భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-21

0
14

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 4వ భాగం

7. ఖరహరప్రియ:

[dropcap]ఖ[/dropcap]రహరప్రియ అనే పేరు తొలిసారిగా కనకాంగి – రత్నాంగి మేళ పట్టికలోనే 22వ మేళముగా కన్పించుచున్నది. దీని జన్యరాగమైన శ్రీరాగము పూర్వ ప్రసిద్ధ మేళములను గురించి చెప్పుటకు చాలా కాలము నుండియే లక్ష్య లక్షణములతో వివరింపబడిన రాగము. క్రీ.శ. 13వ శతాబ్దంలో సారంగదేవులు శ్రీరాగమును పూర్వ ప్రసిద్ద రాగములలో ఒకటిగా పేర్కోనెను.

సంగీతములో రాగములను జనక, జన్య రాగములుగా వర్గీకరణము చేసినది  లక్షణయుక్తంగానే. కాని అంతకు పూర్వము అనుభవమునకే అగ్రస్థానమిచ్చి, అనుభవములో ఏ ఏ రాగములు రక్తి యుతముగా యుండినవో ఆ రాగములను మాత్రము జనక రాగములుగా పేర్కొని మిగిలిన రాగములను జన్య రాగములుగా నిర్ణయించిరి.

ఈ విధముగా జనక రాగములుగా (లేదా) పూర్వ ప్రసిద్ధ రాగములుగా నియమింపబడిన శీరాగము ప్రస్తుతము ‘ఖరహరప్రియ’ జన్యముగా ఉన్నది. ఖరహరప్రియ జనగ రాగముగా ఉన్నప్పటికీ, దాని స్వర సమూహము, షడ్జ గ్రామ మూర్ఛన అయిన ఉత్తర మంద్రములో సూచించ బడుచున్నది. షడ్జ, మధ్యమ, పంచమములకు పైన, దిగువ ఒక చతుశ్రుత్యంతరం ప్రయోగించి స్వరములను కనుగొన్నచో రిషభ, ధైవతములను ఒక ప్రమాణ శ్రుతి తగ్గించినచో షడ్జ గ్రామ స్వర సప్తకమును గాంధార నిషాదములను ఒక ప్రమాణ శ్రుతి ఎక్కంచినచో, ఖరహరప్రియ స్వరములు లభించును.

ఈ విధంగా భైరవి, ఖరహారప్రియ రాగ వర్గములు లభించినవి. ఈ రెండు రాగాల మధ్య గల భావ భేదమును చక్కగా విపులపరచినది త్యాగరాజస్వామియే. త్రిమూర్తులలో త్యాగయ ఒక్కరే ఈ రెండు రాగాలను వేరు పరచు విధముగా అందమైన కృతులను వ్రాసి సంగీత లోకమునకు ప్రసాదించిరి.

ఖరహరక్రియ కనకాంగి – రత్నాంగి పట్టికలో 22వ మేళము. 4వ చక్రములో 46వ మేళము. ‘వేదు భూ’ మేళ సంకేతములు. రి, గ, మ, ద, ని – స్వర సంకేతములు. పూర్వాంగ మందు గల ప్రతిస్వరమునకు ఉత్తరాంగముగ సంవాదులు గలవు.

ఆరోహణం: స రి గ మ ప ద ని స

అవరోహణం: స ని ద ప మ గ రి స

గమక వరీక రక్తి రాగము. గ, మ, ని మాత్రమే గమకముతో పాడవలెను. ఇందు రి, ద, స, ప వలె లఘు స్వరములనే చెప్పవచ్చును. గ, ని న్యాసము చేసి పాడినచో కొంత వరకు భైరవి భావము స్ఫురించు అవకాశము కలదు. రి, ని ప్రధాన న్యాసము చేసి, రి, ద – అతి సూక్ష్మ స్వరములుగా త్రిశ్రుతి రిషభ, కోమల సాధారణ గాంధారములూ, పలుకునట్లుగా ప్రయాగించి, అవరోహణ క్రమములో నిషాదమును న్యాసముగా, కంపితముగా పాడునప్పడు వచ్చునది భైరవియే. ఇచ్చట ఖరహరప్రియ భావమునకు అవకాశము వుండదు.

స రి గా రి రి స నీ – భైరవి

గా గా గా గ రి స నీ – ఖరహరప్రియ

ఆ రెండు ప్రయోగములలో ధైవాము లేదు. అదియే ఆ రెండింటింలో గల విశేషాంశము. భావపూరితమైన రాగము భైరవి. స్వరప్రస్తారము చేతనే ప్రకాశించునది ఖరహరప్రియ.

భైరవి కూడా బహు రస ప్రధాన రాగము. ఖరహరప్రియ గాన రస ప్రదాన రాగము. మనోధర్మముచే కల్పించుటకు తగిన జంట దాటు, అహత, ప్రత్యాహత స్వర యాగము లన్నిటికి ఖరహరప్రియలో అవకాశము కలదు. భైరవిలో ఈ ప్రయోగములన్నిటికిని సమయమెఱిగి పాడవలెను. స్వరములన్నీ రాగాచ్ఛాయ స్వరములే. రిషభ, పంచమ, ధైవతములు మిక్కిలి ప్రాముఖ్యమైన న్యాసములు. మధ్యమము కూడా సమయానుసారముగా న్యాసస్వరముగా పాడబడుచున్నది. షడ్జ, రిషభ, పంచమము గ్రహ స్వరములు. దైవత గ్రహము కొంచెము అరుదే.

త్రిస్థాయి రాగము. వివిధ కాల ప్రమాణములలో పాడదగిన రాగము. సార్వకాలిక రాగము. నిండు పాండిత్యము గల రాగము. ఖరహరక్రియ స్వర ప్రస్తారము అన్ని దేశ సంగీతోములలోను (గ్రీక్, అరబ్, పాశ్యాత్యం, తమిళ, etc.,) కలదు. ఈ రాగమందు రాసిన వర్ణములు, కొన్ని కీర్తనలు మాత్రమే ప్రచారములో నున్నవి. తిల్లానా రచనకు అంత రమ్యమైన రాగము కాదు. టైగర్ వరదాచారి గారి సోదరుడు కృష్ణమాచార్య ఒక పద వర్ణమును రచించెను. త్రిమూర్తులలో త్యాగయ్య గారిదే ఖరహరప్రియ సొమ్ము అయినది.

ప్రసిద్ధ రచనలు:

  • ప్రక్కల నిలబడి – కృతి – చాపు – త్యాగయ్య
  • రామా నీ సమానమెవరు – కృతి – రూపక – త్యాగయ్య
  • చక్కని రాజమార్గము – కృతి – ఆది – త్యాగయ్య
  • నడిచి నడచి – కృతి – ఆది – త్యాగయ్య
  • కోరి సేవింపరారే – కృతి – ఆది – త్యాగయ్య
  • చిత్ర రత్నమయ – కృతి – ఆది – త్యాగయ్య
  • పేరిడి నిన్ను – కృతి – ఆది – త్యాగయ్య
  • మణి ప్రవాళ సాహిత్యం – శివరామయ్య గారి జావళి

~

స్వాతి తిరుణాళ్ రచన ‘సతతం తావక’ – సాహిత్యం:

పల్లవి:

సతతం తావక పదసేవనం

కరవాణి సారసనాభ ముదా

అనుపల్లవి:

చూత సాయక చారుమూర్తె

కృపయా వితర కుశలమయి వారణ భయహరా

చరణం:

కమల బాహు లాలిత కిసలయ పద పద్మ

విమల మణి భూషణ తనరుహ దళనేత్ర

మమ హృది వాసానిశం మధుసూదన శౌరే

శమలార్తి భంజన సాధుజన సేవిత

~

ప్రతిపదార్థం:

సతతం = ఎల్లప్పుడు

తావక = నీ యొక్క

పద = పదముల

సేవనం = సేవనము

కరవాణి = చేతును కాక

సారస నాభా= ఓ పద్మనాభా

ముదా = ఆనందముతో

చూత = మామిడి

సాయక = బాణము (మన్మథుని బాణము)

చారుమూర్తీ = మన్మథుని వంటి అందమైన శరీరము కలవాడా.

కృపయా = కృపతో

వితర = ఇయ్యి

కుశలము = క్షేమౌ

అయి= ఒ

వారణ = ఏనుగు యొక్క

భయ = భయము

హర = పోగొట్టువాడా

కమలబాహు = లక్ష్మీదేవి చేతులతో

లాలిత = లాలించిన

కిసలయ = చిగురుటాకుల వంటి

పద = పాదములు.

పద్మ = పద్మము వంటి

విమల మణి భూషణ = స్వచ్చమైన మణులతో చేసిన ఆభరణములను అలంతరించుకోనిన

వనరుహ దళ నేత్ర = పద్మము యొక్క రేకుల వంటి కన్నులు కల హృదయమునందు

వస = వసించిన

అనిశం = ఎల్లప్పుడు (రాత్రి, పగలు లేని మధు అను రాక్షసుని సంహరించిన).

మధుసూదన =మధు అను రాక్షసుని సంహరించిన

శౌరే = యాదవులలో ఒక తెగ అయిన శూర వంశములో జన్మించిన

శమలార్తి = శమమును పోగట్టువాడు

భంజన = పోగొట్టువాడు

సాధు = సాధు

జన = జనుల చేత

సేవిత = సేవింప బడిన

~

తాత్పర్యము:

ఓ పదుమనాభా! ఎల్లప్పుడు ఆనందముతో నీ యొక్క పదముల సేవనము చేతును.

మన్మథుని వంటి అందమైన శరీరము కలవాడా నాకు క్షేమమును ప్రసాదించు. ఏనుగు యొక్క భయమును పోగొట్టినవాడా, లక్ష్మీదేవి చేతులతో లాలించిన చిగురుటాకుల వంటి పాద పద్మములు కలవాడా! స్వచ్ఛమైన మణులతో చేసిన అభరణములను అలంకరించుకొనిన వాడా, పద్మము యొక్క రేకుల వంటి కన్నులు కలవాడా, ఎల్లప్పుడు నా హృదయము నందు వసించువాడా, మధు అను రాక్షసుని సంహరించిన వాడా, యాదవులలో ఒక తెగ అయిన శూర వంశములో జన్మించిన వాడా, శమ అను దుఃఖమును పోగొట్టువాడా, సాధుజనుల చేత సేవింపబడిన వాడా నీకు ఎల్లప్పుడు సేవ చేయుదును.

8. ధీర శంకరాభరణం:

ఇది 29వ మేళము. 5వ చక్రమైన బాణ చక్రములో 5వ రాగం. దీని సాంకేతిక నామము – ‘బాణ – మా’

ఆరోహణం: స రి గ మ ప ద ని స

అవరోహణం: స ని ద ప మ గ రి స

‘శంకరాభరణం’ అను పేరు కటపయాది సూత్రాలకు అనువుగా వుండుటుకు ‘ధీర’ అను అక్షరములు చేర్చబడినవి. శంకరాభరణం కర్ణాటక సంగీత అత్యంత ప్రసిద్ధమైన జనక రాగములలో ఒకటి. అనేక జన్యరాగములు కలిగిన మేళకర్త. గంభీరమైన రాగము. త్రిస్థాయి రాగము. అన్ని వేళలా పాడదగినది. విస్తృతమైన ఆలాపన చేయుటకు తగిన రాగము. ఈ రాగములో అన్నియు రాగాచ్ఛాయ స్వరములే. రి, మ, ద కంపిత స్వరములు. స గ మ ప – గ్రహస్వరములుగా; స, గ, ప మంచి న్యాస స్వరములుగా బాగుండును. ఈ రాగమును పోలిన రాగమును హిందుస్థానీ సంగీతములో ‘బిలావల్’ అందురు. ఇది ప్రాచీనమైన రాగము. ఈ రాగంలో స ద ప స అనునవి విశేష ప్రయాగములు.

పాశ్చాత్య సంగీతములో దీనిని ‘major diatonic scale’ అందురు. ఇది వెన్నెముక వంటిది. కానీ Major diatomic scale లో త్రిశ్రుతి ధైవతము పలుకు చున్నది.

స, ప, స, మ – సంవాది స్వరములు, స, మ, ప కాకుండా, షడ్జ పంచమ భావములో మొట్టమొదట వచ్చు స్వరము చతుశ్రుతి రిషభము. దీనికి సంవాదిగా చ॥ దై॥ వచ్చును. అంతర గాంధారమునకు కాకలి ని॥ వచ్చును. షడ్జము నుండి పూర్ణ చతుశ్రుతి అంతరము ఒక రిషభము, అదే విధంగా పంచమము నుండి పూర్ణ చతుశ్రుతి అంతరములో ఒక ధైవతము కల్గియున్నది. ఇవికాక ప్రాచీన రాగమైనటు వంటి షడ్జ గ్రామము యొక్క నిషాద మూర్ఛన ‘రంజని’ అని పిలువబడి అదియే శంకరాభరణం రాగమైనది

ప్రాచీన కాలములో సామగానమలనకు ప్రతి వాద్యముగా వాడబడిన వీణలో మొదటి తీగ నిషాదమునకు శ్రుతి చేయబడినది. మిగిలిన స్వరములు – మెట్టు మీద వాయించబడినవి. ఇవి షడ్జ గ్రామ స్వరములు. మొదటి తీగలో పలుకు నిషాదమును ఆధార షడ్జముగా ఏర్పరచుకొన్నిచో మిగిలిన షడ్జ గ్రామ స్వరములన్నియు శంకరాభరణ స్వరములకు సరిపోవుచున్నవి. అనగా షడ్జ గ్రామము యొక్క నిషాద మూర్ఛన అన్ని తీవ్ర స్వరములను కల్గిన చ॥రి॥; అం॥గా॥; చ॥ధై॥; కా॥ ని॥ లతో ఒక రక్తి రాగముగా ఏర్పడినది. ఇది రంజితముగా ఉండుటచే ‘రంజని’ అని పేర్కొనిరి.

నారదుడు ‘సంగీత మకరంద’ అను గ్రంధములో మొట్టమొదట ఈ రాగమునే పేర్కొనెను. సారంగదేవులు ‘సంగీతరత్నాకర’ గ్రంథంలో పూర్వ ప్రసిద్ధ రాగాంగ రాగములలో శంకరాభరణం ఒకటిగా చెప్పిరి. స్త్రీ, పురుష, నపుంస రాగ విభజనలో నారదుడు దీనిని ‘నపుంస’ రాగముగా పేర్కొనెను. ఈ రాగమును మధ్యాన్న రాగముగా నారదుడు పేర్కొన్నాడు. కానీ ప్రస్తుతం దీనిని సాయం సంధ్యా రాగముగా చెప్పుచున్నారు. పార్శ్య దేవుడు తన ‘సంగీత సమయసార’ గ్రంథంలో ఈ రాగమును పేర్కోనెను. 12 రాగాంగ సంపూర్ణ రాగములలో ఇది ఒకటి. విద్యారణులు తన 15 మేళములలోని దీనిని ఒకటిగా పేర్కొనిరి. లోచనకవి ‘రాగతరంగిణి’ లోని 12 థాట్ లలో దీనిని ఒకటిగా పేర్కొనెను. ఇంకా రామామాత్యులు, వేంకటమఖి, సోమనాధులు ఈ రాగమును పేర్కొన్నారు. ఈ రాగమును 29వ మేళ సంఖ్యగా పేర్కొన్న వారు వేంకటమఖి. అందరు లాక్షణికులు శంకరాభరణం రాగమును మేళరాగ జనక రాగంగా చెప్పారు. తమిళంలో శంకరాభరణమును ‘శంబాలై’ అని అంటారు. ‘పణ్ పళం పంజరం’ అనునది శంకరాభరణమే.

ఈ చరిత్రనంతా గమనించినచో, శంకరాభరణం రాగము కాలక్రమముగా ప్రసిద్ధి లోకి వచ్చిన రాగంగా చెప్పవచ్చును.

రామామాత్యులు, సోమనాథుడు, వేంకటమఖి, మేళ జంత్రులు మరియు సుబ్బరామ దీక్షితులు శంకరాభరణం యొక్క రి, ద లను, పంచశ్రుతి రి, ద లుగా పేర్కొనిరి. మేళకర్తలకు ఇవ్వబడిన 3 పేర్ల పట్టికలో ఈ రాగం శంకరాభరణం రాగంగా

పిలువబడుచున్నది.

ఈ రాగములలో మధ్యమము – 3 విధములుగా పలుకును

  1. గమపా – రి గ మ పా = మ దాని స్వరస్థానంలోనే పలికినది.
  2. గమపా – దపమా – నిదపమ – కోంచెం తీవ్రముగా పలికినది.
  3. రిగమగమామ – సరిగమ – మద్యమము న్యాసం చేసి పాడునప్పుడు కొంచెం కోమలంగా వుండును.

మ – సహజమైన న్యాస స్వరం.

కా॥ ని॥ తీవ్రముగా పలుకును.

సనీప – సదా ప మ గ – స దా పమగా – గమరిగా – రంజక ప్రయాగములు.

స్వర జతులను పూర్తిగా నిరాకరింపవలె. ఇవి కల్యాణి రాగం యొక్క సూచన.

శంకరాభరణం సర్వస్వర గమక వరిక. రక్తి రాగం. గాంధారము మాత్రము కదలించరాదు. రి, ద, దీర్ఘ, కంపితములు. ఇవి జీవనాడిగా చెప్పవచ్చు. స, ప –  లు కాక గాంధారం మంచి కేంద్ర న్యాసం. దై॥ న్యాసం చేయరాదు. అవరోహణ క్రమములో ధైవతమును న్యాసం చేసినచో కల్యాణి రాగచ్ఛాయ స్ఫురించును. జంట స్వర ప్రయోగములకు అవకాశం తలదు. దాటు ప్రయోగములకు అవకాశం కలదు.

ఇది ఒక పంచ స్వర మూర్ఛనా కారక మేళం. ఈ రాగంలోని ‘రి గ మ ప ద’ గ్రహ భేదం చేసినచ వరుసగా (అ) ఖరహరప్రియ (ఆ) హనుమ తోడి (ఇ) మేచ కల్యాణి (ఈ) హరి కాంభోజి (ఉ) నఠ భైరవి వచ్చును. దీని యొక్క నిషాద మూర్ఛన ప్రాచీనుల గాంధార గ్రామము.

ముఖ్య రచనలు:

  1. అరేరే – గీతం – సింహ నందన తాళం
  2. రాగాంగ రాగ లక్ష్యం – గీతం.
  3. సామి నిన్నే కోరి – తాన వర్ణం – ఆది – కరూర్ దక్షిణమూర్తి శాస్త్రి
  4. చలమేల – ఆట తాళం – స్వాతి తిరునాళ్
  5. పశ్యతి దిశిదిశి – అష్టపది – జయదేవుడు

త్యాగరాజు కీర్తనలు:

  1. ఈ వరకు
  2. మనసు స్వాధీనమైన
  3. ఏమి నేరము
  4. ఎదుట నిలిచి
  5. ఎందుకు పెద్దల
  6. స్వర రాగ సుధారస
  7. సుందరేశ్వరుని (కోవూరు పంచరత్న)
  8. బుద్ధిరాదు
  9. భక్తి భిక్షమీయరే

శ్యామశాస్త్రి రచనలు:

  1. సరోజ దళ నేత్రి
  2. దేవి మీన నేత్రి

దీక్షితుల వారి రచనలు:

  1. కమలాంబా – నవవర్ణ కృతి
  2. అక్షయ లింగ విభో
  3. దక్షిణామూర్తే
  4. సదాశివం ఉపాస్మహే
  5. నాగలింగం భజేహం
  6. సుందరేశ్వరాయ

స్వాతి తిరునాళ్ రచనలు:

  1. దేవి జగజ్జనని – నవ రాత్రి కృతి

వీణ కుప్పయ్యర్ రచనలు:

  1. బాగు మీరగను – వేంకటేశ పంచరత్న కృతి
  2. పదము – ఎవ్వడో ఓ భామా
  3. తిల్లానా

~

ఎందుకు పెద్దల వలె – కృతి – సాహిత్యం:

పల్లవి:

ఎందుకు పెద్దల వలె బుద్ధి ఇయ్యవు

ఎందు పోదునయ్య రామయ్య

అనుపల్లవి:

అందరి వలె దాటి దాటి వదరితి

అందరాని పండాయె కదరా

చరణం:

వేద శాస్త్ర తత్వార్థములు తెలిసి

భేద రహిత వేదాంతములు తెలిసి

నాద విద్య మర్మంబులను తెలిసి

నాథ త్యాగరాజ నుత నిజముగ

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here