గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 39: చందోలు

0
10

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 39” వ్యాసంలో చందోలులోని లింగోద్భవ క్షేత్రం, శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ బండ్లమ్మ ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]చం[/dropcap]దోలు లేదా చందవోలు గుంటూరు జిల్లా, పిట్టలవానిపాలెం మండలంలోని ఒక ప్రాచీన గ్రామం. ఇది మండల కేంద్రం పిట్టలవానిపాలెం నుంచి 4 కి.మీ.ల దూరంలో వుంది. మేము నిజాంపట్నం నుంచి చందోలు లోని లింగోద్భవ స్వామి ఆలయానికి చేరుకునే సరికి రాత్రి 7-50 అయింది.

లింగోద్భవ క్షేత్రం

    

రాష్ట్రంలోని ప్రసిధ్ధి చెందిన పురాతన శైవక్షేత్రాలలో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత వున్నది. మహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసమైన ఈ క్షేత్రాన్ని పదో శతాబ్దంలో కుళోత్తుంగ చోళ మహారాజు పునః ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ వున్న శివలింగం దక్షిణ భారత దేశంలో పెద్ద శివలింగాలలో రెండవదిగా చెబుతారు. ఈ క్షేత్ర వైభవాన్ని వివరిస్తూ శ్రీ పరిమి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి .. లింగోద్భవ మహాత్మ్యము అను చందవోలు వైభవము.. అనే పుస్తకాన్ని రచించారు.

ఈ ఆలయంలో వెనుకవైపు 5 చిన్న చిన్న ఆలయాలలో శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ సీతారాములు, శ్రీ నరసింహస్వామి వున్నారు.

ఇక్కడ పూజారిగారు ఈ ఊళ్ళోని ఇంకొక ఆలయం గురించి చెప్పారు. అదే బండ్లమ్మ ఆలయం. చాలా ప్రసిధ్ధి చెందినది, ఆ ఊరి వారందరికీ నమ్మిన దైవం, ఆవిడని తప్పక దర్శించమని చెప్పారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం

లింగోద్భవ క్షేత్రం ఎదురుగానే శ్రీ చెన్న కేశవస్వామి ఆలయం కూడా వున్నది. ఇది కూడా అతి పురాతన ఆలయమే. ఈ ఆలయ పూజారిగారు చాలా విశేషాలు చెప్పారు. వాటి ప్రకారం దీనిని 12వ శతాబ్దంలో గొంక రాజులు నిర్మించారని తెలుస్తోంది. చోళులు, కాకతీయుల సమయంలో పునరుధ్ధరింపబడింది. శాసనాలు ఏమీ లేవు కానీ మెడ్రాస్ క్రిస్టియన్ లైబ్రరీలో చందోలు కైఫియత్ వున్నదిట.

చందోలు ఒకప్పుడు వెలనాటి రాజుల రాజధాని. చందోలునుంచి బాపట్ల ఇవతల వరకు ఒకటే ఊరు. అప్పుడు ఈ ఊరుకి ధనదప్రోలు, ధనదవోలు, ధనవోలు వగైరా పేర్లుండేవి. వైశ్యులు పెట్టుబడులు పెట్టారుట. చందోలు రాజు కూతురు మైలమ్మ కారెంపూడి రాజుకి రెండవ భార్య.

ఇక్కడి రాజులు బౌధ్ధమతావలంబులు. ఈ ఆలయంలో ద్వార పాలకుల బదులు కలశాలు వుంటాయి. అంటే బౌధ్ధుల కాలంలో పునర్నిర్మాణం జరిగింది. పూజారిగారు పల్నాటి చరిత్ర ఇంకా చెప్పబోయారు కానీ అప్పటికే 8-30 దాటటం, ఇంకా బండ్లమ్మ ఆలయం, చందోలు అనుకున్నప్పటినుంచి నేను చూడాలనుకున్న శాస్త్రిగారిల్లు మిగిలిపోవటంతో హడావిడిగా బండ్లమ్మ ఆలయానికి బయల్దేరాము.. ఆలయం మూసేస్తారేమోననే కంగారుతోనే.

చిత్రం చూడండి. చాలా చోట్ల మనకి విశేషాలు చెప్పేవారే దొరకరు. అలా చెప్పగలిగేవారున్నప్పుడు మాకు సమయం లేదు.

పూజారిగారే చెప్పారు.. బండ్లమ్మ ఆలయం చూసుకుని శాస్త్రిగారింటికెళ్ళండి. మళ్ళీ ఆలయం మూసేస్తారని. హడావిడిగా బయల్దేరాము.

శ్రీ బండ్లమ్మ ఆలయం

మేము వెళ్ళేసరికి ఆలయం తెరిచే వుంది. ఈ తల్లి అంటే ఇక్కడివారికి అపరిమితమైన విశ్వాసం. ఈ ఆలయ నిర్మాణం గురించి కొన్ని విశేషాలు చెబుతారు. 11వ శతాబ్దంలో చోళరాజు శివాలయం నిర్మించదలచి బళ్ళతో కొండరాళ్ళని తెప్పించాడుట. ఆ సమయంలో బళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయాయిట. రాజు దైవజ్ఞులను రప్పించి కారణమడిగితే ఆ గ్రామాన్ని కాపాడుతున్న ఒక గొప్ప దైవ శక్తి అక్కడ వున్నదని, ఒక ప్రదేశం చూపించారుట. అక్కడ తవ్వి చూడగా అమ్మవారి విగ్రహం బయల్పడిందిట. అప్పుడు రాజు ప్రతి బండిలోంచి ఒక రాయి తీసి వాటితో గుడి కట్టించి అమ్మవారిని ప్రతిష్టించారు. అందుకే ఆవిడ పేరు కూడా బండ్లమ్మ అని స్ధిర పడింది. అమ్మవారి విగ్రహం బయల్పడిన ప్రదేశం (బావి) అమ్మవారి గుడి పక్కనే వున్నది. అమ్మవారి విగ్రహం కోసం తవ్విన గుంటలో నీరు చేరేసరికి దానిని బావిలాగా కట్టించారు. అది చాలా పవిత్ర స్ధలమని, అమ్మవారిని దర్శించేవారు ఆ బావిని కూడా దర్శించి ఆ నీరు శిరస్సున జల్లుకోవలసినదని అక్కడ ఒక బోర్డు పెట్టబడి వుంది. మేము వెళ్ళేసరికి రాత్రి కావటంతో ఆ చీకట్లో బావి సరిగా కనబడలేదు.

    

ఒకసారి వర్తక రీత్యా బళ్ళమీద సరుకు తీసుకు వెళ్తున్న వ్యాపారులకు బళ్ళమీద అమ్మవారు కనిపించిందిట. అందుకని కూడా ఆవిడని బండ్లమ్మ, బళ్ళమ్మ అంటారంటారు. అసలు మొదట్లో ఆవిడ పేరు భగళాముఖి. తర్వాత బండ్లమ్మగా మారింది.

అంతే కాదు. ప్రస్తుతం వున్న ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఆలయంలో రెండో స్తంభం దగ్గర (ఆ స్తంభాన్ని చూపించారు.. ఫోటో చూడండి) తవ్వకాలలో అనేక మేలిమి బంగారు ఆభరణాలు దొరికాయిట. వాటితో ఆలయాభివృధ్ధి గావించారు

చందోలు అనగానే మనకి గుర్తువచ్చేది చందోలు శాస్త్రిగారుగా ప్రసిధ్ధి గాంచిన శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు. ఈయన దేవీ ఉపాసకులు. బండ్లమ్మ మహత్యాన్ని ప్రత్యక్షంగా గాంచిన మహనీయులు. ఒక రాత్రి సమయంలో అమ్మ తన దేవళానికి ప్రాకారం నిర్మించవలసినదని శ్రీ శాస్త్రిగారిని కోరిందిట. మర్నాడు గ్రామస్తుల సహకారంతో అమ్మ ఆదేశాన్ని పాటించి చరితార్ధులయ్యారంటారు.

ఒక సంవత్సరం గ్రామం మొత్తం కరువుతో అల్లాడిపోతుండగా శ్రీ శాస్త్రిగారు అమ్మకి సహస్ర ఘటాభిషేకం చేస్తే, ఆ రాత్రే అమ్మ కృపతో విస్తార వర్షం కురిసి అమ్మ మహత్యం ప్రజలకి తెలిసిందిట. ఒక రోజు అమ్మ ఉగ్ర నేత్రాన్ని వీక్షించిన శాస్త్రిగారు అమ్మవారిని శాంతింప చెయ్యటానికి అమ్మ భృకుటినుండి పాదాలదాకా నారికేళోదకంతో అభిషేకించి, అమ్మ ప్రసన్నతను భక్తులకు చూపించారుట. ఇలా అమ్మ మహత్యాలు అనేకం.

ఇంకొక విశేషమేమిటంటే లయ కారకుడైన శివుని లింగం అమ్మవారి కుడి భుజం మీద వుంటుంది.

ఇంత మహత్యంకల అమ్మవారి గురించి తెలుసుకున్న సంతోషంతో శ్రీ శాస్త్రిగారిల్లు చూడాలనే కోరికతో అటు బయల్దేరాము. రాత్రి 9 గంటలవుతోంది. ఆ సమయంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడతామేమోననే అనుమానం. బండ్లమ్మతల్లి ఆలయంలో కలిసిని శ్రీ హరనాధ్ గారు ముందు వారికి ఫోన్ చేస్తానన్నారు. తర్వాత పర్వాలేదు వెళ్ళండి. చూపిస్తారు. మళ్ళీ ఇంత దూరం రావటం మీకు కుదురుతుందో లేదో అనే ధైర్యం చెబితే అటు బయల్దేరాము.

యాత్రలలో మనం తెలుసుకున్న మహనీయుల గురించి కూడా కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది కదా. శ్రీ శాస్త్రిగారి గురించి, అక్కడ మా అనుభవం తెలుసుకోవటానికి వచ్చే వారం దాకా ఆగాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here