కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 23

0
8

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

బెనరస్‌ హిందూ మహావిద్యాలయము:

[dropcap]కా[/dropcap]శీలో వీధులు చాలా ఇరుకుగా వుంటాయి. కానీ మీరు కొద్దిగా దేవాలయము దాటి బయటకు వస్తే, నయా కాశీ వీధులు విశాలముగా వుంటాయి. నగరానికి కావలసిన హంగులు కనపడతాయి. మాల్స్ వంటివి గూడా మనకు కనపడతాయి. అవన్నీ నయా కాశీ. ఆ నయా కాశీలో వున్న ప్రముఖ విశ్వ విద్యాలయము ‘బెనారస్ హిందూ విశ్వ విద్యాలయము’ చూడవలసిన ప్రదేశము. మదన్‌మోహన్‌ మాలవ్య, అనిబిసెంటు కలసి 1916 సంవత్సర వసంత పంచమి నాడు నిర్మించిన ఈ విద్యాలయము భారతదేశ ప్రముఖ విద్యాలయాలలో ఒకటి. దేశములో 6వ స్థానములో, ఆసియాలో 150వ స్థానములో వున్న ఈ విద్యాలయము ఒక్క వ్యక్తి యొక్క కృషితో నిర్మించబడిందంటే ఆశ్చర్యము కలుగుతుంది. శ్రీ మాలవ్యా ఆనాటి రాజులను వేడుకొని, ఫండు సేకరించి నిర్మించారు. ప్రభుత్వములో మనకూ స్థానము కావాలంటే మంచి విద్య వుండాలనీ, అలాంటి విద్యను అందించి యువతను సిద్ధం చెయ్యాలన్న ముందు చూపుతో ఆయన ఈ విశ్వవిద్యాలయ సంకల్పము చేశారు. అనిబిసెంటును వప్పించి, ఆమె సహాయముతో బ్రిటిష్ వారి నుంచి పర్మిషను తెచ్చుకున్నారు. అందుకే అనిబిసెంట్‌ పేరు ఆయనతో కలిపి వుంది. ఆంగ్ల విద్య బోధించి యువతలో ఆత్మవిశ్వాసము కలిగించాలని ఆయన తలచారు.

ముందుగా ఆయనకు స్థలము కావలసి వచ్చినది. కాశీ రాజును విద్యాలయ స్థలము కోసము ఆశ్రయించారు మాలవ్యా. కాశీ రాజు ఆయనకు అక్కడి చుట్టు ప్రక్కల పల్లెల నుంచి దాదాపు 2500 ఎకరాల స్థలము దానము చేశారు. దీనికి ఒక చిన్న కథ స్థానికులు చెబుతారు.

నేను రెంటుకు తీసుకున్న ఆటో డ్రైవరు నాకు ఆ కథను చెప్పాడు. కాశీ రాజా వారు మాలవ్యా వారిని ఒక రోజు ఎంత నడిస్తే అంత జాగా నీదేనని అన్నారట. ఆయన నడిచిన దూరమంతా ఆ విద్యాలయానికి ఇచ్చివేశారట.

ఇలాంటివి మనకు స్థానికంగా వినిపించే కథనాలు. వాటిని అలా వుంచి చూస్తే ఆ విద్యాలయ ప్రాంగణము, భవనాలు, వీధులు విశాలముగా చాలా శుభ్రంగా కనిపిస్తాయి. విద్యాలయములో దాదాపు 30,000 మంది విద్యార్థులు క్యాంపసులో బస చేసి వుంటారు. ఇలాంటి వసతి వున్న విశ్వవిద్యాలయము ఆసియాలో ఇదొక్కటే. పదమూడు రకాల డిపార్టుమెంట్లు వున్నాయి. ప్రత్యేక సంస్కృత విభాగముతో సంస్కృతమును బ్రతికిస్తున్న నేటి విద్యాలయము కూడా ఇదే. ఇది వూరికి ఒక ప్రక్కగా వున్నా, రామ్‌పురా వెళ్ళాలంటే ఇటుగానే వెళ్ళాలి. 2015లో వంద సంవత్సరాల ఉత్సవములు జురుపుకున్నది ఈ విశ్వవిద్యాలయము. ఇందులో ప్రపంచ దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి విద్యనభ్యసించి వెడతారు. పూర్వ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ ఈ విశ్వవిద్యాలయములో పనిచేశారు. ఎందరో మహానుభావులు ఇక్కడ విద్యనభ్యసించారు.

సర్‌ సుందర్‌లాల్‌ ప్రథమ వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. దీనికి ధన సహాయము చేసినవారిలో నిజాం నవాబు కూడా వున్నాడు. ఆయన దీనిని చూసే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడని అంటారు. విశ్వవిద్యాలయములో రంగస్థలము పేరు భారత కళా భవన్. దీనికి మొదటి అధ్యక్షులుగా రబీంద్రనాథ్ టాగుర్‌ వున్నారు. విశ్వవిద్యాలయములో చూడతగ్గది గ్రంథాలయము. ఆ భవనము 1940లో పూర్తి చెయ్యబడింది. బరోడా రాజా వారి సౌజన్యంతో నిర్మించిన ఈ గ్రంథాలయమును బ్రిటిష్ లైబ్రరీ మోడల్‌లో కట్టించారు. విశాలమైన హళ్ళతో కూడిన ఈ లైబ్రరీలో 18వ శతాబ్ధపు అతి పాత, విలువైన పుస్తకాలు ఎన్నో వున్నాయి. రెండు లక్షల పుస్తకాలతో దేశములోని అతి పెద్ద గ్రంథాలయములలో ఒకటి.

విశ్వవిద్యాలయం మధ్యలో నాలుగు రోడ్ల కూడలిలో నిర్మించిన అతి పెద్ద సుందర పాలరాయి టవరుతో కూడిన శివ దేవాలయము చాలా ప్రత్యేకమైనది.

(సశేషం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here