భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 4

0
6

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 4” వ్యాసంలో కర్ణాటక రాష్ట్రంలోని చిక్కవలం లోని ‘విదురాశ్వధ్ధం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

విదురాశ్వధ్ధం

[dropcap]క[/dropcap]ర్ణాటక రాష్ట్రంనుంచీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి, హిందూపురం మీదుగా మళ్ళీ కర్ణాటక రాష్ట్రంలోని చిక్కవలం జిల్లాలో వున్న విదురాశ్వధ్ధం చేరాము. హిందూపురంనుంచి 19 కి.మీ. లు వున్న విదురాశ్వధ్ధం చేరేసరికి సమయం సాయంకాలం 3-55.

విదురాశ్వధ్ధం అనే పేరు అక్కడ వున్న అశ్వత్థ వృక్షం, ఇంకా మహాభారతకాలంనాటి విదురుడు, ఈ ఇద్దరితో వచ్చింది. ఇక్కడవున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని మహాభారతం కాలంలో విదురుడు నాటాడుట. అందుకే ఆ అశ్వత్థ వృక్షం విదురాశ్వధ్ధం అయింది, తర్వాత ఆ ప్రదేశం కూడా అదే పేరుతో ప్రసిధ్ధికెక్కింది. అయితే 2001లో ఆ అశ్వత్థ వృక్షం పడిపోయిందిట. చిన్న కొమ్మలాగా వుంది. దానికిందే చిన్న ఆలయం.

చుట్టూ కనుచూపుమేర అన్నీ నాగ శిలలే. ఇక్కడ భక్తులు నాగ ప్రతిష్ఠలు చాలా ఎక్కువ చేస్తారు. ఈ వృక్షం కింద నాగ ప్రతిష్ఠ చేస్తే జాతకంలోని సర్ప దోషాలు వగైరా అన్ని దోషాలూ తొలగి పోతాయని, సత్సంతానం ప్రాప్తిస్తుందనీ, పెళ్ళికానివారికి పెళ్ళవుతుందనీ, భక్తులలో ప్రగాఢ నమ్మకం వుంది. ఈ కోరికలతో భక్తులు వచ్చి మొక్కుకుని, తమ కోరిక నెరవేరాక వచ్చి నాగ ప్రతిష్ఠ చేస్తారు.

పురాణ కథ ప్రకారం యమధర్మరాజు శాపవశాత్తు విదురుడుగా జన్మిస్తాడు. కురుక్షేత్రం రణరంగంలో జరిగిన రక్తపాతం చూసి దుఃఖించిన విదురుడు కృష్ణ పరమాత్మని ‘ఈ బాధ నేను భరించలేనయ్యా, ముక్తి మార్గం చూపించమ’ని వేడుకుంటాడు. కృష్ణుడు విదురుణ్ణి తీర్ధయాత్రలు చెయ్యమని చెబుతాడు. అనేక ప్రదేశాల్లో తిరుగుతూ, విదురుడు మైత్రేయ మహర్షి నివసించే ఈ ప్రాతానికి వస్తాడు. ఒకసారి నదిలో స్నానం చేసి సూర్యుడుకి అర్ఘ్య ప్రదానం చేయబోతుండగా విదురుడి చేతిలోకి రావి చెట్టు చిన్న మొక్క వచ్చింది. ముక్తి సాధించటానికి ఆ మొక్కని ఆరాధించమని విదురుడికి మైత్రేయ మహర్షి చెబుతాడు. విదురుడు అత్యంత భక్తి శ్రధ్ధలతో ఆ మొక్కని నాటి పూజిస్తాడు. విదురుడి భక్తికి సంతోషించి బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు విదురుడికి ప్రత్యక్షమవుతారు. అప్పటినుంచీ ఈ వృక్షం విదురాశ్వధ్ధం అయింది. విదురుడు కూడా ఇక్కడే తపస్సు చేసుకున్నాడు అంత్య దశదాకా అంటారు. మనవాళ్ళు అశ్వత్థ వృక్షాన్ని, అదే రావి చెట్టుని పరమ పవిత్రంగా భావించి, దానిని త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తారుకదా.

మరొక కథనం ప్రకారం చాలాకాలం క్రితం అక్కడ నదిలో బాగా వరద వచ్చినప్పుడు ఇద్దరన్నదమ్ములు నది దాటి ఇవతల ఒడ్డుకు రాలేక అవతల ఒడ్డునే ఒక శివాలయంలో వుండిపోయారు. ఆ రాత్రికి అందులో ఒకరి కలలో అశ్వత్థనారాయణుడు కనిపించి తనని కొలిస్తే తరతరాలను కాపాడతానని చెప్పాడుట. మర్నాడు తెల్లవారేసరికి వారు ఇవతల ఒడ్డున ఈ అశ్వత్థ చెట్టుకింద వున్నారుట. అప్పటినుంచీ ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయని చెబుతారు.

భారత స్వాతంత్ర్య సమరంలో ఈ విదురాశ్వధ్ధం మరో జలియనివాలాబాగ్ అయింది. బ్రిటిష్ పరిపాలనకి వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుతో, మైసూర్ ప్రజా పార్టీ 1938 ఏప్రిల్ 25న విదురాశ్వధ్ధం ఆలయంలో జరిగే 4 రోజుల ఉత్సవాల సందర్భంగా, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేసే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో మైసూరు మహారాజానుంచి వచ్చిన ఆజ్ఞల ప్రకారం పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ అక్కడ చేరిన గుంపు మీద ముందు లాఠీ ఛార్జీ చేసి, ఏ విధమైన ప్రతిఘటన లేకుండానే కాల్పులు జరిపారు. ఒక గర్భిణీ స్త్రీతోసహా 10 మంది అమాయకులు, యాత్రీకులతోసహా చనిపోయారు, 35మందికి గాయాలయినాయి. చరిత్రలో ఇది విదురాశ్వధ్ధ దారుణం కింద మిగిలిపోయింది.

మానవుల జాతక దోషాలు మార్చి మంచిని ప్రసాదించే ఈ విదురాశ్వధ్ధంలో నాగ ప్రతిష్ఠ చేయించటానికి అనేకమంది భక్తులు వస్తుంటారు. భవిష్యత్‌లో అవకాశం వుంటే మీరు చూడండి.

సాయంకాలం 5 గం. లకు అక్కకడనుండి బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here