[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]
భారత జాతీయతావాదం- చైతన్యం
మొదటి ప్రకరణము
[dropcap]మ[/dropcap]నం మొదటగా విశ్వాసాధారిత, అనాధారిత మతాల గురించి చర్చించాము. అదే ఈ గ్రంథానికి మూల సిద్ధాంతంగా పరిగణించవచ్చు. భారతీయ ధర్మమే భారతదేశపు జాతీయమతం. భారతీయ ధర్మమే కాకుండా ఇంకో నిజమైన భారతదేశం లేనే లేదు.
ఈ విషయాన్ని విమర్శించడానికి సిద్ధంగా ఉన్న వారు చాలా మంది మన దేశంలో ఉన్నారు. వారిలా అంటారు. “మత మనేది వ్యక్తిగత విషయం. ప్రతి భారతీయుడు, తనకు నచ్చిన మతాన్ని ఎందుకు అనుసరించకూడదు? అతని మతానికీ అతని జాతీయభావాలకు సంబంధం లేదు.” వారింకా ఇలా చెబుతారు. “అన్ని నాగరిక దేశాల్లో జాతీయత, మతం అనేవి రెండు వేర్వేరు సంగతులు.” ఇంకా ఇలా అంటారు “ఉదాహరణకు జపాన్‌ను తీసుకోండి. ఆసియాలోనే అత్యంత పురోగామి దేశం. దానిలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు విభిన్న దేవాలయాలను సందర్శిస్తారు, వివిధ మతాలకు చెంది ఉంటారు. అయినా వారు ఐక్యంగా ఉంటారు.” చివరికిలా ముగిస్తారు “భారతదేశంలో అలా ఎందుకు ఉండకూడదు?”
ఈ మాటలన్నీ మతానికి గల రెండు వేర్వేరు అర్థాలను గ్రహించలేని మౌలిక అయోమయం నుంచి వచ్చినవే. ‘విశ్వాసం’, ‘సంస్కృతి’ ఈ రెండు పదాలను అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన అజ్ఞానపు వాచాలత్వమే. మతాన్ని విశ్వాసంగా భావించినంత వరకు వారి అభిప్రాయం సరైనదే. కాని మతమంటే ఒక సంస్కృతి, ఒక నాగరికత, ఏ విశ్వాసంతో సంబంధం లేనిది, అని అనుకుంటే మటుకు వారి అభిప్రాయాలు తప్పు.
మతం ఒక వ్యక్తిగత విషయం. సరే, మతాన్ని ఒక ఆధ్యాత్మిక మార్గంగా నీవు భావిస్తే ఆ మాటా నిజమే. ఆత్మ సాక్షాత్కారానికి దారి తీసే మార్గాలు అనేకమని ఏ భారతీయుడైనా అంగీకరిస్తాడు. అట్లే విశ్వాసాలు కూడ ఎన్నో ఉంటాయి, పరస్పర విరుద్ధంగా ఉటాయి కూడా, అన్నీ నిజమే, ఎందుకంటే ‘సత్యం’ అన్న భావనలోనే ఎన్నో విరుద్ధమైన అంశాలున్నాయి. దీన్ని కూడా ఏ భారతీయుడూ కాదనడు. ఒకే కుటుంబంలో ఒకడు ఒక వ్యక్తిగత దైవాన్ని ఆరాధిస్తాడు. మరొకడు ఎంతో మంది దేవతలను దేవుళ్లను కొలుస్తాడు. మూడో వాడు భగవంతుడే లేడంటాడు! ముగ్గురూ చక్కని సౌభ్రాతృత్వంతో కలిసి ఉంటారు. కాని ఒక్క విశ్వాసమే నిజమైనది, ఇతర విశ్వసాలన్ని అబద్ధం, హానికరం, అందరూ ఆ విశ్వాసాన్నే పాటించాలని, దాన్ని ప్రపంచం మీద రుద్దాలని భావిస్తారు కొందరు. వారిది అజ్ఞానం. భారతీయులు అలా భావించరు.
మతం, ముక్తికి ఒక సాధనంగా, మార్గంగా ఆత్మ సాక్షాత్కారానికి ఆలంబనగా దైవత్వాన్ని చేరడానికి ఊతగా అలాగే ఉండాలి. ఎప్పుడూ అలాగే ఉంది కూడా. నిజానికి అది జాతీయతాభావానికి సంబంధం లేకుండా, రాజ్యము యొక్క జోక్యానికి అతీతంగా ఉండాలి. ఒక ఉమ్మడి విశ్వాసాన్ని పంచుకునే వారినందరినీ ఐక్యం చేయగలిగినదిగా భావించబడుతున్న మతంలో కూడా, వారు ఎన్నుకునే ఆధ్యాత్మిక మార్గం, వేరుగా ఉంటుంది. దాని మీద రాజ్యపు అదుపు ఉండదు. ఎందుకంటే, విభిన్న వ్యక్తులు సత్యాన్ని ‘తెలుసుకోవాలంటే’ అది మనస్తత్వపరంగా అసాధ్యం. అదే సత్యాన్ని వివిధ మూఢ విశ్వాసాలు, ఒకే రకంగా వ్యక్తం చేసినా. ఒక నియంతృత్వ రాజ్యం మహా అయితే ఏం చేయగలదు? మత విషయంలో, అంటే ఆధ్యాత్మిక విషయాలలో అది తన పెత్తనం చలాయించాలంటే, ఒకే విధమైన అంధవిశ్వాసాలను తన ప్రజలంతా బాహ్యంగా అంగీకరించాలని, లేకపోతే శిక్షిస్తామని బెదిరింపులకు పాల్పడుతుంది. దీన్నే ఐరోపాలో క్రైస్తవరాజ్యాలు అనుసరించాయి. ‘పవిత్ర జిజ్ఞాస’ సమయంలో అంత కంటె ఏం చేయలేరు. కాని అది ఒక వైఫల్యంగా ఋజువైంది కదా! ఎందుకంటే క్రైస్తవులు అనబడే వారంతా ఒక దేశంగా ఉన్న చోట కూడా, వారు ఒకే విశ్వాసం ఆధారంగా ఏకీకృతం కాలేదు, భగవంతుడిని గురించి తెలుసుకోవడం అటుంచితే! ఒకే జాతీయత కల్గిన కొందరు క్రైస్తవుల వ్యక్తిగత విశ్వాసాలను గనుక మనం లోతుగా విశ్లేషిస్తే, ఈ మాటలు నిజమని మనం ఒప్పుకుంటాము.
రాజ్యం బలవంతంగా కొన్ని అంధవిశ్వాసాలను ప్రజల నెత్తిన రుద్దాలని ఎంత ప్రయత్నించినా, నాగరిక దేశాల్లో మతం, జాతీయత, మతవ్యవస్థ, రాజ్యం, విశ్వాసం, జాతీయత వేరుగానే ఉండి ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఉన్నాయి. కాని ‘సంస్కృతి’, ‘జాతీయత’ మాత్రం వేరుగా లేవు. నాగరికత, ‘జాతీయత’ వేరుగా లేవు. ఉండబోవు కూడా!
ఇప్పుడు, ఒక క్యాథలిక్ ఫ్రెంచివాడు, ఒక థియోసోఫిస్ట్ ఫ్రెంచివాడు, మరో సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ముగ్గురూ ఫ్రెంచి వాళ్లే. ఎందుకంటే, కేవలం వాళ్లంతా ఫ్రెంచి భాష మాట్లాడతారని కాదు, అందరి పూర్వీకులూ ఫ్రెంచి వారని కాదు. ఒకే గడ్డ మీద బ్రతుకుతున్నారని కాదు. మరి ఎందుకు? చిన్న చిన్న విభేదాలున్నా (ఉదా – థియోసఫిస్ట్ శాకాహారి, క్యాథలిక్ మాంసాహారి, భగవంతుని గురించి వారి అభిప్రాయాలు వేరు, ఇలా) వారంతా ఉమ్మడిగా దైనందిన ఆలోచనలు పంచుకుంటారు. ఉమ్మడి ఆచారాలను అలవాటును కలిగి ఉంటారు. దుస్తులు వేసుకోవడం, కూర్చోవడం, ఇంటిని అలంకరించుకోవడం లాంటి విషయాల్లో. సాహిత్యం, కళలు, సంగీతం, విజ్ఞాన శాస్త్రం లాంటి విషయాల్లో ఉమ్మడి ప్రమాణాలను పాటిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అదే ఫ్రెంచి సంస్కృతి, అదే ఫ్రెంచి నాగరికత. దాని వల్లే వారంతా ఫ్రెంచి వాళ్లు ఐనారు.
ఫ్రెంచి సంస్కృతి, ఖచ్ఛితంగా, ఒక మతం కాదు! అది ఐరోపా సంస్కృతి, నాగరికత అనే విస్తృతి, సంక్లిష్ట భావనలో ఒక భాగం మాత్రమే. ఐరోపా సంస్కృతి, ఐరోపాలోని పశ్చిమ భాగంలో అభివృద్ధి చెందింది. దానిపై క్రైస్తవ మతం ప్రభావమూ ఉంది, హేతువాదం ప్రభావమూ ఉంది. దాన్ని మనం ‘క్రైస్తవ సంస్కృతి’ అనలేం. ఎందుకంటే కేవలం క్రైస్తవ మతమే దాన్ని పుట్టకకు కారణం కాదు కాబట్టి. క్రైస్తవ మతం పాత్ర అందులో ఎక్కువగా ఉండవచ్చు, కాని దాన్ని నిర్ధారించడం కష్టం. క్రైస్తవం అనేది అన్నిటి కంటే ముందు ఒక ‘విశ్వాసం’ మాత్రమే. అంతేగాని, ఈ ప్రపంచపు అద్భుత సృష్టికి అదొక్కటే కారణం కాదు.
ఆధునిక ప్రాచ్యంలో, నిజానికి మతం అంటే సంస్కృతి మరియు నాగరికత, వ్యక్తిగత విశ్వాసం.. అని, మతవ్యవస్థ, రాజ్యం వేరుగా ఉన్న దేశాలను అభివృద్ధికి తార్కాణాలుగా మనం చూసినపుడు, మనం తప్పుదారి పడుతున్నట్లు. మతవ్యవస్థ, మతం అనేవి నాగరికత సంస్కృతుల తర్వాత వచ్చినవి అనుకుంటే, మతం, రాజ్యం లేదా సమాజం, ఎక్కడా, చివరికి పాశ్చాత్య దేశాల్లో కూడా, వేరుగా లేవు. ఒక ఫ్రెంచివాడు, తన నిజ జీవితంలో, ఒక మహమ్మదీయుని తీరుగా జీవించడం ఒకసారి ఊహించుకుందాం! అది అసాధ్యం ఏమి కాదు కాని, ఆ ఫ్రెంచి పెద్ద మనిషిని, అతనికి ఐరోపా ముఖం, వారసత్వం ఉన్నా కూడా, అతన్ని ఫ్రెంచివాడిగా ఒప్పుకోరు. అతడు ఫ్రాన్స్ లోని, ఒక అజ్ఞాతంలో ఉన్న, ఐరోపా జాతీయుడు కాని వాడు అవుతాడు.
జపాన్ లోని మత ‘విశ్వాస సహనం’ ఐరోపాలోని ఆధునిక రాజ్యాలలో దాని కంటే లోపభూయిష్టమైంది. కొన్ని జపాన్ కుటుంబాల్లో విశ్వాసపరంగా చెప్పాలంటే, ఇద్దరన్నదమ్ములు బౌద్ధులు, మూడో వాడు క్రైస్తవుడు, నాలుగో వాడు, అసలు విశ్వాసమే లేని షింటాయిక్ క్రతువులను పాటించేవాడు, అనుకుందాం. ఈ నలుగురు ఆధ్యాత్మికంగా విభిన్నంగా ఆలోచిస్తారు. ఇద్దరు బుద్ధున్ని నమ్ముతారు, చట్టాన్ని, సమాజాన్ని నమ్ముతారు. ఒకరు క్రీస్తును! మరొకరు ఇంకోటి! కాని సంఘజీవులుగా, వారంతా ఒకే విధంగా జీవిస్తారు. ఒకే ప్రమాణాన్ని అనుసరించి ఆలోచిస్తారు, ఒకే సంస్కృతిని పంచుకుంటారు. జపనీయులుగా, వారంతా షింటో అనుయాయిలే. వారిది షింటో భావించిన ఆహ్లాదకరమైన, వీరోచితమైన నాగరికత. ఆయన పెట్టిన ఆచారవ్యవహారాలను అందిపుచ్చుకున్నది. జపాన్ చక్రవర్తి యొక్క పవిత్రస్థానం, ఆ దేశంలోని క్రైస్తవుడికైనా, జాతీయ క్రతువులను పాటించే వాడికైనా గొప్పదే. అంతే కాదు, ఒక క్రైస్తవుడు, ఒక జపాన్ జాతీయుడిగా, షింటో ఆచారానికి అనుగుణంగా నిర్వహించే వేడుకల్లో పాల్గొనటానికి ఏ మాత్రం సంకోచించడు. అతని సాటి షింటోయిస్ట్‌లలాగా, బుద్ధిస్టులలాగా, అతడు కూడ ఒక జపాన్ పేరునే కలిగి ఉంటాడు కాని, క్రైస్తవ పేరును కాదు. ఎందుకంటే అది విదేశీ పేరు అవుతుంది. అది పోర్చుగల్, ఆమెరికాల నుండి ఆరువు తెచ్చుకున్నా, లేదా నేరుగా బైబిల్ నుంచి, అంటే పాలస్తీనా నుంచి వచ్చినా సరే.
ఒక జాతీయత రూపుదిద్దుకోవడానికి, విశ్వాసాల్లో వైవిధ్యం ఎంత మాత్రం అవరోధం కాదు. జాతీయ ఐక్యత బలంగా ఉండడానికి కూడా. ఇంకోసారి చెబితే, ఏ నాగరిక దేశంలో కూడా, పౌరులందరూ, మతాన్ని ఖచ్ఛితంగా ఒకే విధంగా అర్థం చేసుకోరు, వారు ఒకే విశ్వాసాన్ని అవలంబించినా (మతం ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గమను కున్నపుడు).
కాని ఏ దేశం కూడా, రెండు లేదా అంత కంటే ఎక్కువ నాగరికతల అతుకుల బొంత నుండి బయటకి రాలేదు. ఉమ్మడి జాతీయత అనే భావన, ఉమ్మడి సంస్కృతి, నాగరికతలకు చెందడమే భావన, పూర్తిగా వేరు. “ఒక ఫ్రెంచ్ క్యాథలిక్, ఒక ఫ్రెంచి థియోసఫిస్టు ఇద్దరూ ఫ్రెంచివారే! కాబట్టి ఒక ఇండియన్ హిందువు, ఒక ఇండియన్ ముస్లిం ఇద్దరు భారతీయులు ఎందుకు కాకూడదు?” అని మనం అనలేము. ఈ రెండు విషయాల్లోని సామ్యం అనే ఊహ పైన మనం మత వ్యవస్థ, రాజ్యం లోలాగా లోపభూయిష్టమైంది. ఫ్రెంచి నాగరికత సంస్కృతి అనేవి ఉంటాయి గాని, అవి థియోసాఫికల్ లేదా క్యాథలిక్ నాగరికతలుగా ఉండవు కదా! కాని, హిందూ లేదా ముస్లింది కాని, భారత నాగరికత అనేది ఉండదు. ఫ్రాన్స్ లాగే, జపాన్ లాగే, ప్రపంచంలోని ఏ ఇతర దేశంలాగే, భారతదేశం కూడ ఒక జాతిలా ఉండలంటే, ఆమెకు ఒకే నాగరికత ఉండాలి. ఒకే సంస్కృతి ఉండాలి. అంతే తప్ప, అరడజను ఉండకూడదు.
భారతదేశ సర్వస్వానికి గల ఒకే ఒక నాగరికత భారతీయ నాగరికతే! అట్లే సంస్కృతి కూడా భారతీయ సంస్కృతే! భారత జాతీయతా చైతన్యం అంటే పటిష్టపరచ బడిన, చైతన్య పరచబడిన భారతీయ జాతీయ చైతన్యమే!
ఎందుకు?
మనం మందుగా అనుకున్నట్లు, నిజంగా ఒక జాతిగా ఉన్న ఏ దేశంలోనైనా, రెండు లేదా అంత కంటే ఎక్కువ నాగరికతలు కలిసి ఉండవు. కాని, కొన్ని (చాలా కూడా) దేశాలు, ఒక దాని తర్వాత ఒకటిగా రెండు లేదా మూడు నాగరికతలను చవిచూచాయని విషయాన్ని కాదనలేం. క్రిస్టియన్ క్యాథలిక్ ఇటలీ, ప్రస్తుతం సీజర్ల కాలం నాటి ఇటలీ కాదు. ఆ దేశం పాగన్ రోమ్ పట్ల ఎంత గర్వపడినా సరే! గతంలోని ఇటలీ గురించి నేరుగా తెలియని మనకు, అది ఇంకా ఇటలీయే. ఒక పురాతన రోమన్ జాతీయుడు, ఒక వేళ మళ్లీ తిరిగి వస్తే, ప్రస్తుత తన దేశాన్ని గురించి ఏమని భావిస్తాడో ఎవరూ చెప్పలేరు. హైపాషియా కనక మళ్లీ తిరిగొస్తే, ఆమె తన గ్రీకుల గురించి ఏమనుకుంటుందో ఎవరూ చెప్పలేరు. దాని దేవతలూ, తత్త్వాలతో నిండిన పాత గ్రీకు నాగరికతకు, బైజాంటైన్ క్రిస్టియానిటి మీద ఆధారపడిన నూతన నాగరికతకు మధ్య, ఆమె చూసిన పోరాట కాలంలో, పాగన్స్‌కు మాత్రమే గౌరవం ఉండేది. వారిని హెతెనెస్ (అంటే గ్రీకులు), ఎత్నికోయ్ (అంటే జాతీయులు) అని మన్నన చేసేవారు. క్రిస్టియన్స్‌ను మాత్రం, జాతి లేదా దేశపు తేడా లేకుండా ఉట్టి క్రిస్టియన్సనే అనే వారు. హెలెనిక్ పాగనిజం యొక్క చైతన్య పూరిత యోధులకు, ‘హెలెన్’, ‘క్రిస్టియనోస్’ అనే పదాలు సమానార్థకాలే!
బైజాంటియన్ క్రిస్టియానిటీ (దాన్ని రాజ్యం మరియు మత వ్యవస్థల కలయికలోని బైజాంటీన్ క్రైస్తవ నాగరికత అంటే మేలు) గ్రీసుదేశానికి ఒక కొత్త జాతీయ స్పృహనిచ్చింది.
కాని, పాత నాగరికత పూర్తిగా క్షీణించినపుడే, కొత్త జాతీయ చైతన్యం పరిఢవిల్లుతుంది. వెనక ఒక కొత్త ఇతిహాసంతో, పాతది మొదట లుప్తమైపోవాలి. గ్రీసు దేశాన్నే తీసుకుందాం. గ్రీకు పాగనిజం యొక్క వైభవాన్ని వీక్షించిన చివరి సాక్షి మరణించేంత వరకు (అతని క్రిస్టియన్ సోదరులు అతన్ని గ్రీకు మరియు జాతీయుడు అనేవారు), క్రిస్టియన్ గ్రీకులు తమను తాము క్రిస్టియన్స్ మరియు గ్రీకులుగా భావించుకోగలిగేవారు కాదు.
వారి మతవ్యవస్థను (చర్చ్) జాతీయమైన దానిగా చూడగలిగేవారు కాదు. తమ మతం ఒక విదేశీ గడ్డ నుంచి వచ్చిందని మరువగలిగేవారు కాదు.
అదే విధంగా, మనం వాదం కోసం ఒప్పుకుంటే, నేపథ్యంలో ఇస్లాం ఉండిన, ఒక ఖచ్చితమైన భారతీయ జాతీయ చైతన్యమనేది, చివరి భారతీయ హిందువు మరణించేంత వరకు, ఉద్భవించేది కాదని మనం గుర్తు పెట్టుకోవాలి.
కాని అలాంటి పరిస్థితికి అసలు అవకాశమే లేదు!
మన గత జాతీయ మతాన్ని గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవడం వేరు, దానిని సజీవంగా, దైనందిన జీవితంలో, ప్రత్యక్షంగా దర్శించడం వేరు.
క్రైస్తవ ఇటలీ, క్రైస్తవ గ్రీసు, ‘క్రైస్తవ’ దేశాలుగా తమకంటూ ఒక జాతీయ చైతన్య స్పృహను సులభంగా కలిగి ఉండగలవు. ఆ దేశ ప్రజలు, వారి అందమైన వారసత్వ పాగనిజం గురించి రెండు రకాలుగా మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి పుస్తకాల ద్వారా, రెండవది శిధిలాల ద్వారా. కాని ఎంత బాగా వ్రాయబడిన వర్ణనలు గాని, ఎంత మహత్తరమైన శిధిలాలు గాని, అవి ఎంత విస్తృతంగా ఉన్నా, సజీవమైన జీవిత చిత్రంలాగా ప్రభావవంతం కానేరవు.
భారతీయ ముస్లిములు, క్రైస్తవులు, తాము కోల్పోయిన జాతీయ పాగనిజపు దృశ్యాన్ని, రోజూ తమ కళ్ల ముందే చూడగలరు, పుస్తకాల్లో కాదు, కళారీతుల్లో కాదు, తాము రోజూ ఎవరి మధ్య సంచరిస్తుంటాలో ఆ లక్షలాది భారతీయ సోదరుల మధ్యలో!
వారి భారతీయ వారసత్వం, భాష ముఖ్యమైన ఆంశాలుగా ఉండిపోతాయి. అవి, ఇతర పరిస్థితుల్లో ఒక భారత జాతీయతా వాదాన్ని కలిగింపచేస్తాయి. భారతదేశం అంటే ఏమిటి? భారతీయుడంటే ఎవరు? ఏథెన్స్ నగరంలోని ఒక గొప్ప గ్రంథాలయం ప్రవేశద్వారం మీదే ఇలా వ్రాసి ఉంటుంది. “ఎవరయితే మన సంస్కృతిలో భాగంగా ఉంటారో, వారే గ్రీకులు”. భారతీయులు కూడా అలాంటి వారే. భారతదేశ నాగరికతను సంస్కృతిని పంచుకోనేవారే. ఒకే ఒక హిందూ కుటుంబం, కొంత వరకు, పురాతన క్రతువులను నిర్వర్తిస్తున్నంత వరకు, ఒక హిందూ వాతావరణాన్ని సృష్టిస్తున్నంత వరకు, హైందవేతర భారత జాతీయతా వాదం అనేదాన్ని భావించడం అసాధ్యం. హిందువులు, వారు ఎంత తక్కువ మందైనా కావచ్చు, హైందవేతరులతో, వారి ఉనికిని గురించి అంటూనే ఉంటారు. “మేం భారతదేశ ప్రతినిధులం, మీరు కాదు! ఎందుకంటే భారతదేశం మాది, మీది కాదు.”
వార నేది సత్యం. ఇండియా వారిదే. వారు మాత్రమే ఇండియా.
భారతీయ ముస్లింలు, సగం అయిష్టంగానే అయినా, హిందూమతం మాత్రమే భారతీయ నాగరికత సంస్కృతి అని గ్రహించక తప్పదు. బహుశా, వారు, తమ పూర్వీకులందరూ పర్షియా నుంచి, అరేభియా నుంచి, వలస వచ్చిన వారే అని అనుకోవడానికి ఇష్టపడటం కావచ్చు. ఇది అసహజం, అసంబద్ధం. బెంగాలులోని ఒకే ఒక జిల్లాలోని ముస్లిం జనాభా (మైమెన్ సింగ్) అరేబియా దేశపు జనాభాలో సగం కంటే ఎక్కువ! నిజానికి, భారతీయ ముస్లింలు అందరూ, హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారిన వారి వారసులే. వారి రక్తాన్ని బట్టి కూడా, వారు భారతీయులే, అనుమానం లేదు కాని “మేము భారతీయులం” అని అనుభూతి చెందాలంటే, సుందరమైన భారత సంస్కృతి వారిది కూడా అని అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు, బహుశా, వారిలో చాలా మంది, బారతీయతా పరిధిలోకి తిరిగి వస్తే బాగుంటుందేమో అని అనుకుంటారు, సాటి హిందూ సోదరులతో జాతీయ జీవన విధానాన్ని పంచుకుంటూ. కాని వారి మతంలో అసహనం ఉంటుంది సహజంగా, ఎందుకంటే అది విశ్వాసాధారిత మతం కాబట్టి. ముస్లిమేతరులను వారు హీనంగా చూస్తారు. హీనమైనది ఏదైనా, చివరికి భారత జాతీయతా వాదం కూడా, వారి దృష్టిలో తిరస్కరించ తగినదే!
దానిని తమ పరిభాషలో ‘హీదెన్’ అంటారు. హీదెన్ ప్రజలతో సమైక్యంగా ఉంటడం, వారి నాగరికతా సంస్కృతులతో కలిసిపోవడం వారికి దుస్సహంగా ఉంటుంది. పైపెచ్చు, హిందూ సోదరులు వారిని తమ సమాజంలోకి తిరిగి స్వీకరించరు. కాబట్టి, ఏదో నీతి కథలోని నక్క లాగా “ద్రాక్ష పళ్లు పుల్లగా ఉన్నాయి” అనడం వారికి మంచిది. ఎందుకంటే అందుకోలేక పోయినందుకు. కాబట్టి వారికి తమను తాము అరబ్బుల పరియనుల వారసులుగా పిలుచుకోవడానికి, భారతదేశం వెలుపల ఉన్న ముస్లిందేశాలతో మమైకం ఐనట్లు భావించుకోవడానికీ, బాగనిపిస్తుంది. తర్వాత ఐనా, వారు ఐస్లాం కంటే ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వడానికి మొగ్గు చూపుతారనుకుంటే, దానికి అవకాశం చాలా తక్కువ. ఇప్పటికే మొగ్గు చూపాలనుకుటున్న వారు, తమ దైనందిన జీవితంలో తీవ్రమైన నిరాశలకు లోనయ్యే అవకాశం మరీ తక్కువ.
హిందూమతం, ఏ హైందవ తత్త్వాన్నీ ప్రతిపాదించదు. ఫలానా ఆధ్యాత్మిక మార్గం కూడా కాదు. అది ఒక సంపూర్ణమైన హిందూ సంస్కృతి, నాగరికత మాత్రమే. అది కేవలం భారత దేశపు జాతీయ మతం మాత్రమే కాదు (ఇక్కడ ‘మతం’ అంటే సంస్కృతి, నాగరికత. ఆచార వ్యవహారం కూడ). అది భారతదేశాన్ని ఒక బలమైన, వైభవోపేతమైన ప్రపంచ శక్తిగా తయారు చేయగల ఒకే ఒక మతమది. భారత జాతీయతా వాదాన్ని, స్ఫుటంగా వెలిబుచ్చగల ఒకే ఒక మతమది.
మొట్టమొదటిది, భారతీయ ధర్మం భారతదేశంలోనే పరిఢవిల్లింది. దాని లోతైన ఇతిహాసాలన్నీ భారత గడ్డతో అతి దగ్గరగా ముడిపడినవే (ముఖ్యమైన విషయం. ఆ ఇతిహాసాలన్నీ, మేధావులు కాని వారికి కూడా వర్తిస్తాయి. వారిని సైతం పరిగణిస్తాయి. ఆ లెక్కన, మేధావులు ఎంత మంది ఉంటారు?) భారతీయ ధర్మంలోని దేవతలు, దేవుళ్లు, తాత్త్వికంగా ప్రపంచశక్తులు. కాని నిజానికి వారంతా, సామాజికంగా భారతీయులు. చాలా మంది భారతీయులకు తెలియదు, ఒక జాతి మొత్తంగా, వారి దేవతలు దేవుళ్లకు ఆనుషంగికంగా ఉండటమనేది ఎంత ప్రయోజనకరమైన విషయమో!
తమ దేశాన్ని ప్రేమించే వారందరికీ అది పవిత్రమైనదే. కాని భారతదేశం మాత్రం భగవానుని లీలాక్షేత్రం. ఎందరో దేవతలు, దేవుళ్లు, ఋషులు, దైవాంశ సంభూతులు కొలువు తీరి ఉంటారు. వారిని గురించి మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పబడింది. చిన్న పిల్లలకు కూడ వారి పేర్లు, మహిమలు, అద్భుతమైన వారి కథలు తెలుసు. భారతీయ దేవాలయాల్లో, మందిరాల్లో, ఇళ్లల్లో, వారికి అగరొత్తులు వెలిగించి, పువ్వులు అర్పించి, పూజలు చేస్తారు. భారతదేశపు పవిత్రతకు ఇది ఒక మతపరమైన మంజూరు. ఒక భారతీయుడికి (అతడు హిందువైతే) అతని దేశం పట్ల ఉన్న ప్రేమ, సాధారణ దేశభక్తి కాదు. ఒక ఇంగ్లీషు వాడి, ఫ్రెంచి వాడి దేశ భక్తితో దానిని పోల్చలేం. అది దైవభూమి అయిన తన దేశం పట్ల గల అపార గౌరవం.
ఒక ఇంగ్లీషువాడు తన దేశాన్ని తప్పకుండా ప్రేమించవచ్చు. కానీ అతడు ఒక క్రైస్తవుడయితే, తన ప్రభువు జన్మించి, బోధించి, మరణించిన పాలస్తీనా, ఇంగ్లాండు కంటే పవిత్రమైందని భావిస్తాడు. ఒక మతపరమైన యాత్రకు అతడు వెళితే అది ఇంగ్లాడు వెలుపలనున్న జెరుసలేముకే. ఇంగ్లాండులోని ఏ ప్రదేశానికి కాదు. అదే ఫ్రెంచి దేశీయునికి, ఏ ఇతర ఆధునిక ఐరోపా జాతీయునికైనా వర్తిస్తుంది. ఒక గ్రీకు జాతీయునికి, అతనికి కావలసిన పవిత్ర స్థలాలన్నీ గ్రీసులోనే ఉన్నట్లే, ఒక ఆధునిక హిందువుకు కూడా, అతని మాతృభూమి పరిధిలోనే అన్న పవిత్ర స్థాలాలూ ఉంటాయి. అతడు వారణాశికి వెళ్లినా, మధురకు వెళ్లినా, గంగోత్రికి వెళ్లినా, రామేశ్వరానికి వెళ్లినా అతను తన దేశంలోనే, తన మాతృభూమితో టచ్‌లో ఉంటాడు. అదే ఒక భారతీయ ముస్లిం అయితే, భూమి పైనున్న అత్యంత పవిత్ర స్థలాల కోసం, విదేశాలలో వెతకాల్సిందే. అలాగే ఇండియన్ క్రిస్టియన్ కూడా. ఒక హిందువు తన దేశాన్ని అత్యంత ప్రియమైనదిగా, అత్యంత సుందరమైనదిగా గౌరవించడం అనే ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటాడు. ఈ భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైనదిగా తన దేశాన్ని భావిస్తాడు.
రెండోది, కేవలం హిందూమతం ద్వారానే ఎవరైనా, ఒక ప్రాంతంగా, ఒక నాగరికతగా, భారతదేశపు ఐక్యతను తెలుసుకోగలుగుతారు.
ఎన్నో విభిన్న ప్రాంతాలు. ఒక్కొకటి ఎంత పెద్దవంటే, ఒక్కో ప్రత్యేక దేశమంత. ఎన్నో విభిన్న భాషలు, ప్రతి దానికీ దాని సొంత క్రమపరిణామం, సాహిత్యం, గొప్పదనం. ఎన్నో విభిన్న దృశ్యాలు, వాతావరణాలు, భూమధ్య రేఖావృతాలు, దృవసంబంధితాలు. కాని, విస్తృతార్థంలో, ఒకే రకమైన సమాజం, ఉమ్మడి నాగరికత, పండుగలు, పబ్బాలు, పవిత్రమైన భాషలు, యాత్రా స్థలాలు అన్నీ గొప్ప భారతదేశ పరిధిలో!
ఎంతో మంది అన్నారు. భారతీయులకు జాతీయవాదాన్ని బోధించింది ఐరోపా వారని. పరోక్షంగా వారన్నదేమంటే, బ్రిటిష్ వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారతీయులు చేసిన పోరాటానికి ముందు, ఇండియా తనను తాను ఒక జాతిగా, దేశంగా భావించలేదని. హిందూ చరిత్ర, ఇతిహాసాలను నిశితంగా గమనిస్తే, దీన్ని నమ్మడం కుదరదు. విదేశీయులు భారతగడ్డమీద నిలదొక్కుకోడానికి శతాబ్దాలకు ముందే, భారతదేశపు ఐక్యత కొన్ని చిహ్నాల ద్వారా ఆవిష్కరించబడింది. సతీదేవి, పరమేశ్వరుని భార్య. ఆమె మరణానంతరం, ఆమె శరీరం యాభై ఒక్క శకలాలుగా విభజించబడి యాభై ఒక్క వివిధ స్థలాల్లో నిక్షేపించబడినాయి. భారత ఉపఖండమంతటా, వాటిని ‘తీర్థస్థానాలు’గా పూజిస్తారు. ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది. ఒకటి పెషావర్ దగ్గర, మరొకటి కామాఖ్యాలో, భారత తూర్పు సరిహద్దుకు మరీ దూరంగా కాకుండా, మరొకటి బెనారెస్‌లో, ఇంకొకటి పూర్తి దక్షిణ ప్రాంతంలో, మిగతావి, అక్కడక్కడా, యాభై శకలాలు. కాని ఏకశరీరం. ఒకే దేవత పేరిట యాభై ఒక్క తీర్థస్థానాలు! ఒకే దేశ భూభాగంలో వ్యాపించి. సతీదేవి ఇతిహాసం గురించి వివిధ వివరణలను పరిశీలిస్తే, సతీదేవే భారతదేశమని తెలుస్తుంది. భారతదేశానికి ఒక మానవ రూపాన్నిస్తే, అది సతీదేవే! భారతభూమి, ఈ చివర నుంచి ఆ చివర వరకు పవిత్రమైందే. తన వైవిధ్యంతో, ఒక గొప్ప దేవత యొక్క ఏకశరీరమే!
భారత ఐక్యత అనేది ఈ భావచైతన్యం తప్ప మరొకటి కాదు. భారత జాతీయతా వాదమంటే సతీదేవి పట్ల అచంచల భక్తి. అందుకే, హిందువులు కాని వారు, దానిలో భాగం పంచుకోలేరు. ఎవరు దానితో మమేకం అవుతారో వారే హిందువులు.
చివరిదే కాని చిన్నది కాని విషయం ఏమిటంటే, హిందువులు యొక్క భారతదేశ భక్తికి ఆధార భూతమైన మతం హిందూమతం తప్ప మరొకటి కాదు. భారతీయుని హృదయంలో జాతీయ వాదాన్ని రగిలించగల శక్తి హిందు మతానికి తప్ప ఇతర ఏ మతానికీ లేదు. ప్రస్తుతం భారతదేశానికి ఒక బలమైన జాతీయ చైతన్యం, జాతీయ గర్వం అవసరమై ఉన్నాయి. భారతదేశమంతటా, ఒక తెలివైన, వివేకవంతమైన హిందూమతాన్ని, పునరుద్ధరించి, దానిని ఉన్నతీకరించడమే కావలిసింది.
ఐరోపాలోని క్రైస్తవ దేశాలు కూడ దేశభక్తి పూరిత ఉత్తేజం కలిగినవే, అందులో సందేహం లేదు. వారిలో లోపించింది యుద్ధ స్ఫూర్తి కాదు అనే దాంట్లో కూడా సందేహం లేదు. కాని వారు క్రైస్తవులు.
కాని, తత్వతః, వారు క్రిస్టియన్ కాదు. క్రైస్తవమతం అనేది వ్యక్తులనుద్ధరించే ఒక విశ్వాసం మాత్రమే తప్ప, ఒక దేశాన్ని జాతిని నిర్మించగల నాగరికత కాదు. చారిత్రక పరిస్థితుల మధ్యన, కేవలం ఒక నిజమైన క్రిస్టియన్ సిద్ధాంతం ప్రాతిపదికన నిర్మించబడిన ఏ దేశమూ ఎక్కువ కాలం మనలేదు. అది క్రైస్తవ మత వ్యవస్థలతో కలసి పని చేసినప్పుడు మాత్రమే సాధ్యం. అదే ప్రపంచ వ్యవస్థలు. క్రైస్తవ మతంతో ఇది సాధ్యం కాదు. అది కేవలం ఆధ్యాత్మికం. దానితో మాత్రమే క్రైస్తవ దేశాలు పరిఢవిల్ల లేదు. వాటి పూర్తి చరిత్ర క్రైస్తవ మత స్ఫూర్తికి పూర్తి వైరుధ్యంగా ఉంటుంది.
క్రైస్తవ మతమే కాదు, ‘విశ్వాసం’ ప్రాతిపదికగల ఏ మతమైనా, అందరికీ ‘సత్యస్వరూపం’ కాలేదు, జాతీయతా భావానికి విరుద్ధంగా.
గ్రీకులు క్రైస్తవులే, ఆ లెక్కన బల్గేరియన్లు కూడా వారంతా ఒకే చర్చికి చెందిన వారే. క్రైస్తవులు ఒకరి నొకరు ప్రేమించుకోవాలని కదా అనుకుంటాం. కాని రెండు దేశాల మధ్యా యుద్ధం వచ్చిందనుకోండి, గ్రీసు దేశంలోని క్రైస్తవ పూజారులు గ్రీకు ఆయుధాలకు పూజలు చేసి దీవిస్తారు. అవి బల్గేరియన్లకు మరణాన్ని కలిగించేవే. అట్లే, బల్గేరియన్ క్రైస్తవ పూజారులు కూడా. అట్లే ఫ్రెంచివారు, జర్మనీ వారు కూడ క్రైస్తవులే. వారి మధ్యా యుద్ధం ఏర్పడినా, విజయం కోసం, ప్రేమ దేవుడైన క్రీస్తునే ప్రార్థిస్తారు. ఇంత కంటే అసంబద్ధత ఉండదు. వాళ్లు అలా ఉండకపోయి ఉంటే, అంతకంటే సహజమైనది ఉండదు. కాని క్రైస్తవ మతమే సహజమైనది కాదు! ఐరోపా అభివృద్ధిలో, విభిన్న మతనాగరికతలు నేపథ్యంలో ఉంటాయి. అంతే గాని, అది క్రైస్తవ మతం ప్రకారం జరగలేదు. పైగా దానికతీతంగా ఆ అభివృద్ధి జరిగింది.
ఒక క్రైస్తవుడున్నాడనుకుందాం. తన దేశంలోని నాస్తికునికి దగ్గరగా అతను ఉండాలని భావిస్తే, ఇతర దేశంలోని క్రైస్తవుని కంటే కూడ దగ్గరగా, అప్పుడతడు నిజమైన క్రైస్తవుడు కాదు. విశ్వాసాధారిత మతాన్ని అవలంభించే వాడు ఎవరైనా, ఒక జాతీయతావాదిగా ఉండడమనేది పూర్తిగా పొసగని విషయం. ఇద్దరు యజమానులను అంటే, విశ్వాసాన్ని, జాతీయవాదాన్ని, ఒకేసారి సేవించలేం! దేవుడు ముందా, దేశం ముందా అనేది అతడు తేల్చుకోలేడు. అతని మతం అతనికి దేవుడని దేశాన్ని కలిపి చూడడం బోధిస్తే తప్ప. అది క్రైస్తవంలో, ఇస్లాంలో బోధించబడదు. హిందూ మతంలోనే బోధించబడుతుంది. కాబట్టి చెప్పడం ఏమంటే భారతదేశంలో పరిఢవిల్లన ఒకే ఒక మతం హైందవమతం. భారత ఐక్యతకు, వైవిధ్యానికి అది ఒక సజీవ ఉదాహరణనివ్వగలదు. దాని దృక్పథాన్ని బట్టి తనను అనుసరించే వారికి, దేశానికి అది ఒక నిరంతరం మన్నే జాతీయవాదానికి పునాదినివ్వగలదు, దాని మతస్ఫూర్తికి పూర్తి సమైక్యతతో, సహజీవనంతో!
ఒక ఆధ్యాత్మిక చింతన గల హిందువుకు, భగవంతుడు (ఒక వేళ ఉంటే) చరాచరమైన, దృశ్యమానమైన ప్రకృతి, వేరు కాదు. దృశ్యమానం అనేది అదృశ్యమైన దానికి, అంటే కనబడని దానికి, సంబంధించిన వ్యక్తీకరణే. కాబట్టే అన్ని మార్గాలూ చివరికి పరమాత్మనే చేరతాయి. మనం ప్రేమించే, ఆరాధించే ప్రతి దాని ద్వారా, నిజానికి మనం భగవంతునే ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. వివిధ రూపాల ద్వారా, పేర్ల ద్వారా, చిహ్నాల ద్వారా ప్రేమించ తగిన దేవుడిని మాత్రమే!
శ్రీరామకృష్ణ పరమహంస గారి ఒక అందమైన కథ ఉంది. ఒక రోజు, ఒక నిస్సంతు విధవ ఆ మహాయోగిని దర్శించడానికి వచ్చింది. ఆమె శ్రీకృష్ణ భక్తురాలు. కృష్ణపరమాత్మను ప్రత్యక్షంగా చూడడానికి ఏం చేయాలని ఆమె శ్రీరామకృష్ణులవారిని అడిగింది. ఆయన, ‘ఈ ప్రపంచంలో నీవు అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరిని’ అని ప్రశ్నించాడు. ‘తన తమ్ముని చిన్న కొడుకు’నని ఆమె బదులిచ్చింది. రామకృష్ణులు ఆమెతో ఇలా అన్నారు, “తల్లీ! ఆ పిల్లవాడినే ప్రేమిస్తూ ఉండు. ఇంకా ఇంకా ప్రేమించు. అతన్ని నిరంతరం నీ కళ్ల ముందు నిలుపుకో. అతన్నే సేవించు, అతన్నే ప్రేమించు. అప్పుడు నీవు, బృందావనిలో ఆడి పాడిన ఆ పరమాత్మను చూడగలుగుతావు”. ఆమె ఆ యోగివర్యుని ఉపదేశాన్ని తల దాల్చింది. తన బుజ్జి మేనల్లుడి రూపంలో ఆ యదునాథున్ని దర్శించింది.
అలా, భారతీయుల్లో, మతం ద్వారా, అన్ని మౌలికమైన సహజమైన భావాలన్నీ విస్తరించబడి, ఉన్నతీకరించబడి, పవిత్రీకరించబడతాయి. ఒక స్త్రీ, తన భర్త పట్ల చూపే ప్రేమ, ఆయనకు చేసే పరిచర్య, భగవంతునికే చెందుతాయి. ఆమెకు తన భర్తే ప్రత్యక్షమైన, నిర్దుష్టమైన దైవం. మన తల్లి పట్ల మన ప్రేమ, సేవలే విశ్వమంతకు మనం అర్పించే ప్రేమ, సేవలు! ప్రతి తల్లీ, కాళీమాత ప్రతిరూపమే.
అలాంటప్పుడు, భారతీయులకు, తన తల్లికే భరతమాతగా, దట్టమైన నీలిరంగులో ఉన్న కాళికామాతకు మరింత విస్తృతమైన, శాశ్వతమైన ప్రతిరూపంగా భావించడం కంటే సహాజ భావన ఏముంటుంది? భారతదేశాన్ని ప్రేమించడం, సేవించడం అనే భావన, గుళ్లలో దేవతలను ప్రేమించడమే, పూజించడమే అనే దాని కంటే సహజమైనది ఏముంటుంది? బెనారెస్ నగరంలో భరతమాతకు మందిరాలను నెలకొల్పి, భారతదేశపటం ముందు అగరువత్తులు వెలిగించడం కంటే సహజమైన, అపురూపమైన భావన ఏముంటుంది?
దీపావళి రోజున పంజాబు ప్రాంతంలోని జలంధర్ పట్టణంలోని ‘ఆర్యకన్యామహావిద్యాలయ’ కు చెందిన బాలికలు, తమ స్కూలు ముందున్న ఆటస్థలంలో ఒక పెద్ద భారతదేశపటాన్ని గీచి, దాని అంచుల వెంబడి ఒక వరసలో దీపాలు వెలిగించి, దాని చుట్టూ నిలబడి ‘వందేమాతరం’, ఇంకా అటువంటి ఇంతర దేశభక్తి గీతాలను ఆలపిస్తారు. వారిది సరైన చర్య, జాతీయ మత స్ఫూర్తికి అనుషంగికమైనది. దానిని పరిపుష్టం చేసేది. భారతీయ ధర్మం తప్ప, భారతదేశంలో, అత్యంత సుందరమైన భక్తి పూర్వక జాతీయతావాదాన్ని ముందుకు తీసుకెళ్లగల ధర్మం ఏముంది? అదే ‘ఆనందమఠం’ యొక్క స్ఫూర్తిని మరింతగా రగిలించగల పునరుజ్జీవన. భారతదేశానికి తనను తాను ఒక మహోన్నత, స్వేచ్ఛాయుత జాతిగా, మళ్లీ పునరుద్ధరించుకోవడానికి మూల సూత్రం కూడా అదే!
(ఇంకా ఉంది)