కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 34

0
8

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

[dropcap]అ[/dropcap]శోకుడు బోధివృక్షపు ఒక కొమ్మతో మరో మొక్కచేసి, దానిని దానితోపాటు తమ పిల్లలను సింహళము పంపి, బౌద్ధాన్నీ వ్యాప్తి చేశాడు. మనము అనురాగపురములో ఆ చెట్టును, బౌద్ధ దేవాలయాన్ని చూడవచ్చు.

ఆయనకు గల బౌద్ధ మత భక్తికి కోపము తెచ్చుకొని ఆయన భార్య ఆ చెట్టును మొదట కొట్టేయిస్తుందట. అశోకుడు సింహళంకు పంపిన చెట్టు నుంచి మరో కొమ్మ తెప్పించి పాతి మరల ఆ చెట్టును వృద్ధి చేస్తాడు. ఆయన భార్య తరువాత బౌద్ధ మతము తీసుకుంటుంది.

తరువాత కాలములో ఒక తుఫానులో చెట్టు కూలిపోయి, తిరిగి దానంతట అదే మొలకెత్తినదట. అలా ఆ చెట్టు ఇప్పటికి రెండుసార్లు నాశనమై తిరిగి వచ్చింది. ప్రస్తుతము రెండువందల సంవత్సరములుగా, అది విశాలమైన కాండముతో, నలువైపులా వ్యాపించిన కొమ్మలతో, చుట్టూ కట్టిన ప్రాకారపు కాపలాతో వుంటుంది. చెట్టు ముందు వైపు బుద్ధదేవునిది పెద్ద గుడి వుంది. ఆ గుడిలో తథాగతుని మనము చూస్తే ఆ కళ్ళను, అందునుంచి మన పైవ ప్రసరించే కరుణను మనము మరువలేము. నీలి రంగు కన్నుల బంగారు వన్నె బుద్ధునికి కావి రంగు వస్త్రంతో అలంకారము.

ఆ బోధి చెట్టు క్రింద ఎందరు బౌద్ధులు వివిధ పద్ధతులతో ధ్యానము చేస్తూ కనపడతారు. అక్కడ అడుగుల ధ్యానము, కళ్ళు తెరచి చూస్తూ చేసే ధ్యానము, సాష్టాంగాలు చేస్తూ చేసే ధ్యానము ఇలా వివిధములైనవి బౌద్ధులు పాటిస్తారు. కొందరు టిబెటు లామాలు ఆ చెట్టు క్రింద కొన్ని రోజులు వుంటామని అనుకొని వస్తారట. అక్కడే రోజంతా వుండి రాత్రికి బసకు వెడతారు. ఆ చెట్టు నుంచి ఆకు రాలితే టక్కున తీసుకొని దాచుకుంటారు. ఆ చెట్టు క్రిందట అంతటా ఆకుపచ్చని పట్టా పరిచి వుంది. మనము ఎక్కడన్నా కూర్చోవచ్చు. నేను ఆ చెట్టునీడన కూర్చొని, తథాగతుని దీవెనలు కోరుతూ ధ్యానము చేశాను.

ప్రపంచానికి శాంతిని, అహింసను బోధించిన మహావతారుడు బుద్ధుని ఆనాటి స్థితిని ఆలోచిస్తూ వుండగా, అరగంటకు గైడు వచ్చి తట్టి లేపాడు. ‘‘వెడదామా’’ అన్నాడు కళ్ళు విప్పిన నాతో.

నే తలవూపి లేచి వస్తుంటే ‘‘నీవు చాలా లక్కీ’’ అన్నాడు.

‘‘ఎందుకు’’ అని అంటే

“రెండు ఆకులు దొరికాయి. ఒక్కటి దొరకటమే కష్టము” అన్నాడతను.

నేను ఒక ఆకు తీసుకొని, మరోటి అక్కడి బిక్షువుకు ఇచ్చాను.

ఆ బౌద్ధబిక్షవు సంతోషముతో ఆ ఆకు తీసుకున్నాడు.

పూర్వము నిరంజన నది, నేడు లేదు. ఆ స్థలములో గుర్తుగా ఒక సరస్సు దాని మధ్య బుద్ధుని ప్రతిమ వుంచారు.

ఆ ప్రాకరము లోపల చిన్న మందిరాలు కూడా వున్నాయి. అవి పూర్వపు చెట్లు. ఆ చెట్ల క్రిందటే ఆయన వారం వారముగా తపముచేసి, సాగుతారు. మొదట బోధ చేసినచోట ఒక స్తంభము గుర్తుగా కట్టారు.

ప్రతి చోటా దీపాలు పెట్టారు. బౌద్ధులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుతారు. మేము సింహళంలో బౌద్ధాలయములో కూడా దీపాలను చూచాము. నేను అక్కడ దీపం పెట్టాను. బుద్ధగయలో దీపము వెలిగించగలగటము నాకు మంచి అదృష్టములా తోచింది. అలా నెమ్మదిగా తిరుగుతూ ఆ ప్రాకారమంతా చూపించాడు ఆ గైడు. అలాంటిచోట్ల గైడు వుంటే మనకు స్థలపురాణముతో పాటూ, చూడవలసినవి, చరిత్ర స్పష్టమవుతుంది.

ఒక్క ముక్క ఇంగ్లీషు మాట్లాడని ఉత్తరభారతములో చక్కటి ఆంగ్లము మాట్లాడే గైడు దొరకటం నిజంగా అదృష్టము. అక్కడి రక్షణదళాలకు కూడా ఒక్కముక్క ఇంగ్లీషు రాదు. వారు ‘టైం’ అన్న మాటను కూడా పలకరు. ‘సమయ్’ అంటూ అన్నీ స్వచ్ఛమైన వారి భాషలో మాట్లాడేస్తారు. నన్ను చూసి మద్రాసీ అనటము కూడా నేను గమనించాను. ‘కూపస్తమండూకాలు’.

నేను ఇక లోపలి పరిక్రమ పూర్తిచేశాను.

అలా తిరుగుతూ నేను బయటకు వచ్చి, నా ఫోను తీసుకొని గైడుకు డబ్బు చెల్లించి, అక్కడ వున్న భూటానీ షాపులలో షాపింగు చేశాను.

బుద్ధుని తాంత్రిక పద్ధతులలో కొలిచే విధానము ఒకటి మనకు భూటానులో కనపడుతుంది. తాంత్రిక బౌద్ధులు మనకు బుద్ధగయలో కనపడుతారు. టిబెట్ లో ఎక్కువగా అది సాధన చేశావారట. ‘తారా’ అన్న దశమహావిద్యలలో రూపమైన జగదంబను బౌద్ధులు శక్తి రూపముగా కొలుస్తారు. వారి దుకాణాలు మనము తప్పక దర్శించాల్సిన వాటిల్లో ఒకటి. మనకు ఎక్కడా కనపడని బుద్ధుని భంగిమలు, రకరకాల పూసలు దొరుకుతాయి. జపమాలలూ, ధ్యానము చేసేటప్పుడు వాడే ఆసనములు ఇలా ఎన్నో లభ్యమవుతాయి. కాని మనము వారితో కొద్దిగా బేరం చెయ్యాలి.

బుద్ధినికి ఆహారమిచ్చిన స్త్రీ “సుజాత దేవాలయము” కూడా బోధగయలో వుంది. కాని అది నదికి మరోవైపున వుంది. బోధగయలో చిన్న విమానాశ్రయం కూడా వుంది. చాలా మంది బుద్ధ సన్యాసులు అక్కడికే వచ్చేయ్యటానికి వీలుగా వుంది. మంచి వసతికి మంచి హోట్టళ్ళు కూడా కనిపించాయి.

“సహస్రబుద్ధ” అన్న తాంత్రిక బుద్ధుని బొమ్మ ఇత్తడిది కొన్నాను. తిరిగి నా కారు ఆగిన దిశగా బ్యౌటరీ ఆటోలో వెనకకు వచ్చి, కారు ఎక్కాను.

మేము అక్కడే, అంటే బుద్ధగయలో లంచ్ తీసుకోవాలని మా కారు డ్రైవరు చెప్పాడు. నాకు కాఫీడే కనిపించింది. ఒక కాఫీ, కేకుతో నా లంచ్ కానిచ్చి, వారణాసికి బయలుదేరాను.

ఆ రాత్రి దాదాపు పదకొండుకు నేను వారణాసి చేరుకున్నాను. నా గదికి వచ్చాక తెలిసింది అలసట. అంతకు ముందు నా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదిగా! అననసరముగా ఈ ప్రయాణము పెట్టుకున్నానా అని అనుకున్నాను కాని, బోధగయ నన్ను పరిపూర్ణంగా ఆనందపరిచిందనటములో ఎలాంటి సందేహాము లేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here