భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 20: అంకమ్మతల్లి

0
10

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 20” వ్యాసంలో బొర్రావారి పాలెం లోని అంకమ్మ తల్లి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]డవులదీవి నుంచి కూచినపూడి వస్తుంటే దోవలో బొర్రావారి పాలెంలో ఒక ఆలయం.. కొత్తగా నిర్మించినట్లు వైభవంగా వుంది. పైన అమ్మవారి మూర్తులు కనబడుతుంటే ఏ దేవత ఆలయం అని అడిగాను. అంకమ్మ తల్లిది అన్నారు. అంటే.. నా ముఖంలో ప్రశ్నార్థకం చూసి.. అవును మీ కులదేవతే అన్నారు. మరి ఆవిడని దర్శించకుండా ఎలా వెడతాము. వెంటనే అటు వెళ్ళాము.

ఆలయం చిన్నదే. తిరుమల తిరుపతి దేవస్ధానంవారి ఆర్థిక సహకారంతో 2016లో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. గాలి, వెలుతురు బాగా వస్తూ, శుభ్రమైన వాతావరణంలో ఆ మందిరం బహు సుందరంగా అనిపించింది. ముందు గర్భగుడి తలుపు వేసి వుందిగానీ, మమ్మల్ని చూసి ఒకావిడ వచ్చి తలుపులు తీసింది. మేము పులిగడ్డవారి ఆడబడుచులం అని చెబితే సంతోషించి ఇంకొన్ని వివరాలు చెప్పింది. అవేమిటంటే…

ఆలయంలో పూర్వం అమ్మవారి బొట్టు వుండే చెక్క ఒకటే వుండేది. దానికే పూజలు జరుగుతూ వుండేవి.

అయితే అలంకరణలు చెయ్యటానికి ఒక విగ్రహం వుంటే బాగుంటుందని రెండేళ్ళ క్రితం అమ్మవారి విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారు. పక్కనే ఒక ఉయ్యాలలాంటి తొట్టెలో అమ్మవారి బొట్టువున్న చెక్క వుంది.

ఇక్కడ ప్రతి ఏడూ జాతర జరుగుతుంది. దానికి ముందు పులిగడ్డవారి పోతు అని మూడుసార్లు చెప్పి కొబ్బరికాయ కొడతారు. ఈ ఆచారం ఈ తల్లి మా కులదేవత అయినప్పటినుంచీ జరుగుతోంది.

ఊరిలో వారంతా ఒక మాటమీద వుంటారు. ఊరికి కొన్ని కట్టుబాట్లు వున్నాయి. ఇక్కడ చర్చి లేదు. ఎవరైనా మతం తీసుకున్నా శవాన్ని పెట్టెలో తీసుకు వెళ్ళటానికి వీల్లేదు. మైకులు పెట్టటానికి వీలు లేదు.

ఈ అంకమ్మ తల్లే మా కులదేవత. ఈవిడ ఇక్కడనుంచి మా ఇళ్ళకు వచ్చిన కథ ఏమిటంటే.. పూర్వం మా వంశంలో శ్రీ పాపరాజుగారు అనే ఆసామి వుండేవారు. ఆయన ఒక రోజు గుఱ్ఱంమీద వేరే గ్రామంనుంచి వస్తూ ఈ అంకమ్మ తల్లి ఆలయం వున్న బొర్రావారి పాలెంలో సంబరాలు జరగటం చూశారు. అక్కడ అందరూ అమ్మవారికి సమర్పిస్తున్న జంతు బలులకి ఆలయం ముందంతా నెత్తుటి ప్రవాహం చూసి పాపరాజుగారు మనసులో ‘అమ్మవారివై వుండి ఇన్ని ప్రాణాల్ని బలి తీసుకుంటున్నావు. ఈ నెత్తుటన్నం ఏం బాగుంటుంది.. అదే మా ఇంటికి వస్తే చక్కగా బూరెలు, గారెలు, అన్నపు రాసులతో నీకు నైవేద్యం పెడతాను కదా’ అనుకున్నారుట. తర్వాత ఇంటికి వెళ్ళి చొక్కా విప్పబోతే రాలేదుట. ఏమిటీ వింత అని ఆలోచిస్తే అమ్మవారి దగ్గర తన ఆలోచన గుర్తువచ్చి, ‘అమ్మా, మా ఇంటికి వచ్చావా, నీకు రేపే నైవేద్యం పెడతానమ్మా’ అని నమస్కరించారుట. వెంటనే ఆయన చొక్కా మామూలుగా వచ్చేసిందిట. మర్నాడు ఆయన అమ్మవారికి తాననుకున్నట్లు అన్నపు రాశి పోసి దాని మీద పూర్ణపు బూరెలు, గారెలు పరిచి, పప్పు, రకరకాల కూరలు పరవాణ్ణం వగైరాలన్నింటితో నైవేద్యం పెట్టారు. అప్పటినుంచీ ఈవిడని పులిగడ్డవారు తమ కులదేవతగా కొలుచుకుంటున్నారు. ఈ పండగని అంకమ్మ నైవేద్యం అంటాము.

ఈ పండగకి ఏ మాత్రం అవకాశం వున్నా ఆ వంశంలోని బంధువులంతా వస్తారు. ఇలా నైవేద్యం పెట్టిన పదార్ధాలని కేవలం ఆ వంశీకులు మాత్రమే తినేవారు. ఇప్పుడు దూరాభారాలు పెరిగి పులిగడ్డవారు అన్ని చోట్లనుంచీ రావటం కష్టతరం కావటంవల్ల అనుకుంటాను, కొంచెం నియమాలు సడలించి ఆ ఇంటి ఆడబడుచులు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చంటున్నారు.

ఈ తల్లి ఆలయంలో ఇదివరకు ఒక చెక్క మీద పసుపు రాసి, కుంకుమ బొట్లతో అలంకరించి దానినే అమ్మవారిగా పూజించేవారని చెప్పానుకదా. అదే విధంగా పులిగడ్డవారింట్లో నైవేద్యానికి కూడా ఒక డైమండ్ ఆకారంలో వున్న చెక్కకి పసుపు రాసి, ఒకదాని పక్కనే ఇంకో బొట్టు పెడుతూ గుండ్రంగా అలంకరిస్తారు. దాని మధ్యలో రెండు కుంకుమ బొట్లు కళ్ళ స్ధానంలో, ఒకటి ముక్కు స్ధానంలో పెట్టి, కింద చిన్న గీత గీస్తారు కుంకుమతోనే, నోరులాగా. ఈ అలంకారం ఆ వంశీకులలో అక్కడ అప్పుడు వున్న కోడళ్ళల్లో పెద్దవారు చేస్తారు. (గుళ్ళో వున్న చెక్కకి బొట్లు ఇంత కుదురుగా వుండవు). ఇది నైవేద్యం పెట్టిన ప్రతిసారీ అప్పటికప్పుడు పెడతారు. ఆ బొట్టుతో వున్న చెక్క అలాగే దేవుడి గూటి దగ్గర పూజలందుకుంటూ వుంటుంది మళ్ళీ నైవేద్యం పెట్టేదాకా.

గురు, ఆదివారాలలో పెట్టే ఈ నైవేద్యాలు వారి వారి వీలునిబట్టి సాధారణంగా ఏడాదికి ఒకసారయినా పెడతారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తప్పక పెడతారు. అమ్మాయి వివాహం జరిగితే వివాహానికి ముందు, అబ్బాయిదయితే వివాహం అయిన తర్వాత ఈ కార్యక్రమం వుంటుంది.

        

ఇన్నాళ్టికి మా కుల దేవత గుడి చూశామన్న సంతోషం మనసంతా ఆక్రమించగా, అక్కడనుంచి బయల్దేరి సాయంకాలం 5 గం.లకి కూచినపూడిలో వున్న మా తమ్ముడు శ్రీ పులిగడ్డ రామచంద్రమూర్తి వాళ్ళింటికి వచ్చాము.

వాళ్ళు అక్కడ జమీందారులు (ఇదివరకు). వారి తాతగారు శ్రీ పులిగడ్డ రామచంద్ర మూర్తిగారు అక్కడ పిల్లలకోసం హైస్కూలు కట్టించారు. ఇంకా అనేక విధాల గ్రామాభివృధ్ధికి కృషి చేశారు. ఆ హైస్కూలు చూసి సంబర పడ్డాము. పిల్లలు చదువుకోసం దూరాలకి వెళ్ళకుండా అంత పెద్ద స్కూలు కట్టించింది మావాళ్ళేకదాని.

మా మరదలు శ్రీమతి సునీత ఆతిథ్యం స్వీకరించి సాయంకాలం 6-30కి బయల్దేరి ఆ ఊరి గుడికి బయల్దేరాము. ఆ వివరాలు వచ్చే వారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here