గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 40: శ్రీ చందోలు శాస్త్రిగారు

1
9

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 40” వ్యాసంలో శ్రీ చందోలు శాస్త్రిగారి గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]శ్రీ [/dropcap]చందోలు శాస్త్రిగారి పూర్తి పేరు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు. ఈయన చందోలు వాసి. ఈయన గురించి కొన్ని వార్తలన్నా మీరు వినే వుంటారు. ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు. ఆయన ఎంత గొప్ప ఉపాసకులంటే ఆయన అంత్యక్రియలు జరిగినప్పుడు ఆయన చితిపై శ్రీ బాలా త్రిపుర సుందరి రూపం అందరికీ కనిపించిందట. వార్తా పత్రికలలో ఫోటోలు కూడా వచ్చాయి.

అంతటి గొప్ప భక్తులు మన కాలంలో వున్నారు అని గర్వంగా చెప్పుకోవటానికి నేను ఆయన గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు మీకూ చెబుతాను.

తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు 1896 సంవత్సరంలో ఆగస్టు 5వ తారీకున జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి హనుమమ్మ, శ్రీ తాడేపల్లి వెకటప్పయ్య శాస్త్రిగార్లు.

రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్య శాస్త్రి ఉపనయనం చేశారు. తండ్రిగారి వద్దనే శాస్త్రిగారు సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, లౌకిక విద్యను నేర్పినవారు తాడికొండ గ్రామస్తులైన కేదారలింగంగారు. దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం, పొదిలి సీతారామశాస్త్రి వద్ద మంత్రం నేర్చుకున్నారు. శ్రీ కేదారలింగంగారు బాలాత్రిపురసుందరీ ఉపాసకులు. 12వ సంవత్సరంలోనే రాఘవనారాయణశాస్త్రికి ఆయన తండ్రిగారి అనుమతితో కేదారలింగం “బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని” ఇచ్చారు. బాల ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచింది శాస్త్రిగారికి.

రాఘవ నారాయణశాస్త్రికి యవ్వనంలోనే సన్యసించాలనే కోరిక కలిగింది. సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరి కాగా ఆమె శాస్త్రిగారు సన్యసించేందుకు అనుమతినివ్వలేదు. కుమారుడు సన్యసించడాన్ని వెంకటప్పయ్యశాస్త్రి కూడా వ్యతిరేకించారు. ఒకసారి వెంకటప్పయ్యశాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూండగా ఊరి చివర పొదలమాటున గాఢ తపస్సులో వున్న రాఘవనారాయణశాస్త్రి కనిపించారు. దానితో తండ్రికి కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసివచ్చింది. శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు శాస్త్రిగారి రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో తన పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గుర్తుకొచ్చింది. అందులో తాను ఒక సిద్ధుడు. శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. శాస్త్రిగారు వారిలో ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చారు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది. శాస్త్రిగారి 19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రుల కుమార్తె పార్వతితో వివాహమైంది. వారి పిన్ని చూపించిన దృశ్యంలో ఆవిడ కూడా ఈమెనే. ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు.

శాస్త్రిగారు చిన్నప్పటినుంచీ బాలా ఉపాసకులు. చిన్నతనంలో దుర్భర దారిద్ర్యం అనుభవించారు. ఒకసారి ఆయన దేశ సంచారం చేసి వచ్చేసరికి ఇంట్లో దుర్భర దారిద్ర్యం. అప్పటినుంచి ఇంటి దగ్గరే వుండి తండ్రికి తోడ్పడ్డారు. ఒకసారి తిండికి లేని పరిస్ధితి. మూడు రోజులు ఇంటిల్లిపాదీ ఉపవాసమే. శాస్త్రిగారు మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి అమ్మవారికి నీటిని మాత్రమే నైవేద్యం పెట్టి, ఆ నీటినే తాగి అంగవస్త్రం నేలమీద పరచి నిద్ర పోయారు. ఆ రోజు రాత్రి 10 సంవత్సరాల బాలిక కలలో కన్పించి, ఒరే, ముష్టి పెడతాను, కొంగు పట్టు అని దోసెడు బియ్యం కొంగులో పోసిందిట. అంతే కాదు బండి వస్తుంది..అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది అన్నదిట. తెల్లారేసరికి ఖాజీపాలెం సీతా రామరాజుగారి బండి వచ్చింది. అక్కడ రాజు గారి కోరికమీద పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చేసరికి తలుపు దగ్గర రాజుగారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కనిపించింది. అప్పటినుంచీ శాస్త్రిగారింట లోటు లేదు.

ఈ కథనే కొందరు వేరే విధంగా చెబుతారు. ఒకసారి బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై, “శాస్త్రీ ఇంక చాలు. ఎన్నాళ్ళు పేదరికం అనుభవిస్తావు. ఇక అయిపోయిందిలే” అన్నదిట. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపుర సుందరి దేవిపై వారికి ఎంత భక్తి, అమ్మకి ఆయన అంటే ఎంత ఆదరణ అంటే, ఆయన పనిలో వున్నప్పుడు వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రిగారిని పిలిస్తే, బాల అమ్మవారు చిన్న పిల్ల రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, మా నాన్నగారు పనిలో వున్నారండి.. కాసేపు ఆగండి అని చెప్పేదిట. అంత అదృష్టవంతులు శాస్త్రిగారు.

శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశమైనాయి. వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకోలేదు. వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు “నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో” అనేది. వారు “నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా” అనేవారు.

శాస్త్రిగారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలంలో 80 ఏళ్ళు ‘బాలా మంత్రానుష్ఠానం’ చేసిన మహనీయులు. ఆయన తన కార్యక్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో, పేరు పెట్టమనో అడిగేవారు. కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసేవారు. అంతే. ఆ కార్యక్రమం శుభప్రదంగా జరిగి పోయేది. దానికి తిరుగులేదు. అదీ వారి మంత్ర సిద్ధి.

శాస్త్రిగారి గురించి అనేక విషయాలు ప్రచారంలో వున్నాయి. ఈ కాలంలో కూడా నియమ నిబధ్ధతలను పాటిస్తే మనిషి ఎంత ఉన్నత స్ధాయి చేరుకోవచ్చో తెలుసుకోవటానికి శాస్త్రిగారు చక్కని ఉదాహరణ.

సాక్షాత్తూ ఆ బాలా త్రిపుర సుందరినే తమ ఇంట తిప్పుకున్న శ్రీ శాస్త్రిగారు 10-12-1990 ప్రమోదూత సంవత్సరం మార్గ శిర బహుళ నవమి నాడు అమ్మ వారి ఒడిలోకి శాశ్వతంగా చేరిపోయారు. వారి పార్థివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు. శాస్త్రి గారు కారణ జన్ములు.

శాస్త్రి గారికి మగ సంతానం లేదు. కూతురు లక్ష్మిని శ్రీ చెరువు సత్యనారాయణశాస్త్రి కిచ్చి వివాహం చేశారు. ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

అంతటి మహనీయుడి గృహాన్ని, అందులోనూ అమ్మవారు చిన్న పిల్లలాగా తిరిగిన ఆ ఇల్లు చూడాలనే కోరికతో శ్రీ శాస్త్రిగారింటికి బయల్దేరాము.

మేము శాస్త్రిగారి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 9 గంటలయింది. ఆ సమయంలో వెళ్ళటం మాకే ఇబ్బందిగా అనిపించినా, శ్రీ బండ్లమ్మ ఆలయంలో కనబడిన శ్రీ హరనాధ్ గారు (ఆ ఊరివారు, శాస్త్రిగారి కుటుంబం గురించి తెలిసినవారు) ముందు వారికి ఫోన్ చేస్తానని తర్వాత పర్వాలేదు వెళ్ళండి.. చూపిస్తారు.. మళ్ళీ మీరు ఇంత దూరం రావటం కష్టం కదా.. అప్పుడే నిద్ర పోరులెండి అని ధైర్యం చెబితే వెళ్ళాము.

ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. బయటనుంచే పిలిస్తే ఒకాయన 40 ఏళ్ళ లోపే వుంటాయనుకుంటాను .. వచ్చారు. శ్రీ శాస్త్రిగారి అబ్బాయినని చెప్పారు. మేము మా విషయం చెప్పాము. ఆ సమయంలో మా దురదృష్టమేమిటోగానీ, ఆయన మూడ్ సరిగ్గా లేదు.. అనవసరమైన మాటలు చాలా అన్నారు. నేను పుస్తకాలు రాస్తానంటే, ఎవరు రాయమన్నారు మిమ్మల్ని మానేసి ఇంట్లో కూర్చోండి అన్నారు చాలా కఠినంగా. ఇంకా చాలా మాటలు పడ్డాము. ఆ మాటల్లోనే ఏమనుకున్నారో, సరే వచ్చారుకదా ఒక నిముషం చూసెళ్ళండి అంటే లోపలకి వెళ్ళాము. మళ్ళీ దూషణాలు మొదలు పెట్టారు. ఆ ఇంట్లో అంత కటువైన మాటలు వింటుంటే మా కళ్ళంబడ నీళ్ళు తిరిగాయి. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. చివరికి నేను మాత్రం ధైర్యం చేసి అనేశాను – “ఆయన గొప్పతనం విని చూడాలని వచ్చాము, మీకు కుదరక పోతే స్పష్టంగా ఇప్పుడు చూపించము అని చెప్పేసి వుండాల్సింది… ఇన్ని మాటలు అనటం అందులో ఈ ఇంట్లో ఇన్ని మాటలు అనటం అసలు బాగాలేదు. శాస్త్రిగారి కడుపున పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమీ బాగాలేదు.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలెండి” అని బయటకి వచ్చేశాను. మావాళ్ళు నాకన్నా ముందే బయటకి వచ్చారు ఆయన మాటలు వినలేక.

   

ఇప్పటిదాకా ఎన్నో ప్రదేశాలు తిరిగాను, అర్థం చేసుకున్నవాళ్ళు అవకాశం వున్నవాళ్ళు మూసిన ఆలయాల తలుపులు తెరిచి మరీ చూపించారు. కుదరని వాళ్ళు కుదరదమ్మా అని చెప్పారుగానీ, ఇలాంటి దూషణాలు, అందులో అలాంటి మహనీయుని ఇంట్లో, అమ్మవారు నడయాడిన ఆ ఇంటి నేల కళ్ళ కద్దుకోవాలని ఆశతో వెళ్ళిన నాకు చాలా బాధ అనిపించింది. కొంచెం సెంటిమెంటు కూడా .. నేనేం పాపం చేశానని అక్కడ అలాంటి దూషణలు ఎదుర్కొన్నాను అని.. అసలు అలాంటి మహనీయుల నివాస స్ధలాల్లో ఇలా ఎలా జరుగుతుందో అర్ధం కాలేదు. పైగా ఆయన కుమారుణ్ణని చెప్పుకున్నారు. తర్వాత తెలిసింది. ఆయనకి మగ సంతానమే లేరని. అమ్మయ్య ఆయన కడుపున పుట్టినవారెవరూ అలా ప్రవర్తించలేదు అని కొంచెం సాంత్వన పొందాను. ఈ అనుభవాన్ని మాత్రం మరచిపోలేను. తర్వాత నాకీ మధ్య తగులుతున్న దిష్టి ఈ చివాట్లతో పోయుంటుందిలే అని ఆత్మీయుల ఓదార్పు.

ఈ విధంగా 28-9-18 ఉదయం 5-45కి కారులో విజయవాడలో ఇంట్లో బయల్దేరి మళ్ళీ విజయవాడలో ఇంటికి చేరేసరికి రాత్రి 11-45 అయింది. ఈ రోజు 17 ఊళ్ళు, 22 గుళ్ళు చూశాం. 290 కి.మీ. తిరిగాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here