భారతీయులకు హెచ్చరిక-12

0
9

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – ఏడవ అధ్యాయము-1

హిందువులలో స్వభావ మార్పు

ఎదిరించటానికి సన్నద్ధత

[dropcap]రా[/dropcap]ను రాను స్పష్టం అవుతున్న దేమంటే, సంఖ్యాపరంగా హిందువులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో, వారికి అవసరం ఏమిటంటే, వారి జాతీయవాద దృక్పథంతో బాటు, వారి గత సైనిక సుగుణాలను పునరుద్ధరించుకోవాలి, ఒక మిలటరీ జాతిగా మారాలి.

ప్రస్తుతం వారు ఒక బలహీనమైన మందగా ఎందుకు తయారయ్యారో, ఎలా తయారయ్యారో విశ్లేషించే ప్రయత్నం చేయడం నిష్ప్రయోజనం. అంతే కాదు దాన్ని నొక్కి చెప్పడం కూడా ప్రమాదమే. శక్తిని, అధికారాన్ని తిరిగి పొందటానికి ఏం చేయాలో చెప్పకుండా అవన్నీ అనవసరం. ఒక దేశపు బలహీనతను పదే పదే ఎత్తి చూపడం వల్ల, దాని నిరాశాశనకమైన స్థితిని తెలుసుకొని, అది మరింత బలహీనం అవుతుంది.

భారతదేశాన్ని గురించి ఏమీ తెలియని పాశ్చాత్యులలాగే, హిందువులలో కూడా ఉమ్మడిగా ఉన్న, ఒక తప్పు భావాన్ని మొదట వదిలించుకోవాలి. అదేమిటంటే హిందుమతం అనేది మృదుస్వభావుల, బలహీనుల మతం అని, చర్యారహితమైన సహనాన్ని ఒక్క గొప్ప సుగుణంగా కీర్తిస్తుందని.

ప్రస్తుత హిందువులు, తరతరాల అవమానాల కారణంగా ఒక భావాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ‘గట్టిగా నవ్వుతూ భరించడం’ తప్ప చేయాల్సిందేమీ లేదని. చిరకాలంగా బాధపడడం వారికి ఒక విస్తృత సుగుణంగా మారి కూర్చుంది. సహించడం, సర్దుకోవడం, క్షమించడం వారు ఆత్మనిగ్రహానికి చిహ్నలుగా పరిగణిస్తారు, (అంటే బలంగా, శక్తిగా) ప్రశంసిస్తారు. కాని నిజానికి, అవన్నీ తమ బాధలకు గల కారణాలను ఎదుర్కోలేని అసమర్థతకు చిహ్నాలు, బలహీనతకు గుర్తులు. హిందూస్థాన్‌లో ప్రతి ఒక్కరూ అన్నింటితో సర్దుకుపోతారు, సహిస్తారు. పొరుగు వారు గొడవ చేసినా, వీధులు మరికిగా ఉన్నా, అలాంటి సాధారణ అసౌకర్యాలనన్నింటినీ ఓపికగా భరిస్తారు. వాటితో పాటు మహామ్మదీయ దుర్మార్గాన్ని, విదేశీ ఆధిపత్యాన్ని కూడా! తరతరాలుగా, ఇతరులేం చేసినా సహించడాన్ని ఒక సుగుణంగా నేర్చుకుని, ఏమీ మాట్లాడకుండా ఉండడానికే నిర్ణయించుకుంటారు, చెడు నిలిచి ఉంటుంది. చివరికి, తమకే ఇబ్బందీ లేనట్లే అనుకుంటారు. అనారోగ్యకరమైన వాస్తవిక జీవన పరిస్థితులను, ప్రాథమిక సౌకర్యాల లేమిని, ‘ఆధ్యాత్మిక వాదులు’ దృష్టిలోకి అసలు తీసుకోరు. అలాంటి అవాంఛనీయమైన విషయాలను అధిగమించడానికి తగిన మానసిక బలం వారికి ఉంటుంది. కాని హిందువులు, వారనుకుంటున్నంత వేదాంతులేమీ కాదు. తెలివైన విదేశీయులు వారు అలా అనుకునేలా ప్రోత్సహిస్తారు. కాబట్టి, వాస్తవిక పరిస్థితులు, వారి జీవితాల మీద ప్రభావం చూపుతాయి. సౌకర్యాలు లేకపోవడం వారిని నిరాశకు గురి చేస్తుంది. వారు భౌతికంగా, మేధోపరంగా ఎదగడానికి అనువైన వాతావరణం లేకపోవడం, వారిని ఒక వెనుకబడిన జాతిగా ఉంచుతుంది.

హిందువుల్లో, అతి శ్రేష్ఠమైన మానవులుంటారని మనం ముందే అనుకున్నాం. అది నిజమని నమ్ముతాం కూడా. భారతదేశపు నిజమైన ‘కులీనత’ ప్రపంచపు కులీనతే. కాని హైందవత్వంలో, మిగిలిన వారి సంగతి? అణగారిన హిందూ సామాన్య ప్రజానీకాన్ని వారితో పోల్చండి. హిందూమత బోధనలన్నింటినీ వారు మరిచే పోయారు. చిరకాల బాధ ఒక సుగుణమనేది తప్ప. జాతీయ దృక్పథం కల ఇతర దేశాల సామాన్యులతో వారిని పోల్చండి. ఇదే తేలుతుంది. ఒక హిందూ కూలివాడితో, ఒక ఇంగ్లీషు లేదా ఫ్రెంచి కూలివాడిని పోల్చండి. వారు స్వేచ్ఛా పౌరులు. వారి దేశపు శక్తి, బలం, వారిదే అని ఆ దేశపు కూలీలకు బాగా తెలుసు. దేశంలో వారి స్థానాన్ని వారిది అని చెప్పకోవడానికి వారు ఎప్పుడూ సిద్ధమే. వారి జీవించే హక్కును తమ నిమ్న పరిస్థితుల నుండి పైకి వచ్చే హక్కును, వ్యక్తిగతంగా సాధించుకుంటారు. కానీ హిందూ కూలీ, ఒక దెబ్బలు తిన్న కుక్కలాగా, అంతః సిద్ధమైన ఒక భయాన్ని, ఒక లొంగుబాటును కలిగి ఉంటాడు. ఒక వ్యక్తిగా, అతడు ఒక ఐరోపా జాతీయుని కంటె మెరుగైన వాడు కావొచ్చు. అతనిలో అనంతమైన అవకాశాలు ఉండవచ్చు, కానీ ఆ అవకశాలు అసలంటూ ఉంటే, ఒక అసత్యభావన వల్ల నిరాకరింపబడతాయి, అణచి వేయబడతాయి, నశిస్తాయి. ‘నీవున్న స్థితితో సర్దుకుపో! ఇతరులు చేసే అన్యాయాన్ని సహించు! నిశ్శబ్దంగా బాధపడు! అదే సుగుణం’ అదే ఆ అసత్య భావన.

ఒక వ్యక్తిలో, చిరకాల వేదన, బాధ, కొన్ని సార్లు ‘మానసిక శక్తి’కి చిహ్నం కావచ్చు. కాని, ఒక జాతికి, ఒక దేశానికి దానిని బోధిస్తే, ఆ జాతి గొప్పది కాలేదు. ‘రోజువారి జీవితంలో’ చిరకాల వేదనను గురించి మాట్లాడవచ్చు మనం. కాని అది అంతా ఒకటే. రోజు వారీ జీవితం యొక్క విషయాలకు, వాటి కంటె ఉన్నతమైన వేరే విషయాలకు మధ్య, ఒక ప్రత్యేకమైన సరిహద్దు లేదు. దైనందిన జీవితంలో ఘోరమైన దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొవడం, జాతీయ జీవితంలో కూడా అంతకు తీసిపోని పరిస్థితులకు దారి తీస్తుంది. ప్రతిదీ ఒక అలవాటుకు సంబంధించిన విషయమే. సహనం అనే సిద్ధాంతం అత్యంత నిరాశాజనకమైంది, అది బానిసల వేదాంతం.

అందుకే, మనం అనుకునేది, పాశ్చాత్యదేశాల నుండి వచ్చిన, భారతదేశానికి స్నేహితులనబడే వారిలో, క్రైస్తవం వంటి హిందూమతం అంత పేరు పొందిందని. వారు బ్రిటిష్ వారైనా, అమెరికన్‍లు అయినా, ఇంకా ఎవరైనా, వారు యూదులు కాకపోతే తప్ప, వారంతా పాలకవర్గాలు చెందినవారే. వారిక్కడికి వచ్చేస్తారు. కొన్ని సులభంగా ఆచరించతగిన హిందూ పద్ధతులను స్వీకరిస్తారు. ఇక హిందు మతాన్ని పొగడుతూ పోతారు. దాని ‘విశ్వజనీనత’ను దాని ‘అహింసాధర్మాన్ని’, దాని ‘ఆధ్యాత్మికతను’ ఒకటే పొగడుతుంటారు. ఐరోపా, ఇలాంటి క్రిస్టియన్ సుగుణాలను, ఏనాడో తిరస్కరించింది, తాను బలంగా ఎదగడానికి. కాని ఐరోపాకు ‘మంచి’ది అన్నదంతా ఇందియాకు మంచిదవ్వాలని లేదు. ఐరోపా, ఇండియా పరస్పరం భిన్నమైనవి. ఐరోపా పాలించడానికి, ధనవంతమవడానికి, ప్రపంచాన్ని అనుభవించడానికే పుట్టింది. కాని ఇండియా, పరిపాలించ బడడానికి, దోచుకోబడడానికి, సంపద, అధికారం విలువ లేనివని ప్రపంచానికి చాటడానికే పుట్టింది. విశ్వప్రేమను, అపరిమిత సహనాన్ని, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించడానికి, అధికారికంగా కాకపోయినా, కనీసం స్ఫూర్తిగా ఐనా, ఒక స్వాభావిక క్రైస్తవ దేశంగా ఉండటానికి ఇండియా పుట్టింది. కాదా?

హిందువుల అభిరుచులను, స్వభావాన్ని నిరుత్సాహపరచగలిగిన వారిలో చివరివారు యూరోపియన్లు. క్రైస్తవాన్ని పోలిన హిందూమతాన్ని ప్రేమించేవారు తప్పని సరిగా, ప్రభావవంతమైన క్రైస్తవ మఠాధిపతులు అయి ఉంటారు. వారు అదే పనిగా, రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులను మోసం చేస్తూ ఉంటే, వారి నక్క జిత్తులను మనం ప్రశంసించాల్సిందే, వారి వంచనా శిల్పానికి జోహోరులర్పించాల్సిందే. వారు నిజాయితీపరులైతే, మరింత ప్రమాదకరమైన వారు. ఇక్కడికి వచ్చింది వారు కాదు, వారి జాతిలో, ఉపచేతనాత్మకమైన ఒక ఆత్మ రక్షణ ప్రవృత్తి వారినిక్కడికి పంపింది. ఎందుకంటే ఆ శ్వేత జాతీయులు, కొన్ని సంవత్సరాల పాటు, ఏ ఆటంకమూ లేకుండా తమ ‘భారాన్ని’ మోయడానికి – వారు యూదులయితే, వారి బానిస గుణాలకు మూలాన్ని శోధించడం అంత కష్టం కాదు. వారి శాంతి సందేశం, అర్థం చేసుకోడానికి అంత కష్టం కాదు.

దురుదృష్టం ఏమిటంటే, ఈ వక్రీకృత, అస్తవ్యస్త హిందూమత స్నేహితులూ, ప్రశంసించే వారందరూ, హిందువుల్లో గొప్ప ప్రాముఖ్యత కల్గి ఉంటారు. అలా కాకుండా అది ఎలా వుండి ఉంటుంది? వారి ఆది భౌతిక దృక్పథంలో కాకపోయినా, నిజ జీవిత విషయాలలో, హిందువులు క్రైస్తవాత్మకులైనారు. మచ్చిక చేసుకోబడినారు.

హిందూమతం, ప్రస్తుతం, ఒక బలహీనుల, రోగగ్రస్థుల, బానిసల మతం కాదని ఎవరూ బోధించరు. భారత జాతీయ ఆరాధనా విధానం, శక్తికి, యువ స్ఫూర్తికి సంబంధించింది. ఆర్య యోధులది, సూర్యారాధకులది. వారు తరాల క్రితమే భారత దేశంలో స్థిరపడినవారు.

ధైర్య సాహసాలను ప్రేమించడం గురించి, ప్రస్తుత భారతదేశానికి ఇంత కంటె ఎక్కువగా ఎవరూ చెప్పలేరు. ఎవ్వరూ చేయరు. స్వీయ నిర్ణయాన్ని, దాన్ని స్ఫూర్తికి కూడా. బ్రతకాలనే బలమైన కోరిక, ఆ బ్రతుకు కూడా అలసిసొలసిన అరకొర జీవితం కాదు. ఒక అందమైన జీవితం కావాలని. ఈ భూమ్మీద అనుభవించగలిగినదంతా అనుభవించాలనే పట్టుదల, సంపద, సంతోషం, అధికారం, సృష్టించే మనస్సు, ఎదురు తిరిగి, అధిగమించి హిందూ స్వీయ నిర్ణయాన్ని, సృష్టిని వ్యతిరేకించే ఏ శక్తినైనా నిర్దయగా అణచి వేయ ధృడనిశ్చయాన్ని, దాని అత్యంత అవసరాన్ని, ఎవరూ ఇంతగా చెప్పలేరు.

హిందువులు తమ వైభవాన్ని పునరుద్ధరించుకొని, ఒక దేశంగా, సంపదను అధికారాన్ని పొందినప్పుడు, వారిలో కొందరు, కావాలంటే, పాండవులు తమ పునర్విజిత సింహాసనాన్ని త్యజించినట్లుగా, వాటిని త్యజించవచ్చు. కాని ఇప్పుడు కాదు (పాండవులు కూడా, తమ సింహాసనాన్ని, దాన్ని తిరిగి జయించడానికి ముందే త్యజించలేదు). ప్రస్తుతం మొత్తం దేశం యొక్క నిమగ్నత అంతా, ప్రపంచాన్ని, దాని భ్రమను పరిత్యజింతడం కాదు. అది ‘ఇతర దేశాలలాగా, మనం ఎలా జీవించాలి, ప్రపంచాన్ని ఎలా అనుభవించాలి?’ అనేదే ముఖ్యం. అంతే కాని, ‘ఎలా స్వర్గానికి వెళ్లాలి?’ అనేది కాదు. ‘స్వర్గం కంటె ఉన్నతమైన మన మాతృభూమియైన భారతదేశాన్ని ఎలా తయారు చేయాలి?’ అనేది ప్రతి హిందువూ వేసుకోవలసిన ప్రశ్న. ‘నిశ్శబ్దంగా ఎలా భరించి? ఎలా సహించాలి’ అని కాదు. ‘హిందువులను తమ భావాలను వ్యక్తపరచకుండా ఆపే ఏ శక్తినైనా ఎలా ఎదిరించాలి?’ అని.

ఆశ్చర్యం ఏమిటంటే, తమ మనస్సులో హిందూ పురాణేతిహాసలలోని యోధుల ఉదాహరణలను, దేవతలను, కురుత్రంలోని కృష్ణుడిని, మృత్యుంజయుడైన శివుని, తమ మనస్సులో నిలుపుకొని కూడా, ఇంత భయపడే జాతిగా ఎలా అయినారనేది? హిందూ సామన్య ప్రజానీకంలో, విస్తృతంగా రామాయణ మహాభారతాల్లోని బోధనలను, ప్రేరణ కలిగించే దేవతల గాథలను, ఒక నియమంగా, హిందూ ఇతిహాసాల్లో, చరిత్రలో, మతంలో చెప్పబడిన దానిని, ప్రచారం చేయడానికి ఇంతకంటె అవసరమైన సమయం లేదు. వారిలో ఒక యోధుని కవసరమైన వీరత్వ సుగుణాన్ని జాగృతం చేయడానికి అది అవసరం.

కాని ఇది బోధనలతో మాత్రమే సాధించబడేది కాదు. బోధనలు ఎప్పుడూ దేన్నీ సాధించలేవు. ఏదైనా దాగి ఉన్న భావం ఉంటే, అది మాత్రమే చైతన్యాన్ని కలిగించకలదు. జాతీయ స్పృహను, ఎదురు తిరిగే మనస్సును, హిందువులు అలవర్చుకునేలా చేయగలదు.

ప్రజలు, తమకేమీ ప్రమాదం లేదని ఖచ్చితంగా అనుకుంటున్నంత వరకు, ఎదిరించే గుణం వారికి కలుగదు. ఇంచుమించు ప్రతిచోట, హిందువులు ఇలాంటి ‘కుహానా భద్రతా భావాన్ని’ ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ఒక వ్యవస్థీకృతమైన ప్రభుత్వముంది (అది స్వదేశీయమా, విదేశీయమా అనేది అప్రస్తుతం).

అందరినీ రక్షించడానికి సుశిక్షితమైన పోలీసు వ్యవస్థ ఉంది. వీధులు ప్రశాంతంగా ఉన్నాయి. గొడవలు అల్లర్లు ప్రతి రోజూ ఒకే చోట జరగడం లేదు. వార్తాపత్రికలలో మనం చదివే అల్లర్లు, మన ఇంటి చుట్టూ జరిగే అల్లర్లలాంటివి కావు. ప్రతి రోజు మరింత మంది హిందువులు ముస్లిములుగా, క్రిస్టియన్లుగా మారిపోతున్నారు. కాని వారు మారుమూల గ్రామాల్లోని వారు, లేదా మన పట్టణంలోనే మనకు అంతగా పరిచయం లేనివారు. వారిని గురించి మనం అసలు వినలేదు. ప్రతి రోజూ, కొత్త చట్టాలు, నియమాలు చేయబడుతున్నాయి. అవి హిందువులు ఇంతకు మందు ఆర్థికంగా, రాజకీయంగా అనుభవిస్తున్న చట్టపరమైన ప్రయోజనాలను కత్తిరిస్తున్నాయి. ప్రతి రోజు హిందువులు కొత్త యిబ్బందులకు గురి చేయబడుతున్నారు. వారి మతపరమైన ఉత్సవాలను (విగ్రహాల పవిత్ర నిమజ్జనం లాంటివి) నియంత్రిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రావలసిన శాతం తగ్గిపోతూ ఉంది. ఇంకా అలాంటి వెన్నో. కాని జీవితం సాగిపోతూనే ఉంది. ఒక హిందువుకు పనేమీ దొరక్కపోతే, తన తమ్ముని ఆదాయం మీద బ్రతుకుతాడు. తమ్ముడి ఆదాయం కూడా శూన్యం అయితే ఇద్దరూ తమ కుటుంబాలతో అత్యంత దయనీయంగా బ్రతుకునీడుస్తారు. దాన్ని వారు భరిస్తారు (చిరకాల బాధ ఒక సుగుణం కాదా!). వారి పరిసరాల్లో, హింసాత్మక అవరోధాలేవీ లేనంత వరకు, వారు క్షేమంగా ఉన్నామనుకుంటారు.

కాని హింసాత్మక అవరోధమంటూ వస్తే, ఏం చేయాలనేది ఆలోచించటానికి సమయం మించిపోయి ఉంటుంది. బెంగాలులో, కొన్ని ఆందోళనలల్లో, ఇరవై మంది ముస్లిములు రెండు వందల మంది హిందువులను చెదరగొట్టారు. ఎందుకు? హిందువులు సిద్ధంగా లేరు కాబట్టి. గొడవ ముగిసింతర్వాత, ఎందుకు మీరు కొంచెమైనా ప్రతిఘటించలేకపోయారు అని మీరుర వాళ్లనడిగితే, వాళ్లు ఎంతో నిజాయితీగా ఇలా చెబుతారు – “గొడవ జరగుతుందని మాకు తెలీదు. ఇక్కడ, ఇంత వరకు అలాంటివి జరగలేదు”. అది నిజం కాదు. మరో చోట, మరో చోట ఇలాంటి గొడవలు జరిగాయి. హిందువులు గొడవలు అసలే జరగవని అసలు భావించరాదు, ముఖ్యంగా వారు అత్యధిక మెజారిటీగా తమ పట్టణంలో గానీ, మొత్తం పరగణాలోగానీ, ఐనా, ఎవరు చెప్పగలరు? బెనారెస్‌లో కూడా గొడవలు ఉంటూ వస్తున్నాయి.

విషయం ఇది. ఒక వ్యవస్థాగత ప్రభుత్వం, తమ జీవితాన్ని ఆస్తిని కాపాడే పోలీసు, సైనిక దళం, ఉన్నంత వరకు, వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా, హిందువులు, భద్రత ఉన్నట్లే భావిస్తారు. ఈ భావనను వారు విడనాడాలి.

నిజానికి అది ఒక తప్పు భావన. ఒక భ్రాంతి. సాధారణ శాంతియుత పరిస్థితుల్లో, ప్రభుత్వం ప్రతి పౌరునికీ, కొంత మేరకు భద్రత ఇచ్చినా, కొన్ని సార్లు అలా ఇవ్వలేని పరిస్థితులుంటాయి. రక్షణ దొరకని ఆందోళనకర కాలాలుంటాయి. తమ గోడు అనేది ప్రస్తుత ప్రభుత్వానికి ముఖ్యం కాదని హిందువులు గుర్తుంచుకోవాలి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రభుత్వ ఖజానాను, ఇంపీరియల్ బ్యాంకును, ఇతర గొప్ప ప్రభుత్వ భవనాలను రక్షించడానికికే సాయుధ బలగాలను పంపుతారు. తర్వాత యూరోపియనుల, అధికారుల జీవితాలను, ఆస్తులను రక్షించటానికి పంపుతారు. సమయం ఉంటే, కొంత బలగం లభ్యంగా ఉంటే, ఒక అరడజను మంది పోలీసులను, హిందువులను రక్షించడానికి పంపుతారు. అది ఏ మాత్రం? సమీప గతంలో విస్తృతంగా గొడవలు జరిగినప్పుడు అది ఏమీ చాలలేదు. అలాంటప్పుడంతా బాధితులు హిందువులే.

అంతే కాదు, (మనమంతా ఆశిస్తున్నట్లు) భారతదేశం ఒక రోజు స్వతంత్రదేశం అయిందనుకోండి, చెప్పకోతగిన ప్రభుత్వమనేదే లేని, ఒకానొక సుధీర్ఘ అయోమయ పరిస్థితి ఏర్పడదని చెప్పలేము. అలాంటి సమయం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. అప్పుడు అది భారత్ ఇష్టం మీద ఆధారపడి ఉండదు, అంతర్జాతీయ పరిస్థితుల మీద ఆదారపడి ఉంటుంది. భారత్ అదుపు దాటిపోతుంది. అలాంటి పరిస్థితే గనక ఏర్పడితే ఆ బెదరింపును, ఒక వ్యవస్థీకృత నిరసనతో ఎదుర్కోడానికి, వారు ఇప్పటి నుండే సిద్ధంగా గనక లేకపోతే, హిందువులేం చేస్తారు? ఇప్పటి నుండే, వారి స్వాభావిక జడత్వాన్ని విదిలించుకుని, జరగబోయే ప్రమాదం పట్ల జాగరూకులై ఉండకపోతే, ఏం జరుగుతుంది?

వారిలో విస్తృతంగా ఉన్న కుహానా భద్రతా భావాన్ని విడనాడి, దాని స్థానంలో ఆత్మరక్షణా నిమగ్నతను హిందువులు కలిగి ఉండాలి. ఏ గొడవలూ లేని సమయంలో కూడా దీన్ని వదిలేయకూడదు. ఆత్మరక్షణా హక్కు అనేది మనిషికి జన్మహక్కు అని ప్రతి ప్రభుత్వమూ అంగీకరించింది. ఎందుకంటే, ఎంత బలమైన ప్రభుత్వమైనా, తన ప్రతి పౌరునికి సంపూర్ణ రక్షణకై భరోసా ఇవ్వలేదు. అలాంటి భరోసా కనక ఇవ్వబడితే, దోపిడీకి గురయిన, లేదా గాయపడిన ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. కాబట్టి, ఆత్మరక్షణ హక్కును ఉపయోగించుకోవడం, మొదట దాని కోసం సంసిద్ధంగా ఉండడం – ఏ ప్రభుత్వం దృష్టిలోనైనా చట్ట వ్యతిరేకం కాదు. భారతదేశంలో, ఒక యూరోపియన్, నిజానికి అతనికి ఏ ప్రమాదమూ లేకపోయినా, ఒక్కడూ ఒంటరిగా, ఆయుధం లేకుండా, వెళ్లడు. కాని సాధారణంగా, ఒక హిందువు, బయటకి వెళితే, కనీసం ఒక కర్రను కూడా వెంట తీసుకొనిపోడు. హిందువులు మొత్తం జనాభాలో పదిహేను, పది, కనీసం ఐదు శాతం కూడ లేని ప్రాంతాల్లో, గొడవలు అది వరకే జరిగిన ప్రాంతాల్లో కూడా హిందువు చేతిలో ఒక పుస్తకాన్నో, వార్తాపత్రికనో, లేదా ధోవతి అంచునో పట్టుకుని బయటకు వెళతాడు.

ప్రమాదం పొంచి ఉందన్న స్పృహ మాత్రమే హిందువులను బలవంతులుగా చేయదు, ఒక ప్రయోగాత్మకమైన దేమైనా, ఆ ప్రమాదాన్నిఎదుర్కోవడానికి చేస్తే తప్ప. ఇది యువ భారతీయులు చేయవలసిన గొప్పకార్యం.

తన పరిధిలోని వ్యవస్థకు ప్రతి హిందువు తన శాయశక్తులా దోహదం చేయాలి. కాని వారిని బెదిరించే శక్తులు అన్ని వైపుల నుంచి చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి, హిందువులు, గురుగోవింద్ సింగ్ రోజుల్లో, పంజాబులోని సిక్కుల్లాగా, ఒక సంపూర్ణ సైనిక శక్తిగా గనక సత్వరం ఎదగకపోతే, భారత్ లోని అన్ని మూలలా, సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్న వారు అసలు మనుగడ సాగించలేరు. కాబట్టి, మొదట యువకులందరూ, అంతటా, సైనికులు కావాలి. ప్రమాదం – దాన్ని ఎదుర్కోవడం అనేవి వారికి స్వాగతించ తగినవి కావాలి. వారికా భావనలు బలాన్నిస్తాయి.

అందుకే ఈ నిర్మాణాత్మక కార్యక్రమంలో మొదటి భాగం, యువకులను వ్యవస్థీకృతం చేయాలి. ఒక ప్రతిజ్ఞ పట్టిన సైనికులలాంటి బృందాలు తయారు కావాలి. వారి ఏకైక ఆదర్శం హిందూ జాతీయవాదం కావాలి. హిందూ ఇతిహాసాల్లో చరిత్రల్లో ఉన్నదంతా వారికి ఆరాధనా విధానం కావాలి, వారి శక్తిని మరింత లేవనెత్తగలగాలి. ఎలాగైనా సరే, ఎటువంటి దానైనా ఎదుర్కోగలిగిన, ఒక చర్యానిబంధనగా, అన్ని రకాలుగా ఆ స్ఫూర్తి రగులుకోవాలి యువ సైనికులలో.

ఈ హిందూ సైన్యంలోని ప్రతి సభ్యుడు, హైందవత్వ సంరక్షణ కోసం కంకణ బధ్దుడనవుతానని ప్రతిన బూనాలి. ఆ ప్రతిజ్ఞ, ఇతర విషయాలతో బాటు, ఇలా ఉంటాలి.

  1. హైందవత్వ సంక్షేమమే తన వ్యక్తిగత సంక్షేమం కంటె మిన్న అని, హైందవత్వ ప్రయోజనమే తన వ్యక్తిగత ప్రయోజనాన్ని అధిగమిస్తుందనీ, తన వ్యక్తిగత ముక్తి, హైందవత్వపు ముక్తి, స్వేచ్ఛ, ఔన్నత్యం కంటె గొప్పది కాదనీ.
  2. ప్రతి హిందువును తాను తన సొంత కులం వాడిని చూసినట్లే చూస్తాననీ.
  3. తన వ్యక్తిగత రక్షణకు కేవలం తాను మాత్రమే బాధ్యుడుగా పరిగణిస్తాననీ, తన కుటుంబ రక్షణ కూడా తన బాధ్యతేననీ, తన గ్రామంలోని పట్టణంలోని హిందువులనో, తన ప్రాంతంలోని, మొత్తం హిందూస్థానంలోని హిందువులను రక్షించే బాధ్యత తనదేననీ.
  4. నాయకుడు ఏది చెప్పినా, ఎదురు వాదన చేయకుండా, విధేయత చూపుతాననీ

ప్రతిజ్ఞ చేయాలి.

కొందరు స్వయం సేవకులు సమీకరించబడే అవకాశం ఉన్న ప్రతి చోటా అది ఒక గుడి ఆవరణ కావచ్చు, చిన్న చెట్ల గుబురు కావచ్చు, పవిత్రమైన స్థలం ఏదైనా కావచ్చు. అక్కడ ఒక హిందూ సైనిక విభాగం ప్రారంభించ బడాలి. పవిత్రమైన చోట్ల అని ఎందుకు సూచించామంటే, ఆ పరిసరాలు, వారికి, తాము రక్షణ ఇస్తున్న ఒక గొప్ప సంస్కృతిని సదా గుర్తు చేస్తుంటాయి. ఎక్కడ హైందవేతరులు మెజారిటీగా ఉంటారో, అక్కడ ఈ తిరుగుబాటు యువకులు అప్రమత్తంగా ఉండాలి. వారు ‘చట్టవిరుద్ధమైన’ దేదీ చేయకుండా, నిగ్రహంగా, తెలివిగా, వ్యవహరించాలి. అస్సాంలో, హిందూ మిషన్ ద్వారా ఏర్పటైన అలాంటి హిందూ యువజన బృందాలు ఒక ‘భౌతిక సాంస్కృతిక సంస్థ’ శాఖలుగా ప్రారంభించబడ్డాయి. ఆ పేరు ఖచ్చితంగా సమర్థనీయమే. ఎందుకంటే శారీరిక శిక్షణ (కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు, క్రీడలు మొదలైనవి – కత్తులు, ఖడ్గాలు, మామూలు కర్రలు, ఆత్మరక్షణ కోసం ఉపయోగించే కసరత్తులు) అనేది, ప్రతి బృందంలోని యువకులకు ఇవ్వబడే అతి ముఖ్యమైన శిక్షణ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here