత్తాను. సదునుసేసి, నేలంతా తవ్వేసి రాయీ, రప్పా ఏరి పోత్తాం. దాంట్లో జొన్నలో, గడ్డిగింజలో, కొర్రవిత్తులో చల్లుతాం. పండినేడు పండుతుంది. అపుడు ఆ గింజల్ని బద్రం సేత్తాను. పండనిరోజుల్లో తీసివాడతాను. ఎవరికి తిండిగింజలవసరం వచ్చినా పరుగెత్తి నా దగ్గరకే వత్తారు. నా బొందిలో ఊపిరున్నంత వరకూ ఇదే పద్దవతి. మా నాయిన కొద్దికొద్దిగా ఆళ్ళకూ, ఈళ్ళకూ పెట్టేవారు. నేనింకా ఎక్కువ సేత్తన్నాను” అంటూ తాత చెప్పుకొచ్చాడు.

“అదే నాయనా. అదే పద్ధవతి, మేమూ కలిగినోళ్ళం కాదు. అన్ని సంబరాలూ ఇంట్లో వున్నవాళ్ళమూ కాదు. మా ఇంట్లో వున్న గంజిచుక్కలతోనే పక్కనోళ్ళ కడుపులు నింపాలని చూసేటోళ్ళం మాత్రమే. భగవంతుడు మాకు ఇంతే సత్తువనిచ్చాడు. నువ్వు చూడబోతే కలిగినోళ్ళ బిడ్డలాగున్నావు. మా ఊరు, మా సోపరా, మా తిండీ అన్నీ నీకు వేరుగా అనిపించొచ్చు” అన్నది అవ్వ.

“కొత్తగానే వున్నది అవ్వా! అయినా ఎంతో కలిగినవాళ్ళకంటే మీ మనసులు చాలా దొడ్డవి. ఇతరుల ఆకలి తీర్చాలన్న మీ తాపత్రయమూ గొప్పదే. మీలాంటి వాళ్ళుంటారని కూడా నాకు తెలియదు. ఇంత దయగల మనుషుల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వున్నది” అన్నాడు కమలనాధుడు ఎంతో మెచ్చుకోలుగా.

“అవునవును. దయగల మనుషులు కాబట్టే మనలాంటి వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. తాతా, అవ్వ ఇద్దరికిద్దరే” అన్నాడు లక్ష్మణయ్య.

“ఏంటో? మా కర్థంకాని పెద్దపెద్ద మాటలు అంటున్నారు నాయినా. ఇదేదో చాలా గొప్పసంగతని నేను అనుకోవటం లేదు” అన్నాడు తాత వినయంగా.

అలా అంటూనే “నడి జామైంది. పడుకుందాం. చుక్కపొడవగానే బండల్ని నలగగొట్టటానికి పోవాలి. కూస్తంత నిద్రపోతాను. మీరూ పడుకోండి నాయనా” అన్నాడు తాత. తాను మోచేయి తలకిందపెట్టుకుని పడుకున్నాడు.

మర్నాడు వేకువజామునే కమలనాధుడు, లక్ష్మణయ్య నిద్రలేచారు. అప్పటికే గుర్రం లేచి సకిలిస్తున్నది. తాతేమో మట్టికడవలతో నీళ్ళు మోసుకొచ్చి గోలేలలో నింపుతున్నాడు. అవ్వ చీపురు పట్టి అక్కడంతా శుభ్రం చేస్తున్నది.

“నాయనా! కాసేపుండండి. జొన్నసంకటి సేత్తాను. చింతాకాయ తొక్కుతో తిందురుగాని” అన్నది అవ్వ.

“కాదులే అవ్వ. తొందరగా పోవాలి. చాలాదూరం వెళ్ళాల్సి వున్నది. బయలుదేరతాను” అన్నాడు లక్ష్మణయ్య.

“నేనూ చాలాదూరం పోవాలవ్వ. అందుకని వెంటనే బయల్దేరతాను. దారిలో ఏదైనా తింటానులే. నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఇది ఊరికినే చెప్పేమాట కాదు నిజం. తాతా వెళ్ళివస్తాను. నేను మిమ్మల్ని మాత్రం మర్చిపోను. తాతా! రాళ్ళను పిండిచేస్తూ ఈ వయసులో మరీ ఎక్కువగా శ్రమపడకు. భగవంతుడు మీకు అన్ని విధాలా మేలు చేస్తాడు” అన్నాడు కమలనాధుడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here