భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 5: చేబ్రోలు

0
11

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 5” వ్యాసంలో చేబ్రోలులోని ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]పె[/dropcap]ద కాకాని నుంచి గుంటూరు బసకి వచ్చి ఆ రోజుకి ఇంక విశ్రాంతి తీసుకున్నాము.

మర్నాడు కనుమ పండుగ. ఉదయం 9-20కల్లా మా పనులు పూర్తి చేసుకుని శంకర విలాస్‌లో మా రూమ్ ఖాళీ చేసి సామానుతో సహా మా రథం ఎక్కాము. దోవలో కనబడ్డవి చూసుకుంటూ సాయంకాలానికి తెనాలి చేరాలని మా ప్రణాళిక. కొత్త ప్రదేశాలని చూడబోతున్నాననే సంబరంతో ముందుకు దూకింది మా కారు. గుంటూరుకి 13 కి.మీ.ల దూరంలో వున్న చేబ్రోలు మా మొదటి మజిలీ. ఈ చేబ్రోలు మండలానికి చేబ్రోలే హెడ్ క్వార్టర్స్. ఇది తెనాలి రెవెన్యూ డివిజన్‌లో వున్నది. కాకతీయ రాజుల రాజధాని అయిన చేబ్రోలు పూర్వం బౌధ్ధులకు ఆవాసంగా వుండేదట. దీనికి ఆధారం ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే వారు నిర్వహించిన తవ్వకాలలో శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంనాటి అవశేషాలు బయటపడటమే. శాతవాహనుల సమయంలోని నాణేలు ఇక్కడ తవ్వకాలలో బయటపడ్డాయి. శాతవాహనుల పరిపాలనా సమయంలో దీనికి తామ్రపురి, చతుర్ముఖపురం అనే పేర్లు వుండేవి.

పూర్వం ఇక్కడ 101 దేవాలయాలు, 101 బావులు వుండేవని ప్రసిధ్ధి. కాలక్రమంలో అవ్వన్నీ అంతరించి పోయాయి. ఇక్కడ అతి అరుదైన చతుర్మఖ బ్రహ్మాలయం వున్నది.

చేబ్రోలులో ఒకే ప్రదేశంలో చాలా ఆలయాలు వున్నాయి. ఇవ్వన్నీ కూడా 300 సంవత్సరాల క్రితంవే. ముందుగా మేము చూసింది నాగేశ్వరస్వామి మరియు ఇతర ఆలయాలు.

నాగేశ్వరస్వామి ఆలయం

ఇది శివాలయం. గోపురం సన్నగా పొడుగ్గా వున్నది. ఈ ఆలయాన్ని, గోపురాన్ని దేవభక్తుని సోదరులు కాంతన్న, మూర్తన్న నిర్మించారంటారు. ఆలయం ముందు రెండు శాసనాలు క్రీ.శ. 1231లో జాయప సమయంలో చెక్కించబడ్డవి. ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా హూణులకి దక్షిణాది రాజులకి మధ్య వున్న సంబంధాల గురించి తెలుస్తోంది. ఇక్కడ ఇంకా శాసనాలు దొరికాయి కానీ, అన్నీ పరిష్కరింపబడలేదు.

పక్కనే సాయిబాబా ఆలయం. సాయిబాబా ఆలయం పక్కన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ రంగనాధ స్వామి దేవాలయం. దీనిని రాజా వాసిరెడ్డ్ వెంకటాద్రి నాయుడుగారు నిర్మించారు. 2002లో పునరుధ్ధరించారు. అదే కాంపౌండ్‌లో ఆంజనేయస్వామికి వేరే ఆలయం వున్నది.

మేము వెళ్ళేసరికి ఆలయం మూసి వున్నది. కటకటాల తలుపులోంచి స్వామి దర్శనం చేసుకుని, పక్కనే వున్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి ఎదురుగా వున్న చతుర్ముఖ బ్రహ్మ ఆలయానికి బయల్దేరాము.

చతుర్ముఖ బ్రహ్మాలయం

బ్రహ్మ దేవుడికి ఆయనకున్న శాపంవల్ల పూజలు, ఆలయాలు వుండవు. భారత దేశంలో ఒక్క పుష్కర్ లోను, కుంభకోణంలో మాత్రమే బ్రహ్మాలయాలు వున్నాయంటారు. అంత అరుదుగా వుండే బ్రహ్మాలయాన్ని చేబ్రోలులో 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. ఆయన ఈ ఆలయం నిర్మించటానికి కారణం దొంగలు. దాని గురించి రరకరకాల కథలు ప్రచారంలో వున్నాయి. ఆ కాలంలో దొంగలు చాలా భీభత్సం సృష్టించారు. ఒక కథనం ప్రకారం వారిని దోవలోకి తీసుకు రావటానికి నాయుడుగారు దొంగలు లొంగిపోయి మామూలు జీవితాలు గడిపితే వారికి ఎటువంటి హాని కలగనివ్వనని అన్నం మీద ప్రమాణం చేసి చెప్పాడని, అది నమ్మి దొంగలు లొంగిపోతే, వాళ్ళ బాధ శాశ్వతంగా తప్పించికోవటానికి వాళ్ళని చంపించేశాడని, అప్పటినుంచి ఆయనకి అన్నం రక్తంగా, పురుగులుగా కనబడి అన్నం తినలేకపోయాడని, ఆ పాపం పోగొట్టుకోవటానికి ఈ ఆలయం నిర్మించాడంటారు.

ఇంకో కథ ప్రకారం దొంగలనందరినీ ఒకసారి విందుకు పిలిచి అందులో విషం పెట్టి చంపించాడట. మరో కథ ప్రకారం వాళ్ళని శ్రీశైలందాకా తరిమేశాడట. ఏది ఏమైనా దొంగలకి హాని చెయ్యటంవల్ల కలిగిన పాపాన్ని పోగొట్టుకోవటానికి నిర్మించిన ఆలయం ఇది.

పాపాన్ని పోగొట్టుకోవటానికి బ్రహ్మాలయమే ఎందుకు నిర్మించాలి అనే సందేహం రావచ్చు. వెంకటాద్రి నాయుడుగారు తన బాధ నివారణోపాయం గురించి పండితులతో చర్చించారుట. వారు బ్రహ్మ స్వరూపమైన అన్నం మీద ప్రమాణం చేసి, మాట తప్పటంవల్ల వచ్చిన ముప్పు ఇది, దీనిని పోగొట్టుకోవటానికి బ్రహ్మ దేవునికి ఆలయం నిర్మించాలి అని చెప్పారుట. బాగానే వుంది కానీ, శివుడి శాపం వల్ల బ్రహ్మ దేవుడికి పూజలు వుండవు, ఆలయాలు కూడా నిర్మించకూడదుకదా అనే సందేహాన్ని వెలిబుచ్చారు కొందరు. ఆ సందేహానికి సమాధానంగా బ్రహ్మతో కలిపిన శివాలయం కడితే సరిపోతుంది అనుకున్నారు.

ఆగమ శాస్త్రం ప్రకారం వచ్చిన అనేక సందేహాలు నివృత్తి చేసుకుంటూ, ఈ ఆలయాన్ని ఒక కోనేటి మధ్యలో నిర్మించారు. ఇందులో శివలింగం పైన నాలుగు వైపులా బ్రహ్మ ముఖాలు వుంటాయి. బ్రహ్మ అంశంతో శివలింగం. బ్రహ్మకు పూజాదికాలు లేవుగనుక శివలింగానికి చేసిన పూజలే బ్రహ్మ దేవునికి కూడా చెందుతాయి అనుకున్నారు.

బ్రహ్మ దేవుని ఆలయ నిర్మాణం వల్ల కలిగే దోషాలను పోగొట్టటానికి తూర్పున చంద్ర మౌళీశ్వర స్వామిని, పడమర సహస్ర లి౦గేశ్వరస్వామిని, ఉత్తరంలో వేణుగోపాల స్వామిని, దక్షిణాన రంగనాథ స్వాములను, నాలుగు వైపులా అమ్మవారి ఆలయాలను నిర్మించి అష్ట దిగ్బంధం చేశారు. కాల భైరవుడి విగ్రహం కూడా వున్నది.

ఆలయ నిర్మాణం

ఈ ఆలయాన్ని కోనేటి మధ్యలో నిర్మించారు. కోనేటికి మూడు వైపులా మెట్లు, ఒక వైపు ఆలయం చేరుకునే మార్గం. మధ్యలో ఆలయం చిన్నదే. నాలుగు వైపులా నడవటానికి వీలుగా వరండా వున్నది. ముందు ధ్వజ స్తంభము. ఆలయానికి నాలుగు వైపులా ద్వారాలున్నాయి. అంటే నాలుగు వైపులనుంచీ స్వామిని దర్శించవచ్చు. గర్భగుడిలో ఎఱ్ఱరాతితో నిర్మించిన పద్మాకారంలో నల్లటి లింగం. దానిపైన నాలుగు వైపులా బ్రహ్మ ముఖాలు. అందుకే స్వామి బ్రహ్మ లింగేశ్వరుడు. ఎదురుగా మండపంలో ఏకరాతిలో చెక్కిన నందీశ్వరుడు.

చరిత్ర

9వ శతాబ్దంలో చేబ్రోలు రాజధానిగా తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన రెండవ యుధ్ధమల్లుడు పరిపాలించాడు. తర్వాత పశ్చిమ చాళుక్యులు, కాకతీయుల సామంత రాజు జాయపసేనాని ఈ చేబ్రోలుని రాజధానిగా చేసుకుని పరిపాలించారుట. తర్వాత వెలనాటి చోళులు, గోల్కొండ నవాబులు పరిపాలించారు.

మేము వెళ్ళినప్పుడు బ్రహ్మేశ్వరాలయానికి వెళ్ళే దోవ కూడా నీటితో నిండి వుండటంతో ఆలయందాకా వెళ్లలేక పోయాము. మరోసారి వెళ్ళినప్పుడు స్వామి దర్శనమయింది.

చాళుక్య భీముడు కట్టించిన శ్రీ భీమేశ్వరాలయం

అక్కడినుంచి క్రీ శ.892లో చాళుక్య భీమరాజు కట్టించిన అతి ప్రాచీన శ్రీభీమేశ్వరాలయానికి చేరుకున్నాము. ఆ రాజు పేరుతో భీమేశ్వరాలయం అనే పేరొచ్చింది. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ చైత్యం ఉండేది. దాన్నే భీమరాజు భీమేశ్వరాలయంగా మార్చాడని చరిత్రకారులు భావించారు. విశాలమైన ఆవరణ, దాని లోపల ప్రాకారం, మధ్యలో భీమేశ్వరాలయం ఉన్నాయి. గర్భాలయానికి ఈశాన్యంలో చిన్నగుడిలో అమ్మవారు శ్రీబాలాత్రిపురసు౦దరీదేవి కొలువై ఉంటుంది. ఈ రెండు ఆలయాలను కలుపుతూ పెద్ద మండపం ఉంది. ఆలయాలకు ప్రదక్షిణ చేయటానికి చుట్టూ మార్గం ఉన్నది. పెద్ద మండపంలో నందీశ్వరుడు, నందిని దాటి ముందుకు వెడితే ఒక వేదిక, దానికి దిగువన మరొక చిన్న నంది కనిపిస్తాయి. ఇక్కడ నిత్య పూజలతో బాటు శివరాత్రి, కార్తీకమాసం, నవరాత్రులలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.

 

గుడిముందు ఏనుగు మీద సింహం విగ్రహాలున్నాయి. ముందు ఆది కేశవస్వామి ఆలయం. మేము వెళ్ళినప్పుడు ఆలయం మూసివుంది. తాళం వేసే చిల్లిలోంచే స్వామిని చూశాము. రెండవసారి వెళ్ళినప్పుడు దర్శనమయింది.

రోజూ భక్తుల సంఖ్య అంత ఎక్కువగా వుండక పోవటంతో కొన్ని ఆలయాలు మూసి వున్నాయి.

దర్శన సమయాలు ఉదయం 5-30 నుంచీ 10-30 దాకా, సాయంత్రం 5-30 నుంచి 8-30 దాకా.

ఇంక అక్కడనుంచి బయల్దేరి పొన్నూరు వైపు సాగింది మా రథం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here