గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 44: కొండవీడు

0
9

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 44” వ్యాసంలో కొండవీడు లోని శ్రీ గోపీనాధ ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కత్తుల బావిగా మారిన గోపీనాధ ఆలయం

ఉదయం 9-40కి కత్తుల బావి చేరాము. విఠలాచార్య సినిమాలలోలాగా బావిలో కత్తులు వగైరాలుంటాయేమో అననుకుంటూ వెళ్ళాము. కానీ ఎదురుగా ఒక పురాతన ఆలయం కనబడింది. కత్తుల జాడే లేదు. అసలైతే అది గోపీనాధ ఆలయం. కిందటి వారం చెంఘిజ్‌ ఖాన్ పేట లోని కృష్ణుని విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ఠించారని, తర్వాత అంచెలంచెలుగా అది చెంఘిజ్‌ఖాన్ పేట చేరిందనీ చెప్పాను కదా. ఆ ఆలయమే ఇది.

ఇది కొండవీడు కోట వున్న కొండకి దిగువన వున్న ఆలయం. కట్టించింది శ్రీకృష్ణ దేవరాయలు. కొండవీడు జయించటానికి అప్పాజీ సలహా మీద, తన కలలో కనిపించగా తన ఆస్ధానంలో ప్రతిష్ఠించిన చిన్ని కృష్ణుడిని ప్రార్థించిన తర్వాత కొండవీడు జయించటం, విజయ చిహ్నంగా ఈ ఆలయం నిర్మించి ఆ చిన్ని కృష్ణుడిని తీసుకు వచ్చి ఇక్కడ ప్రతిష్టించటం జరిగిందని ఒక కధ. పారాడే చిన్ని కృష్ణుని కోసం కట్టించిన గోపీనాధ ఆలయం అనేక రూపాంతరాలు చెంది ప్రస్తుతం శిధిలావస్తలో వున్నది.

పూర్వం దేవుడి విగ్రహాలుండి పూజా పునస్కారాలు జరిగేవేమోగానీ, ప్రస్తుతం దానిలో ఏమీ లేవు. పూజలూ వగైరాల మాట అసలే లేదు. ఆలయం బయట మాత్రం కొన్ని విగ్రహాలు పడి వున్నాయి.

పూర్వం ఇక్కడ రెడ్డి రాజులు కట్టించిన శివాలయం కూడా వుండేదిట. కానీ ఇప్పుడు కనబడదు. శ్రీకృష్ణ దేవరాయలు కొండవీడు జయించిన తర్వాత ఇక్కడ జయ స్తంభాన్ని స్ధాపించాడు. తర్వాత ఆయన ఆజ్ఞానుసారం ఆ జయస్తంభానికి పడమరగా, తిరుమల రాయలు విజయ నగర శిల్ప కళా రీతులు ప్రతి బింబించేలా శ్రీ గోపీనాధస్వామి ఆలయాన్ని నిర్మించి, నవనీత బాల కృష్ణుణ్ణి ప్రతిష్ఠించినట్లు ఇక్కడ వున్న శాసనాలలో వున్నదంటారు. ఆలయం పెద్దదే.

ఈ ఆలయం పూర్తిగా విజయనగర శిల్పరీతిలో నిర్మించబడింది. విశాలమైన ముఖ మండపము, రంగమండపము, తర్వాత అంత్రాలయం గర్భాలయం చూడవచ్చు. కానీ ఇవ్వన్నీ శిధిలావస్తలో వున్నాయి. అక్కడ ఒక అనధికారిక గైడ్ వున్నారు. ఆయన కొంత బాగోగులు చూస్తున్నట్లున్నారు. లేకపోతే మనుషులు అడుగు పెట్టలేనట్లు తయారయ్యుండేది. గర్భాలయంలో వెలుతురు లేదు. చెడు వాసన. భరించి టార్చి లైటుతో గోడలను పరికిస్తే బుధ్ధ భగవానుడు, కాళీయ మర్దనుడు నాగబంధం, గోడమీద చెక్కిన చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. ఒక ప్రవేశ ద్వారానికి కుడివైపు నవనీత కృష్ణుని శిల్పాన్ని గోడమీద చూడవచ్చు. ఆలయం ముందు శిధిలమైన నంది, వినాయకుడు, ఒక అమ్మవారి విగ్రహం బోర్లా పడి వుండటాన్ని గమనించవచ్చు. ఇవి పూర్వం ఇక్కడవున్న శివాలయానికి చెందినవి కావచ్చు.

        

తర్వాత కాలంలో అనేక చేతులు మారిన కొండవీడు ప్రాంతం జమీందారుల పాలన వచ్చాక చిలకలూరిపేట జమీందారుల పాలనలోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని కోట గ్రామంగా పిలుస్తున్నారు.

కత్తుల బావిగా మారిన వైనం

పారాడే కృష్ణుణ్ణి పూజించిన ఈ ఆలయంలోనే ఒక ఊరి జనాన్ని భోజనానికి పిలిచి చంపించారంటే నమ్మగలరా. వివరాలు సరిగ్గా తెలియవుకానీ రెడ్డి రాజులనని కొందరూ, వారి సమయంలో అని కొందరూ, మొత్తానికి అసలైతే రెండు వర్గాల మధ్య జరిగిన కుట్ర ఇది. ఒక వర్గం వారు ఇంకొక వర్గం వారిని భోజనానికి పిలిచి ఇక్కడ భోజనాలు పెట్టారు. భోజనం అయిన తర్వాత చేతులు కడుగుకుని అటే వెళ్ళచ్చని వెనకకి పంపించారు. అక్కడ ముందే చేసిన ఏర్పాటు కత్తుల బావిట. బావిలాగా తవ్వించి, అంతా కత్తులు అమర్చారు. అక్కడ కాలు పెట్టినవారు బావిలో పడిపోయేటట్లు వాలు అమర్చారు. దీపాలు లేకుండా చేశారు. చీకటిలో సరిగ్గా తెలియక, అందరూ అందులో పడి చని పోయారుట. ఇది ఆలయం దగ్గర వున్న అనధికారిక గైడ్ చెప్పిన సమాచారం. అప్పటి నుంచీ దీనికి కత్తుల బావి అని, చీకటి కోణం అని పేర్లు వచ్చాయి.

కొండవీడు కోట

కారు కొండ పై దాకా వెళ్ళదని కొంత నడవాలని అనేసరికి మేము సమయాభావం వల్ల కొండ ఎక్కే ప్రయత్నం మానేసి తిరుగుదారి పట్టాము. కానీ దాని గురించి నేను తెలుసుకున్న విషయాలు చెబుతాను. ఇప్పుడు కొండ పైకి వాహనాలు వెళ్తున్నాయన్నారు.

కొండవీడు కోట సమద్ర తటానికి 1700 అడుగుల ఎత్తులో వుంది. ఇది ఒకప్పటి రెడ్డి రాజుల రాజధాని. పైనుంచి చూస్తే చాలా సుందర దృశ్యాలు కనబడుతాయట. అసలు కోట తెలుగు చోళులు కట్టింది, కాకతీయుల చేత బలోపేతం గావించబడింది తర్వాత 1323లో ప్రోలయ వేమారెడ్డి తన రాజధానిని అద్దంకి నుంచి ఇక్కడికి మార్చాడు. తర్వాత ఈ కోట విజయనగర రాజులు, గజపతులు, గోల్కొండ సుల్తానులు, చివరికి ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారి అధీనంలో కూడా వున్నది. అందరూ ఎవరి తరహాలో వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. హిందూ ప్రభువుల కాలంలో సంక్షేమకర ప్రాంతంగా విలసిల్లి, మిగతావారి హయాంలో సంక్షోభకర ప్రాంతంగా పేరు పడ్డది.

క్రీ.శ. 1323లో వరంగల్, ఆంధ్ర ప్రదేశ్ మొత్తం తుగ్లకుల పరిపాలనలోకి వచ్చింది. ఆ సమయంలో ముసునూరి నాయకులంతా కలిసి ముస్లిం పరిపాలన అంతం చేశారు. రెడ్డిరాజులు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. తర్వాత రెడ్డి రాజులలో మొదటివాడు ప్రోలయ వేమారెడ్డి తన రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు. ఈయన, తర్వాత ఐదుగురు రాజులు ఈ ప్రాంతాన్ని దాదాపు వంద సంవత్సరాలు పరిపాలించారు (1328 – 1428). వీరిలో మొదటి వాడయిన ప్రోలయ వేమా రెడ్డి (1353 దాకా పరిపాలన) అనేక కోటలు నిర్మించి (కొడవీడుతో సహా) తన రాజ్యాన్ని పటిష్టం చేశాడు. తర్వాత పరిపాలన చేతులు మారింది .. బహమనీలు (1458), విజయనగర రాజులు (1516), కుతుబ్ షాహీలు (1531 నుంచి 1579 దాకా మధ్యలో కొన్ని సంవత్సరాలు), ముఘలులు (1687), అసఫ్ షాహీ రాజులు, చివరికి బ్రిటిష్ వారు (1766 మరియు 1788).

ప్రస్తుతం

అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో 150 ఎకరాల్లో 150 కోట్లతో అభివృధ్ధి పథకాలు చేపట్టటాటనికి ఇస్కాన్ సంస్ధ కృషి చేస్తున్నది. వెన్న ముద్దల వేణు గోపాలస్వామి కోసం ప్రత్యేకమైన బంగారు ఆలయం కూడా నిర్మించాలని యోచిస్తున్నది.

ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేసి గత వైభవాన్ని తెలియచేసే పథకాలను ప్రభుత్వం కూడా రచిస్తున్నదన్నారు. ఇవ్వన్నీ సక్రమంగా జరిగితే కొద్ది కాలంలోనే ఈ ప్రాంతం అద్భుతమైన పర్యాటక స్ధలంలా మారుతుంది. అంతే కాదు గత చరిత్ర కూడా అందరికీ తెలిసే అవకాశం వుంటుంది అనుకుంటూ అక్కడనుంచి బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here