భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 6

0
8

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 6” వ్యాసంలో లేపాక్షి లోని ‘లేపాక్షి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

లేపాక్షి – 1

[dropcap]మ[/dropcap]రీ చీకటి పడకుండానే హిందూపూర్ నుంచి 14 కి.మీ. ల దూరంలో వున్న లేపాక్షి చేరాము. అనంతపురం జిల్లా పేరు విన్నా వినకపోయినా, లేపాక్షి పేరు వినని వారు అరుదు. దానికి కారణం అక్కడ వున్న అతి పెద్ద నంది, శిల్ప సంపదతో కూడిన ఆలయాలు. విజయనగర సామ్రాజ్యంలో కోశాధికారిగా పనిచేసిన విరుపణ్ణ, పెనుకొండ ప్రభువుల ధనముతో 16వ శతాబ్దంలో ఇక్కడ ప్రసిధ్ధి చెందిన వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఆలయ నిర్మాణం విజయనగర శైలిని పోలివుంటుంది. ఈ ఆలయం కూర్మ శిల అనే పేరుగల చిన్న కొండమీద నిర్మింపబడింది. ఈ కొండ తాబేలు పృష్ఠ భాగాన్ని పోలి వుండటతో ఆ పేరు.

ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో చాలా ప్రసిధ్ధిగాంచింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, యాత్రాస్థలంగానూ విలసిల్లింది. విరూపణ్ణ నాయకుడు, వీరణ్ణ నాయకుడు అనే ఇద్దరు గొప్ప వ్యక్తులు రాయల ప్రతినిధులుగా ఈ ప్రాంతం ఏలారుట.

లేపాక్షి ఆలయంలో శివుడు, విష్ణువు, వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు.. ఇక్కడ శిల్పకళ అత్యద్భుతం. ఆలయం లోపల స్తంభాల మీద సంగీత, నాట్య కళాకారుల శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. పూర్వం మనుష్యులలో ఉత్తమమైన స్త్రీలు, పద్మినీ జాతి వారు ఎలా వుంటారు, వారి శరీర నిర్మాణం ఎలా వుంటుంది, అలాగే పురుషులు, వారి శరీరాకృతి.. అన్నింటికీ కొలతలుంటాయి.. ఆ ఉత్తమ జాతి స్త్రీ, పురుషుల విగ్రహాలు స్తంభాల మీద చెక్కబడ్డాయి. అక్కడ గైడ్ సదుపాయం కూడా వున్నది. అన్నీ వివరంగా చూడాలంటే గైడ్ సహాయం తీసుకోవటం మంచిది.

స్ధల పురాణం

రామాయణ గాథతో ఈ క్షేత్రానికి సంబంధం వున్నది. సీతాదేవిని ఎత్తుకు పోతున్న రావణాసురుణ్ణి జటాయువు ఎదుర్కున్నది ఈ కూర్మ పర్వతం పైనే. రావణుడు పక్షి రెక్కలు నరికెయ్యగా అది ఈ స్ధలంలో పడ్డది. తర్వాత సీతాన్వేషణలో వచ్చిన శ్రీరాముడు ఇక్కడ జటాయువుని చూసి ‘లే పక్షి’ అని లేవదీశాడుట. ఆ తర్వాత జటాయువు నుంచి వివరాలు కనుక్కుని, చనిపోయిన జటాయువుకి దహన సంస్కారాలన్నీ చేస్తాడు. శ్రీరాముడు జటాయువుని ‘లే పక్షి’ అని పిలిచిన ఆ పిలుపే ఈ ప్రాంతం నామధేయంగా స్ధిరపడి, లేపక్షి, లేపాక్షి అయిందని చెబుతారు.

ఇంకో కథ ప్రకారం… అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ, రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడుట. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. కళ్యాణ మంటపం నిర్మాణము మధ్యలోనే ఆగిపోవటానికి ఈ సంఘటనే కారణమంటారు.

ఆలయ నిర్మాణం

మొదట్లో ఈ ఆలయం ఏడు ప్రాకారాలుగలదిగా నిర్మింపబడినా ప్రస్తుతం మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారాలు కాలగర్భంలో కలసిపోయాయని అంటారు. ప్రాకారం గోడలు ఎత్తుగా ఉన్నాయి. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనాలు వున్నాయి.

నాట్య మంటపము

ఇది డెభ్భయి స్తంభాల నిర్మాణం. మంటపము మధ్యనగల 12 స్తంభముల మీద రంభ నాట్యము చేస్తుండగా దత్తాత్రేయుడు, నటరాజు, చంద్రుడు, శివుడు, పార్వతి, సూర్యుడు, తుంబురుడు, నంది, బ్రహ్మ మొదలగు పెద్దలు వివిధ సంగీత వాద్యాలతో నిల్చున్నట్లు చెక్కారు.

మంటపం మధ్య పైకప్పులో 12 రాళ్ళతో 100 రేకుల పద్మాన్ని చెక్కారు. దీనినే శతపత్ర కమల మంటారు. ఇక్కడ ప్రతి స్తంభముమీద చెక్కిన శిల్పాలు అత్యద్భుతాలు.

ఈ మంటపంలో ఈశాన్య మూలలో నేలను తాకకుండా దాదాపు 8 అడుగుల రాతి స్తంభము పైకప్పునుండి నిలబడివుంది. బ్రిటీషువారు పరిపాలించిన రోజులలో ఈ దేవాలయమును దర్శించుటకై వచ్చిన ఒక ఆంగ్ల ఇంజనీరు శ్రీ హ్యయిల్డన్ ఈ స్తంభమును పరీక్షించదలచి దీనిని పక్కకు నెట్టించాడని, దానితో ఆ స్తంభము ఇప్పుడు నేలకు కేవలం అర్ధ అంగుళము పైనే వున్నదనీ అంటారు. ఈ స్తంభము కిందనుంచి ఒక పేపర్ ని తేలికగా తియ్యవచ్చు. ఈ స్తంభాలమీద అనేక శివలీలలు అందంగా చెక్కబడ్డాయి.

గర్భాలయము ముందు ఒక స్తంభము మీద వాస్తు పురుషుడు, ఇంకొక స్తంభము మీద పద్మినీ జాతి స్త్రీ శిల్పాలను చూడవచ్చు.

దుర్గాదేవి

వీరభద్రస్వామికి ముందు దుర్గాదేవి విగ్రహము ఒక స్తంభములో చెక్కబడి వుంటుంది. ఈ శిల్పము చెక్కే సమయంలో దుర్గాదేవి భక్తులపై ఆవాహనమై నేను ఈ స్తంభంలోనే వుంటానని, తనకి నిత్య పూజలు, ఆరాధనలు జరిపించమని కోరినందువల్ల నాటినుండి నేటి వరకు స్తంభములో వున్న ఈ శిల్పానికి అలంకారాలు చేసి, పూజలు నిర్వహిస్తున్నారు.

గర్భగుడి పై కప్పులో దాదాపు 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో వీరభద్రస్వామి వర్ణ చిత్రాన్ని చూడవచ్చు. ఈ వర్ణ చిత్రము భారతదేశములోకెల్ల పెద్ద చిత్రముగా పేరుగాంచింది. ఒక ప్రక్క విరుపణ్ణ, మరియొక ప్రక్క విరుపణ్ణ భార్యా పుత్రులు స్వామిని పూజిస్తున్నట్లుగా చిత్రీకరించారు.

ఈ ఆలయ ఆకృతి అలాగే నిర్మాణం శైలిలో ప్రఖ్యాతి గాంచిన శిల్పి అమర శిల్పి జక్కనచారి హస్తం ఉందని చాలామంది నమ్మకం. కాకోజు అలాగే మొరోజు అనబడే ఆ కాలపు పేరుగాంచిన శిల్పులు కూడా ఈ ఆలయ గోడలపై ఉన్న హస్త కళా నైపుణ్యానికి సహాయ పడ్డారని చెపుతారు. భారత పౌరాణిక గ్రంథాలైన రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలనుండి తీసుకోబడిన వివిధ ఘట్టాలను ఈ ఆలయ గోడలపై చెక్కారు. ప్రసిద్ధమైన లేపాక్షి చీరల డిజైన్‌లు కూడా ఈ ఆలయ గోడలపై ఉన్న చెక్కడాల ద్వారా ప్రభావితమయ్యాయన్నది ఆసక్తికరమైన అంశం.

దేవాలయం లోపల కప్పుపైన అద్భుతమైన చిత్రాలు వున్నాయి. సహజ రంగులని ఉపయోగించి చిత్రీకరించిన అందమైన చిత్రలేఖనాలతో ఈ ఆలయ పై కప్పు అలంకరించబడినది. అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పులమీద చిత్రించిన రూపాలంతటి బృహద్రూపాలు మరెక్కడా లేవంటారు. దీనితో మనకు కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము తెలుస్తుంది.

వచ్చే వారం లేపాక్షిలోని మరిన్ని విశేషాలని తెలుసుకుందాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here