భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 17: పెదపులివర్రు

0
9

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 17” వ్యాసంలో పెదపులివర్రు లోని నరేంద్రేశ్వరస్వామి, వరదరాజస్వామి ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] తర్వాత మజిలీ ప్రస్తుతం పెదపులివర్రు అని పిలువబడుతున్న వ్యాఘ్రపురి. దోవలో ఫణిగారు ఈ ఆలయం విశేషాలు కొన్ని చెప్పారు. ప్రముఖ సినీ దర్శకులు శ్రీ కె. విశ్వనాధ్ గారిది ఈ ఊరే. ఈ ఆలయ స్ధాపకులు వారి వంశీకులే. అందుకే వారీ ఆలయానికి వస్తూ వుంటారు. అలాగే ప్రఖ్యాత గాయకుడు కీ.శే. ఘంటసాలగారి భార్యది ఈ ఊరు. వారి సోదరుడు ఇక్కడ ఆలయంలో అర్చకుడు. అంటే ఈ ఆలయానికి పౌరాణిక ప్రశస్తేకాక ఆధునిక కీర్తి కిరీటాలు కూడా వున్నాయన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి ఆలయ చరిత్ర వింటూ ఇవి మర్చి పోయాము. వారి గురించి ప్రత్యేకించి తెలుసుకోలేదు అని తర్వాత అనుకున్నాను.

ఊళ్ళో నరేంద్రస్వామి (శివుడు), వరదరాజస్వామి (విష్ణువు) ఆలయాలు ఎదురెదురుగానే వున్నాయి. నరేంద్రేశ్వరస్వామి ఆలయంలో పూజారిగారు శ్రీ దీవి సీతారామానుజాచార్యులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఊరుని ఇదివరకు వ్యాఘ్రపురి అని పిలిచేవారు. పూర్వం ఇక్కడ వ్యాఘ్రపాద మహర్షి తపస్సు చేసి, తన పేరుని స్వామివారికి అంకితమిచ్చారని ప్రతీతి. ఇక్కడ శివుడి పేరు మొదట్లో శ్వేతలింగేశ్వరుడు అని వుండేది, తర్వాత వ్యాఘ్రేశ్వరుడు, నరేంద్రేశ్వరుడు అని రూపాంతరం చెంది, ప్రస్తుతం నరేంద్రస్వామిగా పిలువబడుతున్నాడు. ఈ లింగం నారద మహర్షి చేత ప్రతిష్ఠింపబడిందిట. పూర్వం నారద మహర్షి తన శిష్యులతో సంచారం చేస్తూవచ్చి ఇక్కడ కొంత కాలం వుండి, ఈ లింగ ప్రతిష్ఠ చేసి తర్వాత శిష్యులతో వేరే ప్రదేశానికి వెళ్ళారు.

తర్వాత వ్యాఘ్రపాద మహర్షి, మౌద్గల్య మహర్షి కూడా ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారుట. ఒకసారి మౌద్గల్య మహర్షి మృగ రూపంలో తన భార్యతో సంతోషంగా గడుపుతున్న సమయంలో వ్యాఘ్రపాద మహర్షి చూసి పరిహసించాడుట. దానికి కోపగించిన మౌద్గల్య మహర్షి వ్యాఘ్రపాదునికి ఆయన పేరు సార్ధకమవుగాక అని శాపం ఇచ్చాడు. వ్యాఘ్రపాద మహర్షి పాదాలు పులి పాదాలు అయ్యాయి.

వ్యాఘ్రపాద మహర్షి తన శాపానికి విమోచనం కూడా చెప్పమని మౌద్గల్య మహర్షిని కోరాడుట. కాలాంతరమున జనమేజయ మహారాజు వంశస్తుడైన నరేంద్ర మహారాజు ఇక్కడికి వచ్చి తన బాణంతో నిన్ను కొడతాడు. అప్పుడు నీ ఈ మృగరూపం అంతరించి దేవలోకానికి వెళ్తావని చెబుతాడు.

వ్యాఘ్రపాద మహర్షి ఇక్కడ శివార్చన చేసి ప్రతి నిత్యమూ కంచి వెళ్ళి అక్కడ వరదరాజస్వామిని సేవించి వస్తూ వుండేవాడుట. కొంత కాలం తర్వాత వార్ధక్యం మూలంగా ఆయన రోజూ కంచి వరదరాజస్వామిని దర్శించలేక చింతించగా వరదరాజస్వామి వ్యాఘ్రపాద మహర్షి కలలో కనబడి కృష్ణానదిలో తన విగ్రహం కొట్టుకు వస్తుందని, దానిని మొసళ్ళు ఎక్కడైతే సంతానోత్పత్తి చేస్తాయో అక్కడ ప్రతిష్టించి ఆరాధించమని చెబుతాడు. మరునాడు కృష్ణానదికి స్నానానికి వెళ్ళిన వ్యాఘ్రపాద మహర్షికి కృష్ణానదిలో కొట్టుకు వచ్చిన వరదరాజస్వామి విగ్రహం దొరుకుతుంది. దానిని శివాలయానికి ఎదురుగా మొసళ్ళు సంతాన ఉత్పత్తి చేసే ప్రదేశంలో ప్రతిష్టించి, ఆలయం నిర్మించి, పూజించసాగాడు.

కొతంకాలం గడిచిన తర్వాత రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మహారాజు కలలో వ్యాఘ్రపాదుడు కనిపించి తానిలా వ్యాఘ్రపాద క్షేత్రంలో వున్నానని, తనకి శాప విమోచనం కలగ జెయ్యమని చెబుతాడు. మహారాజుకి ఏమి చెయ్యాలో తెలియక తన కుల గురువయిన శ్రీపతి పండితారాధ్యులవారిని పిలిచి తన కలగురించి తెలియజేస్తాడు. అప్పుడు ఆ గురువుగారు శరభసాళువ అనే మహావిద్యను ప్రయోగించి రాజమహేంద్రవరాన్ని దిగ్బంధనం చేశారుట. అప్పటినుంచీ వ్యాఘ్రపాద మహర్షి మహారాజు కలలో కనబడటం మానేసి, గురువుగారి కలలో కనబడి తన సందేశాన్ని తెలియజెయ్యసాగాడు. నరేంద్ర మహారాజుగారి బాణంతో తనకి శాప విమోచనం కలుగుతుందనుకుంటే తమరు శరభ సాళువ విద్యతో అష్టదిగ్బంధనం చేశారు, నాకు శాప విమోచనం కలిగించవలసినదని చెప్పసాగాడు.

అప్పుడు రాజ గురువు నీవు బ్రహ్మర్షివి, నిన్ను బాణంతో కొడితే రాజుగారికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది, ఆ శాప విమోచన మార్గంకూడా తెలియజెయ్యమని కోరారుట. అప్పుడు రాజుగారి పేరును మహాదేవునికి అంకితం చేస్తే రాజుగారి బ్రహ్మ హత్యా దోషం పోతుందని వ్యాఘ్రపాద మహర్షి తెలియజేశాడు. శ్రీపతి పండితారాధ్యులవారు మహారాజుకి ఈ విషయం తెలియజెయ్యకుండా, కృష్ణా తీరంలో మునుల తపస్సును క్రూర మృగాలు భంగం కలిగిస్తున్నాయని వేటకి తీసుకు వస్తాడు. స్వామికి ఉత్తర ఈశాన్యంగా వున్న శమీ వృక్షం కింద పెద్ద పొదలో నిదురిస్తున్న వ్యాఘ్రపాదుని రాజుకి చూపించి శ్రీపతి పండితారాధ్యులవారు అదిగో పెద్దపులి అని చూపిస్తారు. నరేంద్రుడు బాణంతో కొట్టగా పెద్దపులి రూపాన్ని వదిలిన వ్య్ఘాఘ్రపాద మహర్షి పొదలోనుంచి బయటకి వచ్చి, శ్వేత లింగాన్ని అక్కడ చూపించి, తన పేరును శివునకు ధారా పూర్వకంగా అంకితం చెయ్యమని రాజుకి చెప్పి తాను అదృశ్యమవుతాడు.

ఆ లింగాన్ని తీసి ఎత్తయిన ప్రదేశంలో ప్రతిష్టించుటకు ప్రయత్నం చెయ్యగా పలుగు గాట్లు తగిలి రక్తం చిందింది. స్వామికి అక్కడనుండి తియ్యబడటం ఇష్టంలేదని గ్రహించి, లింగానికి రక్తం చిందించినందుకు ప్రాయశ్చిత్తంగా అక్కడ ఆలయాన్ని నిర్మించి, చుట్టూ వున్న అడవిని నరికించి అగ్రహారం ఏర్పాటు చేసి శ్రీపతి పండితారాధ్యులవారికి ధారా పూర్వకంగా దత్తత చేశారు. ఆ వంశంలో వారిని కాశీనాధునివారుగా ఇక్కడ స్ధానాచార్యులుగా నియమించటం జరిగింది. అప్పటినుంచి స్వామి నరేంద్ర స్వామిగా ప్రఖ్యాతి చెందాడు. శ్రీపతి పండితారాధ్యులవారే ఇక్కడ బాలాత్రిపురసుందరి అమ్మవారిని, గణపతిని కూడా ప్రతిష్ఠించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. స్వామికి ఎడమ భాగాన గణపతి, కాలభైరవుడు, షణ్ముఖుడిని ప్రతిష్ట చేశారు. వీరభద్రుడు, భద్రకాళి ఈ క్షత్రానికి క్షేత్రపాలకులు. అప్పటినుండీ ఇక్కడ ప్రతి దినమూ కాశీనాధునివారు స్ధానాచార్యులుగా, ములుగువారు అమ్మవారి ఆలయంలో అర్చకులుగా దేవతా మూర్తుల సేవలు జరుగుతున్నాయి.

విశేషాలు

         

ఇక్కడి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి. శ్రీ చక్రానికి మూలాధారం. ఈ అమ్మవారు తన ప్రజలని కాపాడటానికి ఇప్పటికీ ఊరులో తిరుగుతూ వుంటుందని భక్తుల నమ్మకం. అమ్మవారి కుడిచెయ్యి కిందకి ఎడమ చేయి పైకి వుంటాయి. ఎడమ చేతిలో కమలం వుంటుంది

స్వామి స్వయంభూ. పంచాక్షరీ యంత్ర స్ధాపన కాశీనాధునివారు చేశారు. ఇక్కడికి సమీపంలో కృష్ణానది వున్నది. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కుమారస్వామి విగ్రహానికి చెమటలు పోసినట్లు చెమ్మ వస్తుంది.

పూర్వ రాజులు వేయించిన శాసనం ధ్వజస్తంభం దగ్గర వుండేదికానీ తర్వాత కింద పడింది. కరికాల చోళులు, తూర్పు చాణుక్యులనాటి శాసనాలు మోర్తోట, చిలుమూరు, ఇక్కడ వున్నాయి.

ఆలయంలో శివుడి ముందు మండపంలో వున్న శాసనంలో గోపురానికి బంగారు కలశాలు చేయించినట్లు, అన్నదానం చేసినట్లు, 1000 సంవత్సరాల క్రితం పున్నమ్మ అనే ఆవిడ అఖండ దీపారాధనకి నెయ్యి ఇచ్చినట్లు వుందని చెప్పారు.

ఈ ఆలయంలో ఇంకొక విశేషానికి కారణం తెలియదుగానీ, ఇప్పటికీ అవలంబించే పధ్ధతి పూజా సమయంలో మంత్రం గర్భగుడిలో చెప్పరు. గర్భగుడి ఇవతల మండపంలో కూర్చునే చెబుతారు. లోపల పూజా కార్యక్రమాలు మౌనంగా జరుగుతాయి.

సూర్యకిరణాలు ఇదివరకు గర్భాలయంలో స్వామిమీద పడేవని చెప్పుకుంటారు.

తెలుసుకోగలిగినన్ని విశేషాలు తెలుసుకుని అక్కడనుంచి 11-35కి మోర్తోట బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here