గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 60: అమృతలూరు – 1

0
9

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 60” వ్యాసంలో అమృతలూరు లోని శ్రీ అమృతేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

2018 అక్టోబర్ 3వ తారీకు పొద్దున్నించి రాత్రి దాకా తిరిగాముకదా. అందుకనే 4వ తారీకు విశ్రాంతి. 5వ తారీకు మళ్ళీ పొద్దున్నే బయల్దేరామంతా అదే కారులో. ఈ మారు ముందుగా అమృతలూరు వెళ్ళాము. కిందటిసారి ఆ పరిసరాలకు వెళ్ళినా సమయం చాలక ఈ ఊరు వెళ్ళకుండా వచ్చేశాము.

ఇక్కడ విశేషమేమిటంటే ఆలయ కమిటీ మెంబరు శ్రీ రామకృష్ణగారు కలిసి అమృతలూరు గ్రామ కైఫియ్యత్తు పుస్తకాన్ని ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనే ఈ కైఫియ్యత్తు అనే మాట ఎక్కువ విన్నానండీ. కొందరు అడిగారు కూడా కైఫియ్యత్తు చదివారా అని. అప్పటికి అదొకటుంటుందని నాకు తెలియదు. ఈ కైఫియ్యత్తు 2016లో అచ్చుకాబడినది. గ్రామ వివరాలు వున్నాయి. ప్రతి గ్రామానికీ ఇలాంటి పుస్తకం వుంటే గ్రామం గురించి అందరికీ తెలుస్తుందికదా అనిపించింది. నేనిప్పుడు చెప్పబోయే వివరాలన్నీ ఆ కైఫియత్తు నుంచి సేకరించినవే.

అమృతేశ్వరస్వామి ఆలయం

ఇది ఈ ఊరుకన్నా ముందు నిర్మింపబడిన ఆలయం. ముందు ఆలయాన్ని నిర్మించి తర్వాత ఊరు నిర్మిస్తే ఆ దేవాలయాన్ని ఉత్తమ దేవాలయంగా పరిగణిస్తారు. అమృతలూరు లోని అమృతేశ్వరస్వామి ఆలయం అలాగే ముందు నిర్మింపబడింది.. తర్వాత ఆ స్వామి పేరు మీదే ఊరు నిర్మింపబడింది. అందుకని ఇది ఉత్తమ దేవాలయం. ఇంక దేవాలయం నిర్మింపబడిన కథేమిటంటే…

ఇప్పటి జనావాసాలు చాలా పూర్వకాలం అరణ్యాలుగా వుండేవి. అలాగే ఈ ప్రాంతం కూడా అడవే. ఒక గొల్లవాడికి పశువులు ఎక్కువగా వుండటంతో వాటన్నింటికీ మేత బాగా దొరుకుతుందని సమీపంలో వున్న ఈ అరణ్యానికి తోలుకు వచ్చేవాడు. ఆ మందలో ఒక ఆవు రోజూ అక్కడవున్న ఒక పుట్ట మీద పాలని వర్షించి వెళ్ళేది. రోజూ సాయంకాలం ఇంటికి వెళ్ళాక ఆ గోవు పాలివ్వకపోవటం గమనించి యజమాని ఒక రోజు ఆ గోవుని వెంబడించి, అది పుట్టలో పాలు వర్షిస్తున్నప్పుడు ఒక చెట్టు మీద దాక్కుని తన చేతిలో వున్న గొడ్డలిని దాని మీదకి విసిరేశాడు. గొడ్డలి తగిలేసరికి బెదిరిన ఆవు పుట్టలో వున్న శివలింగం మీద కాలు పెట్టి పరిగెత్తింది. దానితో లింగం పైన ఆవు గిట్ట అంత మేర పగిలిపోయింది.

ఆ రాత్రి గొల్లవాడికి శివుడు కలలో భయంకరాకారంతో కనిపించి నేను అమృతేశ్వరుడ్ని, చాలా కాలంనుంచీ ఈ పుట్టలో వున్నాను, ఆ ఆవు ఇస్తున్న క్షీరాన్ని స్వీకరిస్తున్నాను. నువ్వు పుట్ట తవ్వించి నన్ను పైకి తీసి ఆలయం నిర్మించి పూజాదికాలు నెరవేర్చమని ఆజ్ఞాపించాడు. ఆ గొల్లవాడు మేలుకుని, తన బంధువులకీ విషయం తెలిపి అందరూ కలిసి పుట్ట దగ్గరకు వచ్చి తవ్వించ చూడగా శివలింగం కనిపించటంతో సంతోషించారు. అక్కడే ఆలయం నిర్మించి ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత కొంత కొంత అడవి నిర్మూలించి వూరు కట్టారు. అమృతసమానమైన క్షీరాన్ని సేవించినవాడు కనుక ఆ శివుడు అమృతేశ్వరుడయ్యాడు, ఆ దేవుడి పేరుతో వూరు కట్టినందువల్ల ఆ ఊరు అమృతలూరు అయింది. వాడుకలో అది అమర్తలూరు అయినా, అంత చక్కని తమ వూరు పేరును వదులుకోవటం ఇష్టంలేక కైఫియ్యత్తులో ఊరి పేరుని అమృతలూరుగానే అన్ని చోట్లా వ్యవహరించి, గ్రామనామ చరిత్రని కాపాడుకుంటూ ముందు తరాలవారికి అందించటం గ్రామస్తుల కనీస బాధ్యత అని లిఖించబడింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే చరిత్రలు కలకాలం నిలుస్తాయి.

        

మేము వెళ్ళేసరికి అమృతేశ్వరస్వామికి అభిషేకం జరుగుతున్నది. స్వామికి కుడిపక్క వినాయకుడు, ఎడమవైపు అమ్మవారు కొలువు తీరి వున్నారు. శిధిలమవుతున్న ఈ దేవాలయం పునర్నిర్మాణం ప్రభుత్వ, పుర ప్రముఖుల సహకారంతో జరుగుతోంది. పునర్నిర్మాణ సమయంలో తీసిన దేవతా మూర్తుల విగ్రహాలు పక్కనే వున్న చెట్టు చుట్టూ పెట్టారు.

ఈ ఊళ్ళో ఇంకా వేరే దేవాలయాలు కూడా చూశాము. వాటి గురించి వచ్చే వారం ముచ్చటించుకుందాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here