భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 4: తెలంగాణా తిరుపతి

0
6

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 4” వ్యాసంలో “తెలంగాణా తిరుపతి” గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ఆ[/dropcap] ఏడుకొండల వెంకన్న తన దాకా రాలేని తన భక్తుల కోసం అనేక ప్రదేశాలలో వెలిశాడు. భక్తులు ఆ వెంకన్న మీద వున్న ప్రేమతో ఆ స్వామి వెలిసిన ప్రదేశాలని తమ ప్రాంతం తిరుపతిగా భావించి కొలుచుకుంటూ వుంటారు. దూరాన వున్న ఆ తిరుపతికి వెళ్ళలేకపోయినా, తమ ప్రాంతంలోని తిరుపతులలో స్వామిని దర్శించి తృప్తి చెందుతారు.

అలా వెంకటేశ్వరస్వామి వెలిసిన క్షేత్రాలలో పరమ పవిత్రమైన తెలంగాణా తిరుపతిని ఈ వారం దర్శిద్దాము. ఇది పాలమూరు జిల్లా.. అదేనండీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్య కేంద్రమైన మహబూబ్‌నగర్ కి 18 కి.మీ.ల దూరంలో మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళే మార్గంలో వుంది. దాని పేరే మన్యంకొండ. మన సమీపంలో వున్న క్షేత్రాల గురించి మనం పట్టించుకోంగానీండి, వీటిని గురించి తెలుసుకుంటే అద్భుతమైన ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇన్ని విశేషాలు మన చుట్టు పక్కలే వున్నాయా అని ఆశ్చర్యపోవటం మన వంతవుతుంది. అలాంటి ప్రదేశమే ఈ మన్యంకొండ.

పూర్వం ఈ ప్రాంతమంతా మహారణ్యం. ఇక్కడవున్న కొండలో ఏర్పడ్డ గుహలలో అనేకమంది మునులు తపస్సు చేసుకుంటూ వుండేవారు. అందుకనే ఈ కొండకి మునుల కొండనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే మునుల కొండ, మన్యంకొండ అయింది. ఈ కొండలో ఎవరూ కట్టకుండానే ఏర్పడ్డ సహజ గుహాలయంలో, ఏ శిల్పీ ఉలి చేతబట్టి చెక్కకుండానే కొండరాయిపై వెలసిన స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి. తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అంటారు ఇక్కడివాళ్ళు. అంటే తిరుపతి వెళ్ళలేనివారు ఇక్కడ స్వామిని దర్శించుకుని తరిస్తారు. అందుకే దీనిని తెలంగాణా తిరుపతి అంటారు. భక్తుల రద్దీ కూడా ఎక్కువే.

ఈ స్వామి మహాత్యానికి సాక్ష్యాలుగా ఇక్కడివారు నాలుగు నిదర్శనాలు చూపిస్తారు. అందులో మొదటిది ఈ స్వామి వెలిసిన ఆలయం (గర్భగుడి). ఈది ఒక గుహ. దీనిని ఎవరూ కట్టలేదు. స్వతఃసిధ్ధంగా కొండగుహలో ఏర్పడ్డ ఆలయం ఇది. తర్వాత కాలంలో వాడుకలో అనుకూలంగా వుండటంకోసం చిన్న చిన్న గోడలు మాత్రమే కట్టారు. రెండవది ఉలిముట్టని స్వామి. అంటే ఈ స్వామి విగ్రహాన్ని ఏ శిల్పీ చెక్కలేదు. కొండ గుహలో గోడమీద స్వయంభూగా వెలిసిన స్వామి. ఇంక మూడవది ఇక్కడ ఆలయానికి దిగువ వెలిసిన స్వామి పాదాలు. వీటిని కూడా ఎవరూ చెయ్యలేదంటారు. నాలుగవది ఆలయం ముందున్న పుష్కరిణి. ఇది తవ్వినప్పుడు పెద్ద బండపడింది. దీనిలో ఎవరి ప్రమేయమూ లేకుండా నీరు రావటానికి కారకులు శ్రీ హనుమద్దాసు.

            

శ్రీ హనుమద్దాసు స్వామిపట్ల అత్యంత భక్తి విశ్వాసాలు కలిగినవాడు. స్వామిని అనేక విధముల తన పాటలతో కీర్తించినవాడు. శ్రీ స్వామివారి ఆజ్ఞ ప్రకారమే హనుమద్దాసు మన్యంకొండను రెండవ తిరుపతిగా ప్రచారం చేసి భక్తుల మదిలో స్వామిపట్ల భక్తి విశ్వాసాలు పెంచాడంటారు. కోనేరు తవ్వినప్పుడు బండపడి నీరు రాకపోతే హనుమద్దాసు ఒంటికాలుపై ఏకదీక్షతో భజనచేయగా బండ పగిలి నీరు వెల్లువైనది. అందుకే దీనిని తవ్వని కోనేరన్నారు. ఆ బండ పగలగొట్టటానికి నీరు తెప్పించటానికి హనుమద్దాసు భజనలు తప్ప ఎటువంటి మానవ ప్రయత్నం లేదు.

మన్యంకొండ వెంకటేశ్వరుడు భక్తులకు తెలిసినది శ్రీ అళహరి కేశవయ్య ద్వారా. ఆయనకి కలలో స్వామి దర్శనమిచ్చి తాను కృష్ణానదీ తీర ప్రాంతములోగల మునులకొండమీద వెలిసివున్నానని, కేశవయ్యగారిని అక్కడికి వెళ్ళి నిత్య పూజలు చేయమని ఆదేశించారు. కేశవయ్యగారు స్వప్నంలో స్వామి ఆదేశించిన ప్రకారం కుటుంబ సమేతంగా అక్కడకు చేరుకుని, స్వామి సేవలో నిమగ్నమయ్యారు. వీరందరి చిత్రపటాలు స్వామి గర్భగుడి పక్కన హాలులో దర్శించవచ్చు.

ఒక రోజు కేశవయ్యగారు కృష్ణానదిలో స్నానంచేసి సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేస్తుండగా దోసిలిలోకి ఒక విగ్రహం వచ్చింది. దానిని పరిశీలించి శ్రీ వెంకటేశ్వరస్వామిగా గ్రహించి ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్యంకొండలో వెలిసిన స్వామి చెంతవుంచి పూజాదికాలు నిర్వహించసాగారు. ఈ విగ్రహం మూడు అడుగుల ఎత్తు వుంటుంది. కళ్ళు తెరిచి వుంటాయి. స్వామికి మీసాలు వుంటాయి. ఇరువైపులా శ్రీదేవి, భూదేవివి చిన్న విగ్రహాలు వుంటాయి.

ఈ ఆలయంలో పధ్ధతులన్నీ తిరుపతిలో లాగానే వుంటాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ముందు స్వామికి భక్తితో తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో స్నానంచేసి, ఆ తడి బట్టలతోనే ఒడ్డునే చిన్న ఆలయంలో వున్న వరాహనరసింహస్వామిని దర్శించుకుని, అక్కడనుంచి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తారు.

శివ కేశవులకు బేధములేదని నిరూపించుటానికే అన్నట్లు ఇక్కడ ఇంకొక గుహలో శివుడు కొలువుదీరి భక్తుల పూజలందుకుంటున్నాడు.

ఈ ఆలయాన్ని అనేక విధాల అభివృధ్ధి చేసినవారు వంశపారంపర్య ధర్మకర్త అయన శ్రీ అళహరి రామయ్యగారు. ఉత్సవమూర్తులను తిరుపతినుండి తీసుకువచ్చారు. అమ్మవారు, అలిమేలు మంగ తాయారు ఆలయం కట్టించారు. ఈ ఆలయం రహదారినుండి మన్యంకొండకి వెళ్ళే మలుపు తిరగగానే ఎడమవైపు కళ్యాణ మండపం పక్కనే వుంటుంది. ఈ కళ్యాణ మండపంలో వివాహాలు చాలా జరుగుతున్నాయి.

సమయమున్నవారు ఇక్కడ చూడదగిన ఇతర ప్రదేశాలు స్వామివారి పాదములు, జువి తీర్ధము, నందిదోన మునుల గుహలు. వీటిని మేము సమయాభావమువలను చూడలేకపోయాము.

ఆలయ పరిసర ప్రాంతాలలో వంట చేసుకోవటానికీ, మనం తీసుకెళ్ళినవి తినటానికీ వసతి వున్నదిగానీ అక్కడ ఏమీ దొరకవు.

అందమై ప్రకృతిలో ఇంకా అందమైన కొండల మధ్య విలసిల్లుతున్న ఈ గుహాలయాన్ని అవకాశం వున్నవారు తప్పక సందర్శించాలి. దర్శన సమయాలు ఉదయం 8-30 నుంచీ 12-30 దాకా, సాయంత్రం 3-00 గంటల నుంచీ రాత్రి 9-00 గంటల వరకూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here