భగవంతుని సంపూర్ణ తత్వం

0
10

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని సంపూర్ణ తత్వం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్రీ భగవానువాచ:

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు॥
(భగవద్గీత సప్తమాధ్యాయము, ప్రథమ శ్లోకం)

[dropcap]శ్రీ[/dropcap] భగవానుడు పై శ్లోకంలో “ఓ పార్థా! అనన్య భక్తితో నా యందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై, అనన్య భావముతో మత్పరాయణుడవై, సంపూర్ణ విభూతి బల – ఐశ్వర్యాదిగుణ యుక్తుడవై, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను ఐన నన్ను నిస్సందేహముగా తెలిసికొనగలవో ఆ విధానమును తెలుసుకో” అని పలికాడు.

భగవంతుని తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ‘శ్రీమద్భగవద్గీత’ మనకు ఎనలేని ఉపకారం చేస్తోందన్నది విస్పష్టం. మన సమాజంలో కోటానుకోట్ల సంవత్సరాలుగా ఇది వ్యాప్తిలో ఉండటం విశేషం. ‘భగవత్తత్వం’ అంటే భగవంతుని గురించిన సంపూర్ణ సత్యజ్ఞానం. భగవంతుడు సర్వజ్ఞుడు, సంపూర్ణుడు. అతనిని గురించి మనంతట మనమే తెలుసుకునే అవకాశం లేదు. నిజానికి రోజుకు 24 గంటలు కఠోర సాధన చేసినా కూడా లక్ష్యం చేరుకోవడం అసాధ్యం. కాబట్టి స్వయంగా భగవంతుడే తన గురించి ప్రపంచానికి చాటిచెప్పాడు.

భగవంతుడనే పదానికి అర్థం ఐశ్వర్యం, శక్తి, యశస్సు, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం అనే వాటిని సంపూర్ణంగా కలిగినవాడిని సూచిస్తుందని స్వయంగా వేదాలే తెలియజేస్తున్నాయి. సాధకులు తమకు తోచిన విధంగా భగవంతుని గురించి ఊహించుకుంటున్నారే గానీ భగవంతుని నుంచే నేరుగా వినడానికి ప్రయత్నించడం లేదు. ఈ కలియుగంలో అది దాదాపుగా అసాధ్యం కూడా. కాబట్టి దివ్యమైన భగవద్గీత ద్వారా మనిషి భగవత్తత్వాన్ని ప్రామాణికంగా అర్థం చేసుకోగలిగే అవకాశం మనకు కలిగిందని పై శ్లోకం భావం.

భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మొదట పవిత్రమైన చిత్తంతో, కల్మషం లేని మనస్సుతో సర్వశ్య శరణాగతి చేస్తూ అనుక్షణం ఆయన పాదాల యందు మనస్సు నిలపాలి. ఆయన యొక్క దివ్యమైన, పవిత్రమైన నామం సదా మన జిహ్వపై దోర్లుతూ వుండాలి. మన జీవితమనే ఓడకు భగవంతుడినే సరంగుగా చేసుకోవడం అత్యావశ్యకం. నిరాకార బ్రహ్మానుభూతి లేక పరామాత్మానుభూతి అసంపూర్ణంగా వున్న సందర్భంలో భగవద్ జ్ఞానం అవగతం అవడం అసంభవం. భగవంతుడిని శరణు వేడేందుకు భాగవతం మనకు నవ విధ భక్తి మార్గాలను బోధిస్తుంది. ఇందులో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకొని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే భగవంతుడిని చేరగలగడం సాధ్యమవుతుంది. భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి భాగవతుల సేవ కూడా ముఖ్యమే అని భాగవతం బోధిస్తోంది. భాగవతుల సేవను భగవంతుడు మెచ్చుతాడు. త్రిలోక సంచారి నారదుడు కూడా భాగవతుల సేవ చేసి నారాయణ మంత్రాన్ని పొంది నిత్యమూ నారాయణ జపంతో త్రిలోకాలు తిరిగే శక్తిని సంపాదించుకున్నాడు. భగవంతుడిని చూడాలన్నా, లేక ఆయన గురించి తెలుసుకోవాలన్నా ముందుగా సమత్వబుద్ధిని, విశాల భావాన్ని పెంపొందించుకోవాలి. భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోవాలి. సర్వం పరాత్పరుని రూపంగా భావించాలి. అపుడు భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. అదే సంపూర్ణ అద్వైత స్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here