భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 14

0
5

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 14” వ్యాసంలో కదిరి లోని ‘శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కదిరి:

[dropcap]పొ[/dropcap]ద్దున్న నుంచీ తిరుగుడే అయింది కదా. హిందూపురం నుంచి గోరంట్ల, మేరేడుపల్లి, తిమ్మమ్మ మర్రిమాను, వేమన సమాధి, ఖాద్రి కొండ చూసుకుంటూ ఆ రోజుకి చివరి మజిలీ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చేరాము. చాలా అలసిపోయినా మొట్టమొదటిసారిగా స్వామిని చూడబోతున్నాం అనే సంతోషంతో, గుడిలోనే బస దొరకటంతో దర్శనం కాగానే వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చనే రిలీఫ్‌తో దర్శనానికి వెళ్ళాము.

అహోబిలం కొండమీద వెలసిన నవ నారసింహ రూపాలకు ప్రతీకలుగా శ్రీ నరసింహస్వామి వెలసిన తొమ్మిది క్షేత్రాలను నవనారసింహ క్షేత్రాలు అంటారు. వాటిలో కదిరి ఒకటి. కదిరిలో శ్రీ నరసింహస్వామికి రెండు ఆలయాలు వున్నాయి. ఖాద్రి కొండ గురించి కిందటి వారం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు అర్చా మూర్తి కొలువైన ముఖ్య ఆలయం, కదిరిలో వున్నదానిని దర్శిస్తున్నాము.

ఇక్కడ భృగు మహర్షికి మహావిష్ణువు మూడు అర్చామూర్తులు ఇచ్చారని, అవే ఇక్కడి ఉత్సవ మూర్తులనీ భక్తుల నమ్మకం. ఈ మూర్తులే నరహరి, వసంత మాధవుడు, వసంత వల్లభుడు.

కదిరి చారిత్రకంగా కూడా ప్రసిధ్ధి చెందిన స్ధలం. ఇక్కడా చాలా శాసనాలు లభించాయి. క్రీ.శ. పదవ శతాబ్దంలో చాళుక్యులు దుర్గాదేవిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయమే తర్వాత అమృతవల్లీ తాయారు మందిరంగా చేసారంటారు. హరిహరరాయల కాలంలోనే బ్రహ్మోత్సవం జరిగిన మరునాడు హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించినట్లు శాసనాధారాలున్నాయి.

ఆలయ నిర్మాణం:

పూర్వం ఈ ప్రాంత నివాసి అయిన రంగనాయకుడు అనే వ్యక్తికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి పుట్టలో వున్న విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పటంతో ఆయన స్వామి ఆజ్ఞ ప్రకారం ఖాద్రి (చండ్ర) వృక్షం కింద వున్న పుట్టలోంచి స్వామి విగ్రహం తీసి ప్రతిష్ఠించి, చిన్న ఆలయం నిర్మించి పూజలు చేశారు. తర్వాత క్రీ.శ. 1274లో శ్రీ వీర బుక్కరాయల కాలంలో ఆలయ నిర్మాణ పూర్తయినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది.

2.75 ఎకరాల స్ధలంలో నిర్మింపబడిన ఈ ఆలయం చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడలు, నాలుగు వైపులా గోపురాలతో అలరారుతున్నది. ఆలయం చుట్టూ శ్రీ రామచంద్రులవారిదీ, శ్రీ గోవిందరాజస్వామి ఉపాలయాలు, అన్న సత్రాలతోపాటు భక్తులకు వుండటానికి గదులు కూడా వున్నాయి.

  

విశాల ప్రదేశం మధ్యలో నిర్మింపబడిన ఆలయం గర్భగృహం, అంతరాలయం, రంగ మండపం అని మూడు భాగాలుగా వున్నది. ఇక్కడ స్వామి లక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా దర్శనమిస్తారు. స్వామి సన్నిధిలో ప్రహ్లాదుడిని కూడా చూడవచ్చు. అంతరాలయానికి ముందున్న స్తంభాలలో మొదటి దానిపై వున్న సంతాన గోపాలస్వామిని సేవిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. స్వామి గర్భగుడి పక్కన వున్న ఉపాలయంలో అమ్మవారు అమృతవల్లీ తాయారు కొలువుతీరారు. ఇది పూర్వం దుర్గాలయమంటారు. అమ్మవారి ఆలయం స్తంభాలపై అద్భుమైన శిల్పకళ చూడవచ్చు.

ఈ అలయంలో రంగ మండపంపై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది.

విశేషాలు:

స్వామి మూల విరాట్ కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత స్వామి మూల విరాట్‌ని తుడిచిన తర్వాత విగ్రహం మీద స్వేద బిందువులు కనబడతాయి. ఇది స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు.

పూర్వం ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ మహర్షి కోరికమేరకు స్వామి స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను అందించారని కథనం. వీటిని స్వామి వసంత ఋతువులో ప్రసాదించటంవలన ఆయనకి వసంత వల్లభుడనే పేరు వచ్చింది. 15 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామి వివిధ అవతారాలలో భక్తులకి కనువిందు చేస్తారు.

ఉత్సవాలు:

ప్రతి సంవత్సరమూ సంక్రాంత్రి వేడుకల తర్వాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సంక్రాంత్రి సమయంలో పశువుల పండగ రోజు శ్రీ దేవి, భూదేవులతో కలిసి వసంత వల్లభులు కదిరి కొండకు పారువేట నిమిత్తం వస్తారని నమ్మకం. పారు వేట తర్వాత స్వామిని పుర వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు ఈ ఉత్సవం జరుగుతుంది.

బ్రహ్మోత్సవంలో భాగంగా ఏడో రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుకుంటారు. ఆ రోజు భక్తులు ఉపవాసం వుంటారు.

ఏటా వైశాఖ శుధ్ధ చతుర్దశినాడు నృసింహ జయంతి, వైశాఖ శుధ్ధ పౌర్ణమినాడు మల్లెపూల తిరునాళ , ఆషాఢ శుధ్ధ పొర్ణమి చింత పూల తిరుణాల, శ్రావణ బహుళ నవమి ఉట్ల తిరుణాల, దసరా, వైకుంఠ ఏకాదశి వగైరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

ప్రతి రోజు వైఖానస ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి.

పెద్ద రథం:

బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామికి రథోత్సవం చేస్తారు. ఆ రోజు బ్రహ్మ రథంపై దర్శనమిచ్చే స్వామిని దర్శించటానికి లక్షలాదిమంది భక్తులు విచ్చేస్తారు. ఈ రథం బరువు 540 టన్నులు, ఎత్తు 37.5 అడుగులు వుంటుంది. రథంలో పీఠం వెడల్పు 16 అడుగులు. 130ఏళ్ళ క్రితం తయారు చేయబడిన ఈ రథం చాలా పెద్దది.

ఈ రథోత్సవంలో భక్తులు స్వామి మీద మిరియాలు, పండ్లు, దవనం చల్లుతుంటారు. కింద పడిన వీటిని ఏరుకు తింటే సర్వ రోగాలూ నయమవుతాయని భక్తుల నమ్మకం.

మార్గము:

అనంతపురానికి 90 కి.మీ.లు, పుట్టపర్తికి 40 కి.మీ.ల దూరంలో వున్న ఈ ఊరుకు బస్సు, రైలు, సౌకర్యం వున్నది.

సమీప దర్శనీయ ప్రదేశాలు:

ఖాద్రి కొండ:

స్వామి ఇక్కడ తన పాదాన్ని మోపారని విశ్వాసం. కదిరికి 2 కి.మీ. ల దూరంలో వున్న ఈ కొండమీద స్వామి పాదం, సప్త ఋషులు తపస్సు చేసిన ప్రదేశం వగైరాలున్నాయి. ఉత్సవం సమయంలో స్వామి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తీసుకు వచ్చి పూజలు జరిపి తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.

తిమ్మమ్మ మర్రిమాను:

కదిరికి 25 కి.మీ. ల దూరంలో వున్న తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నది. తిమ్మమ్మ అనే పతివ్రత సహగమనం చేసిన ప్రదేశంనుంచి ఉద్భవించిన ఈ మానును ఆ దేవతగానే భావించి కొలుస్తారు భక్తులు.

వేమన సమాధి:

వేమన పద్యాలు తెలియని తెలుగువారుండరుకదా. ఆ మహా యోగి సమాధి కదిరికి 12 కి.మీ. ల దూరంలో వున్న కటారుపల్లిలో వున్నది. ఈయన పరమపదించినప్పుడే సమాధి నిర్మించారు. అయితే అది చిన్న పాకలాగా వుండేది. క్రీ.శ. 1933లో దానిమీద చిన్న మందిరం, తర్వాత క్రీ.శ. 2005లో చుట్టూ బిల్డింగ్ కట్టి గోడలమీద వేమన పద్యాలు చెక్కించారు. మార్చి 29, 30, 31 తారీకులలో వేమన జయంతి ఉత్సవాలు జరుగుతాయి. వాటికి లక్షమందిదాకా వస్తారు. సమాధి దగ్గర వున్నది వేమన వంశంలో ఏడవతరంవారుట.

పై మూడు ప్రదేశాలు కదిరినుంచి 3 గం.లలో చూసి రావచ్చు. ఆటోకి రూ. 450 తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here