కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-13

0
8

పంచగంగా ఘాట్‌ – త్రైలింగస్వామి:

[dropcap]నే[/dropcap]నూ, మా అక్కయ్య ద్వాదశాధిత్యులను దర్శిస్తూ మొదట ఈ పంచ గంగా ఘాట్‌కు వెళ్ళాము. ఆ ఘాట్ వడ్డునే త్రైలింగస్వామి ఆశ్రమము. మేము నడి మధ్యాహ్నము చేరాము. ఆ సమయమున ఆశ్రమము మూసేసి వుంది. అప్పటి వరకూ మేము తిరుగుతూ ఆకలి దప్పులు మరిచాము. ఆశ్రమమంటే ఆంధ్రాశ్రమములా వుంటుందేమో, అక్కడ బిక్ష చేసి మిగిలిన ఆదిత్యుల దర్శనము చేద్దామంటే మా ఊహలకు వ్యతిరేకముగా ఆ ఆశ్రమము మూసివేసి వుంది.

ఆ సందు చివర అందమైన విశాలమైన ప్రాంగణము. అది ఒక  మసీదు, భారతీయ పురావస్తు శాఖావారి ఆధీనములో వుంది. మరో ప్రక్క బిందుమాధవుని గుడి. మధ్యలో గంగకు మెట్లు. గంగ పాతాళంలో కనపడింది. మేము నీరసముగా ఒకరి మొఖాలు ఒకరము చూసుకొని, ముందుకు సాగాము.

‘చేసేదేముంది, ఎన్ని మెట్లు వున్నా తప్పదు. చూడాలనుకున్నాముగా’ అని సమర్థించుకున్నాము ఒకరికి ఒకరు. కాశీలోని ఘాట్లలో మెట్లు మోకాళ్ళ ఎత్తు. కొన్ని ఘాట్లలో మరీ ఎక్కువ మెట్లు వుంటాయి. అలా చాలా మెట్లతో వున్న ఘాట్‌లలో ఈ పంచగంగా ఘాటు కూడా ఒకటి. మేము దైవమిచ్చిన శక్తితో ఆ రోజంతా అలా ఖాళీ కడుపుతో ఆదిత్యులను దర్శించాము. తరువాత అనుకున్నాము ‘ఏదో శక్తి పూని అలా చేశాము కాని, మాకంత వోపికెక్కడిది’ అని!

అప్పుడు నేను త్రైలింగస్వామి ఆశ్రమములో స్వామిని దర్శించు కోలేకపోయాను. అందుకే మరోసారి బయలుదేరి దశాశ్వమేథఘాట్‌లో పడవ ఎక్కి పంచగంగా చేరాను. ఘాటు దగ్గరగా వున్న ఆశ్రమాలకు పడవలో వెళ్ళటము వుత్తమము. ఎందుకంటే కాశీలో ఘాటు వరకూ రిక్షా కానీ ఆటో కాని రాలేవు. సందులు మరీ ఇరుకుగా వుంటాయి. చాలా లోపలికి నడవాలి. దారి తెలుసుకోవటము కొద్దిగా ఇబ్బంది. కొన్ని ఘాట్లకు మాత్రమే రిక్షా, ఆటోలో చేరే వసతి వుంది. అందుకే పడవ ఉత్తమం.  అలా నేను పడవలో పంచగంగా ఘాటుకు చేరి మళ్ళీ ఆకాశానికి అంటిన మెట్ల మీదుగా ఆశ్రమము చేరాను. ఆ ఆశ్రమము రెండు అంతస్తుల భవంతి. ప్రవేశించగానే రాధాకృష్ణులు ఎదురుగా వున్నారు. ప్రక్కనే హాలులా వుంది. మధ్య అతి పెద్ద శివలింగము వుంది. ఆ శివలింగానికి వెనుకగా త్రైలింగస్వామి వారిది అతి పెద్ద విగ్రహము. నిశ్శబ్ధంగా వున్న ఆ హాలులో క్రిందకు మెట్లు, ఒక ప్రక్క పైకి మెట్లు. ఎవ్వరూ లేరు. నేను నాతో తెచ్చిన పూలమాల త్రైలింగస్వామికి అలంకరించి, ఒక బిల్వదళం వుంచి ప్రదక్షిణలు చేసి నమస్కరించి, వచ్చి రాధాకృష్ణుల ముందు కూర్చుని నా జపం మొదలెట్టా. ఇంతలో ఒక జంట వచ్చారు. వారితో కొందరు భక్తులు. ఆయన వారితో పూజ చేయించటము మొదలెట్టాడు. ఆమె రాధాకృష్ణులను అలంకరిస్తూ, నన్ను క్రింద వున్న హాలులో కూర్చొని జపం చేసుకోమన్నది.

పూలమాల స్వామికి ఎవరు వేశారని నన్ను అడిగింది.

‘నేనే’ అని చెప్పాను. ‘మనము స్త్రీలము. వారు సన్యాసి. వారిని మనము అంటరాదు’ అని చెప్పి శివునికి అలంకారము చెయ్యవచ్చని చెప్పింది.

నేను క్రిందహాలులోకి వెళ్ళి, అక్కడ స్వామి సమాధికి నమస్కరించుకొని మరికొంత సేపు వుండిపోయాను.

స్వామి సమాధి వింత అయిన విషయము. గులాబీపూల మీద కట్టిన సమాధి అది.

ఆయన దాదాపు 300 సంవత్సరాలు జీవించారు. అంటే 280 ఏళ్ళ వరకూ. చివరి 150 సంవత్సరాలూ కాశీలో వుండిపోయారు. ఎత్తుగా, లావుగా వుండే ఆ స్వామి పూర్తిగా నగ్నంగా తిరుగుతూ సదా పరమాత్మతో అనుసంధానమై వుండేవారు.

చిన్నతనము నుంచి సదా మూల కూర్చోని ధ్యానములో వుండేవారు. తల్లి మరణించే ముందు కాళీ మంత్రము ఉపదేశించి సిద్ధి పొందమని దీవిస్తుంది. ఆయన తల్లిని దహనము చేసిన చోటనే వుండి దీర్ఘమైన తపస్సు చేస్తాడు. కాళీ మాత చిన్నపిల్లలా ప్రత్యక్షమవుతుంది. ఆయన మహిమలకు ప్రజలు రావటము మొదలెడతారు.  ప్రజల తాకిడికి దూరంగా హిమాలయాలో తపస్సు చేసుకుంటూ ఒకనాడు నేపాలు రాజుకు కనపడుతారు. రాజు కాల్చిన తూటకు దెబ్బతిన్న పులి ఆయన వద్ద సేద తీరుతూ కనపడుతుంది. రాజు ఆశ్చర్యపడి స్వామిని వారి గృహనికి రమ్మని ఆహ్వానిస్తాడు. స్వామి వెళ్ళారు. అక్కడా జనుల తాకిడి మొదలవుతుంది. అక్కడ్నుంచి మానస సరోవరం వద్దకు వెళ్ళి కొద్ది కాలము తపస్సు చేస్తాడు స్వామి. ఎందరినో రక్షిస్తూ, కాశీలో నివాసముంటాడు చివరకు.

ఒక శిష్యుడు దేవి దర్శనము కోరితే, ‘మంగళా! రామ్మా!’ అని పిలిస్తే కాళీ మాత చిన్న పిల్లలా ఆ విగ్రహం నుంచి నడిచి బయటకు వస్తుంది. శిష్యుడు నమస్కరించగానే మళ్ళీ విగ్రహములోకి వెళ్ళి మాయమవుతుంది జగదంబ.

రామకృష్ణ పరమహంసతో కాళీ మాత స్వయంగా చెబుతుంది, స్వామిని దర్శించుకు రమ్మని. ఆయన తన వంద మంది శిష్యులతో బయలు చేరి కాశీ వెళ్ళి పాయసం చేసి స్వయంగా త్రైలింగస్వామికి తినిపిస్తాడు.

స్వామి తన శరీరాన్ని గంగలో కలపమని ఆదేశిస్తాడు శిష్యులకు. ఆయన పరమపదించిన తరువాత ఆయనను మోసుకుపోతూ వుంటే పేటిక తేలికగా మారుతుంది.

చూస్తే కొన్ని గులాబీపూలు వుంటాయి. శిష్యులు ఆ పూలను తెచ్చి సమాధి కట్టారు ఆశ్రమములో. మనము చూసే సమాధి అదే. గులాబీలపై సమాధి.

ఎంతో కరుణా సముద్రుడు అయిన త్రైలింగస్వామి ఎందరికో ముక్తిని ప్రసాదించాడు. అవధూత అయిన త్రైలింగస్వామిని మనము ప్రత్యక్షముగా చూడకపోయినా, ఆయన నడయాడిన ఆ ఆశ్రమము దర్శించవచ్చు. ఆయన సేవించిన కాళీమాత విగ్రహము గుంటూరులోని శ్రీ సిద్ధేంద్రభారతీ స్వామి వారి ఆశ్రమములో నేటికీ పూజలందుకొనుచున్నది. నేటికీ భక్తులకు వారి ఇబ్బందులలో ప్రార్థిస్తే స్వామి స్వయంగా వచ్చి రక్షిస్తాడనే దృష్టాంతాలు ఎన్నో కలవు.

ఆ ఆశ్రమము చూడటానికి నాకు అనుమతి లభించటము నా పూర్వపుణ్యము. త్రైలింగస్వామికి  నా వందనాలు సమర్పించి బసకు మరలివచ్చాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here