భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-24

0
13

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 7వ భాగం

13. ఆరభి:

ఇది 29వ మేళకర్త ధీర శంకరభారణంలో జన్యం. ఔడవ, సంపూర్ణ ఉపాంగ రాగము.

ఆరోహణం: స రి మ ప ద స

అవరోహణం: స ని ద ప మ గ రి స

ఆరభి ఘన రాగ పంచకములో నొకటి. గంభీరమైన రక్తి రాగము. బహుళ ప్రచారము చెందిన రాగము. ఆరోహణలో గాంధార, నిషాదముము వర్ణింపబడినవి. త్రిస్థాయి రాగము. మంగళప్రదమైన రాగము. ఈ రాగములో గ, ని దుర్బల స్వరములు. ఈ రెండును రాగమునకు ముఖ్యమైన వైనను, అవి దీర్ఘ స్వరములుగా పాడుటకు గాని, ఆ స్వరములపై నిలుపుట గాని తగదు. ఈ రాగములో పెక్కు రచనలు కలవు.

ఇందు రి, ప, ద జీవ స్వరములు, న్యాస స్వరములు. స, రి, మ, ప, ద లు గ్రహ స్వరములు.

ఆరభిలో జంట ప్రయోగములు మిగుల రంజకముగా యుండును.

సంచారం:

మగలి సరి – సని ద సా. ద స రి ప మా – గరిసరి – రిమప దాపా – రిమప ద సనిదా దదసస రిమగరి మగరి – సరిమగరి సనిదసా – దరి దస పదమపా – పమగరి సరి – రిసని దసా

రచనలు:

  1. రే రే శ్రీరామ – గీతం – త్రిపుట -పైడాల గురుమూర్తి శాస్త్రి
  2. శ్రీ సరస్వతి – కృతి – రూపక – దీక్షితార్
  3. సాదించినే – కీర్తన – ఆది – త్యాగరాజు
  4. నాదసుధారసం – కీర్తన – రూపక – త్యాగరాజు
  5. చాల కల్ల లాడుకొన్న – కీర్తన – ఆది – త్యాగరాజు
  6. ఓ రాజీవాక్ష – కీర్తన – చాపు – త్యాగరాజు

~

దీక్షితార్ కీర్తన:

పల్లవి:

శివ కామేశ్వరం చింతయామ్యహం

చిదానంద పూజితాంభోరుహం

అనుపల్లవి:

శివ కామేశ్వరీ మనోహరం

శ్రీ గురు గుహ భక్త వశంకరం

చరణం:

నాద బిందు కలా రూప మనిశం

నటేశ్వరం భాను కోటి సదృశం

నంది తురగారోహితం గురు గుహ మహితం

చిదంబర పురీ విలసితం

వ్యాఖ్యానం:

ద్వితీయ. శివకామేశ్వరుని, చిదానందునిచే పూజింపబడిన వానిని, నందిని గుఱ్ఱముగా ఎక్కినవానిని, చిదంబర పురమున నున్న – నటరాజును నేను చింతించుచున్నాననీ ఈ కృతిలో శివకామేశ్వరిని, చిదంబర నటరాజును వల్లించిరి.

శ్లోకం:

నృత్తావసానే నటరాజ రాజే

నవనాద ఢక్కాం నవ పంచవారమ్

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్

ఏతద్విమర్శే శివసూత్రజాలమ్

14. మోహన:

ఇది 28వ మేళకర్త హరికాంభోజి జన్యం. ఔడవ ఉపాంగ రాగం.

ఆరోహణం: స రి గ ప ద స

అవరోహణం: స ద ప గ రి స

మోహన అతి ముఖ్యమైన ఔడవ రాగములలో ఒకటి. మిగుల రంజకమైన రాగం. ఈ రాగములో అనేక రచనలు కలవు. త్రిస్థాయి రాగం. ఎక్కువ సేపు ఆలాపన చేయుటకు వీలైన రాగం. ఈ రాగంలో అన్నియు జీవ స్వరములని చెప్పవచ్చును. ఈ రాగమును పోలిన రాగమును హిందూస్థానీ సంగీతములో ‘హుప్’ అందురు, ఈ రాగము మిక్కిలి ప్రచారము చెందిన ఉపాంగ రాగం.

క్రీ.శ. 10వ శతాబ్ధిలో జీవించిన మాణిక్యవాచకర్ రచించిన ‘తిరువాచకం’ మోహన తోనే పాడబడుచున్నది. ఈ మోహన రాగమును ‘రేవగుప్తి’  లేక ‘రేగుప్తి’ అని కూడా అనెడివారు. కాని రేవగుప్తి ఎల్లప్పుడూ ‘మాళవగౌళ’ జన్యం.

బహురస ప్రధానరాగం, వర్ణనకు తగిన రాగం. దీనికి త్యాగయ్య గారి ‘నను పాలింప నడచి వచ్చితివో’ అనే కృతి ఉదాహరణ. కళా ప్రధానమైన సంగీత రచనలలో మాత్రమే కాకుండా, నృత్య గేయ నాటకములకు చెందిన అనేక దరువులు కూడా ఈ రాగంలో కలవు. ఇది సర్వస్వర మూర్ఛనా కారక జన్యరాగం.

రిషభం చేత మధ్యమావతి; గాంధారం చేత హిందోళం; పంచమంతో శుద్ధ సావేరి; ధైవతముతో శుద్ధ ధన్యాసి రాగములు వచ్చును

సంచారం:

గప రిగ సా – దరిస దపదా – దసరిగారీ గ ద ప గ రీ – సరిగ పదా దసదాప గపదసా దసరిస దసరి దసపద: గప దప గరిసా

ప్రసిద్ధ రచనలు:

  • గీతము – వరవీణా
  • స్వరజతి – సామిదయ
  • నెనరుంచి – ఖండ అట – తానవర్ణం -వీణ కుప్పయ్యర్
  • నిన్ను కోరి – ఆది – రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్
  • చౌక వర్ణం – గోవిందసామయ్యర్

త్యాగయ్య కృతులు:

  • నను పాలింప – ఆది
  • ఎవరురా – త్రిపుట
  • మోహానరామా – ఆది
  • భవనుత – ఆది
  • రామా నిన్నే నమ్మినాను – ఆది

~

రారా రాజీవలోచన – మైసూరు వాసుదేవాచారి

దీక్షితుల వారి కృతులు కూడా కలవు.

~

దీక్షితుల వారి కృతి

మోహన రాగం – మిశ్రజాతి – ఏక తాళం

పల్లవి:

నరసింహాగచ్ఛ పరబ్రహ్మ పుచ్ఛ స్వేచ్ఛ స్వచ్ఛ

అనుపల్లవి:

హరి హర బ్రహ్మేంద్రాది పూజితాత్యచ్ఛ

పరమ భాగవత ప్రహ్లాద భక్తేచ్ఛ

చరణం:

ధీరతర ఘటికాచలేశ్వర సౌరతర హేమ కోటీశ్వర

వీర వర మోహన విభాస్వర మార వర మానవ హరీశ్వర

(మధ్యమ కాల సాహిత్యం)

ముర హర నగ ధర సరసిజ కర

పరమ పురుష పవనజ శుభకర

సురుచిర కరి గిరి వరద విచర

సరస గురు గుహ హృదయ సహచర

వ్యాఖ్యానం:

సంబోధన ప్రథమా విభక్తి.

ఓ నరసింహ స్వామి, రావలసినది. పరబ్రహ్మయే తోకగా కలవాడవు. స్వతంత్రుడవు. నిర్మలమైన వాడవు. హరి, హర బ్రహ్మలగు త్రిమూర్తులు, ఇంద్రాదులచే పూజింపబడు అతి స్వచ్ఛమైనన వాడవు. పరమ భాగవతుడగు ప్రహ్లాదునకు భక్తి యందు కోర్కె కలుగ చేసిన వాడా – ఘటికాచలేశ్వర మందున్న వాడా.

ధీర తర, సౌర తర, వీర వర, మారవర అను విశేషణ పదములతో కూర్చిరి.

నరసింహ క్షేత్రములు చాలా కలవు. అందు ఘటికాచల క్షేత్ర మొక్కటి. ఆ స్వామిపై రచించిరి.

సాధారణంగా నారసింహ క్షేత్రములు కొండ గుహలలో, అరణ్య ప్రాంతమున కలవు. గుహాంతర వాసి మరియు నరసింహ క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు. అందువలన ‘పవనజ శుభకర’ అని వర్ణించిరి. మోహన రాగ నామమును ‘వీర వర మోహన విభాస్వర’ అను పదమున కూర్చిరి.

సర్వ లఘు పదములతో రచించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here