భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-16

0
12

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-16: త్యాగరాజు

[dropcap]క[/dropcap]ర్ణాటక సంగీత ప్రపంచమునకు – శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు త్రిమూర్తులు. త్యాగరాజు భగవదావతారము. ఈ విషయాన్ని త్యాగయ్య గారే స్వీయరచన యగు ‘దాశరథి నీ ఋణము దీర్చ నా తరమా’ అని తోడి రాగంలో చెప్పారని శ్రీ హరి నాగభూషణం గారు వ్రాసియున్నారు.

శ్రీ త్యాగరాజస్వామి శంభు, నారద, గణపతి, ఆంజనేయ, వాల్మీకి అంశలతో జననమొందినారని విమర్శకుల తలంపు. త్యాగయ్య కృతులు ఉపనిషత్సూక్తులకు ఆలవాలములని, ఆ కారణముగ ఆయన కృతులకు ‘త్యాగబ్రహ్మోపనిషత్తు’లను పేరు కలిగినదని బహు పండితాభిప్రాయము. త్యాగయ్య సహజ వాగ్గేయకారులు. మహాకవి ముఖ్యశిష్యులలో ఒకరగు శ్రీ వాలాజాపేట వేంకట రమణ భాగవతులు తాము వ్రాసిన గుర్వష్టక శ్లోకములలో అయ్యగారి వైభవము ఇట్లు చాటినారు:

“వ్యాసో నైగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మా మునిః

వైరాగ్యే శుక యేవ భక్తి విషయే ప్రహ్లాద యేవ స్వయం

బ్రహ్మా నారాద యేవ చాప్రతిమయోః సంగీత సాహిత్యయోః

యో నామామృత పాన నిర్జిత శివాః తం త్యాగరాజం భజే!”

శాస్త్ర చర్చ యందు వ్యాసుడు, మృదువైన వాక్యములను పలుకుటలో వాల్మీకీ, వైరాగ్యమున శుక్ల యోగేంద్రులు, భక్తి విషయమున స్వయం ప్రహ్లాదులు, సాహిత్యమున బ్రహ్మ సంగీతమున నారదుడు, రామ నామామృత పానమున శివుని జయించినవాడు త్యాగయ్య. ఆంధ్రుడగుట ఆంధ్రుల పుణ్య పరీపాకము.

త్యాగయ్య పూర్వీకులు – జననము:

త్యాగయ్య పూర్వులు కర్నూలు జిల్లా కాకర్ల గ్రామమునకు చెందినవారు. త్యాగయ్య ముత్తాత పంచనదబ్రహ్మ. ములకనాటి వైదిక శాఖ. భారద్వాజస గోత్రము. ఆపస్తంభ సూత్రులు. వీరిని విజయనగర ప్రభువులు ధర్మ ప్రచారమునకై దక్షిణ దేశమునకు పంపిరి. వీరికి 5గురు కుమారులు. (1) సదాశివ బ్రహ్మము (2) సదానందబ్రహ్మము (3) సచ్చిదానంద బ్రహ్మము (4) బాల బ్రహ్మము (5) గిరిరాజు బ్రహ్మము

కనిష్ఠుడగు గిరిరాజు బ్రహ్మము గిరిరాజ కవిగా పేరు పొందాడు. ఈయనకు ‘సుబ్రహ్మణ్య భారతి’ అను నామాంతరం కలదు.

తంజావూరు నేలిన మహారాష్ట్ర ప్రభువు శహజీ ఆస్థానాంధ్ర కవియగు గిరిరాజ కవి – త్యాగయ్య తాతగారగు గిరిరాజ కవి ఒకరేనని భ్రమపడియున్నారు.

ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర ద్వితీయ భాగం పుట 314 నందు, ‘సప్త తంతువు’ అను వ్యాస సంపుటంలో త్యాగరాజు కృతులు అను వ్యాసంలో ఇచ్చారు.

గిరిరాజ బ్రహ్మము వ్రాసిన కీర్తనలు ‘సంగీత సంప్రదాయ ప్రదర్శిని’ అను గ్రంథమున నీయబడినవి.

త్యాగయ్య తాతగారగు గిరిరాజు బ్రహ్మము శహాజీ సన్మానం అందుకొనినట్లు ‘కృతి మణిమాల’ అను గ్రంథం వలన తెలియుచున్నది

గిరిరాజు బ్రహ్మమునకు అయిదుగురు కొడుకులు – కనిష్ఠుడు రామబ్రహ్మము. ఈయన గొప్ప పండితుడు. భాగవత శివపురాణ నిష్ణాతుడు. రామ భక్తిపరుడు. పేరొందిన రామాయణ పౌరాణికుడు.

రామబ్రహ్మముగారు ‘సీతమ్మ’ అను కన్యను పరిణయం ఆడారు, కొందరు ఆమెను ‘శాంతమ్మ’ అని కూడా అంటారు.

కమలాలయ క్షేత్రమున జన్మించిన కర్ణాటక సంగీత ప్రపంచమునకు మూర్తిత్రయమనదగు శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు నాదోపాసనలో ముక్తినొందిరి. ఈ మువ్వురు జీవన్ముక్తులు.

‘గీతాద్యఖిలోపనిషత్సార భూత జీవన్ముక్తుడౌటకు సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ అనిరి త్యాగయ్య గారు.

బాల్యం:

  1. దేవతా విగ్రాహాలను తనివి తీరా పూజించటం.
  2. హరికథాగానాలు వినడం.
  3. తండ్రి చెప్పిన రామాయణ పురాణములు ఆసక్తితో వినడం
  4. తిరువారూరు వీధి బడిలో చదివారు.
  5. తిరువారూరు వీడి తిరువయ్యూరు (పంచనద క్షేత్రము) చేరినారు.
  6. త్యాగయ్య జీవితమంతా తిరువయ్యూరు నందే గడిపారు.
  7. కావేరి, కొలెడము, కుడమురుతి, పెన్నార్‌, వెట్టార్‌ అను 5 నదులు కలియు పవిత్రస్థలము – పంచనద క్షేత్రము. అచట ఈశ్వరుడు పంచనదీశుడు. దేవి ధర్మసంవర్ధిని. త్యాగయ్య పంచనదీశుని ప్రణతార్తి హరుడని కీర్తించారు.

విద్యాభ్యాసం:

  1. 8వ ఏట ఉపనయన సంస్కారము
  2. సంస్కృతాంధ్రమున నిష్ణాతులు
  3. అచ్యుతప్ప నాయకుని కాలమున మహా మేధావి యైన గోవింద దీక్షితులు స్థాపించిన విద్యాశాలలో వేద వేదాంగ జ్యోతిష, తర్క, వ్యాకరణ ఆయుర్వేదములను చతుష్షష్టి కళలను నేర్చుకున్నారు. ప్రవీణుడు అయ్యెను.
  4. త్యాగయ్య తల్లి సీతమ్మగారు మంచి గాయని. ఆమె తన తండ్రి వీణ కాళహస్త అయ్యర్ వద్ద సంగీత విద్య అభ్యసించెను. తాగయ్య మొదటి గురువు తల్లి సీతమ్మ గారే.
  5. తండ్రి గ్రామాంతరము వెళ్ళినప్పుడు ఏకపీఠ విగ్రహమును పూజించే అవకాశం కలిగింది. గీతం శ్రావయామి అనుచు భగవంతునకు పాట పాడి వినిపించుట కూడ షోడశోపచారములలో ఒకటి. త్యాగయ్య నోటి వెంట అపూర్వమైన సాహిత్యము వెలువడినది. అవే దివ్య నామ సంకీర్తనములుగా విరాజిల్లినవి. ఉదా. (a) నమో నమో రాఘవాయ అనిశం – దేశిక తోడి (b) అన్యాయము సేయకురా రామ – కాపి, ఆది
  6. రామ నామ జపానికే ప్రాధాన్యత ఆయన కీర్తనలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉదా: ‘సుఖి యెవ్వరో రామనామ సుఖి యెవ్వరో’, ‘రామనామమునే వరఖడ్గము’, ‘నామ పుణ్యము చెలగునా’, ‘రామా నీ యెడ ప్రేమ రహితులకు నీ నామ రుచి తెలియునా’, ‘ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును దలచువారు’ ‘నాధ సుధారసంబు’ అరభి.
  7. ‘ఇంతకన్నా ఆనంద మేమి?’ బిలహరి లోని – ‘నీ జపముల వేళ ఈ జగములు నీవై రాజిల్లునయ్య’ లో గోచరిస్తుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసములు ఏకమై రామనామ జపం జరుగుతోంది
  8. ‘మేలు మేలు రామనామ మీ ధరలోన’ (సౌరాష్ట్ర), ‘రామ నామము మేలు రామ చింతన చాలు’ (భైరవి), ‘రామనామము జన్మరక్షక మంత్రము’ (అఠాణ) మొదలగు కీర్తనలలో రామ నామ మహిమ గోచరిస్తుంది.

సమకాలీకులు:

పట్నం సుబ్రమణ్యం అయ్యర్, మహావైద్యనాథయ్యర్ – వీరు వేంకట సుబ్బయ్య గారి శిష్యులు. టైగర్ వరదాచారి, మైసూరు వాసుదేవాచారి – పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ నకు శిష్యులు. ముసిరి సుబ్రహ్మణ్యం మొదలగువారు.

నారద సందర్శనము – స్వరార్ణవ ప్రాప్తి:

తాగయ్య జీవిత పంచాగమున 18వ సంవత్సరానికి విశేష ప్రాముఖ్యత వుంది. 18వ యేటనే త్యాగయ్య గారు ‘పార్వతి’ అను కన్యకామణిని వివాహమాడిరి. త్యాగయ్య గారు రామనామ జపమును ప్రారంభించినది 18వ ఏటనే.

సద్గురు కటాక్షము వల్లనే సందేహములు నివృత్తి కాగలవని “గురు లేక ఎటువంటి గుణికి తెలియక పోదు” (గౌరీమనోహరి) అని గురు కటాక్షమునకై ఎంతో పరితపించారు త్యాగయ్య. ‘ఆచార్యస్సహరిస్సాక్షాత్’ కాన శ్రీరామునే సద్గురువుగా నెంచి త్యాగయ్య ఇట్లు ప్రార్థించిరి.

“నీ చిత్తము నిర్మలము నిశ్చలమని నిన్నే నమ్మినాను” (ధన్యాసి- చాపు)

రామ షడాక్షరీ మంత్రము ఉపదేశించిన రామకృష్ణానంద యతీంద్రులు త్యాగరాజ ఆర్తినెరింగి త్యాగయ్యను చేరి నారద మంత్రోపదేశము చేసి ‘మంత్ర జపము చేయుము, కృతార్ధుడవు కాగలవ’ని చెప్పి వెడలిరి.

‘అథవా భవితవ్యానాం ద్వారాణి భవన్తి సర్వత్ర’ అని చెప్పుట ఈ సందర్భంలో సమంజసము.

నారద మంత్రోపాసన ప్రారంభించిన కొన్ని దినాలకు ఒక యతీశ్వరుడు త్యాగయ్య యింటికి వచ్చి గ్రంథ మొసగెను. అదియే స్వరార్ణవనము. ఆ యతీంద్రుడే నారదునిగా గుర్తురెరింగి త్యాగయ్య గారు ఆనందంతో నారదుని కీర్తించుచు చాలా కీర్తనలు వ్రాసారు.

నారద పంచరత్నములు:

(అ). శ్రీ నారదముని గురురాయ (భైరవి) (ఆ). శ్రీ నారద నాద సరసీరుహభృంగ శుభాంగ (కానడ) (ఇ) నారద గురుస్వామి (దర్బారు) (ఈ) వర నారద నారాయణ (విజయశ్రీ) స్మరణానందానుభవము.

‘నారదగానలోల’ (అఠాణ) రాగకృతిని నారద శబ్ద ప్రసక్త మాత్రము చేత నారద పంచరత్నముల చేర్చి చెప్పుచున్నారు. నారదగాన లోలుడు విష్ణువు. విష్ణువును సంబోధించి చెప్పిన కీర్తన అది. నారదుని శరీర కాంతి ‘శరదిందు నిభము’. కాని అఠాణ రాగకృతిలో ‘నీరద సమ నీల నిరుపమ శీల’ అని వుంది. దీనిని బట్టి ఇది నారద పంచరత్నం లోనిది కాదు.

నారద పంచరత్నములనుటకు – సంఖ్యా పూరణమునకే అయినచో ‘నారద వర్ణనము కల్గిన ప్రహ్లాద భక్తి విజయము నందలి ‘నారదముని వెడలిన సుగుణాతిశయము వినరే’ అను దానిని చేర్చుట సమంజసము.

వాగ్గేయకారులలో నారద సందర్శన భాగ్యమును పొందినవారు కానీ, నారదునిపై కీర్తనలు చెప్పినవారు గాని మరియొకరు లేరు. త్యాగయ్యగారొక్కరే అనుటకు సందియము లేదు.

వైష్ణవులకు శ్రీమద్రామానుజుడెట్లో, అద్వైతులకు శ్రీ శంకరాచార్యులెట్లో, కబీరునకు రామానందులెట్లో, చైతన్యునకు నీశ్వరవధూటియు, కేశవభారతి నెట్లో, రామదాసునకు కబీరెట్లో – త్యాగరాజునకు నారదడట్లు.

రజతగిరీశుడు నగజకు దెలుపు స్వరార్ణవ మర్మములు

విజయము కలిగిన త్యాగరాజునకెరుకే

(స్వర రాగ సుధా – శంకరాభరణము)

స్వరార్ణవ పరిశీలనంతో త్యాగయ్య గారి సంగీత శాస్త్ర సందేహాలు తీరాయి. తద్వారా ఆయన రామాయణ కృతి రచన చేశారు. నూతన రాగములు (కైకవ్రశి, రసావళి) కనుగొన్నారు.

త్యాగయ్య జ్యోతిస్స్వరూపిణి రాగం పాడి దీపము వెలిగించారని ప్రతీతి. రాగం యొక్క హెచ్చు తగ్గు స్థాయిలను అనుసరించి దీపము ప్రకాశం కూడా హెచ్చి  తగ్గి అందరిని ఆశ్చర్యపరిచినదట.

పితృ వియోగం:

త్యాగయ్య అన్నగారు జప్యేశుడు  సదానంగ క్రియాలోలుడై కాలక్షేపము చేయుచుండెను. త్యాగయ్య తన భార్యయగు పార్వతితో కలిసి కాపురం చేయుచుండెను. 1789 సంవత్సరంలో త్యాగయ్య తండ్రి రామబ్రహ్మంగారు దివంగతులైరి. సీతమ్మ గారి సహగమనాన్ని భర్త నిరాకరించారు. త్యాగయ్య భావి ఔన్నత్యాన్ని చూచుటకు జీవించి యుండవలయు అని చెప్పినారు.

త్యాగయ్యకు భార్యా వియోగం 1790లో జరిగింది. అప్పటికి త్యాగయ్య  వయసు 23 సంవత్సరాలు. పార్వతి మరణించుచు త్యాగయ్యను మరల వివాహమాడుమని కోరిరి. పార్వతి మరణం అతనికి మనస్తాపం కల్గించింది. పార్వతి కోరిక మేరకు ఆమె చెల్లెలు కమలాంబను వివాహమాడి సీతాలక్ష్మి యను కుమార్తెను కన్నారు.

ఉంఛవృత్తి:

త్యాగరాజు అనాదియై, సంప్రదాయసిద్ధమై, అనిందితమైన ఉంఛవృత్తి మార్గముగ జీవయాత్రను సాగించిరి. ఆయన చాల సాధారణమైన జీవితమును గడిపిరి. మానవజాతికి భక్తి, సంగీతముల సేవ చేసిన మహనీయుడు త్యాగరాజు. వారానికి ఒకసారి మాత్రమే శిష్య బృందంతో ఉంఛవృత్తి చేసేవారు. ఆ ఆర్జనతో ఇంటికి వచ్చిన అతిథులను పోషించెడివారు. అక్షయపాత్రను శిరముపై పెట్టుకుని, తంబూర చేతబూని శిష్యులతో ఉంఛవృత్తి చేస్తూ చాలా కీర్తనలు గానం చేసేవారు.

ఉదాహరణ: ‘హరిదాసులు వెడలె’ (యమునాకళ్యాణి – ఆది).

త్యాగయ్య సమకాలీకుడు తూము నరసింహదాసు కూడా ఉంఛవృత్తి మార్గాన్నే ఎంచుకుని జీవయాత్ర సాగించారు. ఉదాహరణ: ‘పరమ పావనమైన అక్షయపాత్ర జీవనాధారము చేసుక రాముల నమ్మితి ఈ దేహము స్వామి కమ్మితి’.

త్యాగయ్య ఉప్పు కప్పురము వరకు ఉంఛవృత్తిచే ఆర్ధించినట్లు చెప్పికొనిననారని [‘ఎన్నాళ్ళు లాగేది’ (మాళవశ్రీ)] శ్రీ నారుమంచి సుబ్బారావు వ్రాసిరి (తెలుగు  సంగీత మహర్షులు, రెండవ భాగం – త్యాగయ్య జీవిత చరిత).

ఉంఛవృత్తి కేవలం సంప్రదాయానుసారము మాత్రమే.

దినచర్య:

ప్రాతఃకాలమున లేచి దైవారాధన చేయడం, మేలుకొలువులు పాడి శ్రీరామునకు ‘ఆకలిదీర పాలారగింపు’ చేసేవారు. ‘చనువున ఘనునకు పన్నీటి స్నానము’, కమ్మని భోజనము పెట్టెడివారు, విడెమిచ్చెడివారు. ‘నీవే నన్నెడ జేసితే నే నెవరితో దెలుపుదునయ్య’ అని (సౌరాష్ట్ర) కీర్తనలో చెప్పారు. ‘చేతులార శృంగారము చేసి చూతున’ని శ్రీరామునికి అలంకారము చేసెడివారు. బాగుగ ఘననయరాగముల దీపారాధన మొనరించి ‘రాగరాత్నమాలికచే రంజిల్లునట హరి – భాగవతోత్తములు కూడి పాడే కీర్తనములట’ అని శ్రీరామునకు రోజురోజుకు క్రొంగొత్త రాగములలతో కూర్చిన దండను సమర్పించి – శ్రీరామునకు ఉయ్యాల వేసి పరుండజేసి ‘ఉయ్యాల లూగవయ్య శ్రీరామ’ అని మల్లెపూల పాన్పు వేసి రామచంద్రుని పరుండ పెట్టేవారు త్యాగయ్య.

ఈ విధంగా స్వవిరచిత కీర్తనము లను రామదాస పురందరదాసాది భక్తుల కీర్తనలను గానము చేయుచుండెడివారు.

సీతాలక్ష్మి వివాహము 1810:

త్యాగయ్య ఏకైక పుత్రిక సీతాలక్ష్మి వివాహము జరిపించిరి.

రామ దర్శనం కొరకు పరితపిస్తున్న త్యాగయ్య నిద్రలో – శ్రీరాముడు విశ్వామిత్రుని యాగరక్షణమునకు అనుజుడగు లక్ష్మణుని వెంట నిడుకొని వెళ్తున్నట్లు – కలగని ఆనందముతో ‘వెడలెను కోదండపాణి..’ అని కీర్తించారు. ‘నను పాలింప నడచి వచ్చితివో..’ అని కీర్తించారు.

మాతృ వియోగం – 1810:

సీతాలక్ష్మి విహాహం అనంతరం కొద్దికాలానికే త్యాగయ్యగారి తల్లి కాలం చేసారు. త్యాగయ్య జీవితమున 1810 సంవత్సరానికి విశేష ప్రాముఖ్యత వుంది. కుమార్తె సీతాలక్ష్మి వివాహాం, మాతృవియోగం, అన్నతో విడివడి వేరే కాపురం పెట్టడం జరిగాయి.

తీర్థయాత్రలు:

త్యాగయ్య వార్ధక్యమున అనగా 68, 69 సంవత్సరాల వయసులో తీర్థయాత్రలు చేసారు. సందర్శించిన క్షేత్రాలలో మధుర, ధనుష్కోటులు కూడా వున్నాయి.

అభోగిలో ‘మనసు నిల్ప శక్తిలేక’; తోడిలో ‘కోటి నదులు..’ వంటి కీర్తనలు రచించారు.

శ్రీరంగం, తిరువత్తియూర్ క్షేత్రాలలో దేవతల గురించి పంచరత్న కీర్తనలు వ్రాసారు.

నవ విధ భక్తి మార్గమున వారు జీవితమంతయు నామ సంకీర్తనముకే వినియోగించిరి. ఉపనిషత్ బ్రహ్మేందులు 108 ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాసారు. అడయార్ థియోసాఫికల్ సొసైటి వారు ప్రచురించారు. కంచిలో తాళపత్రగ్రంథములు వున్నవి.

దర్శించిన క్షేత్రాలు:

వాలాజాపేట, తిరుపతి, పుత్తూరు, షోలింగర్, మదరాసు, తిరువత్తియూర్, కోవూరు, నాగులాపురం, శ్రీరంగం, నాగపట్టణం, లాల్ గుడి, మొదలగు క్షేత్రాలలో దేవతామూర్తులను కీర్తించుచూ చాలా కీర్తనలు రచించారు.

వాగ్గేయకారుడు, మహాకవి, గేయనాటక మార్గదర్శి త్యాగయ్య ప్రాతః స్మరణీయుడు.

త్యాగరాజును సందర్శించిన మహానీయులు – త్యాగరాజు విద్వత్సమాగము:

తూము నరసింహ దాసు 1822, గోపినాథ భట్టారాచార్యులు, గోపాల కృష్ణ భారతి, స్వాతి తిరునాళ్ దూత వడివేలు, 1835, గోవిందమారార్ 1843, ముత్తుస్వామి దీక్షితులు.

వారు రచించిన కీర్తనలు కూడా చాలా ప్రాముఖ్యత పొందినవే.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here