గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 65, 66: నవులూరు, సీతానగరం

1
7

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 65, 66” వ్యాసంలో నవులూరు లోని శ్రీ నాగేంద్రస్వామి పుట్ట గురించి, సీతానగరం లోని శ్రీమద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

65. నవులూరు

శ్రీ నాగేంద్రస్వామి పుట్ట

నవులూరు మంగళగిరి మండలంలోది.. మంగళగిరి శివార్లల్లో వున్నట్లు వుంటుంది. అచ్చమయిన పల్లెటూరి వాతావరణం. సన్నటి సందులు, దోవకటూ ఇటూ చెట్లూ సిటీలో వుండేవాళ్ళకి కన్నుల పంటే. మేము వెళ్ళదల్చుకున్న ఆలయం కొంచెం వెతికాక కనబడింది. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం అంటే అక్కడి వాళ్ళు చెప్పలేక పోయారు. తర్వాత ఒకరు నాగేంద్రడి గుడా.. పుట్ట కదా అని దోవ చెప్పారు. ఒక మామిడి తోటలో వున్నది ఈ పుట్ట ఆలయం. ఇదే నవులూరు పుట్ట తోటగా పేరు పొందింది.

తోట గేటుకి ఆర్చీ, కట్టించినవార్ల పేర్లతో వున్నది. పక్కనే చిన్న బోర్డు మేము వెళ్ళవలసిన ఆలయం అదేనని తెలిపేటట్లు. లోపలకి కొంచెం దూరం నడిచాక పైన నాగేంద్రుని బొమ్మలతో వున్న మండపాలు కనిపించాయి. కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళమన్నారు. పెద్ద గది దాని మధ్యలో పెద్ద పుట్ట. చుట్టూ ఒక మనిషి తిరగటానికి స్ధలం వున్నది. బహుశా పుట్ట చుట్టూ గోడ కట్టి వుండవచ్చు. లోపలకి వెళ్ళినా భయం. ఏ పక్కనుంచి ఏ పాము వస్తుందో అని. అలాగే ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసి బయటకు వచ్చి అక్కడ వున్నావిడతో మాట్లాడాము. జంట నాగులు వున్నాయట ఆ పుట్టలో. బయటకి వస్తుంటాయిట. ఎవరీనీ ఏమీ చేయవు, ఏ భయం లేదని చెప్పింది.

    

ఇంకొక విశేషమేమిటో తెలుసా ఇక్కడ ముస్లింలు కూడా ప్రార్థనలు చేస్తారుట. గర్భగుడి బయట జెండా చెట్టు వుంది. హిందువులు నాగేంద్రుడు పేరుతో లోపల పుట్టకు పూజ చేస్తే, ముస్లింలు నాగుల్ మీరా పేరుతో పూజిస్తారు. ఎవరికైనా ఈయన సంతానాన్ని ప్రసాదించే దేవుడిగా ప్రఖ్యాతి పొందాడు.

ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల పొంగళ్ళు నైవేద్యాలు పెడతారు. ప్రదక్షిణలు చేస్తారు. చిన్న పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించటం, చెవి పోగులు కుట్టించటం, అన్నప్రాసనవంటి కార్యక్రమాలు ఇక్కడ చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. నాగుల చవితికి, సుబ్రహ్మణ్య షష్టికి విశేష పూజలు జరుగుతాయి.

అక్కడనుంచి ఈ రోజుకి మా ఆఖరి మజిలీ సీతానగరం బయల్దేరాము.

66 సీతానగరం

శ్రీమద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవస్ధానం

కృష్ణానదికి ఇవతల ఒడ్డు (ప్రకాశం బేరేజ్ కీ) కృష్ణా జిల్లాలో ముఖ్య పట్టణం విజయవాడ అయితే అవతలి ఒడ్డు సీతానగరం. ఇది గుంటూరు జిల్లాలోకి వస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామిది అతి ప్రాచీన ఆలయం వున్నది. పక్కనే శ్రీ కోదండ రామస్వామి దేవాలయమూ వుంది. ఇక్కడ త్రిదండి శ్రీ రామానుజ జియ్యర్ గారి ఆశ్రమం వున్నది. కొండమీద పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తున్నారుట. మేము కొండపైకి వెళ్ళ లేదు.

ఈ స్ధలానికి వున్న పురాతన గాథ రామాయణంతో ముడిపడి వున్నది. అది ఏమిటంటే త్రేతా యుగంలో రావణుడు సీతను అపహరించుకు పోతుంటే ఆమె నగ ఒకటి ఇక్కడ జారిపడిందనీ, సీతాన్వేషణకు బయల్దేరిన హనుమకి ఆ నగ ఇక్కడ దొరికిందనీ, అందుకే సీతానగరం అయిందని అంటారు. మరి ఒక కధనం ప్రకారం శ్రీరామచంద్రుడు సీతను కోల్పోయిన తర్వాత ఇక్కడ సీతా సీతా అని సీత కోసం దుఃఖించాడుట. అందుకే ఈ ప్రదేశం సీతానగరం అంటారు.

    

మరుగున పడ్డ ఈ స్వయంభూ ఆంజనేయస్వామి విగ్రహం 150 సంవత్సరాల క్రితం మళ్ళీ వెలుగులోకి వచ్చిందట. తమ్మిన అంకమ్మ శ్రేష్ఠిగారు ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆయనకు హనుమంతుడు కలలో దర్శనమిచ్చి తాను ఇక్కడ వున్నానని, తనని గుర్తించి బయటకి తీసి ఆలయ నిర్మాణం చెయ్యమని కోరాడుట. శ్రేష్ఠిగారు ఈ విషయం అందరికీ తెలియజేసి అందరినీ సమీకరించి విగ్రహం కోసం వెతికి కనుక్కున్నారు. అక్కడికి చేరటానికి మార్గం ఏర్పాటు చేసి తర్వాత ఆలయాన్ని నిర్మించారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఈ ఆంజనేయస్వామి పేరు పొందాడు.

ఈ ఆలయంలో శ్రీ కోదండరామస్వామికి ప్రత్యేక ఆలయంతోబాటు అనేక ప్రత్యేక ఆలయాలు, ఉపాలయాలు వున్నాయి.

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం

ప్రక్కన వున్న కొన్ని మెట్లు ఎక్కి వెళ్తే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటాము. పూజారిగారు చెప్పినదాని ప్రకారం ఇది 300 సంవత్సరాల క్రితంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారు 101 శివాలయాలు ఒకేసారి నిర్మించారుట. వాటిలో ఒకటి ఇది. ఆయన సమయంలో అన్ని దేవాలయాలకూ స్వామి కైంకర్యానికి భూములు ఇచ్చారుట. స్వామి పేరు శ్రీ రాజరాజేశ్వరస్వామి అనీ, అమ్మవారు శ్రీ రాజేశ్వరీదేవని చెప్పారు.

  

కృష్ణానది ఒడ్డున వున్న ఈ ఆలయ దృశ్యాలు రమణీయంగా వుంటాయి. సాయం సమయంలో ప్రకాశం బేరేజ్ మీది విద్యుద్దీపాలు కృష్ణమ్మలో ప్రతిబింబిస్తుంటే, దూరంగా కనకదుర్గమ్మ ఆలయ దీపాలు అభయమిస్తుంటే, కృష్ణమ్మ మీద నుంచి వచ్చే చల్లని గాలి సందడి చేస్తుంటే ప్రశాంతంగా కొంత సేపు గడపటానికి మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది.

కానీ ఇంటికి వెళ్ళక తప్పదుకదా. ఇవాళ ఉదయం నుంచీ అయిదు ఊళ్ళు, 12 ఆలయాలు దర్శించాము. ఇవాళ్టితో గుంటూరు జిల్లా గురించి వ్రాద్దామనుకున్న తర్వాత ప్రత్యేకించి బంధువులతో కలిసి చేసిన ఆలయ పర్యటన పూర్తయింది. ఈ జిల్లాలో ఇంకా కొన్ని ఆలయాలు మేము అప్పుడప్పుడూ చూసినవి వున్నాయి. వాటిని గురించి కూడా తెలుసుకుందాము వచ్చే వారంనుంచీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here