భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 3

0
8

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 3” వ్యాసంలో కర్ణాటక రాష్ట్రంలోని పావగడ లోని ‘శనీశ్వర ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

పావగడ

[dropcap]ఏ[/dropcap]మిటి అనంతపురం జిల్లా అంటూ బయటకెక్కడికో వెళ్ళి పోయారు. తెలిశా తెలియకా అనుకుంటున్నారు కదా. మీ అనుమానం నిజమేనండీ. పావగడ కర్ణాటక రాష్ట్రంలో వున్నది. అనంతపురం జిల్లాలోని మడకశిరనుంచీ ఇక్కడికి 17 కి.మీ.ల దూరం. అంత దగ్గరకనుకే అనంతపురం జిల్లా యాత్రలో దీనినీ కలిపేశాము. మేము కలిపి చూశాం గనుక మీకూ దాని గురించి చెప్పాలి కదా. అదీ సంగతి.

 

పావగడ ఇక్కడ వున్న శనీశ్వర ఆలయంతో ప్రసిధ్ధి చెందింది. ఇది ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో వుండటంతో తెలుగునాటనుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలో వున్న పావగడలో శనీశ్వరుడు, శీతల అమ్మవారు కొలువుతీరి వున్నారు. ఇక్కడి ఆలయం ఊరి సెంటర్లో వున్నట్లు వుంటుంది. చక్కని రంగులు వేసి ఆధునికంగా వుంటుంది.

 

చరిత్ర ప్రకారం హోయసాలులు, మొఘలులు, మైసూర్ రాజులు… ఇలా ఎందరో ఈ ఊరిని పాలించారు. 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ కరువు గట్టెక్కించమని సమీపంలో అడవిలో ఉన్న సిద్ధులు, మునుల దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు ప్రజలు. అప్పుడా సిధ్ధులు ఒక నల్లరాతిని తీసుకొని, దానిమీద శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమి పై ప్రతిష్టించారు. భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా పడ్డాయి, తద్వారా ప్రజలు బాగుపడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊరిలో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించడం మొదలుపెట్టారు. వర్షాల కోసం వరుణ యాగాలను, యజ్ఞాలను జరిపిస్తుంటారు. కొన్ని ఏళ్ల క్రితం అమ్మవారి విగ్రహం పక్కన శనీశ్వరుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ స్వామిని ప్రతిష్ఠించాక అమ్మవారి దేవాలయం కాస్తా శనీశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. పావగడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉందిట. మేము చూడలేదు.

 

ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. పెళ్లి కానివారు, సంతానం లేని వారు, వ్యాపారంలో వృద్ధి చెందాలనుకొనేవారు ఈ స్వామిని కొలుస్తారు. పెళ్లి జరగటానికి మాంగళ్య పూజ, వ్యాపారంలో వృద్ధి చెందటానికి ప్రాకార పూజ జరిపిస్తారు.

ఆలయం

సాధారణంగా శనీశ్వర ఆలయాలు చిన్నవిగా వుంటాయి. కానీ ఇది పెద్దదే. అన్ని ఆలయాల్లా కాకుండా వృత్తాకారంలో వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఎత్తైన గోపురాలు, శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా, ఆకర్షణీయంగా వుంటుందీ ఆలయం.

  

ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమవైపు గణపతి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని మొదట దర్శించాకే భక్తులు అమ్మవారిని, శనీశ్వరుణ్ణి మరియు ఇతర దేవతలను దర్శిస్తారు.

 

గణపతి దేవునికి కుడివైపున అశ్వత్థ చెట్టు మనకు దర్శనమిస్తుంది. అక్కడే అమ్మవారి మహాబీజాక్షర యంత్రం కనిపిస్తుంది. పిల్లలు లేనివారు అమ్మవారికి రంగురంగుల గాజులు సమర్పిస్తారు. శీతలాదేవిని పూజించిన భక్తులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

 

అమ్మవారి ఆలయం వెనక శనీశ్వరునికి ప్రత్యేక సన్నిధి వుంది. ఈ సన్నిధిలో నవగ్రహాల మధ్య కవచం ధరించి ఉన్న శనీశ్వరుణ్ణి గమనించవచ్చు. పూజలు, అభిషేకాలు, వ్రతాలు స్వామి వారికి జరిపిస్తారు.

ఆలయంలో ఇంకా రంగురంగుల దేవతా విగ్రహాలు పెద్దవీ, చిన్నవీ దర్శనమిస్తాయి. నవగ్రహాలు లోహంతో చేసినవి వుంటాయి. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని అవకాశం వున్నవాళ్ళు తప్పక దర్శించవచ్చు.

అక్కడినుంచీ 2-40కి బయల్దేరి మధ్యాహ్నం 3-55కి హిందూపూర్ మీదుగా విదురాశ్వధ్ధం చేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here