కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు -18

0
9

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

ఝాన్సీ బాయి మెమోరియల్‌:

తులసీ ఘాటులో మెట్లు అన్నీ ఘాట్లలానే ఎత్తు. నేను ఆ ఘాటులో పడవ దిగి ఎక్కుతుండగా చూశాను. ఘాటు చాలా అందముగా వుంది.

కొందరు స్నానాలు చేసి గంగకు అర్చనలు చేస్తున్నారు. కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు.

మండపాలు కట్టి వాటి పై వాలుగా వున్న పెద్ద చెట్లు, అద్భుతంగా విశ్వనాథ చిత్రములా వుంది ఆ ఘాటు. జనాలు పలచగా వుండి ఆ అందము ద్విగుణీకృతమైయ్యింది.

వారణాసిలో ఈ పెద్ద పెద్ద చెట్లు మనకు చాలా చోట్ల దర్శనమిస్తాయి. అవి ఎన్ని వందల సంవత్సరాల నుంచి వున్నాయో అక్కడ. అవి అందించే చరిత్ర, అందము మనము చూడవలసినదే కాని వర్ణించాలంటే కాళిదాసు రావలసినదే.

ఆ ఘాటులో అలా ఎక్కుతూ వుంటే పాత మంటపాలు, వాటి ముందర శివ దేవాలయము, ప్రక్కనే గణపతి దేవాలము చాలా సహజంగా అందముగా అమరాయి.

తులసీదాసు ఆశ్రమము రెండస్తులూ ఘాటు మీదుగానే వుంటుంది. నేను ఆ ఆశ్రమము చూశాక, నెమ్మదిగా అక్కడ కాసేపు హనుమాన్ చాలీసా చదువుకొని బయటకొచ్చాను.

అక్కడే ఝాన్సీ బాయి మెమోరియల్‌‌కు మార్గమని బోర్డు కనిపించింది.

నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది. తులసీ మానస మందిరములో గైడు నాకు ఈ ఘాటులోనే ఝాన్సీ రాణి జ్ఞాపిక వుందని చెప్పటము. నేనే కాదు భారతీయులందరూ ఆమె గురించి చదివే వుంటారు, చరిత్రలో. ఆమె జన్మస్థలము వారణాసీయే. ఆ విధముగా కాశీ ఆధ్యాత్మీకముగానే కాకుండా చరిత్రాత్మకముగా కూడా ప్రసిద్ధి చెందినది.

లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె తల్లితండ్రులు మణికర్ణికా ఘాటులో వుండేవారని గైడు చెప్పాడు. కావచ్చు, కాకపోవచ్చును. 1823లో మరాఠీ బ్రాహ్మణ కుటుంబములో పుట్టిన మణికర్ణిక చదువులో, ఆటలలో చురుకు. ఆటా పాటతో పాటూ యుద్ద విద్యలలో నేర్పరి. తెలివితేటలు, ధైర్యము చిన్ననాటి నుంచి ఆమె లక్షణాలు.

గంగారామ్‌తో వివాహానంతరము ఆమె ఆనాటి ఆచారము ప్రకారము లక్ష్మీబాయిగా పేరు మార్చబడింది.

   పిల్లలు కలగని కారణమున ఆనందరావనే పిల్లవాడిని దత్తతు తీసుకుంటుంది. వివాహమైన 9 సంవత్సరాలకే భర్త కాలం చేస్తాడు. ఆమె భర్త లేని సింహాసనానికి కొడుకును యువరాజుగా చేసి పాలిస్తూ వుంటుంది. రాజ్యకాంక్ష గల బ్రిటీషు ఆ దత్తతు చెల్లదని, రాజ్యం వారిదేనని ప్రకటిస్తారు. దానికి రాణి ఎదురుతిరుగుతుంది.

మిగిలిన ముగ్గురితో కలసి ఆమె సలిపిన యుద్ధమే మొదటి స్వాతంత్ర సంగ్రామముగా చరిత్రలో నిలచిపోయ్యింది.

స్త్రీ శక్తికి నిలువెత్తు ప్రతీక. వీపున చిన్న పిల్లవాడిని కట్టుకొని కోట మీదనుంచి గుర్రం వీపు మీదకు దుమికి యుద్దరంగానికి వెళ్ళిన మరో వీర వనిత గాని, వీరుడు కాని చరిత్రలో కనపడరు.

ఆమె శిల్పము అలా అక్కడ చూస్తూంటే నా హృదయం కకావికలమైపోయ్యింది. లక్ష్మీబాయి పై భక్తి, చరిత్ర మళ్ళీ సినిమా రీళ్ళలా కళ్ళలో మెదిలాయి.

నేను కాశీ యాత్రలో కొన్ని సార్లు మాత్రమే అత్యంత భావోద్వేగమునకు లోనయ్యాను. లక్ష్మీబాయి విగ్రహమును చూసినప్పుడు నా హృదయము ద్రవించినది. ఆమె మీద నాకున్న గౌరవము వల్ల, నాకు స్పూర్తిగా చిన్నప్పటి నుంచి లక్ష్మీబాయి వుండటము వల్ల కావచ్చు.

ఆమె విగ్రహము ఎంతో ఎత్తుకు కట్టారు. కాంస్య విగ్రహము, రెండు కాళ్ళపై నిలబడ్డ గుర్రం మీద, వీపున పిల్లలాడిని కట్టుకొని, ఒక చేత్తో కత్తి ఎత్తి పట్టి, రెండో చేతితో గుర్రం తాళ్ళు పట్టుకొని వీరోచితముగా వుంది ఆమె.

ఆమె ముఖములో భావాలు ఎంతో స్పష్టముగా కనపడుతున్నాయి.

చుట్టూ వున్న గోడలపై హిందీలో, ఆంగ్లములో ఆమె చరిత్ర రాశారు.

ఆపై చుట్టూ తోట. పూలతో, పళ్ళతో ఆహ్లాదముగా వుంది.

నేను మౌనముగా అక్కడే వుండిపోయాను. అరగంట తరువాత నా ఆటో డైవరు నన్ను చూడవచ్చాడు.

నేను భారతీయ వీర వనితకు వీర నివాళ్ళులు అర్పించి,కళ్ళు తుడుచుకొని బయలుచేరాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here