భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-29

0
8

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 12వ భాగం

26. ముఖారి:

22 మే॥ ఖరహరప్రియలో జన్యం.

ఆరోహణ: స రి మ ప ద ని ద ప

అవరోహణ: స ని ద ప మ గ రి స

శు॥ధై॥ అన్యం.

అవరోహణలో అన్య స్వరము కూర్చబడిన రాగం. చాలా మార్లు అన్య స్వరము వచ్చును.

సనిదపా, రిమ పని దపా, మపదప – etc

భాషాంగ రాగం. వక్ర రాగం. వక్ర, షాడవ సంపూర్ణ రాగం. రిగ ద ని – రాగాచ్ఛాయ. నిదమ, పదస – విశేష సంచారములు. గమక వరీక రాగం. రక్తి రాగం. వర్ణనకు ఉపయోగపడును. శ్లోకములు, పద్యములు పాడదగిన రాగం. కరుణా రసమును వెదజల్లు రాగం. మధ్నాహ్నం పాడదగిన రాగం. అన్ని వేళల పాడదగును. ‘సంకేత మకరంద చతుర్దండి ప్రకాశిక’ అను ప్రాచీన గ్రంథములో ఈ రాగం పేర్కొనబడెను.

బహురస ప్రధాన రాగము అని చెప్పిననూ, శోక రసము, వాత్సల్య భావములకు చక్కగా అవకాశము గల రాగం.

త్యాగయ్య ‘చింతిస్తున్నాఁడే యముఁడు’ అనే కృతి, జయదేవుని ‘వదసి యది కించిదపి’ అనే అష్టపది, నారాయణ తీర్థుల ‘కృష్ణం కలయ సఖి సుందరం’ అనే తరంగం, ‘ఆనంద మానందమాయె’  అని ఆంధ్ర దేశములో సుప్రసిద్ధమైన పెళ్ళి పాట – ముఖారి రాగములో ఉన్నవే.

రచనలు:

  • ఏమనిన్ – సుబ్బరాయశాస్త్రి
  • ఏలావతార మెత్తుకొంటివి – త్యాగయ్య
  • చింతిస్తున్నాఁడే యముఁడు – త్యాగయ్య
  • క్షీణమై తిరుగ జన్మించే – త్యాగయ్య
  • మురిపెము గలిగె గదా – త్యాగయ్య
  • ఎంతని నే వర్ణింతును – త్యాగయ్య
  • పాహిమాం రత్నాచల – దీక్షితులు
  • ఓసోసి – పదం
  • ఏమందునే – ధర్మపురి సుబ్బరాయర్
  • బ్రహ్మ కడిగిన పాదము – అన్నమాచార్య
  • నానాటి బ్రతుకు – అన్నమాచార్య
  • ఆఁకటి వేళల నలపైన వేళలను – అన్నమాచార్య

~

దీక్షితార్ కృతి – గోవిందరాజం ఉపాస్మహే

పల్లవి:
గోవింద రాజం ఉపాస్మహే నిత్యం
శ్రీ గురు గుహ వినుత చిదాకాశ గృహే
అనుపల్లవి:
దేవ రాజాది పూజిత దివ్య గాత్రం
దీనార్తి హర నిపుణతర క్షేత్రం
దేవకీ వసు దేవ పుత్రం
దేవ కనక సభేశ మిత్రం
దేశిక నుత రమా కళత్రం
చరణం:
నృగ రాజస్య కృకలాస జన్మాపహం
నృపతిం రుక్మిణీ సత్య భామాబ్జ మధు లోలం
భగవంతం భక్త కల్పక ధరణీ రుహం
భద్ర ప్రదోద్యుక్త పాణి సరోరుహం ఉరగ శయనం
అంఘ్రి సరసీరుహం ఆనన జల రుహం
నగ ధరం గోపికా మోహం
నత భాగవతాది సమూహం
ఖగ రాజ తురగారోహం
కరుణామృత రస ప్రవాహం

వ్యాఖ్యానం:

సంబోధనా ద్వితియా విభక్తి.

చిదంబర క్షేత్రమందలి గోవిందరాజుపై రచించిరి. నిజమైన భక్తునకు నిజతత్వము తెలిసిన వారికి, నామ భేదమే గాని, భగవత్త్వ మొక్కటే అను భావమును గుర్తించి, స్తోత్ర మొనర్తురు. గోవిందరాజుని, కుమారస్వామితో వినోదించు చిదాకాశ గ్రహమందున్న ఇంద్రాదులచే పూజింపబడు శరీరము గల, దీనులైన జనుల ఆర్తిని పొగొట్టు క్షేత్రమందున్న దేవకీ వసుదేవుల పుత్రుని, కనక సభకు ప్రభువైన నటరాజుని మిత్రుని, నృగ మహరాజునకు శాపముచే కలిగిన ఊసరవెల్లి జన్మమును పోగొట్టిన వానిని, కృష్ణుని విష్ణుని నిత్యం ఉపాసించుచున్నాను.

ఇందు ప్రాసలు, ప్రాసాక్షరములు రచనకు, గానమునకు హాయిని కలిగించునవిగా కూర్చి గొప్పగా వర్ణించిరి. విశేషణ పదములతో రచించిరి.

27. అఠాణా:

29 ధీర శం॥ లో జన్యం.

ఆరోహణ: స రి మ ప ని స

అవరోహణ: స ని దా ప మ ప గా రి స

కై॥ని॥, సా॥గా॥ అన్య స్వరములు.

భాషాంగ రాగము. అన్య స్వరములు రెండు.

  • మ ప ప గా మ ప; గ గ రి స – అను ప్రయోగములో
  • కై॥ని॥ ప ద ద ని ని స; ప ద ని ప – అను ప్రయోగములో

వేంకటమఖి దీనిని 28 హరికాంభోజి జన్యముగా చేసిరి. కాని – కా॥ని॥ తరచు వాడుత వల్ల ధీరశంకరాభరణ జన్యం అయింది.

ఔడవ, వక్ర, సంపూర్ణ రాగం. గమక వరీక రాగం. దేశరాగం. చ॥ధై॥ ముఖ్య జీవ న్యాస స్వరం. సా॥గా॥ మధ్యమము. కై॥ కా॥ని॥ రాగాచ్ఛాయా స్వరములు.

వీర రసము వెదజల్లు రాగము. నిరూపణములు ఈ రాగమున పాడవచ్చును.

కొందరు – స రి మ ప ద ని స – ఆరోహణ

కాని ప ద ని స – విశేష ప్రయోగం మాత్రమే.

రచనలు:

  • ఏల నీ దయ రాదు – ఆది – త్యాగయ్య
  • ఇలలో ప్రణతార్తి హరుడనుచు – ఆది – త్యాగయ్య
  • అట్ట బలుకుదు విట్ట బలుకుదు – ఆది – త్యాగయ్య
  • కట్టు జేసినావు రామ బంధు – ఆది – త్యాగయ్య
  • చెడెడు బుద్ధి మానురా – ఆది – త్యాగయ్య
  • భజనసేయరాదా – రూపక – త్యాగయ్య
  • నారద గానలోల – రూపక – త్యాగయ్య
  • అనుపమగుణాంబుధీ యని నిన్ను – ఝంపె – త్యాగయ్య
  • బృహస్పతే – త్రిపుట – దీక్షితార్
  • శ్రీరుర్మికేశ – చాపు – మార్గదర్శి శేషయ్యంగార్
  • వాచామ గోచరుండని – ఆది – మైసూర్ సదాశివరావు
  • ఎందు దాచుకున్నావో – ఆది – మైసూర్ సదాశివరావు
  • చుమ్మా చుమ్మా – రూపక – ఘనం క్రిష్ణయ్య
  • శ్రీ కుమార – స్వాతి తిరుణాళ్
  • శ్రీ మహగణపతిం భజేహం – మైసూర్ వాసుదేవాచార్

~

దీక్షితార్ కృతి – బృహస్పతే – తాళం త్రిపుట

పల్లవి:
బృహస్పతే తారా పతే
బ్రహ్మ జాతే నమోస్తుతే
అనుపల్లవి:
మహా బల విభో గీష్పతే
మంజు ధనుర్మీనాధిపతే
మహేంద్రాద్యుపాసితాకృతే
మాధవాది వినుత ధీమతే
చరణం:
సురాచార్య వర్య వజ్ర ధర
శుభ లక్షణ జగత్రయ గురో
జరాది వర్జితాక్రోధ
కచ జనకాశ్రిత జన కల్ప తరో
పురారి గురు గుహ సమ్మోదిత
పుత్ర కారక దీన బంధో
పరాది చత్వారి వాక్స్వరూప –
ప్రకాశక దయా సింధో
(మధ్యమ కాల సాహిత్యం)
నిరామయాయ నీతి-కర్త్రే
నిరంకుశాయ విశ్వ భర్త్రే
నిరంజనాయ భువన భోక్త్రే
నిరంశాయ మఖ ప్రదాత్రే

వ్యాఖ్యానం:

సంబోధనా ప్రథమా విభక్తి. చరణము చివర మధ్యమ కాల సాహిత్యం చతుర్థీ విభక్తిలో రచించారు.

ఓ బృహస్పతీ, తారకు పతి యైన వాడా, – బ్రహ్మ జాతే – బ్రహ్మ నుండి ఉద్భవించినవాడా నీకు నమస్కారము. నమోస్తు శబ్దము నుపయోగించుటలో అంతరార్థము బృహస్పతి దేవతల గురువు. బృహస్పతికి గురువను నామము కలదు. అందుకే బృహస్పతి వారమును గురువార మందురు. 33 కోట్ల దేవతలకు గురువైన కారణమున గురువను నామము సార్థకమైనది. గురువునకు నమస్కారము చేయవలెను. జగద్గురువి శంకరాచార్యులు, దక్షిణామూర్తి స్తోత్రంలో ‘తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే’ అన్నారు. గావున నమోస్తు శబ్దమందు అంత గొప్పతనము గలదు. మహాబల విభో – దేహ బలము కన్న బుద్ధి బలమెక్కువ. బుద్ధిలో బృహస్పతి యంత వాడని యందురు. గావున బుద్ధి బలముతో ప్రకాశించు వాడా! గీష్పతే =గీః పతే = వాక్కులకు పతివి. బృహస్పతి వీక్షణమున్న లగ్నమందున్న విద్య, మంచి వాక్కు లభించును. మంజు ధనుర్మీనాధిపతే = అందమైన ధనస్సు, మీనరాశులకు అధిపతివి. కవులు స్త్రీ అందమును వర్ణించుచు, ధనువు వంటి కనుబొమలు, మీనలోచని అనీ వర్ణింతురు. గావున ‘మంజు’ శబ్దము నుంచిరి. కోదండ మిన యోర్మంత్రీ – జ్యోతిష శాస్త్రము. ఈ రాశులకు అధిపతీ, ఇంద్రాదుల చేత నుపాసించబడిన, సేవించబడిన యాకారము గలవాడా; లక్ష్మీపతి మొదలైన వారిచే బుద్ధిమంతుడవని కొనియాడబడినవాడా – నీకు నమస్కారము.

చరణం:

దేవతలకు శ్రేష్ఠమైన ఆచార్యుడా – ఆచరించు వాడు ఆచార్యుడు. వజ్రధర – వజ్రమును ధరించినవాడా, మూడు లోకములకు గురువుగా నుండ దగిన లక్షణములు గలవాడా – మూడు లోకములలో నీ కన్న గురువు లేడని భావము. జరాది = ముసలితనము లేనివాడా, అక్రోధ – కోపము లేనివాడా; కచజనక = బృహస్పతి కుమారుడు కచుడు అతనికి తండ్రి యైనవాడా; బృహాప్పతి కుమారుడైన కచుడు శక్రుని వద్ద మృత సంజీవనీ విద్యను గ్రహించెను. ఆశ్రయించిన వారి కోర్కెల దీర్చు కల్ప వృక్షము వంటి వాడా = కల్పవృక్షము కోరిన కోర్కెలు దీర్చును. శంకరునకు, సుబ్రహ్మణ్యేశ్వరునికి మీదు మిక్కిలి సంతసమును కలిగించువాడా – పుత్ర కారకుడు బృహస్పతి. పుత్ర సంతానము గుర్వనుగ్రహమున. ఆ దశలో కలుగునని శాస్త్రము.

‘గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే’ – దీనులకు బంధువైనవాడా! పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ యను 4 విధములుగ ముూలాధారము నుండి ఉత్పన్నమై, నాభి, హృదయ, కంఠ, ముఖముల నుండి వెలువడు శబ్దము అకారము మొదలు క్ష – కారము వరకు, సందర్భానుసారముగ భావ రస యుతముగా, మృదువుగా వాక్కు రూపమున ప్రకాశింప జేయువాడా – దయా సముద్రుడా – నిరామయామ – మనోవ్యాధిని పోగొట్టువాడా నీతిని కలుగజేయువాడా – అంకుశమును ఆయుధము లేకుండ ప్రపంచము భరించు వాని కొరకు మాట తోనే ప్రపంచమును నడిపించగల సమర్థుని కొరకు, నిరంజనాయ – అంజనః వరుణ, దిగ్గజము, నల్లతుమికి చెట్టు, దీపశిఖ, కాటుక యని నానార్దములు.

కొడివట్టిని దీప శిఖ వలె కాంతితో మూడు లోకములకు సుఖముల అనుభవింప జేయువానికై – నిరంకుశాయ విశ్వ భర్త్రే – తనకు వేరొక నియామకుడు లేకుండ – విశ్వమును పాలించువాడు, నిరంశాయము- సంపూర్ణంగా యజ్ఞ ఫలము నొసంగువాని కొరకు నమస్కారము.

రాగనామము లేదు. బృహస్పతి యొక్క రూపమును, గురు శబ్దముతో జేర్చి వర్ణించుటచే -ఈ కృతిని ప్రతి గురువారమున గానమొనర్చిన గుర్వనుగ్రహము, సర్వ దేవతానుగ్రహము లభించును.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here