కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 30

0
9

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

[dropcap]“సా[/dropcap]నంద మానంద వనే వసంతం, ఆనందకందం హతపాపబృందం।
వారాణసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే॥”

కాశీ అంటే ప్రకాశం! స్వయం ప్రకాశం!!

కాశీ వెలుగుతూ, వెలుగులు పంచుతుంది. తనను చేరిన వారిలో ఆ వెలుగులు కలిగించకలదు కూడా.

కాశీలో ప్రతి శిలా ఆ జంగమదేవుడే। ప్రతి జలము పరమ పవిత్ర గంగా తరంగమే.

కాశీలో శిలలన్నీ శివాకారమే. అక్కడ మనకు ఎక్కడ చూచినా శివాకార లింగ దర్శనము కనపడుతుంది, ఏ గోడ క్రిందో, చెట్టు మొదటో. సర్వం శివమయం. అవి “జంగమస్థావరాకారా స్సమ్యగ్రాజిత దేవతా॥” అని ఆ మూర్తులన్నీ స్వప్రకాశములే.

ఆ శివలింగ రూపాలు కొన్ని అనాదిగా వున్నవి. కొన్ని కొంత కాలము క్రిందటే స్థాపించినవి. కొన్ని నిరుడు ప్రతిష్ఠించినవి.

కొన్ని చోట్ల పూజారులు లింగము పెట్టి వాటికి చరిత్ర సృష్టించి జీవనోపాధి గడుపటము కూడా కద్దు. వారి పిల్లలు పూజారులైన సమయానికి ఆ చరిత్ర స్థిరమై పురాతన చరిత్రగా చెప్పబడుతుంది. ఎప్పటి లింగమైనా, ప్రతి శిలా శివుడుగా వున్న మహా పుణ్య క్షేత్రం కాశీ. ఏ లింగమును పూజించినా పరమాత్మ “ఓ” యని పలికే స్థానము కాశీ.

కాశీఖండములో శ్రీనాధుడు కాశీ మహిమ వివరిస్తూ – “ఎన్ని కల్పంబు లరిగిన నెడలిపోవ దెందఱింద్రులు గడచిన నెలము తప్ప దెన్ని మన్వంతరమ్ములు చన్న నెపుడు బసిమి తప్పదు కాశి పట్టణంబు” అంటాడు.

ఎన్ని కల్పాలు మారినా కాశీ మహిమ మారదు. ఎందరింద్రులు మారినా వికాసము కోల్పోదు. దాని మహిమ ఎన్ని మన్వంతరములు మారినా మారదు అని.

అటువంటి కాశీ పట్టణములో అడుగడుగునా శివలింగాలే. దేవాలయాలలో, మఠాలలో, సత్రాలలో, ఇళ్ళలో, బయట, గంగ వడ్డునా, గంగలో ఎటు చూస్తే అటు శివలింగాలే.

ఆధునిక లెక్కలలో కాశీలోని దేవాలయాల సంఖ్య 23,000. వీటిలో కనీసము 2000 ప్రముఖమైనవి.

ఇవి కాక ప్రతి గృహములో ఒక శివాలయముంటుంది. అందుకే చూడగానే భక్తి అంతా కాశీలో ప్రోగు చేసుకున్నదా అన్నట్లుగా వుంటుంది. భక్తికీ, హిందూ మతానికి పట్టుకొమ్మైనది కాశీ.

వీటిలో కొన్ని ముఖ్యమైనవి తప్పక దర్శించదగినవైవునవి వున్నవి. చాలా మటుకు యాత్రికులు ఆ ముఖ్యమైన శివలింగాలను తప్పక దర్శించుకుంటూ వుంటారు.

అవి ప్రథానముగా:

గాభస్తీశ్వర లింగము: సూర్యుడు ప్రతిష్ఠ చేసిన శివలింగము. మంగళగౌరి సహితముగా వుంటాడు శివుడు ఇక్కడ. మయూఖాదిత్యుడు కూడా ఈ ఆలయములో కొలువై వున్నాడు. అశాంతులు తొలుగుతాయి ఆ శివ దర్శనముతో. పంచగంగా ఘాట్ నుంచి వెళ్ళవచ్చు.

శూలటంకేశ్వరుడు: గంగాదేవి వేగము తగ్గించటానికి శూలము అడ్డం పెట్టినందున ఈ శివుని శూలటంకేశ్వర్ అని పిలుస్తారు.

బ్రహ్మేశ్వర లింగము: బ్రహ్మ లోక ప్రాప్తి కోసము ఈ శివారాధన చెయ్యాలి.

వరాహేశ్వర లింగము: ఈ శివుడు దశాశ్వమేధ్ ఘాటులోని రామ మందిరములో కొలువై వున్నాడు. ఈ స్వామి దర్శనము సేవ వలన మానసిక అశాంతి తొలుగుతుంది.

దశాశ్వమేధేశ్వర్: దశాశ్వమేధ్‌లో శీతలా దేవి మందిరమున్నది. ఆ ఘాట్లో ఈ దేవాలయము ప్రాముఖ్యమైనది. ఆ మందిరములో కొలువై వున్నాడు ఈ శివుడు. సుఖసంతోషాలనిచ్చే స్వామిగా కొలుస్తారు ప్రజలీయన్ని.

అమరేశ్వరుడు: గంగా నది నుంచి ఉద్భవించాడట ఈ స్వామి. లోలార్క కుండం వద్ద నెలవై వున్నాడు. ఈ అమరేశ్వర లింగమును పూజిస్తే, మనము అమరనాథ్ యాత్ర చేసిన ఫలము దొరుకుతుందని చెబుతుంది స్థలపురాణము.

ఆత్మ వీరేశ్వరుడు: సింధియా ఘాట్ లోని ఈ ఆత్మ వీరేశ్వర లింగము ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ పిల్లల కోసం దంపతులు శివుణ్ణి సేవిస్తారు. వారి కోరికలు తీరటము కూడా చాలా సులభము. అభిలాష్టాష్టకముతో ఈ మహాదేవుని కొలుస్తారు.

ఆత్మవీరేశ్వర్ లింగాలయానికి దగ్గర్లో వున్న ఉపశాంతేశ్వర్ లింగము మనఃశాంతి కోరు వారు తప్పక దర్శించవలసినది.

హిరణ్యగర్భేశ్వరుడు: త్రిలోచన ఘాట్ వద్ద వున్న ఈ ఆలయములో శివారాధన వలన ప్రశాంత జీవితము కలుగుతుంది.

త్రిలోచనేశ్వర్ లింగం: పాతాళ లోకము నుంచి బయటకు వచ్చిన లింగమిదని చెబుతారు. సర్వపాప హరము ఈ లింగ దర్శనము.

దుర్వాస మహాముని ప్రతిష్ఠించిన లింగం కామేశ్వర లింగం. ఖగోళాదిత్యుడు కొలువైన ఆలయము కూడా ఇదే.

లాల్ ఘాట్ లోని గోప్రేక్షేశ్వర లింగారాధనతో గోదానమిచ్చిన ఫలముంటుంది. దీనినే గౌరిశంకరాలయమని అంటారు.

నక్షత్రేశ్వరాలయము: జాతకములో దోషాలను తొలిగించుతోవటానికి ఈ శివుణ్ణి ఆరాధిస్తారు.

బ్రహ్మ ప్రతిష్ఠించిన చతురుముఖేశ్వర లింగము నాలుగు ముఖాలతో వుంటుంది. బ్రహ్మలోక్త ప్రాప్తి కోసం ఈ శివుణ్ని ఆరాధిస్తారు.

ఆదికేశవుడు గంగా వరుణా ఆవరణలో ప్రతిష్ఠించిన లింగం వరుణా సంగమేశ్వరుడు. సకల పాపాలు తొలిగిపోతాయి ఈ శివారాధనతో. గోదాన ఫలముంటుంది, ఈ స్వామి సేవ వలన.

ఆదికేశవ ఆలయములో వున్న వేదేశ్వరుని అర్చనతో నాలుగు వేదాలు చదివిన ఫలము వుంటుంది.

ఈ లింగాలన్నీ కాశీ విశ్వేశ్వరునికి కేవలము ఐదు కిలోమీటర్ల దూరములో నెలవై వున్నాయి.

ఇవే కాక జ్యోతిర్లింగ రూపాన కూడా ఇక్కడ శివాలయాలు వున్నాయి. ఆ దేవాలయాలను దర్శిస్తే మనకు అన్ని జ్యోతిర్లింగాల దర్శన ఫలముటుంది.

అలాగే నేపాలి ఘాట్‌లో వున్న పశుపతినాథ దేవాలయము ప్రసిద్ధమైనది. అది ఖాట్మండులోని పశుపతినాథ దేవాలయమును పోలి వుంటుంది. అందమైన ఆ దేవాలయమును కూడా భక్తులు తండోపతండాలుగా దర్షిస్తూ వుంటారు.

ఇంకా చూడదగ్గ వివిధ శివలింగాలు గంగా ఘాట్లలో అంతటా వ్యాపించి యున్నాయి వ్యాఘ్రేశ్వర లింగం, శైలేశ్వర లింగము, రత్నేశ్వర లింగము ఈ రత్నేశ్వర లింగమును సిద్ధులు కొలిచేవారట. రత్నములా మెరుస్తూ శివుడు వారణాసిలో రాత్రులను కూడా పగళ్ళలా మారుస్తాడని కాశీఖండం చెబుతుంది. వారణాసికి కొంత దూరములో వున్నది ఓంకారేశ్వర లింగము. శివలింగము పెద్దది. ఓంకార ప్రణవధ్వనుల మధ్య ఈ శివలింగం ఉద్భవించిదట. అందుచే ఇక్కడ శివుణ్ణి ఓంకారేశ్వరుడన్నారు.

త్రివిష్టపేశ్వర లింగము: విశ్వనాథునికి దక్షిణమున వున్న లింగం. కేదార ఘాటులో వున్న కేదారేశ్వర లింగము.

ఇలా ఎన్నో శక్తి లింగాలకు క్షేత్రమై దర్శించిన వారి మనః ఫలకములో ఆత్మలింగమై ప్రకాశించు పరమశివుని నివాసము కాశీ మహా నగరము.

“వారాణసీ దివాకాత్రం
శివనామ్నా నినాదితా।
శివరాత్రౌ కిం బ్రవీమి?
దుర్జన స్సజ్జనాయతే॥” (కాశీ శతకము)

శివ నామముతో నిండిన కాశీ పట్టణం గురించి ఏం చెప్పను? అచ్చట దుర్జనుడు సైతం సజ్జనుని వలె ప్రవర్తిస్తాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here