భారతీయులకు హెచ్చరిక-10

0
12

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – ఆరవ అధ్యాయము-2

[dropcap]హైం[/dropcap]దవత్వ పరిరక్షణ కోసం అవసరమైన సాంఘిక సంస్కరణలను గురించి విద్యావంతులైన సగటు భారతీయులకు వెళ్లి చెప్పండి. వాళ్లు, ముందుగా ఆత్మను శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమని మీతో చెబుతారు. సమాజ జీవితంలో అభివృద్ధి, తర్వాత దానంతట అదే వస్తుందని అంటారు. ఉదాహరణకు, ఇలా మాట్లాడే వ్యక్తిలాగా ఒకే విధమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు, ఒకే మఠంతో సంబంధం ఉన్నవారు, లేదా అతడు వెళ్లే ఆశ్రమానికే వెళ్లేవారు, ఒకే గురువుకు మోకరిల్లే వారిని తీసుకోండి, వారితో కులవిభేదాలు ఉండవని, అతని లాంటి వారు చెబుతారు. హిందువుల మంచి కోసం ఫలానావారు కట్టిన, ఫలానా సార్వజనీన దేవాలయాన్ని తరచుగా సందర్శించే వారిని తీసుకోండి. అక్కడ దేవునికి పెట్టిన నైవేద్యాలను అందరూ కలసి తింటారు. అందరూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. హిందువులంతా వారిలా ఉంటే, హైందవత్వం ఎప్పటికీ పరిడవిల్లుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. అది ఐక్యంగా, బలంగా, నమ్మకం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇంకొకరు ఇలా అంటారు. “వైష్ణవుల ఉదాహరణను తీసుకోండి, హరినామసంకీర్తన చేసే వారంతా ఒక గొప్ప సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పండి. ఆ హరి కరుణాంశ గలవాడు. ఇంకొకరు ఇంకొకటి అంటారు. మత పరమైన విషయాల్లో నిజమైన హిందూ శాస్త్రీయ దృక్పథాన్ని వారు గ్రహించినట్లు కనపడరు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత అనుభవం అనీ, వ్యక్తగతమైన ఎన్నికకు వదలి వేయబడిందనే విషయాన్ని వారు పరిగణించినట్లు కనబడదు. అలాంటి వాళ్లు అంటే పైన చెప్పిన గ్రహింపు ఉన్నవాళ్లు, ఎవరైనా ఉంటే, వారు సామాజిక సంస్కరణలను అసలు ఒప్పుకోరు. వారికి ఇంకా గొప్ప విషయాలు, ఆలోచించవలసినవి ఉన్నాయి.”

నిజం ఏమిటి? హైందవత్వం యొక్క ఐక్యత అనేది, అసలు సాధ్యపడితే, అది ఒకే గురువును గౌరవించడం వల్ల గాని, ఒకే దేవుని నామాన్ని జపించడం వల్ల గాని, ఒక దేవుని నైవేద్యాన్ని పంచుకోవడం వల్ల గాని రాదు. మొదటగా, ఇలాంటివన్నీ, ఒక విశ్వాసపరమైన ఐక్యతకు సంబంధించిన బాహ్య చిహ్నాలుగా మాత్రమే భావించాలి. హిందుమతం లాంటి వ్యవస్థలో, మతపరమైన విషయాల్లో స్వేచ్ఛగా, ప్రయోగాత్మకంగా పరిశోధన చేసే తత్వమే మూలమైన దానిలో, ఈ విశ్వాసపరమైన ఐక్యత అనేది మనం ఎంత ఆలోచించినా కుదరని ఒక అసాధ్యం. హిందువులెప్పుడూ కూడా, క్రైస్తవులలాగా, ముస్లింలలాగ ఒకే విశ్వాసానికి కట్టుపడరు. వారి ఉత్తేజం చాలా స్వేచ్ఛాపూరితమైనది, వారి సంస్కృతి అతి పురాతనం. అంతే కాకుండా, మతపరమైన సమావేశాలతో, ఎలాంటి ఐక్యతనూ సాధించలేము. అలా కలగనటానికి కూడా సమయం మించిపోయింది. ఆ ప్రయోగం చాలా కాలం క్రిందటే జరిగింది. కాని విఫలమైంది.

శతాబ్దాల తరబడి, పూరీలోని జగన్నాథస్వామి దేవాలయంలో, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు చెందిన హిందువులు, స్వామి వారి నైవేద్యాన్ని అందరూ కలసి తింటారు. కాని వారు దేవాలయం ద్వారాలు దాటిన మరుక్షణమే, కులభేదాలు, ప్రాంతీయ వాదాలు, మళ్లీ వారి మనస్సులో చేరిపోతాయి. ముందుకంటె ఎక్కువగా వారు విభజితులవుతారు. మరి హరినామంలోని పవిత్రత వల్ల వారిలో ఐక్యత రాలేదే! నవద్వీపంలో, హరినామంలోని పవిత్రభాగాలు మరింత తరచుగా, మరింత భక్తి భావంతో ఉచ్చరింపబడతాయి. అక్కడ కంటె బాగా, హిందువులు, అందరూ కలిసి, భక్తి పారవశ్యంతో, మరెక్కడా తప్పెట్లు, డప్పులు వాయించరు. పరమాత్ముని నామాన్ని ఒక విధమైన ఆధ్యాత్మిక ఆవేశంలో స్మరించరు. వైష్ణవమతానికి పుట్టినిల్లయిన ఆ పుణ్యక్షేత్రంలో, ఎక్కడా లేనంత గొప్పగా వైష్ణవ విశ్వాసం, వైష్ణవ ప్రేమతత్త్వం పరిఢవిల్లుతంది. ఐనా సరే, నవద్వీపం ప్రస్తుతం ఉన్న నదియా జిల్లాలో జనాభా ఎంత? ఐదున్నర లక్షల మంది హిందువులు, తొమ్మిదిన్నర లక్షల మంది ముసల్మానులు!  నిజంగా, హరినామం కంటె, అల్లా నామం, ఆయన ప్రవక్త నామం ఎక్కువ శక్తివంతమైనవనుకోవచ్చా?

కాదు, కానే కాదని మనం నిర్ధారించవచ్చు. కాని హిందువుల యొక్క సామాజిక మత దురభిమానం, ఈ తొమ్మదిన్నర లక్షల మంది బెంగాలీలు, ఇస్లాంను స్వీకరించి, హిందూమత పరిధిలోంచి వెళ్లిపోయేలా చేసింది. మనం ఇంకొక విషయాన్ని కూడా నిర్ధారించవచ్చు. ఈ ‘సంకీర్తనలు’, ‘ఈ మహోత్సవాలు’, ఈ హరినామ జపమే కనుక లేకపోయి ఉంటే,  వైష్ణవ వేదాంతమే గనుక లేకపోయి ఉంటే, బహుశా, ఈ తొమ్మిదిన్నర లక్షల మందే కాదు, మొత్తం పధ్నాలుగున్నర లక్షల మంది నదియా జిల్లాలోని హిందువులంతా, మహామ్మదీయులుగా మారి ఉండేవారని. దీన్ని సరే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏం జరిగి ఉండేదో ఎవరూ చెప్పలేరు. హరినామం, సంకీర్తనలు, మహోత్సవాలు, హైందవత్వం ఏకీకరణకు, బలపడడానికి ఉపయోగ పడవని మనం అనము. పూరీ క్షేత్రానికి, ఇతర మఠాలకు, ఆశ్రమాలకు సందర్శనల కోసం వెళ్లడం వల్ల, హిందువుల జీవితాల్లో ఒక సౌభ్రాతృత్వ అనుభవం రాదని మనం అనము. హైందవ సంస్థలైన బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్ లాంటివి ఆధునిక కాలంలో, హిందూ చైతన్య చరిత్రలో, పోషించిన ప్రముఖ పాత్రను కూడ మనం కాదనడం లేదు.

మనం కేవలం ఏమంటున్నా మంటే, అవి ఎంత ఉపయోగపడినప్పటికీ, ప్రస్తుతం హైందవత్వాన్ని కాపాడటానికి అవి అసలు సరిపోవని. హైందవమత స్ఫూర్తికి విరుద్ధం ఏమంటే, హిందువులంతా వైష్ణవులో, బ్రహ్మసమాజీయులో, ఆర్యసమాజీయులో, ఇంకా అలాంటి వారో అయిపోతారని ఊహించడం. అది అలా ఉంచితే, కేవలం మత పరమైన ప్రాతిపదికన హిందువుల ఏకీకరణను లక్ష్యంగా చేసుకొని మందుకు సాగడం చాలా నెమ్మదిగా జరుగుతూంది. హిందువుల మనోభావాల కారణంగా హైందవ సమాజం, నిస్సందేహంగా, ఒక తీవ్ర క్రమపరిణామానికి లోనవుతూ ఉంది. కాని మరింత శీఘ్రంగా, ప్రస్తుత కాలంలోని ప్రమాదాలు హిందువులను చుట్టుముడుతున్నాయి. అవి అతి సమీపంలో ఉన్నాయి. కానీ అది తీవ్రమైన పరిణామం కాదు. నెమ్మదిగా సంభవిస్తూన్నది. అది హిందువులను ఆ ప్రమాదాలను ఎదుర్కొని, అధిగమించేల చెయ్యలేదు. గుర్తుంచుకోండి, చరిత్ర ఎవరి కోసం, దేని కోసం, ఆగదు..

హైందవ సమాజ క్రమ పరిణామం చాలా మెల్లగా  జరుగుతూంది. ఒక జాతిగా హిందువులు కూడగట్టుకున్న బలం చెప్పుకో తగ్గది కాదు. ఎందుకు? పైన పేర్కొన్న ఉద్యమాలన్నింటికీ ప్రాతిపదిక కేవలం మతపరమైనది కాబట్టి.

(మతం అంటే ఒక అధ్యాత్మిక మార్గం అనుకుంటే) పూర్తిగా మతపరమైనది వ్యక్తిగతం అవుతంది. ఈ వాస్తవిక ప్రపంచం తాలూకు ఇబ్బందులనది పట్టించుకోదు. హిందూమతం, ఒక  అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనల ఎన్నిక కావచ్చు. ఆధ్యాత్మిక జీవితం అనే సంపూర్ణమైన, ఖచ్చితమైన విజ్ఞాన శాస్త్రం కావచ్చు. ప్రతి హిందువూ, తన ఆత్మోన్నతిని పొందడానికి చిత్తశుద్ధిగా కోరుకునే ఒక వ్యక్తిగత సంపద కావచ్చు. కాని హిందూ మతం ఈ వాస్తవిక సమాజానికి చెందినదే. దాని ఉనికి మత పరమైన లేదా ఆదిభౌతికమైన ‘సత్యం’ మీద ఆధారపడి ఉండదు. ప్రపంచంలో, దాని రాజకీయ బలం మీద, సైనిక పాటవం మీద, జాతీయ పటిష్టత మీద ఆధారపడి ఉంటింది.

అందుకే, పూర్తిగా మత ప్రాతిపదికన హిందువులందర్నీ ఏకం చేయడానికి ప్రయత్నించడం ద్వారా హైందవత్వాన్ని బలపరచడమనేది కష్టం. అలాంటి ప్రయత్నం జరిగిన వెంటనే, శోచనీయమైన, ఆధునిక హైందవత్వపు, సామాజిక రాజాకీయ సమస్యలు, తగిన ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. ఐక్యతను, బలాన్ని తెచ్చే సామాజిక సంస్కరణలు, పెద్దఎత్తున జరిగితే, అవి ఒక ప్రత్యేక స్థలానికి (జగన్నాథస్వామి మందిరం, పూరీ), ఒక ప్రత్యేక మత ఆరాధనకు, అనుయాయుల సౌభ్రాతృత్వానికి పరిమితమవుతాయి, కనీసం. లేకపోతే, తెలియని, తెలుసుకోలేని వాటిని గురించిన కలహాల కనుగుణంగా అవి పూర్తిగా విస్మరించబడతాయి. ఆదిభౌతిక దృక్పథం కల హిందువులకు అదే ఎక్కువ యిష్టం.

ఒక శతాబ్దానికి పై మాటే అప్పుడు, ప్రారంభంలో, బ్రహ్మసమాజం, ఒక అవసరంగా పరిగణించి, హిందువులకు ఒక సామాజిక సంస్కరణ కార్యక్రమాన్ని సూచించింది. అది, నిస్సందేహంగా ఒక అవసరమే, గత శతాబ్దపు ఆధునికులైన బెంగాలీలను క్రైస్తవం వైపు, ఐరోపా జీవన శైలి వైపు పరుగెత్తకుండా ఆపడానికి. చాలా మందికి అది ఎందుకు అవసరం అనిపించిందంటే, భగవంతుడు నిరాకారుడని, ఆయనను అనేక రూపాలలో పూజించడం తప్పని, సామాజిక సంస్కరణల ద్వారా స్పష్టం చేయవచ్చు కాబట్టి. వారు ఈ విషయం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫలితం? ఆ సామాజిక కార్యక్రమం, అదంతట అదే వెనక్కు వెళ్లిపోయింది. హైందవత్వ క్రమ పరిణామానికి బ్రహ్మ సమాజం చేయాలనుకున్న దోహదం వెలుగులోకి రాలేదు. ఆ వివాదం ఆదిభౌతిక స్థాయికి చేరి, అక్కడే ఉండిపోయింది. అప్పుడు ముఖ్యమైన ప్రశ్న “హిందువులందర్నీ కలపడం ఎలా”  కాకుండా, “భారతీయ క్రైస్తవులను, ముస్లింలను హైందవత్వంలోకి వెనక్కు తీసుకు రావడం ఎలా?” అనేది కాకుండా “మిగిలిన హిందువులను మతం మారకుండా ఇక్కడ ఉంచడం ఎలా?” అనేది కాకుండా, “భగవంతుడు నిరాకారుడని హిందువులందర్నీ ఒప్పించడం ఎలా?” అంటే “హిందువులందర్నీ బ్రహ్మసమాజీయులుగా చేయడం ఎలా?” ఇలాంటి ప్రశ్నలు ముఖ్యమైనవిగా మారాయి.

బ్రహ్మసమాజం ఉదాహరణ, కేవలం చాలా వాటిల్లో ఒక్కటే. నిజానికి, హైందవత్వ పునరుద్ధరణ అనే ప్రయత్నం, ఒక మతపరమైన, ఒక అంతుపట్టని ఆదిభౌతిక సిద్ధాంతం ప్రాతిపదికగా జరుగకూడదు. ఈ ప్రపంచపు ప్రయోగాత్మక సత్యాల ప్రాతిపదికన జరగాలి. లేకపోతే అది కొన్ని ప్రత్యేక దేవతారాధనా రీతులకు దారి తీస్తుంది. కొందరు యోగులైన హిందువులకు భగవంతుని ‘అవతారాలు’గా పదోన్నతిని కలిగిస్తుంది. కొన్ని ఇప్పటికీ, భారతదేశంలో, అవసరానికి మించిన్ని దేవతారాధనా రీతులున్నాయి.  పాత కొత్త ‘అవతారాలతో’ దేశం నిండిపోయి ఉంది. ఆ పరిస్థితి, ఆమెను ఒక జాతిగా నిలబెట్టదు. హిందువులు ఇతర మతాల్లోకి వెళ్లకుండా ఆపదు కూడా.

చేయాల్సిన గొప్ప విషయం, హిందువులు తాము కొన్ని కులాల పరస్పర విరుద్ధ సమాహారంగా, పరస్పర విరుద్ధ ఆరాధనా పద్ధతుల సమూహంగా భావించకుండా చేయడం. తాము ఒక జాతి, తామే భారతదేశం, భారతదేశమంటే తామే అన్న భావన, వారి అస్పష్ట అంతశ్చేతనంలోంచి, పూర్తి చైతన్య స్థాయిలోకి రావడం. వారిలో, హైందవత్వపు వాస్తవిక, రాజకీయ సాంస్కృతిక సంక్షేమమంతా, భారతదేశ సంక్షేమం తప్ప మరేమిటనే భావన, వారి దైనందిన ఆలోచనల్లో, జీవనంలో, అదే ముఖ్య ప్రయోజనంగా కలిగించడం. అందరు హిందువుల్లో ఇది కలగాలి.

హిందువుల శక్తిని, కేవలం ఆదిభౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, పూర్తిగా నియంత్రిస్తున్నంత వరకు, ఈ కొత్త స్వభావం పెరగలేదు. అంతు పట్టని సిద్ధాంతాలు ముఖ్యమై, తాము తమ అనుభవాల ద్వారా కూడా వాటిని గురించి, మాట్లాడలేని స్థితిలో హిందువులు ఉన్నంత వరకు (నిజమైన ‘సాధకులు’ ఆదిభౌతికాన్ని అసలు చర్చించరు) వ్యక్తిగత మోక్షం పొందటమే పరమార్థం అయినంత వరకు, హైందవత్వపు స్వేచ్ఛ, దాని బలం, దాని సంపన్నత, దాని వైభవం, అత్యంత ప్రధానమైనవిగా, ఒక జాతిగా, హిందువులంతా భావించేంత వరకు, ఈ కొత్త స్వభావం అభివృద్ధి చెందలేదు.

హిందువులను, జీవితంలోని వాంఛల పట్ల, ప్రపంచంలోని సంఘర్షణను స్వీకరించే తత్వం పట్ల, జాగృతం చేయడానికి, విలువల మార్పిడి అనేది అవసరం. ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనడానికి వారిని సన్నద్ధం చేయాలి, పరిపాలించడానికి, భవిష్యత్తులో సమున్నతంగా ఎదగడానికి, ప్రస్తుతం వారు గట్టిగా నిలబడకపోతే లాభం లేదు. ఈ విలువల మార్పిడిలో రెండు పార్శ్వాలున్నాయి.

  1. హిందూ ఆదర్శవాదాన్ని, ‘స్వర్గం’ నుంచి ‘భూమి’ మీదికి, భూమిలో ఒక బాగమైన భారతదేశానికి దించడం.
  2. సగటు భారతీయ జాతీయతావాదాన్ని, అరువు తెచ్చుకున్న “మతం/రాజ్యం వేరు” అనే సిద్ధాంతం నుండి దూరంగా పెట్టడం. ఎందుకంటే మతం, రాజ్యం, దైవరాధన – రాజకీయాలు, విడదీయరానివి.

ఒక్క మాటలో చెప్పాలంటే, జాతీయవాదులు కాని హిందువులను, ఐనవారిని, హిందువులని పిలవబడడానికి కూడ ఇష్టపడని వారిని, అందర్ని కూడా, హిందూ జాతీయవాదులుగా మార్చాలి. దీని కోసం, మనం అనుకున్నట్లుగా, హిందూమతాన్ని ఒక విశ్వజనీన మతపర పరిశోధనగా, దాని దేవతారాధనా రీతులలో ఏదో ఒక దానిగా, పరిగణించడాన్ని, వెనక్కు పెట్టాలి. అదీ! తప్పక చేయాల్సింది. కానీ దాన్నే కేవలం మనసులో ఉంచుకోవడం, నిరంతరం, ద్వారా మాత్రమే కాదు హిందువులు విశాల ఆసియా ఖండంలోని, ఒక ప్రత్యేక దేశంగా బలపడేది.

పాశ్చాత్య సనాతన వాదం ఛిన్నాభిన్న మవడానికి  కారణాలను మనం గుర్తుచేసుకున్నాం. అది గ్రీసు –  రోమన్ ప్రపంచంలో బానిసలు మరియి ఆటవిక జాతుల సామాజిక స్థితి. మరో కారణం కూడా ఉంది. అది సామాజికం కాదు. మేధోపరమైనది. ఇదే గత తరాల సనాతన మేధావి వర్గపు విశ్వజనీన దృక్పథం. నవజాతమైన, జాతీయ వ్యతిరేక క్రైస్తవం మరింత బలపడుతూ ఉన్న సమయంలో, విద్యాధికులు, సంస్కార వంతులైన సనాతనులు తమను తాము అటు గ్రీకులుగా కాకుండా, ఇటు రోమనులుగా కాకుండా, మానవులుగా, విశ్వపౌరులుగా భావించుకొన్నారు. అంటే, ఎటువంటి దేశభక్తీ లేని వేదాంతులుగా అన్న మాట. క్రైస్తవం వ్యాప్తి చెందకుండా ఆపే ప్రయత్నాలు రాజ్యం చేత, రాజ్యం పేరిట చేపట్టడం జరిగింది. కాని, చెతన్యవంతులైన పౌరుల్లో జాతీయచైతన్యం బలహీనపడినపుడు, రాజ్యం మాత్రం ఏం చేయగలదు? రాజ్యానికి గల రాజకీయాధికారాన్ని ఉపయోగించడం, రాజ్యం ఎవరి చేత ఏర్పడుతుందో వారి భావాల మీద ఆధారపడి ఉంటుంది. రోమను ప్రపంచంలో అత్యంత పలుకుబడి గలవారు తమ దేశం అంటే, తమ జాతి అంటే, తమ దేశపు దేవతలనీ, తమ దేశపు సంస్కృతేనని గుర్తించలేనప్పుడు, దేశమే దేవతలందరిలోకీ గొప్ప దేవత అన్న దాన్ని ప్రేమించలేనప్పుడు, రోమన్ ప్రభుత్వమే, రాజ్యమే, క్రైస్తవాన్ని స్వీకరించింది. అప్పుడు, వారి చిహ్నాల విలువను బట్టి పాత దేవతలను పట్టుకొని వేలాడిన, సంస్కారవంతులైన ‘విశ్వపౌరులు’, మానవ విజ్ఞానానికే పట్టుగొమ్మలయిన పురాతన సిద్ధాంతాలకు కట్టుబడిన వారు, అజ్ఞాతంలో ఉండిపోయారు లేదా నిశ్శబ్దంగా ఉండిపోవాల్సి వచ్చింది.

రోమ్ నగరం ఒక విశాల సామ్రాజ్యానికి విశ్వ కేంద్రంగా విలసిల్లినపుడు, రోమన్ ఆధిపత్యంలోని గ్రీసులో, ఈజిప్టులో, ఆసియామైనర్‌లో, ఇతర ప్రాంతాల్లో, లోతైన విశ్వసనీయమైన అనుభూతి పూర్వకమైన జాతీయతావాదం, గనుక విలసిల్లి ఉంటే అది పురాతన ప్రంపంచాన్ని, దాని సంస్కృతిని, ఏక మొత్తంగా కాపాడగలిగి ఉండేది.

భారతదేశంలో, జాతీయవాదం అనేది ఉండదు. ఒక వేళ అతి కొద్దిమంది ఆ ఆదర్శానికి కట్టుబడినా సరే, అదే గనుక విస్తృతస్థాయిలో గనుక వ్యాపించి ఉంటే, అది హైందవత్వాన్ని కాపాడేది, దాన్ని మరింత శక్తివంతం చేసేది. హిందువులు భారతదేశాన్ని హైందవత్వంగా గుర్తించకపోతే, ఆమెను పవిత్రతకు ప్రతిరూపంగా గౌరవించకపోతే, ఆమెను అత్యంత ప్రియమైన దేవతగా పూజించకపోతే, అంతుపట్టని ఒక గొప్ప సిద్ధాంతానికి ప్రత్యక్షమూర్తిగా, భావ వ్యక్తిగా భావించకపోతే (ఒక వేళ ఆ అంతుపట్టని దాన్ని పూజించాలంటే, దాని ప్రతిరూపాన్ని కనుల ముందు ఏర్పరుచుకోవాలనుకొంటే), ఒక స్వేచ్ఛాయుత భారత ప్రభుత్వం సైతం, హైందవత్వాన్ని కాపాడటానికి సమర్థవంతం కాదు. ఎందుకంటే, హైందవత్వం ఎక్కడ బలహీనంగా ఉంటుందో, అక్కడ అలాంటి ప్రభుత్వం ఉనికిలోఉన్నా, అది హిందువులకు ప్రాతినిధ్యం వహించదు.

మనం హిందూ జాతీయతావాదాన్ని గురించి మాట్లాడినప్పుడు, మనం ఒక ఫ్రెంచివాడు ఫ్రాన్సు దేశం పట్ల విధేయత చూపినట్లుగా (ఉదాహారణకు), దాన్ని భారతదేశానికి విధేయతగా చెప్పలేము. భారతేదశం ఫ్రాన్స్ కాదు. హిందూమతం ఒక ఆరాధనా రీతి, దాని ఆధ్యాత్మికతలో అపార ప్రేమ సంపదలున్నాయనే విషయాన్ని మనం మరచిపోము. ఇది ఇంచు మించు ప్రతి హిందువు హృదయంలో రక్త నిష్ఠ ఉంటుంది.

హిందూమతం కాకుండా, ఇతర ఏ మతమైనా అఖిల భారత జాతీయవాదానికి పునాదినివ్వ లేదు. మరి, ఆ ప్రాతిపదికన ప్రభవించిన అఖిల భారత జాతీయవాదం ఎలా వుంటుంది? అది కేవలం ఒక ఉత్తమ పౌరసత్వ భావన కంటె మొరుగైనది. అలాంటిది మనం ఐరోపాలో చూస్తాం. అది కొంత వరకు జపాన్‌తో పోల్చతగినది. ఒక క్రతువులాంటి జాతీయవాదం. అది సంప్రదాయ దేవుళ్లు, దేవతలను బాహ్యంగా ఆరాధన చేయడం, గొప్ప ప్రకృతి శక్తుల ఆరాధన, వేటికయితే భారతదేశం ఒక లీలాక్షేత్రమో, సాక్షత్తు భరతమాత ఆరాధనే. అది ఒక భక్తి పూర్వక జాతీయవాదం. సంపూర్ణం, ప్రతి హిందువుకు ఆ భారతదేశమనే దేవత పట్ల షరతులు లేని ప్రేమ. ఆమె జీవితం, స్ఫూర్తి  ‘అతనివి’. కాని ఆమె ఉనికి అతని ఉనికి కంటె అతీతంగా వ్యాపిస్తుంది. స్థల కాలాల గుండా ఆమెకున్న విలువ, అతని విలువకంటె, అతడు తాకి, చూడగలిగిన ప్రతిదాని విలువ కంటె మహోన్నతంగా ఉంటుంది. ఆమె వైభవం అతన్ని తన వ్యక్తిగత అనామకత్వం నుండి బయటకు లాగుతుంది. అతని దృష్టిలోనే అతన్ని గొప్పగా చూపిస్తుంది.

అతి కొద్ది మంది నిజమైన మేధావులు జీవితంలోని అత్యంత అల్పమైన ప్రకృతి భాగాలలో కూడా భగవంతుడిని దర్శించి, ఆరాధించినట్లు, లక్షలాది హిందువులు, తమలోని ప్రతి ఒక్కరిలో భరతమాత ముద్దు బిడ్డనే చూస్తారు. పరస్పరం అన్నదమ్ములుగానే మసలుకుంటారు.

అలాంటి చిత్త శుద్ధితో గూడిన జాతీయ వాదాన్ని అలవర్చుకుంటే, ఎన్నో మతపర, సామాజిక, రాజకీయ మూఢ నమ్మకాలు, అవంతట అవే అదృశ్యం అవుతాయి. అవే హైందవ ఐక్యతకు గొప్ప అవరోధాలుగా ఉన్నాయి.

హిందువులు, జాతీయవాదాన్ని మతానికి (లేదా నైతిక సిద్ధాంతాలకు, ఆధ్యాత్మిక సూత్రాలకు) అధీనం చేయడానికి బదులుగా, మతాన్నే జాతీయవాదానికి అధీనం చేస్తే, భారతదేశ పరిస్థితి మారిపోతుంది. చర్యలో మార్పు, ఎప్పుడూ, దృక్పథంలో మార్పును తీసుకురాదు. కాని దృక్పథంలో మార్పు, తప్పకుండా ఆచరణలో మార్పుకు కారణం అవుతుంది.

కాబట్టి ఇది ఎలా ప్రారంభం కావాలి? ‘శాస్త్రాల’ అధికారం మీద ఏర్పడిన హిందువుల పాత వ్యవస్థలన్నీ, తమ దృఢత్వాన్ని, మారని గుణాన్ని, అంతటా పోగొట్టకుంటాయి. హిందువుల ప్రయోజనాలు, ఒక జాతిగా, పరిగణిస్తే, ఆ వ్యవస్థలన్నీ అదృశ్యమవుతాయి కూడా. ఉదాహరణకు కులాన్ని తీసుకోండి. చాలా మంది హిందువులు, ఈ వ్యవస్థను, రూపుమాపకపోయినా(చాలా కొద్ది మందే అంత దూరం వెళతారు), కనీసం దాన్ని సంస్కరించాలని గుర్తించారు. కాని అది ఒక మతవ్యవస్థ. ఎందుకంటే, హిందువుల్లో, సామాజికమైన ప్రతిదానికీ, ఒక మత ప్రాతిపదిక ఉంటుంది. దాన్ని మార్చడం అంటే వేదాలు, ఉపనిషత్తుల అధికారానికి వ్యతిరేకంగా వెళ్లడమే. అదృష్టం ఏమిటంటే, హిందూధర్మ శాస్త్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత కులవ్యవస్థను సంస్కరించదల్చుకున్నవారికి, వారి ప్రయత్నాన్ని సమర్థించే ఏదో ఒక ఆధారం, ధర్మ శాస్త్రాలలో దొరకుతుంది. కొందరు మీతో చెబుతారు  “భగవద్గీతలో, కులం అనేది, గుణాన్ని బట్టి ఉంటుంది. అది మనం ప్రస్తుతం చూస్తున్నది కాదని”. ఇంకొకరంటారు “వేదాల్లో కుల ప్రస్తావనే లేదని”. మరొకరు, “ప్రాచీన జ్ఞానులు, దార్శనికుల మనస్సులో కులం అనేది పూర్తిగా ఆధ్యాత్మికమైన భావన” అని చెబుతారు. కుల వ్యవస్థను సమర్థించే వారికంటె తక్కువ నిజాయితీపరులు కాదు వారు. అంతర్లీనంగా వారంతా ఒప్పుకునేది ఏమిటంటే, అది ఒక పాత కాలపు సిద్ధాంతమనీ, ప్రస్తుత హైందవ సమాజపు ప్రయోజనాలకు అది విరుద్ధమనీ, హిందువులను ఇప్పుడు నడిపించటానికి పనికి రాదనీ. వారు మతపరమైన దృక్పథం కలవారు కాబట్టి మొదటగా జాతీయవాదులు కావటానికి బదులుగా, అలా అంటారు. హిందూభారతాన్ని మొదటగా ప్రేమించే హిందువు ఇలా అంటాడు. వేదాల్లో ధర్మ శాస్త్రాల్లో ఏం రాసి ఉందనేది కాదిక్కడ ముఖ్యం. ప్రస్తుతం మనం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మనం దాన్ని ఎలా మలుచుకోవాలనేది, ఎలా ఉపయోగించుకోవాలనేది ముఖ్యం. లిఖిత శాస్త్రాలు మన అవసరాలను తీర్చలేకపోతే, మనం కొత్త శాస్త్రాలను రాసుకోగలం. కాని, మనమే నశించిపోతే, ఒక నూతన హైందవత్వాన్ని నిర్మించడానికి ఎవరూ సమర్థులు కాదు.

జాతీయ రక్షణ సంబంధించినంత వరకు, మన దేశ ప్రయోజనాలే మనకు మొదటి ప్రాముఖ్యతగా పరిగణించాలి. అంటే, కాలావసరాలకు అనుగుణంగా, మనం మన వ్యవస్థలను మార్చుకోవాలి, సాంఘిక వ్యవస్థలనేవి, దేశ శ్రేయస్సు కోసం, దేశం చేతిలో ఉన్న సాధనాలు, అవి దేశం కోసం తయారు చేయబడినాయి. వాటి కోసం దేశం తయారు చేయబడలేదు. ప్రాచీన విషయాలను గౌరవించాలనడంలో సందేహం లేదు. ఎందుకంటే అవి ఒక వైభవోపేతమైన గతంతో ముడిపడి ఉంటాయి. దానర్థం, కాలం మారినప్పుడు, వాటిని పునరుద్ధరించుకోకూడదని కాదు. రాణాప్రతాపసింహుని ఖడ్గం ఏ నిజమైన భారతీయునికైనా పవిత్రమైనదే. గత భారత మహోన్నత వృత్తాంతాలు కొన్ని దానితో ముడిపడి ఉన్నాయి. కాని తెలివైన వాడెవ్వరూ అలాంటి ఖడ్గాలను యుద్ధటాంకులకు, యుద్ధవిమానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఉపయోగించాలని అనడు. హిందూ జాతీయవాదులు కూడా సాంఘిక వ్యవస్థలను అలాగే చూస్తారు, హైందవత్వ ప్రయోజనాలకు ప్రమాదం వాటిల్లినప్పుడంతా.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here