[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 8” వ్యాసంలో చోళసముద్రం లోని ‘చౌడేశ్వరీ ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
చౌడేశ్వరీ దేవి ఆలయం, చోళసముద్రం
[dropcap]ని[/dropcap]న్న మా బోనస్ ఆలయాలలో ఇంకోటి మర్చిపోయానండీ. సాయంకాలం తిరిగి లేపాక్షి వెళ్ళే ముందు చోళసముద్రంలో ఒక ప్రసిధ్ధి చెందిన అమ్మవారి గుడి వుంది. చిన్నదయినా, చాలా ఫేమస్ అని కారు డ్రైవర్ చెప్పటంతో, అప్పటికే చీకటి పడ్డా, ఓపిక అయిపోయినా, ఇంక మళ్ళీ ఆ రోడ్డులో వస్తామో రామో అని చూద్దామనుకున్నాము. ఆలయం చూస్తే చిన్నదే. డ్రైవరూ దాని గురించి ఎక్కువగా చెప్పలేకపోయాడు కానీ ఇది రాస్తున్నప్పుడు ఫోటోలు చూసి పరిశోధన చేస్తే, తెలిసిన వివరాలు చెప్పకుండా వుండలేకపోతున్నా. అందుకే నిన్నటి ప్రోగ్రాం కొనసాగింపుగా నిన్న మేము చూసిన ఆఖరి అతి మహిమగల ఆలయం గురించి చెబుతున్నాను.
ఇది చౌడేశ్వరీ దేవి ఆలయం. హిందూపూర్ – లేపాక్షికి దోవలో వుంది. లేపాక్షి మండలంలోని ఈ ఆలయం చోళసముద్రంలో బస్ స్టాండ్ పక్కనే వున్నది. ఆలయం చిన్నదే. మేము వెళ్ళేసరికి ఆలయం తెరిచి వున్నదిగానీ, అమ్మవారిముందు కటకటాలు వేసి వున్నాయి. వాటిలోంచే అమ్మవారి దర్శనం. పెద్ద విగ్రహం. భీకర రూపంగా అనిపించినా అమ్మ సౌమ్యంగానే ఆశీర్వదిస్తోంది. అడగటానికీ, చెప్పటానికీ ఎవరూ లేరుగనుక గ్రామ దేవత ఆలయమయి వుంటుందని దణ్ణం పెట్టుకుని తిరిగి బయల్దేరాము.
ఈ అమ్మవారు మహాశివుడి అర్ధాంగి పార్వతీదేవి అవతారం అని భావిస్తారు. ఇక్కడివారందరికీ ఈ అమ్మ తమ కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విపరీతమైన నమ్మకం. దీనికి ముఖ్య ఉదాహరణగా శ్రీకృష్ణ దేవరాయలు భార్య తిరుమలా దేవి సంతానం కలుగక ఈ తల్లిని ప్రార్ధించి, సంతానవతి అయిందని చెబుతారు.
ఈ దేవత తొగట జాతీయులు అంటే నేతపని వారి కుల దేవత. పూజారిగారు కూడా ఆ కులంవారే వుంటారు. ఈ దేవత భక్తులు తెలుగు రాష్ట్రాలలోనేకాక, దక్షిణాదిలోనూ, ఇంకా అనేక చోట్ల విస్తరించి వున్నారు.
ఆలయ నిర్మాణం
ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యంకన్నా ముందే నిర్మింపబడిందనీ, చోళుల సమయంలో నిర్మింపబడి, విజయనగర రాజుల సమయంలో అభివృధ్ధి చెందిందనీ, క్రీ.శ. 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు నిర్మించారని ఇలా భిన్న అభిప్రాయాలున్నాయి. ఈ ఆలయంలో చెప్పుకోతగ్గ శిల్ప నైపుణ్యం కనిపించదు. ముఖ మండపం పై కప్పులో తామరలు, వాటి చుట్టూ నృత్యం చేస్తున్న మహిళల శిల్పాలు చెక్కబడ్డాయి. ముందు విశాలమైన హాలు ముఖ్య ఆకర్షణ.
అమ్మవారు
అమ్మవారు దాదాపు 8 అడుగుల ఎత్తు వుంటుంది. పీఠం మీద ప్రతిష్ఠింపబడిన ఈ తల్లి నాలుగు చేతులతో అలరారుతూ వుంటుంది. కుడి చేతుల్లో త్రిశూలము, పొడుగాటి కత్తి, ఎడమ చేతుల్లో ఢమరుకం, కుంకుమ భరిణ వుంటాయి. పాదాల కింద రాక్షసుడి తల వుంటుంది. పార్వతీదేవి అవతారంగా భావించే ఈ దేవిని పూర్వంనుంచీ కూడా అనేక రాచ కుటుంబాలవారు భక్తితో ఆరాధించారని చెబుతారు.
ఈ అమ్మవారు చాలా ఉగ్రరూపంలో వుండి, చూపరులకు భయం కలిగించేలాగా వుంటుంది. అందుకనే అలంకారం చేసే సమయంలో చిన్న చిన్న సవరణలు చేసి ఆ తల్లిని ప్రసన్నంగా మారుస్తారుట, భక్తులు దర్శించటానికి వీలుగా.
శ్రీకృష్ణదేవరాయలి భార్య తిరుమలాదేవి మగ సంతతి గురించి ఎన్ని దేవుళ్ళకి మొక్కినా ఫలితం లేక ఈ అమ్మవారిని ఆరాధించిన తర్వాత సంతతి కలిగిందని చెబుతారు. మహా మంత్రి తిమ్మరుసు కొడుకు కొండమరుసుని పంపి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి, కానుకలు సమర్పించిందని ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోందంటారు.
ఉత్సవాలు
శరన్నవరాత్రుల ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. ఉగాది రోజు, రోజు మొత్తం అమ్మవారికి పూజలు జరుగుతాయి. ఆ రోజు ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. దానికోసం చుట్టుపక్కలనుంచీ అనేక మంది భక్తులు వస్తారు. ఇవి కాకుండా ఇక్కడ జరిగే దీపోత్సవం కూడా ప్రత్యేకమైనదే. ఆ రోజు అన్ని వయసుల స్త్రీలంతా తలమీద దీపాలు పెట్టుకుని తీసుకొచ్చి అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ సమయంలో జంతు బలులు కూడా ఇస్తారు.
కోడిపల్లి
ఇక్కడికి 2 కి.మీ. ల దూరంలో వున్న కోడిపల్లి అమ్మవారు పుట్టిన ఊరుగా భావిస్తారు. ఈ రెండు ఊళ్ళకి మధ్య పెద్ద చెరువు వుంది. కోడిపల్లి వాస్తవ్యులంతా ఈ అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి ప్రతి మూడు సంవత్సరాలకొకసారి అమ్మవారిని పుట్టింటికి తీసుకు వెళ్ళే ఉత్సవం ఘనంగా చేస్తారు.
సోమవారం ఉదయం కోడిపల్లి వాస్తవ్యులు చోళసముద్రానికి వచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగింపుగా తమ ఊరు తీసుకువెళ్ళి అక్కడ సిద్దప్ప గుడిలో వుంచుతారు. మూడు రోజులు జరిగే ఆ ఉత్సవానికి కోడిపల్లి గ్రామస్తులు తమ బంధు మిత్రులనందరినీ ఆహ్వానించి చాలా ఘనంగా ఉత్సవం జరుపుకుంటారు.
సోమవారం, మంగళవారం అమ్మవారిని గ్రామం మొత్తం ఊరేగిస్తారు. ప్రతి ఇంటివారు అమ్మవారికి పూజలు చేసి, నారికేళం వగైరాలు సమర్పిస్తారు. బుధవారంనాడు తిరిగి ఊరేగింపుగా చోళసముద్రం తీసుకువచ్చి గుళ్ళో వుంచుతారు.
రాయల కాలంనుంచీ ఆరాధింపబడ్డ ఒక అమ్మవారి గుడి చూశామన్న తృప్తి మిగిలింది.