భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-27

0
13

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 10వ భాగం

21. పూర్వీ కల్యాణి:

ఈ రాగము 53 గమనశ్రమలో జన్యం. వక్ర, షాడవ, సంపూర్ణ ఉపాంగ రాగం.

ఆరోహణ: స రి గ మ ప ద ప స

అవరోహణ: స ని ద ప మ గ రి స

ఆరోహణలో నిషాదము లేదు. పూర్వీ కల్యాణి ప్రసిద్ధ జన్యరాగములలో ఒకటి. ఈ రాగములో అనేక రచనలు కలవు. సాయంత్రము వేళ పాడిన రంజకముగా యుండును; ఇందు అన్నియు రాగాచ్ఛాయ స్వరములే. గ్రహస్వరములుగా ‘గ, స, ప’ లు; న్యాస స్వరములుగా స, గ, ప’లు బాగుండును. త్రిస్థాయి రాగము. గమదస విశేష ప్రయోగము. ఈ రాగమును పూర్వం ‘గమక’ అనెడివారు.

సంచారం:

ప మగరి గా – దపమగరి సాపదా – దసరిగా – గమపదపా – పమగమ పదపసానిద- దసరిగా రిస దసా – రిసని దసరిగా – గపమగరిసా – రిసనిద సానిద- గమదసని – దపమరిగరిసా – పమగారిసా – రిసనిదసా.

రచనలు:

  1. సామి నిన్ను కోరి – వర్ణం- ఆట- శొంఠి వెంకట సుబ్రహ్మణ్యం
  2. పరిపూర్ణనామా – కృతి – రూపక – త్యాగరాజు
  3. పరలోక సాధనమే – కృతి – ఆది – త్యాగరాజు
  4. మీనాక్షి – కృతి – ఆది – దీక్షితార్
  5. పరమపావన – కృతి – ఆది – రామనాథ్ శ్రీనివాస అయ్యంగార్
  6. నిను వినా – కృతి – మిశ్రచాపు – శ్యామశాస్త్రి
  7. ఓ రామ నీ నామ – కృతి – ఆది – రామదాసు

~

ఏకామ్రనాథం భజేహం – దీక్షితార్ కృతి

పల్లవి:
ఏకామ్ర నాథం భజేహం ఏకానేక ఫల ప్రదం శ్రీ
అనుపల్లవి:
ఓంకార రూపం శివం ఓషధి మూలం వరం
(మధ్యమ కాల సాహిత్యం)
కాల కాలం హరం కర్మ భేద హరం
జ్ఞాన రూప సుతం గురు గుహ నుతమ్
చరణం:
పంచాక్షర మంత్ర రూపం ప్రసన్న రూపం
ప్రపంచాతీత సద్యోజాతాది పంచ ముఖం సుముఖం
(మధ్యమ కాల సాహిత్యం)
ప్రకటిత కామ కోటి పీఠ స్థితం
ప్రసిద్ధ మూకాది నుత కామాక్షీ సహితం

వ్యాఖ్యానం:

ఏకామ్ర నాధుని నేను సేవింతును. ద్వితీయా విభక్తి.

ఒకడైన మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి యగుటుచే ‘ఏకామ్ర నాథేశ్వర’ నామము ప్రసిద్ధి గాంచినది. ప్రణవమైన ఓంకార రూపుని, మంగళప్రదుని, ఓషధికి మూలమైన వానిని, యముని కాలమును చాలించు వానిని, కర్మ భేదమును చేయువానిని, జ్ఞాన రూపమైన, సుఖము నిచ్చు వానిని, కుమార స్వామికి సంతోషమును కలిగించు వానిని, నమశ్శివాయ యను పంచాక్షరీ రూపుని, ప్రసన్న రూపుని, ప్రపంచమునకు అతీతమైన, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన – అను ఐదు ముఖములు గల వానిని, మంచి ముఖములు గల వానిని, ప్రకటింపబడిన ప్రసిద్ధమగు కామ కోఠి పీఠమున నున్న వానిని, యజ్ఞాదులలో నుతింపబడు కామాక్షీ దేవితో గూడిన ఏకామ్రేశ్వరుని నేను నుతింతును అని వర్ణించిరి.

ఇందు రాగ నామము లేదు.

22. షణ్ముఖప్రియ:

56 మేళకర్త రాగం. దిశ.

దిశ 10వ చక్రంలో 2వ మేళం. దిశ 8

ఆరోహణ: స రి గ మ ప ద ని స

అవరోహణ: స ని ద ప మ గ రి స

గమక వరీక రక్తి రాగం. నిషాదము ఒక్కటే కంపితంగా పలుకుటకు అవకాశం కలదు. రిషభమునకు కంపితము లేదు. అన్నియు రాగచ్ఛాయ స్వరములే. జంట, దాటు, ఆహత (స ని ని ద), ప్రత్యాహత ప్రయోగములన్నింటికి అవకాశం గల రాగం. గాన రస ప్రధాన రాగం. త్రిస్థాయి. సాయంకాలం పాడిన బాగుండును. దీని గాంధర మూర్ఛనలో 35 శూలిని, పంచమ మూర్ఛనతో ధేనుక, దైవత మూర్ఛనతో చిత్రాంబరి రాగములు వచ్చును. దీక్షితుల వారి ప్రకారం ఇది చామరం.

సంచారం:

పా పా పా దని దపమ – పాపాదనిసరిగా – రీరీ – సారీ సరి – మగారి – రిసరిగా రీగసా – సారిసా రిగరిసనిద – దని దనిస – నిసని సరి – సరిగరి సనిదా దపమ – గరీ – రీగ రిగమా – గరి – సరిగా రీగస – నీ స దా – ని ద ప మా – పా ద ని సా దా నీ – దా సా.

రచనలు:

  1. వద్దనే వారు -కృతి – ఆది – త్యాగరాజు
  2. సిద్ధివినాయకం – కృతి – రూపక – దీక్షితార్
  3. మరివేరె దిక్కెవరయ్యా – కృతి – ఆది – పట్నం సుబ్రమణ్యం అయ్యర్
  4. ఏమంటి రామ నిన్ను – కృతి – రూపక – పల్లవి శేషయ్య
  5. వల్లీ నాయక – కృతి – ఆది – ముత్తయ భాగవతార్

~

దీక్షితార్ కృతి – సదాశ్రయే అభయాంబికే

పల్లవి:
సదాశ్రయే అభయాంబికే సన్నిధేహి
సదాశ్రయే త్వామంబికే భద్రం దేహి
అనుపల్లవి:
చిదాశ్రయే చిదంబర చంద్రికే ఏహి
చిదాశ్రయే శివ మంచకే నత వారాహి
ముదాశ్రయే భుక్తి ముక్తి ప్రద మార్గం బ్రూహి
(మధ్యమ కాల సాహిత్యం)
ముదాశ్రయే మాయాధీనం దీనం మాం పాహి
చరణం:
గౌరి మాయూర నాథ మోహనకర శక్తే
శౌరీశ విధీంద్రాది సన్నుత పరాశక్తే
నారీమణ్యాద్యర్చిత నాద బిందు యుక్తే
శారీరకాది విద్యా సిద్ధాంత యుక్తే
భేరీ మద్దళ వీణా వాదనానురక్తే
సూరి జనోపాసిత చరణ నళిన యుక్తే
వాణీ మా కర ధృత చామర సేవాసక్తే
దూరీ కృత దురిత వేద శాస్త్రాది ప్రసక్తే
(మధ్యమ కాల సాహిత్యం)
వారీశాది లోక పాల నుత గురు గుహ భక్తే
దారిద్ర్య దుఃఖ భంజన-కర శంకరావిభక్తే
శుక సనకాది దేవతా సేవితే పర దేవతే
వారిజ ముఖి వరదాభయ హస్తే నమో నమస్తే

~

వ్యాఖ్యానం:

సంబోధన ప్రథమా విభక్తి.

ఓ అభయాంబికా ఎల్లప్పుడు ఆశ్రయించిన నా వద్దకు రమ్ము. నిన్ను ఆశ్రయించిన నాకు శుభము లిమ్ము. ‘చిత్’ ను ఆశ్రయించ ‘చిత్’ అనే ఆకాశమునకు చంద్రిక యైన, మంగళప్రదురాలా, వారాహి చే నమస్కరింపబడు తల్లీ – సంతోషముతో నాశ్రయింతిని. భుక్తిని, ముక్తిని యొసగు మార్గము పలుకు మాయకు అధీనుడనైన, దీనుడనైన నన్ను రక్షించుము. గౌరీ – మయూరనాథునికి మెహము కలిగించు శక్తివి, విష్ణు, శివ, బ్రహ్మాదులచే నుతింపబడు పరాశక్తివి. నారీమణుల చేత పూజింప బడిన, నాద బిందు స్వరూపిణివి, శరీర సంబంధమైన విద్యను సిద్ధాంత మొనర్చిన దానివి. భేరి, మద్దెల, వీణ మొదలైన వాద్యముల వాదన యందు ఆసక్తిగల దానివి. శుక, సనక, సనందనాదులచే సేవింపబడు పరదేవతవు. పద్మము వంటి ముఖము గల, వరద అభయ హస్తములు గల తల్లీ, నీకు నమస్కారమని స్తోత్ర మొనర్చిరి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here