భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-25

0
15

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 8వ భాగం

15. హుసేనీ:

ఇది 22 వ మే॥ ఖరహరప్రియలో జన్యం. వక్ర, సంపూర్ణ భాషాంగ రాగం

ఆరోహణం: స రి గ మ ప ని ద మ ప ని ద ని స

అవరోహణం: స ని ద ప మ గ రి స

శు॥ధై, అన్యస్వరము. పనిదప, పదప ప్రయోగంలో వచ్చును. మిగుల రంజకమైన భాషాంగ రాగం. విపులముగా ఆలాపించుటకు మంచి సామర్థ్యము అవసరము. అన్ని వేళలా పాడదగినది. ససపాప, మగపమ గరిస – రంజక ప్రయోగములు.

ఈ రాగములో ఎక్కువ రచనలు లేకపోయినప్పటికీ ఇది మంచి ప్రచారము పొందింది. మంద్రస్థాయి ధైవతమునకు దిగువ సంచారం బాగుండదు.

అన్నియు రాగచ్ఛాయా స్వరములే. స, ప, రి – గ్రహన్యాస కూడా.

సంచారం:

సస పాప – ప ని దమా పని దనిసా – ని సరి గ మ ప గ రి స – స ని రి గ ని ద పా – ప స ని స ప ద ప మ – గ మ ప మ గ రీ – రి గ మ పా ద ప మ గ మ ప మ గ రీ – రి గ మ రి గ స రీ – సని ద ని సా

కొన్ని రచనలు:

  1. రామా నిన్నే నమ్మినానురా – కృతి – ఆది – త్యాగయ్య
  2. భజ నామము – కీర్తన – ఆది – త్యాగయ్య
  3. అలిగితే – పదము – మిశ్రచాపు – క్షేత్రయ్య

~

పరదేవతే భక్త పూజితే – ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి:

పల్లవి:

పరదేవతే భక్త పూజితే భద్రం దేహి ఆశు మాం పాహి

చరణం:

చిరతర సంపత్ప్రద శ్రీ విద్యే

చిదగ్ని కుండోదయ శుభ నిత్యే

హరిహయాది నుత గురుగుహ విదితే

హిరణ్య మణిమయ మందిర స్థితే

~

వాఖ్యానం: సంభోదన. ఓ పరదేవతా! శాశ్వత సంపదల నొసగు విద్యాస్వరూపిణి- శుభము లిమ్ము. వేగమే నన్ను రక్షించుము. బంగారు మణులతో గూడిన మందిరము నందు నివసించిన జననీ అని కొనియాడిరి.

16. నాట కురంజి:

28వ మే॥ హరికాంభోజి జన్యం. ఉభయ వక్ర సంపూర్ణ ఉపాంగ రాగం.

ఆరోహణం: స రి గ మ ని ద ని ప ద ని స

అవరోహణం: స ని ద మ గ మ ప గ రి స

ప్రసిద్ధ వక్ర రాగములలో ఒకటి. త్రిస్థాయి రాగం. ఆరోహణ, అవరోహణ యందు వక్రము లుండుట గమనింపదగిన విషయము. ఈ రాగములలో అనేక రచనలు కలవు. గ్రహ స్వరములుగా ‘సమదని’, న్యాస స్వరములుగా బాగుండును. మ, ని జీవ స్వరములు, కంపిత స్వరములు.

సంచారం:

మ గ సా – స ని ద ని సా – ని స రి గ మా – గ మ ని దా – ద ని సద ని ప ద ని సా – ని స రి గ మ ని రి స ని ద నీ – ద ని స ని ద మా – గ మ ప గ రి స – ని ద ని ప ద ని సా.

కొన్ని రచనలు:

  • చలమేల – వర్ణం – ఆది – కుప్పుస్వామి
  • పరాకేల -కృతి – రూపక – తిరుపతి నారాయణస్వామి
  • మనసు విషయ – కృతి – ఆది – త్యాగరాజు
  • బుధమాశ్రయం- కృతి -మిశ్రఝంపె – దీక్షితార్

~

శివ కామీ పతిం చింతయామ్యహం – దీక్షితార్ కీర్తన:

పల్లవి:

శివ కామీ పతిం చింతయామ్యహం

శ్రీ గురు గుహ పూజిత పదాంభోరుహం

చరణం:

నవ కాళీ జిత నర్తన ధీరం

నాద బిందు కలా రూప మనిశ మభి-

నవ పురందరాది సనకాది

సన్నుత భాను కోటి సంకాశం

వ్యాఖ్యానం: ద్వితీయ. శివ కామీ పతి యైన, గురుగుహునిచే పూజింపబడిన పాద పద్మములు గల వానిని, నవ శక్తులను జయించిన కుమారుని గన్న ధీరుని, నాద బిందు కాళా స్వరూపుని, ఇంద్రాది దేవతలచే, సనకాది మునులచే నుతిగన్న కోటి సూర్యసమానుని ఎల్లప్పుడు నేను చింతించున్నాను. చిత్వరూపుడుగా నా జ్ఞాన నేత్రమున గోచరించు వాడు గాని, చర్మచక్షువులకు అగోచరుడును భావమును వ్యక్తపరిచిరి.

17. సావేరి:

ఇది 15వ మే॥ మాయమాళవగౌళలో జన్యం. ఔడవ సంపూర్ణ ఉపాంగ రాగం.

ఆరోహణం: స రి మ ప ద స

అవరోహణం: స ని ద ప మ గ రి స

సావేరి మిగులు ప్రసిద్ధి చెందిన ఉపాంగ రాగములలో ఒకటి. ఎక్కువ ప్రచారము పొందిన రాగము. త్రిస్థాయి రాగం. ఉదయము పాడిన రంజకముగా ఉండును. ఈ రాగములో అనేక రచనలు కలవు. రిగమద రాగాచ్ఛాయ స్వరములు. ఈ రాగంలో గల గా॥ ప్రత్యేక త్రిశృతిగా చెప్పబడెను. సమద మంచి గ్రహస్వరములు. న్యాస స్వరములు – స రి ప ద లు.

స రి ప మ గా రి – మ ప ద ప మ దా – ప ద ద ప మ గా రి – మొదలగు రాగాచ్ఛాయ స్వరములు.

సంచారం:

స రి పమ గా రి స రి స ని ద స రి మ మ – రి మ ప ద పా – ద ప మ ప దా – ద మ ప ద సా – ప ద స రీ రీ – గ రి రీ – స రి ప మ గా రి స – ప ద రి స రీ ద ప దా – రి స రీ – గ రి స ని ద సా.

కొన్ని రచనలు:

  1. జనక సుత – గీతం – రూపక – పురంధర దాసు
  2. సరసుడ – వర్ణం – ఆది – వేంకటరామయ్య
  3. రామ బాణత్రాణ శౌర్య – కృతి – ఆది – త్యాగయ్య
  4. దరిని తెలిసికొంటి – కృతి – ఆది – త్యాగయ్య
  5. పరా శక్తి మనుప రాదా – కృతి – ఆది – త్యాగయ్య
  6. తులసీ జగజ్జననీ – కృతి – ఆది – త్యాగయ్య
  7. శంకరి శంకురు – కృతి – త్రిశ్రగతి – శ్యామశాస్త్రి
  8. ఎంతనేర్చిన- కృతి – ఆది – పట్నం సుబ్రమణ్యం అయ్యర్

~

కరి కలభ ముఖం – దీక్షితార్ కీర్తన:

పల్లవి:

కరి కలభ ముఖం ఢుంఢి గణేశం భజరే రే చిత్త

కావేరీ తట స్థితం సావేరీ రాగ నుతం

అనుపల్లవి:

హరి-హయాది సకల దేవతారాధిత పదాంబుజం

(మధ్యమ కాల సాహిత్యమ్)

గిరిజా తనుజం విజిత మనసిజం గురు గుహాగ్రజం

చరణం:

మూలాధార చతుర్దళ పంకజ మధ్యస్థం

మోదక హస్తం ముని జన హృత్కమలస్థం

ఫాల చంద్రం సుముఖం కరుణా సాంద్రం

పాశాంకుశ ధరం పద్మకరం సుందరం

(మధ్యమ కాల సాహిత్యం)

నీల గ్రీవ సుకుమారం నీరద శోభా హరం

పాలిత భక్తం ధీరం అపారం వారం వారం

వ్యాఖ్యానం: ద్వితీయా విభక్తి రచన- కావేరి తీరమున నున్న ఢుంఢి గణపతిపై సావేరి రాగమున ‘కుళిక్కరై’ క్షేత్రమున గల స్వామిపై రచించిరి. ఈ క్షేత్రము దక్షిణ కాశీక్షేత్రమని ప్రసిద్ధి.

అట కాశీ విశ్వేశ్వర, విశాలక్షీ, అన్నపూర్ణ, కాలభైరవాది దేవతలను ప్రతిష్ఠించిరి. అందువలన కాశీక్షేత్రముతో సమాన పుణ్యక్షేత్రముగా విరాజిల్లినది.

18. ఆసావేరి:

8వ మే॥ హనుమతోడిలో జన్యం.

ఆరోహణం: స రి మ ప ద స

అవరోహణం: స ని స ప ద మ ప మ రి గా రి స

చ॥రి॥ అన్య స్వరము. ఏకాన్య స్వర భాషాంగ రాగం.

ఔడవ, వక్ర, సంపూర్ణ. అవరోహణలో చతుస్వర వక్రము.

త్యాగయ్య ‘లేకనా నిన్ను జుట్టుకొన్నారు’, దీక్షితార్ ‘చంద్రం భజ మానస’ చ॥రి॥ నందే ప్రారంభమైనవి. భాషాంగంలో అన్య స్వరము గ్రహ స్వరముగా వచ్చుట అరుదు. ఇందలి గ ని లతో పాటు చ॥రి॥ రాగచ్ఛాయ స్వరము పంచమము. న్యాస స్వరం రి గ రి స – గ – చ॥రి॥ కన్నా మృదువుగా పలుకుచున్నది. దీనినే అహోబలుడు పూర్వ గా॥ చెప్పెను. సంగీత వాద్యములలో వీణ యందు రి గా రి స ప్రయోగములోని గా॥ ను శు॥రి॥ మెట్టునందే వాయించవలె. ద ని దా ప – నిషాదము తన స్వస్థానమున వుండదు. రి గా రి స – అను ప్రయోగం రి రి స – గా కూడా వుండును.

ఈ రాగం విస్తారముగా ఆలపించుటకు వీలైన రాగం కాదు. ఏక స్వర సంచార ప్రయోగము లతోనే, విశేషముగా ప్రకాశించుచున్న రాగం. రి ని స ప ద మ ప రి గా రి స – దాటు స్వరములు. చౌక కాల ప్రధాన రాగం. రస భావపూరిత రాగం.

త్యాగయ్య గారి ‘లేకనా నిన్ను జుట్టుకొన్నారు’, ‘ఏ పనికో జన్మించితినని’, ‘సమయముఁ దెలిసి’, చౌక కాంలో ఉన్నప్పటికీ, ‘రారా మా యింటిదాఁక’ మధ్యమ కాలంలోనిది.

‘చంద్రం భజ మానస’, ‘కుమార స్వామినం గురు గుహం’ ముత్తుస్వామి దీక్షితుల కృతులు.

~

కుమార స్వామినం గురు గుహం – దీక్షితార్ కృతి:

పల్లవి:

కుమార స్వామినం గురు గుహం

నమామి పద సరోరుహ మహం

అనుపల్లవి:

హిమాద్రిజా సుతం సుర పతి నుతం

హిరణ్య మణి కుండలాలంకృతం

(మధ్యమ కాల సాహిత్యం)

భ్రమాత్మక విశ్వకరం సురవరం

భ్రాంతి హర చతురతరం శుభకరం

చరణం:

కార్తికేయం బాహులేయం

కాంచనమయ దేహం శిఖి వాహం

కార్తస్వర హారం శ్రుతి సారం

గర్విత శూరాది సంహారం

(మధ్యమ కాల సాహిత్యం)

పూర్తి విద్యా ప్రదం తత్పదం

మూర్తికరం మూలాజ్ఞాన హరం

కీర్తి శాలినం వినత శూలినం

ఆర్తి భంజనం అశేష రంజనం

వ్యాఖ్యానం: ద్వితీయా విభక్తి. కుమార స్వామిని, గురుగుహుని పద్మముల వంటి పాదములు గల వానికి, నేను నమస్కరింతును. హిమవంతుని కుమార్తె యగు పార్వతి కుమారుని; ఇంద్రునిచే నుతింతబడు వాడిని; బంగారం, మణులతో కూడిన కుండలములచే అలంకరింపబడిన వానిని, భ్రమను కలిగించు ప్రపంచమును చేయువానిని, ‘బ్రహ్మ సత్యం జగన్మిధ్య’ – నశించునది శాశ్వతమైనదిగా గోచరించుట భ్రమ. అట్టి భ్రమను తొలగించువానిని; కార్త స్వరము, బంగారం హారంగా ధరించు వానిని; శూరుడై దుష్టులను సంహరించు వానిని; సంపూర్ణముగా విద్య నొసగు వానిని; అజ్ఞానమును మొదలంటు హరించువానిని – మొదలగు విశేషణములతో కీర్తించిరి. కీర్తి గల వానికి నమస్కరించుచున్నాను.

సావేరికి, అసావేరికి మూర్ఛన ఒకటే గాని మేళకర్త భేదముచే సావేరి అని గానీ అసావేరి అని గానీ గుర్తు పట్టడానికి వీలుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here