కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 28

0
9

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

ఆనందమయి మా ఘాట్‌:

వారణాసి లోని ఆనందమయి మా ఘాట్‌ మనకు చాలా ప్రస్ఫుటముగా కనబడుతూ ఆహ్వానిస్తూ వుంటుంది.

ఆ ఘాట్ నుంచి మనము ఆనందమయి మా ఆశ్రమములోనికి వెళ్ళవచ్చు. చాలా ఆశ్రమాలకు వలనే నదిపై ఈ ఆశ్రమము చేరటము చాలా తేలిక. కానీ రోడ్డు నుంచి వెళ్ళాలంటే కొంత ప్రయాస తప్పదు. నేను రోడ్డు మీదుగా వెతుకుతూ వెళ్ళి, వెనకకు నది మీదుగా దశాశ్వమేధ్ ఘాటుకు వచ్చేశాను.

‘ఆనందమయి మా’ రూపుదిద్దుకున్న పరిపూర్ణ చైతన్యమే. మానవ శరీరములో మెసిలి, భక్తులకు ఆనంద ఆధ్యాత్మికత ప్రసాదించిన అవధూత అవతార రూపమే యోగిని మాత ‘ఆనందమయి మాత”.

అనంతమైన ఆనందము రూపుదిద్దుకున్న ఆకారము ‘ఆనందమయి మా’.

తల్లి తమ పిల్లలను ఎంత కనికరముగా చూసుకుంటారో, అదే కనికరము ‘మా’ కు భక్తులందరిపై.  ఆనందమయి మా గురించిన ప్రస్థావన ప్రసిద్ధి చెందిన ‘శ్రీ పరమహంస యోగానంద’ రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’లో వున్నది.  శ్రీ పరమహంస ‘మా’ ను కలసిన వివరము, వారికి ‘మా’ కు మధ్య నడచిన సంభాషణ ఆ గ్రంథంలో వున్నాయి.

ఎందరో మహాపురుషులను కదిలించి, తమ భక్తులకు ఆధ్యాత్మిక ఆత్మోన్నతి నిచ్చిన ఆనందమయి మాత జన్మనామము ‘నిర్మల సుందరీ దేవి’. 1896 లో ఒక నిరుపేద సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబములో ఆనాటి అవిభక్త బెంగాలు రాష్టంలో జన్మించినది. పుట్టిన నాటి నుంచి కూడా భగవన్నామము వినపడినంతనే వింతైన ఆనందములో మునకలు వేసేది ఆ బాలిక. నిశ్ఛలమైన మౌనములో సమాధి స్థితిలో నిత్యానందములో తేలియాడే బాలిక వింత ప్రవర్తన తల్లి తండ్రులను అబ్బురపరిచేది.

ఆనాటి సంప్రదాయం ప్రకారము నిర్మలకు 1909లో ఆమె 11వ ఏట విక్రమపురి వాస్తవ్యులైన రమణి మోహన్‌ చక్రవర్తితో వివాహము జరిపించారు తల్లితండ్రులు. వివాహనంతరము అత్తగారింట ఆ బాలిక శారీరకమైన కష్టతరమైన పనులు ఎన్నో చెయ్యవలసి వచ్చేది. ఆ కష్టాలు ఆమె ముఖముపై ఆనందాన్ని దూరము చెయ్యలేదు. ఆమె సదా ఆ నిత్యానందములో మునకలు వేస్తూ వుండేది. ఆమె భర్త ఆమెలోని పరమాత్మను చూచి ఆమెకు భక్తుడవుతాడు. ఆయనే భోలానాథ్‌గా ప్రసిద్ధి చెందారు. వారి దాంపత్యము విచిత్రమైనది. వివాహమైనను పూర్తి సన్యాసదీక్షలో గడుపుతారు దంపతులు.

ఆమె భర్త అన్నగారింటిలో దాదాపు రెండు సంవత్సరములు వున్న తరువాత తిరిగి తల్లితండ్రుల వద్దకు చేరుతారు ‘మా’. బావగారింట ‘మా’ వున్నన్ని రోజులు ఎన్నో సిరిసందలలో తేలియాడుతారు బావగారి కుటుంబము. బావగారి మరణము, పదమూడు సంవత్సరాల నిర్మల ఆరోగ్యం బాగుండక పోవటము ఇత్యాదివి ఆమెను పుట్టింటికి చేరుస్తాయి. ఆనందమయిమా కు గురువు కాని, ఉపదేశం కాని లేవు.

1922వ సంవత్సరము ఒక పౌర్ణమికి ఆమెకు భగవంతుని నుంచి సందేశము అందుతుంది. ఆమె విన్నవి విన్నట్లుగా ఆచరిస్తూ వుంటుంది. ఈ ప్రక్రియ గురించి ‘మా’ మాటలలో ఉపదేశమిచ్చే గురువు, తీసుకునే శిష్యులు రెండూ ‘మా’నే !!

ఆమెకు అందే ఉపదేశంతో ఆమె ఆచరించే యోగా క్రియాను చూస్తే ఎంతో అనుభవజ్ఞులు ఆచరిస్తున్నట్లుగా వుండేది. ఆమె ఆ యోగాసనాలలలో ఎంతో కాలము అలా నిలచి పోతూ వుండేది కూడా!

ఢాకా చేరిన తదుపరి భగవంతుని కీర్తనలతో అనంతమైన ఆ ఆనందములో వుండే ‘మా’ ను చూచి ప్రజలు తన్మయులైపోయేవారు. ఢాకాలో వుండగా శ్రీ జ్యోతిష్చంద్రరాయ్ ‘మా’ ను ఆశ్రయించిన తొలి భక్తుడు. ఆయనను భాయిజీ అంటూవుండేవారు.

అనంతమైన బ్రహ్మానందములో, శాంత వదనముతో సంచరించే ‘మా’ తన చుట్టూ అదే ప్రతివారికి అనుగ్రహిస్తూ వుండటము జరిగేది.  అలాంటి సందర్భాలలోనే ఆమెను ‘ఆనందమయి మా’ అని నామకరణము చేశారు భాయిజీ.

ఆనందమయి మా కు ఒక ఆశ్రమము ఏర్పాటు చేస్తారు కొందరు భక్తులు.

‘మరునిది’ కి ‘గురుప్రియ దీది’ కి ఉపనయనము చేసి వారికి పవిత్ర యజ్ఞోపవేతము ప్రసాదిస్తుంది ‘మా’.

భారతదేశమంతా అతి విస్థారముగా పర్యటిస్తూ, భక్తులను అనుగ్రహించి నది మా. ఆమె సేవాగ్రములో గాంధీ మహాత్ముని కలవటము, ఢిల్లీలో జె.కృష్ణమూర్తిని కలవటము ఇలానే తటస్థించినది. అలాగే దక్షిణ భారత యాత్రలో మా రమణాశ్రమము, పాండిచ్చేరిలో ‘మదరు’ను, రామేశ్వరమూ సందర్శిస్తారు. పరమహంస యోగానంద కలిసినప్పుడు ఎంతో ప్రియముగా మాట్లాడుకుంటారు. యోగానంద ‘మా’ను రాంచి ఆశ్రమానికి ఆహ్వానింది మాతో ఒక రోజు గడుపుతారు.

సున్నితమైన పువ్వు వంటి ‘మా’ తన శరీరముపై శ్రద్ధ వహించేవారు కారు. ఎవరైనా భోజనము చిన్నపిల్లలకు తినిపించినట్లుగా తినిపిస్తేనే తినేవారు. లేకపోతే అసలు ఆ భోజన విషయము గుర్తు కూడా వుండేది కాదు ఆమెకు. తరచూ  నిశ్చల సమాధిలో మునిగి బాహ్య స్పృహలో వుండేవారు కారు.

ఒకసారి ఆమె కురులు ఒక భక్తురాలు సరిచేస్తూ వుండగా ‘మా’ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. కురులు పట్టుకున్న భక్తురాలు కూడా సమాధిలోకి వెళ్ళిపోయి, ‘మా’ బాహ్యస్పృహ కు వచ్చినప్పుడు మెలుకువలోకి వస్తుంది. (మా తో శిష్యుల అనుభవాలు)

అందరినీ సరి సమానముగా చూడటము ఆమెకు చాలా సహజము. ఆనాటి ప్రధాని నెహ్రు భార్య కమలా నెహ్రు మా శిష్యురాలు. ఆమెతో కలసి నెహ్రూ మా ఆశ్రమానికి రెండుసార్లు దర్శనానికి వచ్చారు. అందరూ ఎంతో హడావిడి పడుతున్నా ‘మా’ ఎప్పటిలానే సర్వసామాన్యమైన వైఖరితో వుంటారు. ఇందిరాగాంధి కూడా ‘మా’ శిష్యులలో ఒకరు.

‘మా’ ఎప్పుడు ‘నేను’ అన్న మాట పలికేవారు కారు. తన గురించి చెప్పవలసి వస్తే ‘ఈ చిన్ని పాప’ “మీ కుమార్తె” ‘ఈ శరీరము’ అంటూ పలికేవారు. తన శిష్యులుగా ఎవ్వరిని చూచేవారు కారు. అందరిలో వున్న పరమాత్మ ఒక్కటే అన్న అభేద భావముతో వుండేవారు. ఆమె అందరితో ఆ ఆభేద భావము పెంపొందిచుకోమని చెప్పేవారు. “రెండు అన్నవి లేవు. వున్నది ఒక్కటే. అదే బ్రహ్మం. పరబ్రహ్మం” అని చెప్పేవారు మా.

ఆమె బోధ కూడా చాలా సరళముగా సామాన్యులకు సైతం అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లుగా  అర్థమవుతుంది. – ‘ప్రతి బిడ్డను తల్లి గమనిస్తూ వుంటుంది, అవసరాన్ని బట్టి వారికి సమాధానము లభిస్తుంది”.

బోధలలో ముఖ్యముగా – “ప్రతిరోజు కొంత సమయము పరమాత్మకై వెచ్చించండి. ఒక్క 15 నిముషాలు. ప్రతి రోజు అదే సమయములో ఆ 15 నిముషాలు భగవంతునివి. మీరు ఆ సమయము ఆయనకు ఇచ్చేసారు.

ఈ అభ్యాసము వలన మీకు తెలియకుండా మీరు ప్రశాంతతను పొందుతారు. నామ రూప భేదము లేని భగవంతుడు అఖండమైన చైతన్యము. మీరు తలిచే నామము ఏదైనా, చైతన్యము మాత్రమదే”

భగవంతుని భక్తులుగా జీవించమని భోదించారు మా. ‘పరమాత్మను అందరిని తన గురించి తాము తెలుసుకోమంటున్నాడు. మీకు అదే ప్రధాన లక్ష్యం కావాలి’ అని ఉద్భోదించేవారు.

‘మా’ తన భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు ఇచ్చారు. వారి షట్‌చక్రాలను చైతన్యము చెయ్యటము నుంచి ఉన్నతికి తీసుకువెళ్ళేవరకూ.

ఆమె పాదాలశ్రయించి తరించిన భక్తులెందరో. వారణాసి లోని ఆశ్రమములో మా చాలా కాలము వున్నారు.

1982 లో డెహ్రాడూము లోని ఆశ్రమములో సమాధి చెందారు మా.

సాధకులను ఆశ్రితులనూ అనుగ్రహిస్తూనే వున్నారు ఆనందమయి మా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here