బతుకాట

0
7

[dropcap]అ[/dropcap]నంత పద్మనాభరెడ్డి గడప దాటుతుండగా కరణం శంభయ్య ఆదరబాదర ఇటుగా వస్తూ కనిపించటంతో ఆగాడు. ఇంతలో మాతంగి ఎల్లమ్మ బుట్ట నెత్తినేసుకొని బాటన కనపడి రెడ్డి గారికి మొక్కేసింది. ‘యాడికి’ అన్నట్లు చూశాడు. “మన మల్లయ్యగారి పెంచలయ్య కంది కల్లం ముగింపుకొచ్చింది. నాలుగు పప్పుగింజలు దొరుకుతయని అటుగా పోతున్న” అని చకచక నడిచింది. దాని నడక వయ్యారం చూస్తుండిపోయాడు రెడ్డి. ఈలోపు శంభయ్య రానే వచ్చాడు. ఇద్దరు కుశలమనుకున్నారు. “నేను చెలకకాడికి బయలుదేరిన. జరూరీ విషయం ఉందా” అడిగాడు రెడ్డి, ఉంటే బేగి చెప్పు అన్నట్లు చూసి. “నీకు తెలియనిది ఏముంది” అని లోపల కడుగేసిన కరణం “ఈ సంగతి తెలిసే ఉందనుకున్నా” అని ఆరంభించాడు. “తెలిసింది చెప్పవయ్య” అనడంతో “మీ ఇంటి పనిమనిషి రంగమ్మ ఈ పొద్దు పనికి వచ్చిందో లేదో కనుక్కోండి” అన్నాడు శంభయ్య.

వెంటనే ఇల్లాలిని పిలిచి ఆరా తీస్తే నిన్నటి నుంటే కాదు నెలపొద్దు నుండే రావడం లేదని తెలిసింది. అది తెలుసుకొన్న రెడ్డి “ఇప్పుడు దాని ఊసెందుకు” అని నిగ్గదీసాడు కరణాన్ని. కరణం నెత్తిగీకుతూ “అది నాలుగేళ్ల పిలగాన్ని వదిలి కొత్తగా వచ్చిన బోయుడుతో టౌనుకెళ్ళిందట. రంగమ్మ మొగుడు సాయిలు పొద్దుటే వచ్చి లబలబ మొత్తుకున్నాడు. పిలిపించి కనుక్కుందామంటే అది ఊళ్లో లేదు. మనం ఎట్లాగో దాన్ని ఊళ్లోకి పిలిపించాలి. ఇప్పటికే పెద్ద మనుషులు ఏం చేస్తారు చూద్దాం అని ఎకశెకలాడుతుంది కుర్రకారు” అన్నాడు.

తల విసిరిన రెడ్డి “ఎట్టోడ్ని పిలిచి దాని కోసం టౌనుకు పంపండి. రేపు పంచాయితీ చేద్దాం. దాని అడ ఊర్లో చాలా మందికి తెలుసు. నా పేరు చెప్పి ఊర్లోకి రప్పించు” అన్నాడు. తల విసిరిన కరణం, “ఊర్ని ఓ తాటి మీద నడపాలంటే కొంచం భయపెట్టాలి. ఆ అదుపులేసిది కష్టం. ఇక నేను వెళ్తాను” అని నడిచాడు.

***

పొద్దు బారడెక్కింది ఊరు పనిముఖానికొరిగినట్టు కనిపించలేదు. రచ్చబండ కాడ యాప చెట్టు నీడన జనం మాత్రం పోగయన్రు. రంగమ్మని ఊర్లోకి తీసుకొచారట, పంచాయితీ చేస్తారట.

పని ముఖం ఉన్నోళ్లు రాలేదు. మిగిలిన జనం పోగయిన్రు. రంగమ్మ నలుగురు ఆడంగుల మధ్య తలొంచుకొని కూలబడ్డది. మామూలుగనే ఉంది. వెంటున్న ఆడంగులతో మాట్లాడుతూనే ఉంది. కులాలవారీగా పెద్ద చిన్నా అంతా పోగయ్యారు. “అదిగో రెడ్డిగోరు ఒస్తుండు” అని గుసగుసలు బయలుదేరినయి. ఎట్టోడు, షేక్ సింగ్, కరణం వెంట కనిపించారు. రెడ్డిగారిని చూసి కొందరు కూర్చోనే మొక్కేసిన్రు. ఆయన బండమీది కొచ్చి జనాలకెంచి చూసి కూర్చుండు. చెట్టుకింద ఉన్న రంగమ్మ లేచి రెడ్డిగారికి దండమెట్టి వచ్చినట్టు తెలుపుకుంది. సాయిలు, రంగమ్మకు తాళి కట్టినోడు ఉన్నడో లేడోనని చూసింది. దూరంగా ఈత చెట్టు కింద పోరడితో కూర్చోని కనబడ్డడు.

కరణం శంభయ్య లేచి అందరిని చూసి “ఇదిగో సాయిలుని వదిలిన రంగమ్మ కొత్త బోయునితో టౌనులో ఉంటుంది. పోరడ్ని సగ సాయిలు పొంటనే వదిలేసింది. వాడు నడుమిరిగి కూర్చున్నాడు. ఊరంత తెలుసు వాడు అర్భకుడని. రంగమ్మ కూడా వచ్చింది. సంసారం కదా, కులపోళ్లందరూ కలిసి మంచో చెడో ఆలోచన చేసి చెప్పండి. ఊరు గనక మంచి జరిగేట్టు చూడండి.” అన్నాడు.  రెడ్డిగారు లేచి జనాన్ని పారద్రోలుతూ “కుమ్మలు సంగయ్య వచ్చినట్టు లేదు. మాదిగ బచ్చయ్య, మాల ఏసోబు, గోళ్ల లక్ష్మీపతి, చలక సోందేవమ్మ, గౌడ మల్లయ్య, అందరూ వచ్చినట్లే కదా” అని రంగమ్మ వైపు తిరిగి “రంగమ్మా నీవు సాయిలను ఒగ్గేసి వెళ్ళిపోవటం, నాలుగేండ్ల పోరగాడ్ని వదలి ఇది మంచి పనిగ తోస్తలేదు. ఇది కట్టుబాటు ఉన్న ఊరు. ఈ శిలశిలా నడిస్తే ఇంకా సంసారాలేం నిలబడతయి.” అని ఆగి “రంగమ్మా, అసలేం జరిగిందో మాకు తెలవదు. నీవు పోరడ్ని తీసుకొని పోయింటే మంచిగుండు” అని కరణం వైపు తిరిగి “అయినా నీకు సాయిల్ని వదిలిపోయెంత తగాదాలు ఏం జరిగిందో చెప్పుకో. న్యాయం అనిపిస్తే ఆలోచిద్దాం” అన్నాడు.

చెట్టుకు ఆనుకొని కూసున్న రంగి ఎడంగ జరిగి లేచి అందిరికకి మొక్కేసి ‘మా మాట ఆలకించండన్నట్టు’ చూసి “ఊరంతా ఏంది ఈడనే ఉంది? చిన్నా పెద్దా అంతా. నేను కన్న పోరడ్ని వదిలి కావరంతో బోయుని వెంట పోలే. అమ్మోరి మీద ప్రమాణం చేసి చెప్తున్న. నేనీడున్న ఐదేళ్లు సగం రోజులు పస్తులున్నా. నేనంటే ఉంటా, కన్న పోరడ్ని పస్తులుంచలేను కదా. వానికి నా చేతులతో కలిపి ఇంత సంకటి ముద్ద పెట్టుకోలేకపోయిన. నేను కూలిపోతే తిన్నట్టు. నన్ను కట్టుకున్నోడ్ని ఏ ఆసామి పనికి పిలవడు. వీడు పోడు. జీతం ఎక్కడా ఉండదు. ఒకేల వీడు ఉంటనన్నా ఉంచుకునేటోడు లేదు. కూలికని టౌనుకి పోయి ఏం చేసిండో పోలీస్ తాన పడ్డడు. వాన్ని ఇడిపించటానికి పుస్తె తాకట్టు పెట్టిన.

‘ఏంది ఆగావు’ అని అడిగితే మాట్లాడడు. నేనుగా నిమ్మలంగ ఏం జరిగిందని ఆరా తీస్తే ఎవడో పోరడ్ని ఆగం చేస్తంటే ఠానాలో వేసిన్రట. ఎవరితో ఏం చెప్పుకోను అన్ని మూసుకొని కూకున్న. నా రెక్కల కష్టంతో నా పోరడ్ని గాక వాన్ని మేపడం నా వల్ల కాలేదు. పస్తులుండలేకపోయా. పుట్టకొచ్చిన బోయనితో ఈ సంగతి చెప్పుకున్న. వాడికి తోడు లేరు. టౌనులో మిల్లు హమాలీ. నన్ను చూసి జాలి పడి మంచిగ చూసుకుంటా నీకూ అడపాదడపా పని దొరుకుతది అన్నడు. ఇది నిజం దొరా, ఆయన పంచకు పోయనాకనే రెండు పూటలు నాలుగేళ్లు నోట్లోకి పోయినయి. దొర ఓ మాట, కన్న పేగును కూడా నాతో తీసుకపోతా. వాని పంతనుంటె పస్తులతోన చస్తడు. వాడి సంగతి మీకు తెలుసు. ఎటు కదలడు. పెద్దమ్మ తల్లి వాడి నెత్తినుంది. అయినా ఈడ్నే ఉండమంటారా? నేనుండ” అని చకచక నడిచి సాయిలు దగ్గరున్న పోరాడ్ని గుంజుకొని దోవన పడ్డది. ఊరు ఊరంతా నోరెళ్లబెట్టి చూసింది తప్ప నోరిప్పలే. దాని ఆకలి తీర్చగలిగిన వాడెవడు, ధైర్యంగా ‘ఆగు’ అనలేకపోయారు. అదే ఆగి “ఇదిగో కరణంగారు సాయిలు మీద మీకంత కారిపోతే, వాడొక్కన్ని సాకండి” అని ఊరు వైపు వెనుదిరిగి చూడలా, నడక ఆగలె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here