గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 67: వైకుంఠపురం

1
8

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 67” వ్యాసంలో వైకుంఠపురం లోని శ్రీ గంగా పార్వతీ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]నా[/dropcap] ఆలయాల పిచ్చి చూసి మావాళ్ళు నాకు కొన్ని ఆశలు కూడా పెడుతూ వుంటారండీ. ఒకసారి తెనాలి వెళ్ళినప్పుడు మా శకుంతలత్తయ్య కూతురు లక్ష్మి నాకో ఆశ పెట్టింది. వదినా, మా ఇంటికొస్తే నేను నిన్ను వైకుంఠపురం తీసుకెళ్తానని. నేను లొంగుతానా.. వైకుంఠపురం ఇక్కడే వుందికదా.. పైగా నేను చాలా సార్లు చూశాను అన్నాను పప్పులేవీ వుడకవు అంటూ. తను అంతకన్నా.. నువ్వు చూసింది తెనాలి వైకుంఠపురం, నేను చూపిస్తానన్నది అమరావతి దగ్గర వైకుంఠపురం. అదీ ఒక కొండమీద వున్న గుహాలయం. అందులో వున్నది వెంకటేశ్వరస్వామి అన్నది. కొండ అంటున్నావు, మెట్లెక్కాలా అని అడిగాను ఎందుకైనా మంచిదని. అబ్బే, ఎంతో దూరం వుండదు.. ఒక ఫర్లాంగు దూరం నడిస్తే సరిపోతుంది అన్నది. అప్పటినుంచీ ఆ ఆలయం ఎలా చూడాలా అనే తహతహ. మొత్తానికి 3 జనవరి 2016 నాడు విజయవాడ వెళ్ళినప్పుడు ఆ కోరిక తీరింది.

ఉదయం 7-40 కి బయల్దేరి నేను, మా చెల్లెలు విమల, వాళ్ళమ్మాయి నీలిమ విజయవాడ బస్ స్టాండ్ చేరుకుని అమరావతి వెళ్ళే బస్ ఎక్కాము. వైకుంఠపురం అని చెబితే రోడ్డుమీద దించాడు. అప్పటికే ఉదయం 10 గం. దాటింది. జనవరి అయినా ఎండ బాగా వుంది.

               

అక్కడనుంచీ ఆలయం దగ్గరే. ముందు రోడ్డుకి ఎడమవైపు గోపురం కనబడింది. అదీ వెంకటేశ్వరస్వామి గుడే. దానిలోకి వెళ్ళబోతే అక్కడ కొబ్బరి కాయలు అమ్మే అతను చెప్పాడు ముందు పైకి వెళ్ళి రండి. లేటయితే మూసేస్తారు అని. సరే అక్కడి వాళ్ళు చెప్పారు కదా అని సిన్సియర్‌గా పైకి బయల్దేరుతూ, ఎందుకైనా మంచిదని అతన్నీ అడిగాము… కొండపైకి ఆటో వెళ్తుందా, ఎన్ని మెట్లుంటాయి వగైరాలన్నీ. రోడ్డు లేదు .. మెట్లెక్కే వెళ్ళాలి, వేరే మార్గం లేదు అని చెప్పాడు.. ఒక వంద మెట్లుంటాయి అన్నాడు. వందే కదా పర్లేదు అని బయల్దేరాం చూసుకోండీ. ఘంటసాలగారి పాట.. ఎన్నీ మెట్లేక్కినా కానారావేమయ్యా.. గుర్తురాని క్షణం లేదు. దోవలో ఎక్కువమంది లేరు. ఒకరెవరో పైనుంచి దిగి వస్తుంటే అడిగాము, ఇంకెంత దూరం అని .. ఇంకొంచెమే అని చెప్పారు. వచ్చేశామనే ఆశతో ఇంకొన్ని మెట్లెక్కాము.. ఎక్కడా గమ్యం కనబడదే. ఓపికలయిపోయినాయి. కాళ్ళు నొప్పులు. పోనీ తిరిగి వెళ్ళిపోదామనుకుంటే అన్ని మెట్లెక్కాము, చూడకుండా ఎలా వెళ్ళటం అనే దుగ్ధ. మొత్తానికి ఎన్ని మెట్లెక్కామో తెలుసా దగ్గర దగ్గర 500. మా లక్ష్మి మాట విని కొంచెం నడిస్తే సరిపోతుందని వచ్చిన వాళ్ళం ఇన్ని మెట్లూ ఎక్కి పైకెళ్ళేసరికి అలసి పోయాము. ఆయాసం.. కానీ, కొండ పక్కన పారుతున్న కృష్ణమ్మ మీదనుంచి వచ్చిన చల్లగాలి గుళ్ళోకి కూడా వచ్చి కన్న తల్లిలా సేద తీర్చింది. అంతే, అలా చతికిలబడి పోయాము కొంచెం సేపు.

ఆలయం ముందు మండపం రంగు రంగుల స్తంభాలతో శోభాయమానంగా వున్నది. బయట ఎండగా వున్నా ఆ మండపంలో చల్లగా వుంది. కృష్ణమ్మ తెచ్చే చల్లగాలి. హాయిగా సేద తీరుతూ అక్కడే కాసేపు కూర్చున్నాం ఆ మండవంలో వున్నవన్నీ చూస్తూ. ఒక పక్కన ఆళ్వారుల విగ్రహాలున్నాయి. ఒక పక్కన రోలు, పత్రంలాగా వున్నాయి. ఆలయంలో వాటి విశేషమేమిటో, అవి అసలు రోలు వగైరా అవునో కాదో తెలియలేదు.

నెమ్మదిగా లేచి స్వామి దర్శనానికి వెళ్ళాము. ఇది గుహాలయం అని ముందే చెప్పానుకదా. స్వామి దర్శనానికి ఒక మనిషి మాత్రం వెళ్ళగలిగే దోవలో కొన్ని మెట్లెక్కాలి. అక్కడ కొండ గోడమీద శంఖం, చక్రం తప్పితే స్వామి ఆకారమేమీ వుండదు. స్వామి ముందు వెలిగించిన దీపాల కాంతిలోనే చూడాలి.

స్వామి దర్శనం చేసుకుని ఇవతలకి వచ్చాక, పూజారిగారు కొంచెం ఖాళీగా వున్నప్పుడు ఆలయ చరిత్ర అడిగాము. ఆయన చెప్పిన విశేషాలు..

ఈ పర్వతాన్ని క్రౌంచగిరి అంటారు. వెంకటేశ్వరస్వామి ఏడు రూపాల్లో ఏడు స్ధలాల్లో ఒకే బ్రహ్మ ముహూర్తం సమయంలో ఉద్భవించారుట. అవి 1. శ్రీనివాస మంగాపురం, 2. తిరుమలగిరి, 3. వైకుంఠపురం, 4. రావూరు, 5. అనంతగిరి, 6. జూపూడి, 7. ద్వారకా తిరుమల. వీరిని అన్నదమ్ములు అంటారుట.

ఇదివరకు ఇక్కడ గోవులు మేతకోసం తిరిగేవి. స్వామి ఆరు నెలల పసి పిల్లాడిలా ఏడుస్తూ ఇక్కడ గొల్లవాళ్ళకి కనబడ్డాడుట. వాళ్ళు పాలు పడితే తాగి ఆడుకునేవాడుట. ఇలా కొంతకాలం సాగింది. స్వామి తననెవరూ గుర్తించటం లేదని ఒకసారి అక్కడి రాజు విష్ణువర్మ ప్రాసాదానికి వెళ్ళి భిక్ష అడిగాడుట. రాజు భార్య యశోధర భిక్ష ఇవ్వబోగా దంపత సమేతంగా ఇచ్చిన భిక్షే స్వీకరిస్తానన్నాడు వటువు. రాజుకి కబురు చేస్తే వచ్చి దేదీప్యమానంగా వెలుగుతున్న వటువుని చూసి, ఇతను సామాన్యుడు కాదని కాళ్ళు కడిగి సత్కరించి, తమరు ఎవరని వివరాలడిగాడు. క్రౌంచగిరి మీద వుంటానని, మీరు వచ్చి చూడమని చెప్పి ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. వాళ్ళు వచ్చి చూస్తే తొలి ద్వారంలో జువ్వి చెట్టు వుంది. దాని మొదట్లో వున్న స్వామి కనబడలేదు. దానితో రాజు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి స్వామి రాజు కలలో కనబడి దంపత నమేతంగా రండి కనబడతానన్నాడుట. రాజుగారు భార్యతో సహా మళ్ళీ వస్తే పసి పిల్లాడిలా ఎడమ కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని కనిపించాడు. మళ్ళీ 5 సంవత్సరాల పిల్లాడిలా శంఖం, చక్రంతో కనిపించి నేను శ్రీనివాసుణ్ణి…. ఇక్కడే వుంటాను. నిత్య నైవేద్యం, ఆలయం వగైరా ఏర్పాటు చెయ్యమన్నాడు. తాను నిరాకారుడిగానే వుంటానని, శంఖం, చక్రం తప్ప ఏమీ కనబడదని అన్నాడు.

రాజుకి నిద్ర పట్టలేదు. భక్తులెలా స్వామిని దర్శిస్తారని మంత్రులతో ఆలోచించి శిల్పులను రప్పించి స్వామి రూపం చెక్కించబోయాడు. శిల్పి ఉలి నాటిందో లేదో ఆ ప్రదేశంనుంచీ రక్తం కారింది. శిల్పి వెళ్ళి రాజుకి చెప్పాడు. శిల్పికి కపాలమోక్షం అయింది. స్వామి రాజుకు కనబడి నేను ఆలయం నిర్మించమంటే ఆకారం చెక్కించబోయి నా హృదయంలో మంట పుట్టించారు. వెంటనే మంచి గంధం పెడితే మంట తగ్గుతుంది. అలా చెయ్యమన్నాడు. స్వామి ఆజ్ఞ పాటించారు. అప్పటికే స్వామినుంచి జువ్వి చెట్టుదాకా రక్తం కారింది.

పూజారిగారు చెప్పిన ఇంకొన్ని విశేషాలేమిటంటే ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితంది. రోజూ ఉదయం స్వామికి ప్రథమ ఆరాధన, గంధం పెట్టి, నివేదన అయ్యాకే భక్తులకు స్వామి దర్శనం. రోజూ 100, 200 మంది భక్తులు వస్తారుట. సెలవు రోజుల్లో, పర్వదినాల్లో 1000మంది పైన వస్తారుట. అక్కడ రాత్రిళ్ళు సర్పం తిరుగుతూ వుంటుందిట. అందుకనే పూజారిగారు కూడా ఆలయ తలుపులు దభాలున తియ్యరుట. ఏడు మార్లు తలుపులు వూపితే నాగేంద్రుడు సర్దుకుంటాడుట. అప్పుడు నెమ్మదిగా తలుపులు తీస్తారు.

ఈ ఆలయానికి నాగేంద్రుడే కాక 11మంది ఆంజనేయస్వాములు కూడా కాపలా కాస్తూ వుంటారు. ఆలయం చుట్టూ 11 ఆంజనేయస్వామి ఆలయాలు వున్నాయి. సమీపంలోని భైరవదిబ్బ మీద సప్తఋషులు తపస్సు చేసుకుంటూ వుంటారుట. వాళ్ళు రోజూ వచ్చి స్వామిని సేవించి వెళ్తారుట.

సమీపంలోని హరిశ్చంద్రపురంలో ఒకరింట్లో అమ్మవారు మజ్జిగదుత్తలో కనిపించి తను స్వామి దగ్గరే వుంటానని ఆ ఇంట్లో ఒక మనిషి మీదకొచ్చి చెప్పిందిట. అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ గ్రామం వారు అమ్మని తమ ఊరు ఆడబడుచుగా భావించి ప్రతి సంవత్సరం ఇప్పటికీ పసుపు కుంకుమ వారి గ్రామంనుంచి తెచ్చి సమర్పిస్తారు.

వేల సంవత్సరాలనుంచీ వుందని చెప్పబడే ఈ ఆలయం గురించి ఈ మధ్యదాకా చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి ముఖ్య పట్టణమైన తర్వాత ప్రభుత్వం వారు ఇక్కడ ఒక బేరేజ్ నిర్మించాలనుకున్నారు. కాశీలో గంగానదిలాగానే ఇక్కడ కృష్ణవేణి ఉత్తర వాహిని. ఆలయందాకా ఘాట్ రోడ్డు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా చాలా అభివృధ్ధి చెందే అవకాశం వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here