భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-23

0
11

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 6వ భాగం

11. బిలహరి:

ఇది 29వ మేళకర్త ధీర శంకరభారణంలో జన్యం. ఔడవ, సంపూర్ణ భాషాంగ రాగము.

ఆరోహణ: స రి గ ప ద స

అవరోహణ: స ని ద ప మ గ రి స (కై॥ని॥ అన్యస్వరము)

బిలహరి మిక్కిలి ప్రసిద్ధి చెందిన భాషాంగ రాగములలో ఒకటి. అన్యస్వరము కై॥ని॥.  ‘ప ద ని ప’ అను ప్రయోగములలో అప్పుడప్పుడు వచ్చును. బిలహరి త్రిస్థాయి రాగము. ఆరోహణలో మ, ని లు లేవు. ఇందు అనేక రచనలు కలవు. విపులముగా ఆలాపించుటకు వీలగు రక్తి రాగము. గ ద జీవ గ్రహ – స గ ప న్యాస. సగపదలు బాగుండును. క్రీ.శ. 1735 సంవత్సరంలో తులజేంద మహారాజులచే రచించబడిన ‘సంగీత సారామృత’ గ్రంథంలో; గోవిందాచార్యుల ‘సంగ్రహ చూడామణి’, తిరుపతి వేంకట కవుల ‘సంగీత సార సంగ్రహం’ మొదలగు గ్రంథములలో బిలహరి రాగం శం॥ జన్యముగా చెప్పబడినది. త్రిమూర్తులలోని త్యాగరాజు, దీక్షితార్ – ఈ రాగమును అద్భుతముగా లక్ష్యించి యున్నారు.

భావపూరితమైన రాగం. ఉత్సాహ రసమునకే ప్రత్యేకించిన రాగం. దీనికి త్యాగయ్య గారి ‘దొరకునా ఇటువంటి సేవ’, ‘కనుగొంటిని’, ‘ఇంతకన్నా ఆనందమేమి’ అనునవి ఉదాహరణలు.

బిలహరి ఒక మూర్ఛనాకారక జన్య రాగం. బిలహరి ఆరోహణ, అవరోహణ క్రమము నుండి మరికొన్ని రాగములు తెలుసుకొనబడినవి. ఆరోహణమును సంపూర్ణముగా ‘సరిగమ పదనిస’,  అవరోహణమును ‘సదపగరిస’ అని ఔడవముగా పెట్టిన ‘గరుడధ్వని’ వచ్చును.

త్యాగరాజ స్వామియే ఈ గరుడధ్వని రాగములో ప్రప్రథమముగా కీర్తనలు వ్రాసెను. అవి – ‘తత్వమెరుగ తరమా’, ‘ఆనందసాగర మీదని దేహము’.

బిలహరి పూర్వకాలములో నుండిన దేశాక్షి నుండియే గ్రహించబడినదని ఒక అభిప్రాయము కలదు.

సంచారం:

గపదప – మగగరి సనిదపా – సరిగప దసా – సనిదాసరిగా రిసనిద పదసా –

రిగప మగ గరిసానిదా దరిసని దపా – ప ద ని ప ద పమగరి – రి ప మ గ గ రి సా

ప్రసిద్ధ రచనలు:

  1. సానీదని – స్వరఫల్లవి – ఆది
  2. ఇంత చౌక – వర్ణం – ఆది – వీణ కుప్పయ్యర్
  3. నా జీవనాధార – కృతి – ఆది – త్యాగయ్య
  4. కనుగొంటిని – కృతి – ఆది – త్యాగయ్య
  5. తొలి జన్మమున – కృతి – ఝంపె – త్యాగయ్య
  6. ఇంత కన్న ఆనందము – కృతి – రూపక – త్యాగయ్య
  7. శ్రీ బాల సుబ్రమణ్యం – కృతి – చాపు – దీక్షితార్
  8. పరిదానమిచ్చితే – కృతి – ఝంపె- సుబ్రహ్మణ్యం అయ్యర్
  9. పూరయ మమకాయం – తరంగం – ఆది – నారాయణ తీర్థులు

~

దీక్షితార్ కీర్తన – మిశ్రజాతి – ఏకతాళం:

పల్లవి:
హాటకేశ్వర సంరక్ష మాం
తప్త హాటక-మయ లింగ మూర్తే త్రయాత్మక
అనుపల్లవి:
పాటలీ పాదప మూల ప్రకాశ
పాతాల బిలహరి హయాద్యమర నుత
(మధ్యమ కాల సాహిత్యం)
హాటక క్షేత్ర నివాస హంస రూప చిద్విలాస
కోటి కోటి చిదాభాస గురు గుహ మానసోల్లాస
చరణం:
దారుకా వనస్థ తపోధనాత్యుగ్ర –
తపఃప్రభావ సంభవ మూర్తే
మేరు శృంగ మధ్య స్థిత శ్రీ నగర –
విహార పరా శక్తి సహిత కీర్తే
మారుతి నంద్యర్జునాది –
భరతాచార్యైరవేదిత నర్తన స్ఫూర్తే
చారు స్మిత ముఖాంభోజ శశి ధర
సరసీరుహ పద విదలిత భక్తార్తే
(మధ్యమ కాల సాహిత్యం)
గౌరీ పతే పశు పతే గంగా ధర జగత్పతే
శౌరి వినుత భూత పతే శంకర కైలాస పతే

వ్యాఖ్యానం:

సంభోదన ప్రథమా విభక్తి.

తిరువారూరు నందలి ‘హాటకేశ్వర’ లింగమూర్తిపై రచించ బడినది. హాటకమనగా బంగారము. స్వర్ణమూర్తియై నన్ను రక్షించుము.

తప్త హాటకమయ లింగమూర్తి = కాల్చబడిన బంగారము వలె స్వచ్ఛమైన కాంతితో ప్రకాశింవాడు; పాటలీ – నల్లగినియ చెట్టు యొక్క మొదలు పాతాళ బిలమున నున్న హరి; ఇంద్రాది దేవతలచే నుతింపబడు వాడు; హాటక క్షేత్రమందున్న, హంస రూపముతో కోటి కోటి చిత్స్వరూపములు గల వాడు; దారుకా వనమందు తపోధనుల గొప్పతపస్సు నందు ఉద్భవించిన మూర్తీ; మేరు పర్వత శిఖరమైన శ్రీనగర మందు విహరించి పరాశక్తితో కూడిన వాడు; శ్రీచక్ర మందలి మేరువు నందు విహరించు ఆదిశక్తితో కూడినవాడు; హనుమ, నంది, అర్జునుడు భరతాచార్యుడు చేత తెలియ బడిన నాట్యమూర్తి; చిరునవ్వుతో కూడిన ముఖ పద్మము గల, గౌరీపతే, పశుపతే, గంగాధర అను పదములతో బిలహరి రాగ నామంతో రచించిరి. సువర్ణమయ లింగమూర్తులు కాశీ, శ్రీశైల, కాళహస్తి మొదలైన క్షేత్రముల యందు, హాటక లింగములు గోచరించును.

అట్టి క్షేత్రములతో ప్రసిద్ధి, సమానమైన క్షేత్రమగుటచే, తమ కమలాపురపున ‘హాటక లింగమూర్తి’ ప్రతిష్ఠించబడినది. ‘పాతాళ బిలహరి హయాద్యమర నుత’ అని బిలహరి నామమును కూర్చి హాటకమయ మూర్తి ఆవిర్భావమును పురాణ ప్రసిద్ధ చరిత్రను సూచించిరి. ఈ చరిత్ర హాటకేశ్వర మాహత్యమున కాననగును.

12. రీతిగౌళ:

ఇది 22 వ మే॥ ఖరహరప్రియలో జన్యం. షాడవ, సంపూర్ణ వక్ర రాగం.

ఆరోహణ: సగరిగ మని దమ నినిస

అవరోహణ: సనిదమ గమ పమ గరిస

రీతిగౌళ పాండిత్య ప్రకర్షను వ్యక్తము చేయు గంభీరమైన రక్తి రాగం. త్రిస్థాయి రాగము.

ఇది భాషాంగ రాగమా (లేక) ఉపాంగ రాగమా అను విషయము గురించి అభిప్రాయ భేదములు గలవు, శు॥ అన్య స్వరమని, పాదమ అను ప్రయోగంలో గలదని ఒక అభిప్రాయము. అన్య స్వరముగా వచ్చినది త్రిశతి ధై॥ మని (చ॥ధై॥ ఒక వాసి తక్కువ) అందువలన ‘అర్ధ’ భాషాంగ రాగమని మరియొక అభిప్రాయము. కాని ఇది ఉపాంగము గానే పాడబడుచున్నది. ప్రసిద్ధ కృతులు వేటి లోను శు॥ధై॥ ప్రయోగములు వినబడుట లేదు. శు॥ధై॥ ప్రయోగము బహుశ రంజకముగా లేనందున వదిలి వేయబడినది.

ఈ రాగములో గ ప ని గ్రహ; మ, ని. న్యాస; గమపని రాగాచ్చాయ; పదని దామ విశేష ప్రయోగము. మనీని మొ॥ ప్రయోగముల వచ్చు జంట, నిషాదములు రాగము లోని ప్రత్యేకత. అన్ని వేళలా పాడదగిన రాగం. మధ్యమకాల రాగము. ద్వితీయ ఘన పంచకములో రీతిగౌళ చేర్చబడినది. నిండుదనము గల రాగం.

సంచారం:

గమ పమ గా రిసా. నిప నినిసా.. నిసగరిగా – గమ నిదమా – మనిదమ నినిసా – నిసగా గా  పమ గాసా నిసగా సనిసనిదమా గమపదని – దామగరిగా – పమగరిసా

ముఖ్య రచనలు:

  1. జననీ నిను వినా – కృతి – మిశ్ర చాపు – సుబ్బరాయశాస్త్రి
  2. రాగరత్నమాలికచే – కృతి – రూపక – త్యాగయ్య
  3. ద్వైతము సుఖమా – కృతి – ఆది – త్యాగయ్య
  4. శ్రీ నీలోత్పల – కృతి – రూపక – దీక్షితార్
  5. చేర రావ దేమిరా – కీర్తన – దేశాది – త్యాగయ్య
  6. పరిపాలయ మాం – స్వామి తిరుణాళ్
  7. సద్గురు స్వామికి – రామానాధపురం శ్రీనివాస అయ్యంగార్

~

దీక్షితార్ కీర్తన – త్రిపుట తాళం:

పల్లవి:
నీలోత్పలాంబాం భజరే రే చిత్త
వీధి విటంక త్యాగరాజాంతరంగాం శ్రీ
అనుపల్లవి:
మూల కూట త్రయ కళేబర శోభారుణాం
ముచుకుందాది నుత పంకజ చరణాం
(మధ్యమ కాల సాహిత్యం)
మూల విద్యా దాన నిపుణాం
విధి పూజిత వినోద కిరణామ్
చరణం:
కమలా నగర నివాసినీం
గురు గుహ మార్గ రీతి గౌళినీం
కమనీయ కామ కలా ప్రదర్శినీం
కాది హాద్యాది మను విశ్వాసినీమ్
(మధ్యమ కాల సాహిత్యం)
సామ గాన శిరఃకంపినీం
అఖిల మహా దురిత భంజనీం
కోమళ కుచ కచ భరాంగిణీం
ముకుంద సోదరీం పురాణీమ్

వ్యాఖ్యానం:

ద్వితీయా విభక్తి రచన.

ఓ చిత్తమా నీలోత్పలాంబను భజించుము. వీధి విటంక త్యాగరాజుని అంతరంగమందున్న ఆమెను స్థూల సూక్ష్మ కారణములను మూడు దేహములలో ఎఱ్ఱనై రజోగుణ రూపమున శోభించునామెను, విద్యయన జ్ఞానము. జ్ఞానమునకు, మూలమైన నామెను, బ్రహ్మలే పూజింప, వినోదము కలిగించు కిరణము గల తిరువారూరు నందు నివసించిన, శ్రీ కుమార స్వామి యొక్క కుమార మార్గమునకు క్రమమును కలిగించినామెను మధురమైన కామ కళను ప్రదర్శించునామెను; ‘క’ కారము మొదలు ‘హ’ కారము వరకు గల అక్షర స్వరూపముతో మనస్సున కలదను నమ్మిక కలుగుజేయునామెను, సంగీతమును వినుచు, ఆనందముతో తల నాడించునామెను; దుర్మార్గులను శిక్షించు నామెను; మృదువైన వక్షోజములు గల  విష్ణుమూరి చెల్లెలును; శంకరుని రాణియైన నీలోత్పలాంబను – చిత్తమా భజింపుము.

బీజాక్షర స్వరూపిణిగా వర్ణించిరి. మార్గ రీతిగౌళ రాగ నామమును కూర్చిరి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here