కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-7

0
8

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

శక్తి పీఠము -విశాలక్షి

సాధనకు క్షేత్ర – ఆలంబన ఎంతో అవసరము. ఆధ్యాత్మిక రాజధాని కాశి సాధకులకు ఆ ఆలంబన కాగలదు. కారణము ఇచ్చట కర్మ బీజములు మొలకెత్తవు. కాశీనే పరిపూర్ణమైన శక్తి పీఠము. ఏ రూపమైన సాధనకైనా కాశియే సరి అయిన క్షేత్రం. కాశీలో చేయు సాధనకు సూక్ష్మశరీరము శుద్ధమవుతుంది. కాశీ విశాలక్షి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.

శక్తి పీఠాలు వివిధ పూరాణాలలో వివిధ రకములుగా చెప్పినా, అన్ని ముక్తకంఠముతో ఒప్పుకున్న శక్తిపీఠాలలో కాశీ ఒకటి.

శక్తిపీఠాల కథ మనలో అందరికీ తెలిసినదే. దక్ష యజ్ఞ వాటికకు పిలవకపోయినా వెళ్ళిన సతీ దేవి అవమానపడి అచ్చటనే ఆత్మత్యాగము చేసిన తరువాత, శివుడు ఆమె శరీరమును భుజాన వేసుకు తిరుగుతాడు. విష్ణువు సుదర్శనముతో ఆ శరీరమును ముక్కలుగా చేసినప్పుడు, అమ్మవారి శరీర భాగాలు అంతటా వెదజల్ల బడ్డాయని, అవి దేవి శక్తి పీఠాలుగా, మందిరాలు ఏర్పడ్డాయని కథనము. అలా ఏర్పడిన శక్తిపీఠాలలో కాశీలోని విశాలక్షి ఒకటి. అమ్మవారి ముఖము పడటము వలన ఈ పీఠము ఏర్పడినది. ఇక్కడ అమ్మవారు విశాలక్షి.

విశాలక్షి విశాలమైన కన్నులు కలది అని అర్థము. ఇది బహిరుగోచరమగు అర్థము. అంతరార్థము ఎంతో వున్నది.

కనిపెట్టుకునే లక్షణం తల్లిది. విశ్వాంగలాను కనిపెట్టుకోవటానికే వున్నదని విశాలక్షి అన్నారు.  విశాలక్షి ఆలయము మనకు లలితా ఘాటులో వుంది. ఈ ఆలయాలు మణికర్ణిక వద్ద నుంచి లలితా ఘాట్‌ అంతా అమ్మవారే. దీన్నేవిశాల అంటారు. విశ్వా – విశ్వాదేవి అని కూడా అర్థము అంటే విశ్వనాధుని దేవేరి అని.

ఈమే విశాలమైన దృష్టినిస్తుంది. సంకుచితత్త్వం, ద్వందదృష్టి పోగొడుతుంది. విశాలక్షి మహాపీఠం – స్మరించినా దానము జపం అన్నీ ఇక్కడ ఎక్కువ ఫలమిస్తుంది.

శివుడి స్వయంభూ జ్యోతిర్లింగాలు ద్వాదశ లింగాలు. కాశీలో విశ్వనాథుడు జ్యోతిర్లింగము. అమ్మవారిది శక్తిపీఠము.

జ్యోతిర్లింగ – శక్తిపీఠాల కలయిక కాశీలో మరో ప్రత్యేకత. ఇలా మనకు మళ్ళీ కేవలము ఒక్క శ్రీశైలములోనే కనపడుతుంది. అంటే ఉత్తరాన కాశీ ఎంత శక్తి వంతమయినదో దక్షణాన శ్రీశైలము అంతటి శక్తివంతమైనది.

శక్తితో వున్న అమ్మే పిల్లలను కనిపెట్టుకు సర్వం సమకూరుస్తుంది. ఆకలి గొన్న శిశువుకు ఆమెనే అన్నపూర్ఞ అయ్యింది. మనకు కాశీ ఖండములో ఈ విశాలక్షి తల్లే అన్నపూర్ణమ్మగా కనపడే కథనము కనపడుతుంది.

వ్యాసుల వారు శిష్యులతో కూడి బిక్షాటన చేస్తూ వుంటాడు. ఆయనకు బిక్ష దొరకదు. మూడు రోజులు ఇలానే జరుగుతుంది. మూడోరోజు ఆయన ఆకలి తట్టుకోలేక కాశీ నగరాన్ని శపింపబోతాడు. ఇంతలో ప్రక్కనున్న ఇంటి తలుపు తెరుచుకు ఒక మధ్య వయస్సు స్త్రీ బయటకు వచ్చి పిలుస్తుంది, ఆయనను ఆయన శిష్యులను బిక్షకు రమ్మని. ఆయన తన శిష్యులు సర్వులు వెడతారు. వారికి భోజనాలు పెడుతుంది ఆ తల్లి. భోజనాల తరువాత వారు ఆ ఇంటి యజమానిని చూడబోతారు. ఆయన రుద్రాక్షలతో, మూఖాన వూర్ద్వ పుండాలతో, విభూతితో మెరిసిపోతూ వుంటాడు.

 ‘వ్యాసుడితడేనా? పురాణాలు రాసినవాడా? నా కాశీకి శాపమిచ్చేవాడా?  పొమ్మను ఇకడ్నుంచి. ఇక ఇక్కడ కనపడరాదు’ అని గద్దిస్తాడు.

గజగజ వణుకుతూ వ్యాసుడు కాళ్ళ మీద పడతాడు క్షమించమని. పర్వదినాలలో రావచ్చని చెబుతుంది అమ్మవారు. వ్యాసుడు తన శిష్యులతో గంగ దాటి ఆవలితీరానికి వెళ్ళి స్థిరపడ్డాడని పురాణగాథ. ఆవలి తీరాన్ని వ్యాసకాశీ అంటారు.

అలా నేటి మధ్యాహ్నం పూట మణికర్ణికలో వ్యాసులవారు వచ్చి బిక్ష అడుగుతారని తరువాత తిరిగి వ్యాసకాశీకి వెళ్ళిపోతారని ఒక నమ్మకము.

ఈ కథ మూలంగా అమ్మవారు విశాలక్షిగా, శక్తిపీఠమై, అన్నపూర్ణగా వెలుగుతున్న క్షేత్రము ఈ కాశీ మహానగరము.

***

కాలభైరవుడు

కాశీలో తప్పక దర్శించుకోవాల్సిన దేవాలయము కాలభైరవునిది.

శునకవాహనముతో కూడిన వాడు ఈ భైరవుడు. వారణాసి పట్టణానికి క్షేత్రపాలకుడిగా కూడా ఈయన కీర్తించబడ్డాడు. మనము కాశీలోకి అడుగుపెట్టాలంటే ఈయన అనుమతి కావాలి. ఈయన అనుజ్ఞ లేకపోతే కాశీకి రాలేము. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలనుకున్నా ముందు భైరవుని అనుమతి తీసుకోవటము ఆనవాయితి. సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర తంత్ర మూర్తిగా వ్యవహరిస్తాడు. ఆదిశంకరాచార్యులవారు కాలభైరవాష్టకాన్ని రచించారు.

 “దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం’అంటూ సాగుతుంది ఆ అష్టకము.

భైరవుని అవతారము గురించి శివ పురాణములో ఒక కథనము వుంది. దాని ప్రకారము ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్తారు. బ్రహ్మదేవుడు ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను కల్పించాడు పరమేశ్వరుడు. దీనితో మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది ‘పిచ్చి మహర్షులు పరమతత్వం గురించి చెప్పేదేముంది నేనే ఆ మహాతత్వాన్ని స్వయంభువును నేను, విధాతను నేను, సృష్టిస్థితిలయ కారకుడిని కూడా నేనే. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే!!’ అంటూ పలికాడు అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయా ప్రభావంతో వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికి వెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని తెలుపుతుంది. అంతలోనే. దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు. ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల పక్కన నవ్వింది. దీంతో శివుడు భృకుటి ఆగ్రహంతో ముడిపడింది. భయంకరమైన ఆకారంతో కాలపురుషుడు ఉద్భవించాడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది.

పాపాల్ని పరిహరించే వాడిగా పాపభక్షకుడు అయ్యాడు. కాలభైరవడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కింద పడకుండా చేతికి అంటుకుంటుంది. అంతలోనే విష్ణువుని కప్పిన మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా పొగడుతాడు. దీంతో శివుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేక పోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది కాశీనగరంలో కాలుపెట్టగానే, కపాలం చేతినుండి విడిపోతుంది. భైరవుడు ఆనంద తాండవం చేశాడు. అలా కాశీ బ్రహ్మహత్యా పాతకము నుంచి కూడా కాపాడుతుంది.

కాశీ క్షేత్రంలోని ఈ ప్రాంతమే పెద్దలకు పిండ ప్రదానము చేస్తారు.

కాళభైరవుని ఆలయము దర్శించినప్పుడు అక్కడ నూనెను అమ్ముతారు. ఆ నూనె మనము మనకు మూడు చుట్టు త్రిప్పుకొని కాలభైరవుని వద్ద వదిలివెయ్యాలి. మనకు వున్న సమస్త దోషాలు తొలిగిపోతాయని అక్కడి నమ్మకము. అక్కడే మనకు కాశీదారము కూడా దొరుకుతుంది. ఎవ్వరి దిష్టి తగలకుండా, మనకు సదా రక్షగా ఆ దారము కాపాడుతుందని భక్తుల నమ్మకము. కాశీ యాత్ర చేసి ఇంటికి వెళ్ళాక గారెలతో మాల చేసి వూరి లోని శునకానికి వేసి భైరవుణ్ణిని గౌరవించుకునేవారు పూర్వము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here