[శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి రచించిన ‘భగిని’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]భ[/dropcap]గిని హస్త భోజనానికి
సోదరుడు ఉవ్విళ్ళూరాడు.
ఎడతెగని పనికి
విరామము నిచ్చాడు.
కడ లేని మమతను
కను కొలనుల్లో నింపాడు. .
వసివాడని జన్మ బంధాలకు
విరివిగ సంప్రదాయం
ఏడుగడగ నిలిచినందుకు
నడవడికల ఆచరణకు
సడలని ఆత్మీయతలను
పాదుకొలిపాడు.
కార్తీక విదియ రోజున
తోడ బుట్టువు వండి పెట్టిన
రుచులకు
కొసరి వడ్డించిన ఆప్యాయతలకు
అన్నయ్య అన్నిటా అజేయుడయ్యాడు.
అభిరుచులనన్నింటిని తెలిసిన సహోదరి
సరసన కూచుని తినిపించిన స్వాదు రసాస్వాదనలకు,
మహా యమ సంతసాన
సత్యబల సంపదను సంగ్రహించాడు.
కౌముది విరిసిన వేళ,
వెన్నెల మాసంలో
కార్తీక దామోదరుడు
వన భోజనాల విందు చేసినట్లు,
అమృతమయమైన భావనల తేజరిల్లాడు.
స్వయమున సంతసాల పందిరిలో ఏకోదరి,
భాతృ విదియ సంబరాలను చేసింది.
తమ్ముడున్న విదేశానికి
శ్రావణంలో రాఖీని మణికట్టుగ పంపించింది,
చేతి ఫలహారాలనిప్పుడు తీపి సంచులలో
కట్టి ఎగరేసింది.
వీరు అన్నా చెళ్లెళ్ళు
అక్కా తమ్ముళ్ళు,
సంఘటిత చేతనా మూర్తులు.
క్షేమాన్ని కోరుకుంటారు.
శ్రేయస్సును అభిలషిస్తారు.
తిలకాన్ని దీర్ఘాయువుకు దిద్దుతుంటారు.
చందమామకు హారతులిస్తారు
సౌహార్ద్ర భావాలకు
ప్రతి ఇంటి ఆలయ గోపురాన
ఆకాశ దీపాలను వెలిగిస్తారు.
ఆత్మజ్యోతి వెలిగింది కనుక
వీధి వీధుల చీకట్లు తొలగినట్లు భావిస్తారు.
Image Source: Internet