[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 6” వ్యాసంలో పొన్నూరు లోని ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]పొ[/dropcap]న్నూరు గుంటూరు – చీరాల రహదారి మీద వున్నది. ఈ పొన్నూరుని పూర్వం స్వర్ణపురి అని పిలిచేవారు. ఆ రోజుల్లో ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువగా వుండటంతో ఆ పేరు వచ్చింది అంటారు. ఆ తరువాత స్వర్ణపురి తమిళరాజుల పాలనలోకి వెళ్ళింది. వారి భాష ప్రకారం ఈ ఊరు పొన్నూరు అయింది. తమళంలో పొన్ను అంటే బంగారం. భాష మారిందిగానీ, అర్థం మారలేదు కదా. అప్పటినుంచి ఇదే పేరు వాడుకలో వుండిపోయింది.
నిడుబ్రోలు పొన్నూరుని ఆనుకుని వున్న ఒక గ్రామం. నిడుబ్రోలు, పొన్నూరు కలిసి ఒక పెద్ద పట్టణం అనిపిస్తాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ నిడుబ్రోలు పేరుతోనే వున్నది.
వ్యవసాయం, వివిధ రకాల ఉత్పత్తులు, కూరగాయలు, తమలపాకులకు ప్రసిధ్ధి చెందింది పొన్నూరు. ఇక్కడి నుంచి తమలపాకులు చెన్నై, బెంగళూరు, ముంబయి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
పొన్నూరు అనగానే చాలామందికి గుర్తు వచ్చేది భావనారాయణ స్వామి ఆలయం (మాకు మాత్రం అక్కకడికి వెళ్తేగానీ తెలియలేదు). ఊళ్ళోకి వెళ్ళగానే దానికన్నా ముందే కనబడతాయి 1961లో నిర్మింపబడిన ఆంజనేయస్వామి, సహస్ర లింగేశ్వరస్వామివార్ల ఆలయ సముదాయం. భావన్నారాయణ ఆలయంతో సమానంగా ఇవి కూడా పేరు పొందాయి.
ముందుగా కనబడ్డ ఆలయంలోకి ప్రవేశించాము. ఒక పెద్ద కాంపౌండ్‌లో అతి విశాలమైన ఆవరణలో నిర్మింపబడ్డ ఆలయ సమూహమది. లోపలకి ప్రవేశించగానే కుడివైపు అద్భుతమైన ఆంజనేయస్వామి ఆలయం చూస్తాము. ఆలయంలోకి అడుగు పెడుతూనే ఎదురుగా వున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం చూసి అప్రయత్నంగా చేతులు జోడిస్తాము.
ఆ విగ్రహం 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉన్నది. విశేషమేమిటంటే అది ఏకశిలలో చెక్కబడింది. అదీ నల్ల రాయి. దీనిని శ్రీ కనిగల్పుల కోటయ్య, తాయమ్మ అనే దంపతులు తమ స్వంత ఖర్చులతో చేయించారుట. దీనిని యడ్లపాడులో తయారు చేశారు. సద్గురు జగన్నాధ స్వామి అనే స్వామి పూనుకుని ఈ కార్యక్రమం పూర్తి చేశారు. ఆయన స్వయంగా చాలా గ్రామాలు తిరిగి, శిష్యులకు జప దీక్షనిచ్చేవారుట. విగ్రహం తయారై బయల్దేరే సమయంలో ఆయన అన్ని గ్రామాల భక్తులను ఆహ్వానించి, యడ్లపాడునుంచి పొన్నూరులో దేవాలయం చేరేవరకు ఏ విధమైన ఆటంకాలు కలుగకుండా చూడమని తాము చేసిన జప ఫలితాన్ని ధారపోసి, చక్కని క్రమశిక్షణతో, దీక్షతో, పెద్ద ఊరేగింపుతో ఆ విగ్రహాన్ని పొన్నూరు తీసుకు వచ్చారు. యడ్లపాడులో బయల్దేరేటప్పుడు వెలిగించిన అఖండ జ్యోతి పొన్నూరు ఆలయం చేరేవరకు వెలిగేటట్లు చూశారు. ఆ జ్యోతి ఇప్పటికీ అఖండంగా వెలుగుతూనే వున్నది.
విగ్రహ నిర్మాణానికి రెండు సంవత్స్సరాలు పట్టింది. అక్కడి నుండి పొన్నూరుకు చేర్చటానికి ఒక ఏడాది పట్టింది. అంతటి అకుంఠిత దీక్షతో భక్తులు స్వామిని పొన్నూరుకు తెచ్చుకొన్నారు. అందుకే భక్తులపాలిటి ‘’కొంగు పొన్ను’’ అంటే బంగారం అయ్యాడు వీరాంజనేయస్వామి. స్వామి ఎడమ చేతిలో భారీ గదతో, కుడి చేయి పైకెత్తి దర్శనమిస్తాడు. తోక శిరస్సుదాకా వుండి వెనక కనిపిస్తుంది. ఆభరణాలతో, పూల మాలలతో, వెండి నేత్రాలు, నుదుట వెండి తిరునామంతో ఉంటాడు. లంగోటి కట్టికనిపిస్తాడు. ఒకసారి స్వామిని చూసినవారెవరూ ఆ విగ్రహాన్ని మర్చిపోలేరు.
ఆంజనేయస్వామి ఆలయం లోపల ప్రదక్షిణ మార్గంలో ఆంజనేయ చరిత్ర చిత్ర పటాల రూపంలో పొందు పరచారు.
అక్కడనుంచి బయటకివచ్చి పక్కనే వున్న సహస్రలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాము మధ్యలోవున్న ఉపాలయాన్ని చూసుకుంటూ.
సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం
బ్రహ్మశ్రీ సద్గురు శ్రీ జగన్నాధస్వామి ఈ ఆలయ స్ధాపకులు. గుడి లోపల చుట్టూ 12 వరసల్లో, వరసకి 9 శివ లింగాలు చొప్పున, పైన ఒక వరసకి 3 లింగాలు చొప్పున 10 వరసల్లో ప్రతిష్టించారు. స్వామికి నర్మదా నదిలో దొరికిన లింగాలు రకరకాల సైజుల్లో వుండటంతో నాగేద్రుని పడగ కింద ఐదు లింగాలు ప్రతిష్టించారు. ఎదురుగా నంది, వినాయకుడి ఆలయం.
ఇతర ఆలయాలు
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ప్రతి ఆలయం ఎదురుగా అఖండ జ్యోతికి ఐదు అంతస్తుల స్తూపంలా నిర్మించారు. మెట్ల ద్వారా పై అంతస్తుకి చేరుకోవచ్చు.
సహస్ర లింగేశ్వర ఆలయం తర్వాత దశావతారాల ఆలయం వున్నది. ఇందులో మొదట్లో ఎడమ వైపు సత్యన్నారాయణ స్వామి, ఎదురుగా పద్మాసనంలో గరుత్మంతుడు, దశావతారాలే కాక శేష తల్పం మీద శ్రీ మహా విష్ణువు, వెలుపలి ప్రాకారంలో పాండురంగ స్వామి, రుక్మాబాయిల విగ్రహాలు వున్నాయి.
తర్వాత ఆలయం గరుత్మంతుడిది. ఈయన విగ్రహాన్ని 26-2-1969లో ప్రతిష్టించారు. ఈ విగ్రహం 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో, కాళ్ళ దగ్గర పెద్ద పాముతో వుంటుంది. పక్కనే ఆలయ స్ధాపకులు శ్రీ జగన్నాధస్వామి విగ్రహం, హరికధా గాన భంగిమలో వున్నది.
ఇవేకాక ఈ ప్రాంగణంలో ఇంకా ఇతర ఉపాలయాలు కూడా వున్నాయి. మొత్తానికి కొన్ని మంచి ఆలయాలు గరుత్మంతునిది, ఆంజనేయ స్వామిది అంత పెద్ద విగ్రహాలతో వున్న ఆలయాలు, సహస్ర లింగాలు ప్రతిష్టింపబడ్డ ఆలయం, శ్రీ మహా విష్ణువు దశావతారాలు ఒకే చోట వున్న ఆలయాన్ని చూశామన్న తృప్తితో బయటకి వచ్చి కారెక్కి ఆ గుడి కాంపౌండ్ దాటామో లేదో, కనిపించిందో పురాతన గోపురం. మా కారు టక్కున ఆగిపోయింది. అది ఆ ఊరిలో ప్రసిధ్ధి చెందిన అతి పురాతనమైన శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయమని లోపలకి వెళ్ళాక తెలుసుకున్నాము.
మరి ఆ ఆలయాన్ని దర్శించి అక్కడి విశేషాలు తెలుసుకోవాలి కదా. అందుకే దిగి లోపలకి వెళ్ళాము. ఆ వివరాలు వచ్చే వారం.