గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 59: కారంపూడి

1
11

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 59” వ్యాసంలో కారంపూడి లోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

సాయంత్రం 6-30కి మాచర్లనుంచి బయల్దేరాము. కారంపూడి చేరేసరికి బాగా చీకటిపడింది. తప్పదు మరి. మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే కుదురుతుందో లేదో. చరిత్రలో ప్రసిధ్ధికెక్కిన కారంపూడి, బ్రహ్మనాయుడు చాపకూడు పెట్టిన చెన్నకేశవస్వామి ఆలయం చూడకుండా వెళ్ళటానికి మనస్కరించక చీకటైనా సరేనని వెళ్ళాము.

చరిత్ర

దాయాదుల సమరంతో మహాభారతంతో సమానంగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది పల్నాటి చరిత్ర. భీకర యుధ్ధంలో ఎందరో వీరులు అసువులు బాసిన కార్యమపూడే ఇప్పటి కారంపూడి. ఆ వీర నాయకులకు ప్రతీకగా వున్న ఆయుధాలకు ఇప్పటికీ పూజలు నిర్వహించటం, వారి పేరుతో ఆరాధనలు చేయటం ఇక్కడ పరిపాటిగా వస్తోంది. ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్యనాడు ప్రారంభమయ్యే ఈ ఆరాధనోత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహిస్తారు.

పల్నాటి యుధ్ధం క్రీ.శ.1187లో జరిగింది. ఈ యుధ్ధంలో గురజాల, మాచర్ల రాజులైన నలగాముడు, మలిదేవాదులు తలపడ్డారు. శైవం కోసం నాగమ్మ, వైష్ణవం కోసం బ్రహ్మనాయుడి వర్గాలు పోరులో తలపడ్డాయి. అప్పటికే వైష్ణవం ద్వారా ప్రజల్లో సమసమాజ స్ధాపనకు బ్రహ్మన్న సుస్ధిర స్ధానం పొందాడు. శైవాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాట ముఖ్య స్ధానం సంపాదించింది. బ్రహ్మన్న మాచర్ల, కారంపూడిల్లో చెన్నకేశవస్వామి దేవాలయాలను ఏర్పాటు చేసి చాపకూటిని ప్రవేశపెట్టాడు. ఎత్తులు, పై ఎత్తుల మధ్య, ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూ పల్నాటి యుధ్ధానికి అతిరథులు బీజం వేశారు. ఈ రెండు రాజ్యాలకు మధ్య వున్న కారంపూడి రణక్షేత్రమయింది. చివరికి బ్రహ్మన్న, నాగమ్మలు కత్తులు దూసినప్పటికీ, బ్రహ్మన్న వైరాగ్యంతో గుత్తికొండ బిలంలోకి ప్రవేశించటం, నాగమ్మ మంత్రిగా నలగామునితో రాజ్యం చేయించటంతో పల్నాటి యుధ్ధం ముగిసింది.

ఇది చరిత్ర. గ్రామంలో నేటికీ ఆ చారిత్రిక చిహ్నాలు వున్నప్పటికీ ఆదరించేవారు కూడా అవసరమే.

శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం

దేవాలయాల్లోకూడా కూడా వివిధ రకాలు వుంటాయి. గ్రామ నిర్మాణానికి ముందు ఆలయం నిర్మించి తర్వాత గ్రామ నిర్మాణం జరిగితే అలాంటి దేవాలయాన్ని స్వతంత్ర దేవాలయం అనిగానీ ఉత్తమ దేవాలయం అనిగానీ అంటారుట. కారంపూడిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి దేవాలయం గ్రామ నిర్మాణానికి ముందే జరిగిందనీ, స్వామి స్వయంవ్యక్తులనీ గజారణ్య సంహితలో చెప్పబడింది. అందుకనే ఇది ఉత్తమ దేవాలయంగా ప్రశంసింపబడుతోంది.

దేవాలయం గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, ఆస్ధాన మండపం, ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, కళ్యాణ మండపం, మహాద్వారం, ఉత్తర ద్వారం వగైరా అన్ని హంగులతో ఉత్తమ ఆలయంగా పరిగణింపబడుతోంది.

స్వామి చతుర్భుజుడు. ఇక్కడ స్వామికి ఎడమ చేతిలో చక్రము, కుడి చేతిలో శంఖము, ఒక చేతిలో గద వుంటాయి. పాదాల దగ్గర కుడివైపు శ్రీచక్ర యంత్రము, ఎడమ వైపు శ్రీ చక్ర పెరుమాళ్ళు వుంటారు. చుట్టూ మకర తోరణం. ఈ స్వామి యుగయుగాలుగా దేవతలు, మహాఋషులు పండితులు, పామరులచే పూజలందుకుంటున్నాడు.

స్వామికి ఎడమచేతి పక్కన ప్రత్యేక దేవాలయంలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు పూజలందుకుంటున్నది. అమ్మవారు పద్మాసనాసీన. చతుర్భుజి. పై చేతులలో కమలములు, కింద చేతులు అభయ వరద ముద్రలతో ప్రసన్న మూర్తిగా దర్శనమిస్తున్నది. స్వామికి కుడి చేతి పక్కన ప్రత్యేక దేవాలయంలో శ్రీ గోదాదేవి, ఇంకా ఆళ్వారులు వున్నారు.

స్ధల పురాణం

పూర్వం ఈ ప్రాంతాన్ని గజారణ్యం అనేవారు. ఇక్కడ శమీవనంలో మృకండ మహర్షి తన భార్య మరుద్వతితో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. తర్వాత వారి పుత్రుడు మార్కండేయుడు కూడా యముణ్ణి ఎదిరించి, దీర్ఘాయువును పొంది ఇక్కడ తపస్సు చేసుకునేవాడు.

ఆ సమయంలోనే కేశి అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి తనకి ఏ ఆయుధం వల్ల మరణం లేకుండా వరం పొందాడు. ఆ వర గర్వంతో అందరినీ బాధిస్తూ తనకెదురు లేదంటూ విహరించసాగాడు. ఒకసారి కేశి శమీవనంలో తపస్సు చేసుకుంటున్న మార్కండేయుణ్ణి చూసి అతనికి తపోభంగం చేయబోయాడు. మార్కండేయుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించాడు. నారాయణుడు ఆ ప్రార్ధన విని కేశితో భీకరమైన యుధ్ధం చేశాడుగానీ బ్రహ్మదేవుని వరంవల్ల ఆ రాక్షసుణ్ణి ఏ ఆయుధంతో చంపలేకపోయాడు. అప్పుడు ఆది శేషువుని ఆ రాక్షసుడిపైకి పంపాడు. ఆది శేషు తన విష జ్వాలలతో ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. అప్పుడు మార్కండేయుడు నారాయణుణ్ణి లక్ష్మీదేవితో కలసి ఆ స్ధలంలో కేశవనామంతో వెలసి తమ పూజలందుకోమని కోరగా స్వామి అతని కోరిక మన్నించి చెన్నకేశవస్వామిగా వెలిశాడు. కేశిని సంహరించిన ఆదిశేషుడు స్వామి చేతిలో అస్త్రంగా వెలిశాడు. అమ్మవారు రాజ్యలక్ష్మిగా వెలిసింది. అలా స్వామి తన కార్యక్రమాన్ని పూర్తి చేసి వెలిసిన గ్రామం కార్యంపూడి.. ప్రస్తుతం కారంపూడిగా వ్యవహరింపబడుతోంది.

        

యుగయుగాలుగా విరాజిల్లుతున్న ఈ స్వామి మహత్యాల గురించి వివిధ కథలు ప్రచారంలో వున్నాయి.

విశేషాలు

కారంపూడి చెన్నకేశవస్వామి బ్రహ్మనాయుడి కులదైవం.

సమర క్షేత్రంలో అలనాటివీర నాయకులకు ప్రతీకగా వున్న ఆయుధాలకు (వీటిని కొణతాలు అంటాలు) పూజలు నిర్వహించటం, వారి పేరుతో ఆరాధనలు చెయ్యటం ఇక్కడ ఆనవాయితీ. కార్తీక అమావాస్యనాడు ఈ ఆరాధనోత్సవాలు ప్రారంభమయి ఐదు రోజులపాటు జరుగుతాయి.

స్వామి ముందు బ్రహ్మనాయుడి ఆయుధం చూడవచ్చు.

బ్రహ్మనాయుడు చాపకూడు ప్రవేశ పెట్టింది ఇక్కడేనంటారు.

ఆలయం బయట రోడ్డుమీద బ్రహ్మనాయుడి విగ్రహం ప్రతిష్ఠించారు.

బ్రహ్మనాయుడు కాలంనాటి దేవాలయం శిధిలావస్ధకు చేరడంతో 2004లో ఈ ఆలయం పునర్నిర్మింపబడింది.

ఉత్సవాలు

అన్ని ఉత్సవాలు విశేషంగా జరిగే ఈ ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి దేవాలయంలో విశేష పూజ జరుగుతుంది.

ఆ రోజే వీర్లగుడి మండపంలో పోతురాజు శిలకు పడిగం కడతారు. ఆ రోజునుంచి తిరునాళ్ళ పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. కార్తీక అమావాస్య రోజున తిరునాళ్ళు ప్రారంభం అవుతాయి. ఐదు రోజులపాటు సాగే ఈ తిరునాళ్ళలో మొదటి రోజు – రాచగావు, 2వ రోజు – రాయబారం, 3వ రోజు – మంద పోరు, 4వ రోజు –కోడిపోరు, 5వ రోజు – కల్లిపాడు నిర్వహిస్తారు. దీన్నే వీర్ల తీరునాళ్ళంటారు. దీనికి, ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ తిరునాళ్ళల్లో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామికి ప్రత్యేక అలంకరణలు, పూజలు వగైరా కార్యక్రమాలన్నీ దేవాదాయ-ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి.

మార్గం

జిల్లాలో అన్ని ప్రాంతాలనుంచి కారంపూడికి బస్సు సౌకర్యం వున్నది.

కారంపూడిలో చూడవలసిన చారిత్రక విశేషాలు వున్నాయిగానీ అప్పటికే బాగా చీకటి పడటంతో ఇంటిదారి పట్టాము (సమయం రాత్రి 8-15)

ఇక్కడి ప్రధాన అర్చకులు శ్రీ కొమండూరి సత్యనారాయణచార్యులు ఫోన్ నెంబర్లు 9951660093 మరియు 7989431611

ఈరోజు చూసిన ఊర్లు 8, దర్శించిన ఆలయాలు 12. ఉదయం 5-45కి ఇంట్లో బయల్దేరితే రాత్రి 11-25 అయింది ఇల్లు చేరేసరికి. ఈ రోజు 440 కి.మీ.లు తిరిగాము మరి. మళ్ళీ ఇంకో రోజు దర్శించిన ఆలయాల విశేషాలతో వచ్చేవారం కలుద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here