భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 1

1
6

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా” వ్యాస పరంపరలో ఇది మొదటిది. ఇందులో జిల్లా చరిత్ర, జిల్లాలోని వివిధ పరిశ్రమల గురించి ప్రస్తావిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. వచ్చే వారం నుంచి జిల్లా లోని వివిధ ఆలయాల గురించి వివరిస్తారు. [/box]

జిల్లా పరిచయం

[dropcap]జి[/dropcap]ల్లా పరిచయం కన్నా ముందు ప్రస్తుత పరిస్ధితుల పరిచయం చేస్తాను. ఇవాళ 2020 సంవత్సరం మే నెల 12వ తారీకు. ఈ కరోనా ప్రారంభమయి నిన్నటికో మొన్నటికో 100 రోజులయిందని టీవీలో చెప్పారు. అమ్మో.. 100 రోజులనుంచీ నేను ఇంట్లో కూర్చున్నానా!? ఆశ్చర్యం!!

కరోనా.. కరోనా.. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ చూసినా దీని విలయ తాండవమే. ఎవరూ యుధ్ధాలు చెయ్యటం లేదు.. ఎవరూ బాంబులు వెయ్యటం లేదు.. అయినా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది ఈ చిన్ని క్రిమి. అది కూడా ఎంత తెలివిమీరిందో చూడండి. దగ్గూ, జలుబూ ద్వారా వస్తే మనమంతా ముక్కుకీ, నోటికీ గుడ్డలు కట్టుకుని మరీ తిరుగుతామని తెలుసు. అందుకే కరోనా వచ్చినవారినే కాదు, వారు తాకిన వస్తువూ, చోటూ ఏదైనా తాకినా వస్తుంది. బయటకి వెళ్తే ఎవరెక్కడ తాకి వెళ్ళారో మనకేం తెలుస్తుంది. పూర్వం మడి కట్టుకున్నవారు తాము వెళ్ళే దోవలో నీళ్ళు జల్లుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాగే మనం ఇప్పుడు సేనిటైజర్ జల్లుకుంటూ వెళ్ళాలేమో. అయినా గ్రామానికీ, గ్రామానికీ అడ్డుకట్టలు కట్టేస్తుంటే (నిఝంగా నిజం… వాళ్ళ గ్రామంలోకి కరోనా సోకిన వారు రాకూడదని కొన్ని గ్రామాలవారు కంచెలేసి కాపలా కూడా వున్నారు.. ఒక చోటయితే ఏకంగా రోడ్డుకడ్డంగా గోడే కట్టేశారు… తర్వాత తీసేశారనుకోండి) సేనిటైజర్ టేంకు పెట్టుకెళ్ళినా మనల్ని వెళ్ళనివ్వరుగాక వెళ్ళనివ్వరు. మహా అయితే ఆ సేనిటైజర్ టేంకు లాక్కుని, పోయి రామ్మా అంటారు. ఇంతకీ, వేరే గ్రహాల మీదకెళ్తున్న మన విజ్ఞానం ఈ సూక్ష్మ క్రిమిని అరికట్టలేక పోయింది. ప్రకృతి ముందు మానవుడి కుప్పిగంతులా!!

ఈ కరోనా ఎప్పుడు అంతమవుతుందో, మళ్ళీ ఎప్పుడు అనుకున్నప్పుడల్లా హాయిగా ఏదో ఒకటి ఎక్కేసి అనుకున్న చోటికి చెక్కేస్తామో తెలియటంలేదు. తిరిగే కాలు వూరుకోదు కదా! నా బాధ సర్కారువారికి విన్నవించుకున్నా ఏమీ చెయ్యలేరు గనుక ఆ కరోనాకే విన్నవించుకుంటున్నా.. అమ్మా కరోనా.. ఇంతకీ అమ్మనా? అయ్యనా?.. రెండూ అయ్యుంటాయిలే.. చెయ్యిపడితేనే తెగ పెరిగిపోతోందికదా కుటుంబం.. మీ కుటుంబ సభ్యులంతా తొందరగా ఉపసంహరించుకుని, మాలాంటివారిని కనికరించి, కావాలంటే మీ రూపు మంచిగా మార్చుకుని అందరికీ మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రపంచ ప్రజలం యావత్తూ కోరుకుంటున్నాము గనుక ఇంక మీరు నిష్క్రమించండి.

సరే మన ప్రార్ధన మన్నించి కరోనా నిష్క్రమిస్తుందని ఆశిద్దాం. ఈ లోపల నేను ఇది వరకు చేసిన యాత్రల గురించి చెబుతాను. మీరూ మానసికంగా విహరించేయండి ఆ ప్రదేశాలలో. ఇప్పటిదాకా యాత్రా దీపికలు 9 అచ్చయినాయా. తర్వాత రెండు.. గుంటూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా సంచికవారి సౌజన్యంతో సంచికలో ప్రచురించబడ్డాయి. యాత్రా వ్యాసాలు మొదలు పెట్టినప్పుడు అన్ని జిల్లాలలోని దేవాలయాల గురించీ రాయాలనుకున్నా. ఆ అభిలాషతోనే ప్రస్తుతం అనంతపురం జిల్లా మొదలు పెడుతున్నా. జిల్లా అంటూ రాసినా, అనేక కారణాలవల్ల జిల్లాలో మేము చూడనివి కూడా వుంటాయి. వాటి గురించి తెలిసినవారు నాకు వివరాలు తెలియజేస్తే, కరోనా కటాక్షిస్తే దర్శించటానికి, తర్వాత వాటి గురించి రాయటానికి ప్రయత్నిస్తాను.

ఇంక అనంతపురం జిల్లా గురించి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా. 1882లో దీనిని బళ్ళారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు.

అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి ఈ పేరు కర్ణాటకలో వడియార్ వంశానికి చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద వచ్చింది. దానికి పూర్వ కాలంలోనే విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలలోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది.

మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు క్రీ.పూ.258 ప్రాంతంలో పాలించినట్టు తెలుస్తోంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.

పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. హోయసాలులు, యాదవులు మొదలగు వారు తరువాత శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.

తర్వాత 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఉంది.

1677 లో అనంతపురం జిల్లా మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేదని తెలుసుగదా.

ఈ జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున వైఎస్ ఆర్ కడప జిల్లా, ఆగ్నేయంలో చిత్తూరు జిల్లా, నైఋతిన కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తరాన మధ్యభాగంలో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగం ఎత్తైన కొండలమయం. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, స్వర్ణముఖి, తడకలూరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. వర్షపాతం తక్కువ. రాజస్ధాన్ లోని జైసల్మేరు తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.

ఈ నగరం కూడా రెండవ ప్రపంచ యుధ్ధంలో బ్రిటిష్ భారత సైన్యం వ్యూహాత్మక ప్రాముఖ్యతలో స్థానం సంపాదించుకుంది. అందుకే చారిత్రక ప్రాముఖ్యతతో పాటుగా ఈ ప్రాంతం చుట్టూ అనేక కోటలు ఉన్నాయి. ఇప్పుడు పర్యాటక ఆకర్షణ కేంద్రంగా కూడా మారింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరం వద్ద ఉత్పత్తి చేసే నాణ్యత గల చేనేత పట్టు వస్త్రాలు, చీరలకి జిల్లా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అనంతపురం నగరం పత్తి, పట్టు పరిశ్రమలు, తోలుబొమ్మలకు ప్రసిద్ధి చెందింది.

యాడికి గత దశాబ్దకాలంగా ధర్మవరం తరువాత అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది

తాడిపత్రిలో గ్రానైటుని శుధ్ధి చేసే పరిశ్రమ వుంది. జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.

దక్షిణ భారత దేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ సప్తగిరి కేంఫర్ ఇక్కడ వుంది.

ఈ జిల్లాలో అనేక ప్రాచీన ఆలయాలు వున్నాయి. ఈ జిల్లాలో మా పర్యటన చాలా కాలం క్రితం రెండు సార్లు మా శ్రీవారు వెంకటేశ్వర్లుగారితో వెళ్ళాను. తర్వాత 2015లో మా స్నేహితురాలు శ్రీమతి బొండాడ ఉమామహేశ్వరితో వెళ్ళాను. ఆ ఆలయాల గురించి వచ్చే వారంనుంచీ వివరిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here