కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-16

0
10

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

తులసీ మానస మందిరము:

[dropcap]కా[/dropcap]శీలో ప్రతీ వారు తప్పక దర్శించే మరో దేవాలయము తులసీ మానస మందిరము. ఈ దేవాలయము ఎంతో ప్రాముఖ్యమైన దేవాలయము. ఎంతో విశాలమైన, సుందరమైన రెండు అంతస్తుల పాలరాయి మందిరము ఇది. ఈ మందిరము చుట్టూ ఒకవైపు తులసీ వనము, మరో వైపు ఉద్యానవనము వుంటాయి. ఇది రామ మందిరము.

తులసీదాసు రామచరిత మానస్ (రామాయణము) ఇక్కడే రాసారంటారు. రామాయణమును సంస్కృతములో వాల్మీకి రచించారు. ఆ సంస్కృత రామాయణమును ప్రజలు ఆదరించటము మానివేశారని, అందుచే తులసీదాసు దానిని వాడుక బాషలో రాశారని చరిత్ర చెబుతుంది.

 

అంతటి అద్భుతమైన రాముని చరిత్ర రాసిన మందిరమీ తులసీ మానస మందిరము. ఇప్పుడున్న ఆ పాలరాయి మందిరమునకు థాకర్‌ దాసు సురేఖా అన్న కుటుంబము నిధులు సమకూర్చారు. వారు బెంగాలుకు చెందిన భక్తులు. ఈ దేవాలయము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 వరకూ తెరచే వుంటుంది.

దేవాలయములో మనము ప్రవేశించినప్పుడు విశాలమైన పాలరాయి హాలులోకి ప్రవేశిస్తాము. మూలమూర్తి హనుమ, లక్ష్మణ, సీతా సమేత రామస్వామి. ప్రక్కనున్న దేవాలములో శివునికి భిక్ష వేస్తున్న అన్నపూర్ణమ్మ తల్లి, మరో ప్రక్క గురూజీ విగ్రహాలు వుంటాయి.

   

ఒక ప్రక్క సమర్థ తులసీదాసు విగ్రహము కూడా వుంటుంది. హాలు చివరన పైకి వెళ్ళే మెట్లు వుంటాయి.

పైన రామాయణములో సన్నివేశాలను బొమ్మలుగా పెట్టి అమర్చారు. పైన అద్దాల గదులు, అందులో రామాయణము లోని సంఘటనల బొమ్మలు అమర్చారు. క్రింద గోడల మీద పూర్తిగా రామచరిత మానసము లిఖించారు. ఆ చరితము అధ్యాయాల వారిగా వుంటుంది. చదువుటకు వీలుగా కూడా వుంటుంది.

నేను ఒక ఉదయము ఈ దేవాలయము దర్శించాను. ఈ దేవాలయము, దుర్గాకుండ్ దేవాలయము, సంకటమోచన హనుమాన్‌ దేవాలయము, గవ్వలమ్మ గుడి అన్నీ ఒక వైపుగా వుంటాయి. మనము ఇవ్వన్నీ ఒకసారిగా చుట్టిరావొచ్చు.

తులసీ మానస మందిరములో ప్రశాంతముగా వుంది. జనము లేరు. నేను గోడగోడలూ చూస్తూ నడుస్తుంటే, నన్ను అడిగాడు ఒకతను గైడు కావాలా అని. నాకు చరిత్ర అంటే వున్న కుతూహలముతో అడిగాను – చెప్పమని.

ఆయన చెప్పిన తులసీదాసు చరిత్రనే పంచుకుంటున్నా:

తులసీదాసు గోస్వామి చరిత్ర చదివితేనో, వింటేనో నమ్మశక్యము కాదు. పరమాత్మ లీలలు ప్రశ్నించే ఆధునిక బుద్ధికి అది ఒక గొప్ప విచిత్రముగా వుంటుంది. ఇలాంటివి నమ్మటానికి కేవలము వారి భక్తి మాత్రమే సహాయపడుతుంది అనిపిస్తుంది. సైన్సుకందని ఎన్నో విశేషాలను భారతావనిలో యోగులు ప్రదర్శిస్తున్నారు, నేటికీ. తులసీదాసు గోస్వామీ అలాంటి యోగులలో ఒకరు.

ఆయనకు ‘అపర వాల్మీకి’ అని పేరు.

ఆధునిక యుగములో ఆవిర్భవించిన యుగకవి అని భారతీయ, పశ్చిమ దేశ మేధావులు వేనోళ్ళ పొగిడారు. ఆయన భారతీయ భక్తి ఉద్యమానికి ఊపిరి. సంస్కృతములో వున్న రామకథను ప్రజల లోగిళ్ళలోకి తెచ్చి, వారి నాలుకల మీద ఆడించి, వారి జీవితాలను భక్తితో నింపిన ఘనత కేవలము తులసీదాసుదే. ఆయన తన పూర్వార్థ జీవితానికి వారణాసిని వేదిక చేసికొని జీవించారు. ఎంతగా వారణాసి చరిత్రలో మమైక్యమైనారంటే తులసీదాసని ఘూటు కూడా వుంది.

అక్కడే ఆయన ఆశ్రమమూ వుండేదట.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here