గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 53, 54: అత్తలూరు

0
7

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 53,54” వ్యాసంలో అత్తలూరు లోని శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం గురించి, విప్పర్ల లోని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం గురించి, వేణుగోపాలస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం, అత్తలూరు-నూతలపాటివారి పాలెం.

[dropcap]ప[/dropcap]చ్చని చేలు, చల్లని గాలి, ప్రకృతి సౌందర్యానికి మైమరస్తూ ఉదయం 8-10కల్లా మల్లాదినుంచి అత్తలూరు చేరుకున్నాము. ఆ ప్రకృతి రమణీయత మధ్య దూరం నుంచి శ్వేతవర్ణంలో ఆలయాలు చాలా అందంగా కనిపించాయి. ఇది కూడా విశాలమైన ఆవరణలో వున్న ఆలయాల సమూహం. అన్ని ఆలయాలూ తీసి వున్నాయి. పూజలు జరుగుతున్నాయి. అన్ని చోట్లా పూజారులు వున్నారు.

ఇందులో ముఖ్యాలయాలు శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామిదీ, అభయాంజనేయస్వామిదీ. వీటిలో అభయాంజనేయస్వామి ఆలయ నిర్మాణం ముందుగా 1510లో జరిగింది. తర్వాత సోమేశ్వరస్వామిది. మూడు సంవత్సరాల క్రితం ఈ ఆలయాలను పునర్నిర్మించారు. అందుకే అన్నీ నూతన ఆలయాలలాగా వున్నాయి.

         

ఆలయం మహా ద్వారం దాటి లోపలకి అడుగు పెట్టగానే చక్కని పూదోట స్వాగతం పలుకుతుంది. తర్వాత తెలుసుకున్నాము ఆ తోట నిర్వహణకి నెలకి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుందిట. అతి విశాలమైన ఆవరణలో వున్న శ్వేతవర్ణ ఆలయాలు, ముందు పూదోట చాలా ఆహ్లాదకరంగా వున్నది. ఎదురుగా శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం. ఇందులో మధ్యలో సోమేశ్వరస్వామి కొలువు తీరి వుంటే ఆయనకి కుడిపక్క ప్రత్యేక ఉపాలయంలో విఘ్నేశ్వరుడు, ఎడమ పక్క ఇంకో ప్రత్యేక ఉపాలయంలో అమ్మ పార్వతీ దేవి కొలువై వున్నారు. ఆ వాతావరణాన్నీ, దేవాలయాన్నీ, దేవతా విగ్రహాలనీ చూస్తుంటే భక్తి భావం పెల్లుబుకుతుంది.

సోమేశ్వరస్వామి ఆలయానికి కొంచెం ముందు కుడివైపు వీరాంజనేయస్వామికి ప్రత్యేక ఆలయం వుంది. ఆక్కడి పూజారిగారు శ్రీ కె.వి.యస్. శర్మగారు చెప్పినదాని ప్రకారం ఈ ఆంజనేయస్వామి ఆలయమే ముందుగా నిర్మింప బడింది.

ఆలయం ముందు బోర్డు మీద (ఆలయాలకన్నా బోర్డు పాతగా కనిపించింది… ఆలయాలు పునర్నిర్మించినప్పుడు బోర్డు తిరిగి వ్రాయించలేదా) రెండు ఊరు పేర్లున్నాయి. అత్తలూరు – నూతలపాటివారి పాలెం గ్రామం అని వున్నాయి. కారణం అడిగాను. రెండు పేర్లూ రాయాలి.. ఒకటి పంచాయతీ రెండవది గ్రామం పేరు అన్నారు.

ఆలయ పునర్నిర్మాణం శ్రీ నూతలపాటి సురేంద్రగారి ఆధ్వర్యంలో శ్రీ గాడిపర్తి సాయిబాబాగారు, ఇంకా భక్త జనుల సహకారంతో జరిగింది.

ప్రస్తుతం పెద్ద కళ్యాణ మంటపం నిర్మించారుట. ఇంకా గోశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని వీలయినంత అభివృధ్ధి చెయ్యాలని వీరందరి సత్సంకల్పానికి మెచ్చుకుంటూ మా తర్వాత మజిలీ విప్పర్ల చేరాము.

శ్రీ కె.వి.యస్. శర్మగారి సెల్ నెంబరు 9963247505

54. శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, విప్పర్ల

విప్పర్లలో మల్లేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం రెండూ మూసి వున్నాయి. తర్వాత మజిలీ విప్పర్ల పక్కనే వున్న వేల్పూరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here