గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 23: చేజర్ల

0
12

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 23” వ్యాసంలో చేజర్ల లోని శ్రీ కపోతేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]సె[/dropcap]వన్ సీటర్ ఆటోలో సత్తెనపల్లిలో ఉదయం 10-15కి బయల్దేరినవాళ్ళం మధ్యాహ్నం 12-15కి చేజర్ల చేరాం. ఆటో దడ దడ శబ్దం, కుదుపులు తప్ప పెద్దగా ఇబ్బందేమీ కలగలేదు. రోడ్డు బాగానే వుంది. మధ్యలో లస్సీ తాగి హాయిగా కాళ్ళు జాపుకుని కూర్చున్నాం. పేరుకి సెవన్ సీటర్ అయినా సీటింగ్ మారుతి వేన్‌లా వుంది. ఇంకా మా సొద కాకుండా చేజర్ల గురించి చెప్పాలి కదా.

మీకు శిబి చక్రవర్తి కథ గుర్తుంది కదా. అది ఇక్కడ జరిగిందే. మీకందరికీ ఆ కథ గుర్తున్నా శ్రీ యీవూరి వెంకటరెడ్డిగారు రాసిన చేజర్ల కపోతేశ్వర వైభవం పుస్తకం చదివిన తర్వాత దాని నుంచి నేను తెలుసుకున్న కొన్ని విశేషాలు మీకూ తెలియజేస్తాను.

పూర్వం కాశ్మీరు, వింధ్య పర్వతాల మధ్యవున్న ప్రాంతాన్ని సూర్యవంశ రాజు మాంధాత పరిపాలించేవాడు. ఈయన యయాతి మహారాజు పుత్రుడు. మాంధాత మహారాజుకి ముగ్గురు కొడుకులు. వారు మనందరికీ తెలిసిన శిబి చక్రవర్తి మొదటివాడయితే, మేఘదంబరుడు, జీమూతవాహనుడు మిగతా ఇద్దరు. మాంధాత తర్వాత శిబి రాజయ్యాడు. తమ్ముళ్ళిద్దరూ అన్నకి అండగా వుండి దేశాన్ని ప్రజా రంజకంగా పాలించసాగారు.

ఇలా వుండగా మేఘదంబరుడుకి భారతదేశమంతా తిరిగి, పుణ్య నదులలో స్నానం చేసి, పుణ్యక్షేత్రాలు దర్శించాలనే కోరిక కలగటంతో అన్నగారి అనుమతి తీసుకుని బయల్దేరుతాడు. దేశమంతా తిరుగుతూ కొన్నాళ్ళకి చేరుంజర్ల (చేజర్లకు పూర్వం పేరు) చేరుకున్నాడు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయిన మేఘదంబరుడుకి కొన్నాళ్ళు అక్కడే గడపాలనే కోరిక కలిగింది. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషులను చూసి తాను కూడా తపస్సు చేసి శివైక్యం చెందాడు. ఆయనతో వచ్చినవారు మేఘదంబరుడికి దహన సంస్కారం జరుపగా, ఆ చితా భస్మంలో ఒక లింగం ప్రత్యక్షమయింది. ఆ లింగాన్ని మేఘదంబరుడు తపస్సు చేసుకున్న గుహలోనే ప్రతిష్ఠించి పూజలు చేయసాగారు. మేఘదంబరుడితో వచ్చినవారు తిరిగి వెళ్ళి శిబి, జీమూతవాహనులకు ఈ విషయాలు తెలిపారు. శిబి వివరాలు తెలుసుకు రమ్మని తమ్ముణ్ణి పంపించాడు. అన్న మేఘదంబరుడి వివరాలు కనుక్కోవటానికి వెళ్ళిన జీమూతవాహనుడు కూడా అన్నలాగానే అక్కడి పరిసరాలకు ముగ్ధుడై అక్కడే తపస్సు చేసుకుంటూ దేహం విడిచాడు. అతని చితా భస్మంలో కూడా ఒక శివ లింగం ప్రత్యక్షమయింది. ఆ లింగాన్ని జీమూతవాహనుడు తపస్సు చేసుకున్న గుహలోనే ప్రతిష్ఠించి పూజలు చెయ్యసాగారు.

తన తమ్ముళ్ళిద్దరూ ఒకే ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ సిధ్ధి పొందటం, చితా భస్మంలోంచి లింగాలు రావటం, వాటిని అక్కడివారు ప్రతిష్ఠించి పూజించటం తెలుసుకున్న శిబి ఆ ప్రదేశాన్ని, తమ్ముళ్ళ చితా భస్మాల్లోంచి వచ్చిన లింగాలను చూడాలనే కుతూహలంతో రాజ్యాన్ని మంత్రులకి అప్పచెప్పి, రాణీతో, కొంత పరివారంతో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడి వాతావరణం నచ్చి కొంతకాలం అక్కడ వుండదల్చుకుంటాడు. తన తమ్ముళ్ళ చితాభస్మాల్లోంచి ఉద్భవించిన లింగాలను దర్శిస్తూ, అక్కడి ఋషిపుంగవుల సాంగత్యంతో వున్న శిబికి తానుకూడా తమ్ముళ్ళలాగా తపస్సిధ్ధి పొందాలని ఆలోచించాడు. ఆ దివ్యక్షేత్రంలో లోక కళ్యాణం కోసం నూరు యజ్ఞాలు చెయ్యాలని సంకల్పించాడు. రాజు తలచుకుంటే కొరవేముంటుంది. శిబి యజ్ఞాలు చెయ్యటం మొదలుపెట్టి 99 పూర్తి చేసి, నూరవ యజ్ఞం మొదలు పెట్టాడు. ప్రతిఫలాపేక్షలేని శిబి చక్రవర్తి చేసే యజ్ఞాల శక్తికి తట్టుకోలేక దేవేంద్రుడు మొదలగు దేవతలు త్రిమూర్తుల శరణుజొచ్చారు.

త్రిమూర్తులు కూడా శిబి చక్రవర్తి తపశ్శక్తిని పరీక్షించాలనుకుని ముగ్గురూ భూలోకానికి వచ్చారు. అలా త్రిమూర్తులు విడిది చేసిన గ్రామాన్ని విప్పర్ల అన్నారు. వారు బయల్దేరి శిబిని క్రీగంట చూసిన స్ధలాన్ని కండ్లకుంట అన్నారు. వారు ముగ్గురూ, బ్రహ్మ బాణముగా, మహావిష్ణువు పావురముగా, మహేశ్వరుడు కిరాతకుడుగా మారిన ప్రదేశం రూపెనగుంటగా పేరుపొందింది. కిరాతుడు పావురముమీద బాణము వెయ్యగా అది దాని కాలుకి తగిలి, కాలు విరిగి నేలకి కూలిన ప్రదేశము కుంకిళ్ళగుంటగా పేరు పొందింది. దానిని ప్రస్తుతం కుంకలగుంట అంటున్నారు. అక్కడనుంచి పావురము ఎగరలేక గిరికీలు కొడుతూ, శిబి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వచ్చి ఆయన శరణు జొచ్చింది.

శిబి చక్రవర్తి మహాదాతగా పేరు పొందాడు. తన శరణుకోరిన పావురాన్ని రక్షించలేడా. రక్షించటమేకాదు, దానికోసం తన ప్రాణమే ఇచ్చాడు. మామూలు పావురమైతే తేలికగా రక్షించగలిగేవాడు. కానీ వచ్చింది సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడాయే. అందుకే తన ప్రాణాన్నే అర్పించాడు ఆ త్యాగశీలి.

సరే. బోయవాడు, శిబిల మధ్య పావురం కోసం వాద వివాదాలు అందరికీ తెలిసినవే కదా. శిబి చక్రవర్తి బోయవానికి పావురం బదులుగా తన రాజ్యాన్ని ఇస్తానన్నాడు. సర్వ లోక పాలకులు..త్రిమూర్తులు వచ్చింది రాజ్యం కోసం కాదు కదా, శిబి త్యాగ నిరతిని పరీక్షించటానికి. అందుకే దేనికీ ఒప్పుకోలేదు. చివరకు శిబి పావురం ఎత్తు మాంసము తన శరీరంనుంచీ కోసి ఇస్తానన్నాడు. దానికి ఒప్పుకున్నాడు వేటగాడు. వెంటనే ఒక త్రాసు ఏర్పాటు చెయ్యబడింది. దానిలో ఒక వైపు పావురాన్ని వుంచి వేరొకవైపున శిబి తనే స్వయంగా తన తొడనుంచి కొంత మాసాన్ని కోసి త్రాసు ఇంకొక పళ్ళెంలో వుంచాడు. అవతల వున్నది శ్రీహరి. ఎలా తూగుతుంది. రెండవ తొడ మాంసము కూడా సరిపోలేదు. చుట్టు పక్కల వారందరూ తమ చక్రవర్తి పరిస్ధితి చూసి తల్లడిల్లిపోయారు. శిబి సేవకుణ్ణి పిలిచి తన భుజాలనుంచి మాంసము కోసి ఇవ్వమన్నాడు. సేవకుడు రాజాజ్ఞ పాటించాడు. అయినా లాభం లేక పోయింది. శిబి తన శిరస్సునే ఖండించి త్రాసులో వుంచమని ఆజ్ఞాపించాడు. అలా చేయగా తుల తూగింది.

శిబి ప్రాణాలు పోతున్న సమయంలో త్రిమూర్తులు తమ రూపాలతో ప్రత్యక్షమయ్యారు. తమ రాకకి కారణం వివరించి శిబితో ఆయన శరీరాన్ని తిరిగి ఇస్తామని చెప్పారు. కానీ శిబి ఒప్పుకోలేదు. నారాయణుడంతటివాడు ఆటకైనా నా శరణుజొచ్చాడు. ఆయన కోసం ఖండ ఖండాలైన నా శరీరం మీద నాకు వ్యామోహం లేదని చెప్పాడు. మరి ఏం కావాలో కోరుకోమంటే, తనతోపాటు అక్కడున్నవారందరికీ కైలాసాన్ని ప్రసాదించమని కోరాడు. తధాస్తు అన్నారు.

కాళ్లూ, చేతులూ, తలా లేని శిబి మొండానికి స్వర్గంలోని గంగానది జలాలతో ఓంకార నినాదంతో అభిషేకం చేశారు. ఆ జలమే ఓంకార నదిగా చేరంజర్లలో ఉద్భవించింది. నాగరాజు వాసుకి తన ఫణుల (తలల) మీద వుండే మణులతో హారతి ఇచ్చాడుట. అప్పటినుంచి త్రిమూర్తుల వరం ప్రకారం శిబి చక్రవర్తి మొండానికి నిత్య పూజలు జరుగుతున్నాయి. శిబి సోదరులు మేఘన, మల్లయ్య అనే పేర్లతో సిధ్ధులకుంట దగ్గరలో వున్న పులికొండ దిగువన ఒకరు, శిఖరము మీద ఒకరు పూజలందుకుంటున్నారు. శివ పార్వతులు గౌరీ శంకరుల పేరుతో అక్కడ కొలువైనారు.

ఈ కథ బౌధ్ధ జాతక కథలలోనిది. ఆంధ్ర మహాభారతములో అరణ్యపర్వంలో కూడా శిబి చక్రవర్తి కథ వున్నది. ఇది మనకందరికీ తెలిసినది.

విశేషము

దీనికి నిదర్శముగా ఆ కపోతేశ్వర లింగము పీఠముపై ప్రతిష్ఠించినట్లుగా కాకుండా స్వయంభువుగా కనిపిస్తుంది. లింగం చుట్టూ మాంసం తీసినట్లు గుంటలుగా వుంటుంది. అంతేకాదు. శిబి తన భుజాలు నరికి ఇచ్చాడు కదా. లింగాకృతికి కుడి, ఎడమ భుజాల స్ధలంలో రెండు బిలాలున్నాయి. ఈ ఆలయం ఆకృతి ఎరుకల గుడిసెలాగా వుంటుంది. భారత దేశంలో ఏ ఆలయం ఈ ఆకృతిలో లేదని చెబుతారు.

ఈ ఆలయం 1950 వరకు నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజుగారి ఆధిపత్యంలో వుండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధిపత్యంలో వున్నది.

ఆలయ నిర్మాణం

ఈ కపోతేశ్వరాలయం క్రీ.శ. 4వ శతాబ్దిలో చేజర్లను రాజధానిగా చేసికొని పాలించిన ఆనంద గోత్రజులగు రాజులు నిర్మించారు. ఈ ఆలయం తూర్పు ముఖంగా వుంటుంది. ప్రవేశ ద్వారం ఒకటే వుంది. దీని ముఖతోరణము పెద్ద చైత్యాలయపు కమానువలె వుంటుంది. వెనక పైభాగము గజపృష్ఠంవలెవుంది. ఆనంద గోత్రరాజులకు మూల పురుషుడు ఆనంద మహర్షి. వీరిలో మొదటిరాజు కందరరాజు. వీరి రాజధాని కందరపురము. ఈ కందరపురమే చేజర్ల. దీనిని ఆ రోజులలో కపోత కందర పురమని పిలిచేవారు.

ఈ ఆలయంలో 9 శాసనాలున్నాయి. వాటిలో రెండు 1085, 1169 సంవత్సరాలకు చెందినవి. వాటి ఆధారంగా 4444 లింగాల మధ్య కపోతేశ్వరుడున్నట్లు తెలుస్తున్నది. ఆలయ నిర్మాణ శైలినిబట్టి, శాసనాలనుబట్టి ఈ ఆలయం ముందు బౌధ్ధ చైత్యమని, దానిని తర్వాత కాలంలో శైవాలయంగా మార్చారని చారిత్రికుల అభిప్రాయం. అన్నట్లు బుధ్ధుడి జాతక కథలలో శిబి కథ కూడా వుంది.

కపోతేశ్వర లింగం చతురస్రాకారంగా వున్న వేదికపై వున్నది. చూడటానికి చేతులు, కాళ్ళు, శిరస్సు లేని మనుష్యుని మొండెములాగా కనిపిస్తుంది. దీనికి రెండు భుజాల స్ధానంలో రెండు రంధ్రాలున్నాయి. కుడి భుజపు రంధ్రములో ఒక బిందె నీళ్ళు పోయగానే రంధ్రం నిండుతుంది. కానీ ఎడమ భుజం రంధ్రంలో ఎన్ని నీళ్ళు పోసినా నిండదు. ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయో కూడా తెలియదు. కుడి భుజపు రంధ్రంలో పోసిన నీటిని ప్రతి ఉదయం కుంచె కోలతో తీస్తారు. ఈ నీళ్ళు పచ్చి మాంసం వాసన వస్తాయి. లింగాకృతి పైన చుట్టు చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు శిబి రాజు తన శరీరం నుండి కత్తితో మాంసం తీసినప్పుడేర్పడిన కత్తిగాట్లని చెప్తారు. గర్భాలయంలో శ్రీ భ్రమరాంబ, పార్వతీ దేవి విగ్రహాలున్నాయి.

గజపృష్ఠాకారంలో వున్న గుడి గోడలపైన శిల్పాలేమీ చెక్కిలేవు. గోడపైన ఒక్క కపోతాకారం మాత్రం చెక్కబడి వుంది. గుడి శిఖరం గుఱ్ఱపు నాడ ఆకారంలో వుంది. శిఖరంపై కలశాలు లేవు. ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న ఆలయాలు, లింగాలు వున్నాయి.

చుట్టుపక్కల వున్న కొండలలో అనేక గుహలున్నాయి. వాటిలో ఋషలు తపస్సు చేసుకుంటూ వుంటారంటారు. ఈ క్షేత్రం గురించి అనేక మహిమాన్వితమైన కథలు వినిపిస్తాయి. ఒక త్యాగధనుడు నడయాడిన ప్రదేశాన్ని చూశామనే సంతోషంతో తిరిగి బయల్దేరేసరికి మధ్యాహ్నం 1 గం. అయింది. ఆలయం మూసే సమయం కూడా అయింది.

సత్తెనపల్లి తిరిగి వస్తూ ఇస్సప్పాలెం శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్ధానం దగ్గర ఆగాము కానీ ఆలయం మూసి వుండటంతో సత్తెనపల్లి చేరి ఒక హోటల్‌లో భోజనం చేశాము. హోటల్‌కి వెళ్తూ సత్యన్నారాయణగారు వారి అన్నగారి వియ్యంకుడు ఆ ఊళ్ళోనే వున్నారు అని ఫోన్ చేశారు. వారు భోజనానికి వాళ్ళింటికే రమ్మన్నా, అప్పటికే ఆటోలో 80 కి.మీ. తిరిగిన అలసటతో, భోజన సమయం అవటంవల్ల ఆకలితో వున్నామేమో హోటల్‌కి వచ్చేశామని చెప్పాము. శ్రీ ప్రసాద్ గారు అరటి పళ్ళు తీసుకుని హోటల్‌కి వచ్చి అందరికీ భోజనాలలో వడ్డించి, ఇంటికి వచ్చి వెళ్ళేలా ఒప్పించి వెళ్ళారు. ఎక్కువ సేపు కూర్చోవద్దు, తొందరగా ఇంటికెళ్దాం, ఎవరికీ ఓపిక లేదు అనుకున్నవాళ్ళం వాళ్ళింటికి వెళ్ళి రెండు గంటలు కూర్చుండి పోయాం. శ్రీ ప్రసాద్ గారు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు. రచయిత. వారు వ్రాసిన గ్రంథాలిచ్చారు అందరికీ. చేజెర్ల విశేషాలు చెప్పి శ్రీ యీవూరి వెంకటరెడ్డిగారు వ్రాసిన పుస్తకం ఇచ్చారు నాకు, దీనిలో మీకు వివరాలు చాలా దొరుకుతాయని. వారి శ్రీమతి బేంక్ ఆఫీసర్. ఆవిడ డ్యూటీకి వెళ్ళటంతో తనే మంచి కాఫీ పెట్టిచ్చారు. పది నిముషాలు కూర్చుందామని వచ్చినవాళ్ళం ఇంత సేపున్నాము, సమయమే తెలియలేదు అనుకుంటూ బయల్దేరి సత్తెనపల్లిలో మా రాధిక వాళ్ళ అత్తగారు శ్రీమతి దుర్గావాణిగారింటికి వెళ్ళాము. డెభ్భయ్యేళ్ళ వయసులోను ఆవిడ శ్రమ అనుకోకుండా మేము వెళ్ళేసరికి ఫలహారాలు సిధ్ధం చేసి వుంచారు. అసలు ఉదయం భోజనానికే రమ్మన్నారు కానీ మా జైత్రయాత్రలో వాటికి తావుండదుగా. వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సాయంత్రం 5-30కల్లా బయల్దేరి గుంటూరు, అక్కడనుంచి విజయవాడ.. ఇంటికి చేరేసరికి రాత్రి 9-15. అలసి సొలసి విశ్రాంతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here