భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 15: కోటిపల్లి

0
11

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన గుంటూరు జిల్లా– 15” వ్యాసంలో కోటిపల్లిలోని శ్రీ సత్యజ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ సోమశేఖర స్వామి వారి దేవస్ధానం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]భ[/dropcap]ట్టిప్రోలు నుంచి 7 కి.మీ.ల దూరంలో వున్న కోటిపల్లి చేరాము. ఇది గుంటూరు జిల్లాలోని ప్రసిధ్ద శైవ క్షేత్రాల్లో ఒకటి. ఆలయం పేరు శ్రీ సత్యజ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ సోమశేఖర స్వామి వారి దేవస్ధానము అని గుడి ముందు పెద్ద బోర్డు కనబడుతుంది. ఆలయం లోపల ప్రవేశించగానే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. వున్న కొంచెం ఆవరణలోనే కొంత స్ధలంలో రకరకాల మొక్కలు వున్నాయి. లోపలకి ప్రవేశించగానే ఎదురుగా చిన్న మండపంలో విఘ్నేశ్వరుడి రాతి విగ్రహం. తర్వాత పాపవిమోచన స్వామి. ఈ శివ లింగం కృష్ణా నదిలో దొరికితే ఇక్కడ ప్రతిష్టించారు. స్వామి ముందు ఉత్సవ విగ్రహాలు వున్నాయి. అమ్మవారు పార్వతి పచ్చని మోముతో, విశాల నేత్రాలతో భక్తుల ఆర్తిని పోగొట్టే చల్లని తల్లిలా ప్రత్యేక గర్భాలయంలో దర్శనమిస్తుంది.

ఇక్కడ వెలసిన ముఖ్య మూర్తి సోమశేఖరస్వామి. ఈయన స్వయంభూ. అమ్మవారు సత్యజ్ఞాన ప్రసూన. ఈ చల్లని తల్లి కూడా భక్తులకు నేనున్నాననే అభయమిస్తున్నట్లు వుంటుంది. ఈ స్వామి గురించి, ఈ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకున్నదేమిటంటే…

పూర్వం రాజా జగ్గన్నాథరావు మాణిక్యాలరావు రాచూరు జమీందారు. ఆయన క్రీ.శ. 1770లో ఒకసారి విహార యాత్రకు వెళ్ళి కోటిపల్లి మీదుగా తిరిగి వస్తుండగా “నన్ను చూడకుండానే వెళ్ళుచున్నావా” అనే మాటలు వినిపించాయట. ఆ జమీందారు అక్కడ దిగి ఆ ప్రదేశమంతా చూడగా ఒక పుట్ట, దాని మీద కొన్ని పువ్వులు కనిపించాయిట. ఆయన తన నగరానికి వెళ్ళి, తన మంత్రి, పురోహితులతో ఈ విషయం వివరించగా వారు ఆ పుట్టలో శివలింగం వున్నట్లు తెలిపారు. వెంటనే అందరూ అక్కడికి వచ్చి పరిశీలించి, శాస్త్ర ప్రకారం పుట్టలోంచి శివలింగాన్ని వెలికి తీయించారు. ఒక శుభ ముహూర్తంలో ఆలయ నిర్మాణం ప్రారంభించి ఆగమ శాస్త్రరీత్యా గర్భాలయం, ముఖమంటపం మొదలైన వాటితో నిర్మాణం పూర్తిచేసి స్వామిని ప్రతిష్ఠించి పూజలు, ఉత్సవాలు నిర్వహించసాగారు. పావన కృష్ణానదిలో స్నానం చేసి ఈ దేవుని సందర్శిస్తే సర్వపాపాలు నశిస్తాయని ఇక్కడి భక్తుల నమ్మకం.

  

పక్కన వేరే మంటపంలో నవ గ్రహాలు కొలువుతీరి వున్నాయి. యజ్ఞాలు నిర్వహించటానికి యజ్ఞశాల కూడా వున్నది. ఈ ఆలయానికి చాలాకాలం రాచూరు జమీందారీ వంశీకులు ధర్మకర్తలుగా వ్యవహరించారు. తరువాత ఈ ఆలయ నిర్వహణ దేవాదాయ ధర్మాదాయశాఖ చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది.

ఉత్సవాలు

నిత్య పూజలతోబాటు ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, ముక్కోటి ఏకాదశి, సంవత్సరాది పండుగలలో విశేష పూజలు జరుగుతాయి.

కృష్ణానదీ తీరాన వున్న ఈ ఆలయం తెనాలి – రేవల్లె రోడ్డు మార్గంలో వున్నది. సమీప రైల్వే స్టేషన్ భట్టిప్రోలు.

ఉదయం 9-35కి కోటిపల్లినుంచి బయల్దేరి వెల్లటూరు చేరుకున్నాము. మరి ఆ విశేషాల కోసం వచ్చే వారం దాకా ఆగాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here