భక్తి తరంగాలు

2
8

[dropcap]కొ[/dropcap]లనులో అలజడి పుడితేనే తరంగాలు పుడతాయి. కానీ, సముద్రంలో అలలకు ఏమాత్రం కొదువ లేదు, ఉండదు. భక్తిసాగరంలో కూడా ఆ తరంగ ధ్వని ఆది ప్రణవనాదంలాగే నిర్విరామ లహరి. మన తెలుగునాట రామాయణ, భారత, భాగవతాలను కూడా ఆరాధ్య దైవాలతో సమానంగా కొలుచుకుంటూ పారాయణలు చేస్తూ తరిస్తూ వుంటాం. ఆ పరమేశ్వరుని కథలు, గాథలు జనపదాలలో అంటే సరళమైన వాడుక భాషలలో జానపదాలుగా వాగ్గేయకారుల చేత చెప్పబడ్డాయి. ఇంక పాండిత్యం కలవారు పద్య, గద్య రూపాలుగా ఎన్నో గ్రంథాలని మనకు అందించారు. అలాగే భాగవతంలో భగవంతుని స్వరూపాన్ని దశ విధాలుగా వింటాము అన్న విషయం కూడా మనకు బాగా తెలిసిన విషయమే. అందునా రామావతరం, కృష్ణావతరాలు మన మనోమందిరాలలో వెలసిన ప్రియ దేవతామూర్తులు. వేదభూమి మన దేశం. ఆరాధన మన జీవం. యోగం మన నాడి. ఉపాసన మన బలం. ఇలాంటి సంప్రదాయాలు పాటించే మన ఇళ్ళు ఇప్పటికి ఆ ఆరాధనలో భాగంగా సామవేద సారమైన సంగీతసాహిత్యాల ద్వారా భాగవతుల గానామృతాలని సంకీర్తనాపరంగాను, పుణ్యకాల భజనసేవగానూ చేస్తూ తరించగల ప్రయత్నాలు ఇప్పటికి మనం చేసుకుంటున్నాం. అలాంటి నాదోపాసన చేసిన వాగ్గేయకారుడు మన తెలుగు వారు అయిన పుణ్యజీవి నారాయణతీర్థులు.

నారాయణతీర్థులు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు. నిత్యము దైవారాధన ముగించుకుని అటుపై పరమేశ్వర పూజ కైంకర్యంగా తన గానాన్ని సమర్పించేవారు. పరమాత్మను బాలకృష్ణునిగా భావన చేసి ఆయన ఆరాధ్యదైవంగా పూజించుకునే సంప్రదాయ కుటుంబం నుండి సంస్కారాన్ని పొందటం చేత ఆబాలగోపాలానికి ఆనందాన్ని పంచిన బాలకృష్ణుడే ఆయనకు ప్రేరణ. తండ్రి గంధర్వదేవుడు, తల్లి పార్వతీ దేవి. వీరిని కొందరు మాధవానల దైవ అవతారం అని అంటారు. శివరమానాథ తీర్థుల శిష్య పరంపరకు చెందినవారిని నారాయణతీర్థులే ప్రకటించుకున్నారని చెప్తారు. ఆదిశంకరాచార్య పరంపరకు చెందిన గురువులు ఆశీర్వదించిన పుస్తకాలలో నారాయణ కవి రచనలైన “శిక్యోత్సవం” మరియు “ప్రస్తావికం” లో నారాయణతీర్థుల గురించి తెలుసుకోవచ్చు.

వివాహానంతరం నారాయణతీర్థులు వేదాద్రి ప్రాంతంలో కృష్ణా తీరాన ఉన్న గ్రామంలో నివసించేవారు. ఒకరోజు ఆయన ఒక పనిమీద వేరే ఉరు వెళ్ళి తిరిగి వచ్చేసరికి నదీ ప్రవాహం చాలా ఉదృతంగా ఉంది. ఇల్లు చేరాలని ప్రవాహంలోకి దిగి ఈదటం మొదలుపెట్టారు. కాసేపటికి ఒంట్లో శక్తి నశించి కాళ్ళు తేలిపోతున్నట్లయ్యింది. మెల్లగా స్పృహ కోల్పోతున్నారు. ‘ఇక లాభం లేదు, సన్యాసం తీస్కుంటే కానీ జీవన్ముక్తి రాదు’ అన్న ఆలోచనతో ఆపత్కాల సన్యాసమంత్రం పఠించి దైవం మీద భారం వేసేరు నారాయణతీర్థులు. కాసేపటికి స్పృహ కోల్పోయారు. కాసేపటికి వరద తగ్గి ఒడ్డుకు కొట్టుకువచ్చారు. స్పృహ వచ్చాక మెల్లగా ఇల్లు చేరుకున్నారు. ‘జరిగినది తనకు మాత్రమే తెలుసుకదా’ అనుకున్నారు. నాటి నుంచి భార్య సమీపించిన ప్రతిసారీ తాను ఆమెకు సన్యాసిగానే కనిపిస్తున్నారు. తనకు మాత్రమే తెలిసిన సంగతికి సర్వసాక్షి అయిన భగవంతుని నిర్ణయమని గుర్తించి అక్కడ నుండి తిరుపతి వైపుగా ప్రయాణమయ్యారు.

కొంత కాలానికి నారాయణతీర్థులు ఆయన హృద్రోగ పీడితులు అయ్యారు. భగవన్నామ సంకీర్తనము చేసుకుంటూ కాలం గడుపుతుండగా ఆయనకు వరహమూర్తి దర్శనమిచ్చి తంజావూరు ప్రాంతానికి దగ్గరలో ఉన్న వరహురు అనే గ్రామంలో ఒక ఆలయ నిర్మాణం కావించమని అదేశిస్తారు. నారాయణతీర్థుల వారు అలాగే ప్రయాణమై వరహురు చేరి ఆలయాన్ని నిర్మింపచేసేరు. తిరుపతి నుండి తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ఠించి అక్కడే నివాసముండ సాగారు. అక్కడ ఉండగానే ఆయన శ్రీకృష్ణ లీలా తరంగిణిని దివ్య గాన వాహినిగా రచించి పరమాత్ముని పాదాలకు సమర్పించేరు. చివరిలో “శ్రీ నారాయణ తీర్థంకిత చరణ” అన్న ముద్రతో తన రచనలు చేశారు. ప్రతి సంవత్సరము కూడా శిక్యోత్సవం పేరుతో ఉట్ల పండుగ జరిపించి తన గురు పరంపరను తరింపచేశారు. ఇప్పటికీ ఆ పండుగ మన కృష్ణాష్టమి వేడుకగా వాడవాడలా జరుగుతున్నది.

శ్రీకృష్ణ లీలా తరంగిణి మొత్తం భాగవతము దశమస్కందము. అది గానరూపంగా అందించడం జరిగింది. పలు శైశవలీలలు, గోవర్ధన లీల, కాళీయమర్దనం, రుక్మిణికల్యాణం, అవతార వర్ణనలు ఎన్నని చెప్పగలం? ‘అసలు ఈ పాటలు పాడుకుంటే చాలు’ అన్నట్లు ఉంటాయి. కొన్ని అనుభూత తరంగాలు ఉన్నాయి, కొన్ని జతులతో సహా ఉన్నాయి. ఆ తరంగాలు వింటుంటే భాగవతం కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. నారాయణతీర్థుల ముఖ్య శిష్యులు కూచిపూడి సంప్రదాయ ఆద్యుడు అయిన సిద్ధేంద్ర యోగులు వాటిని నృత్యరూపకాలుగా అందించారు. ఇప్పటికి నృత్యశాస్త్రంలో అవి ఎంతో ప్రాముఖ్యం కల కళారూపాలు. ఈనాటికీ వరహురులో ఆయన జీవసమాధి దగ్గర ఉత్సవాలు జరిపి ఈ తరంగ గానం చేస్తారు. జయదేవులు అష్టపదుల వలెనే బహు భక్తి ప్రధానమైనవి ఈ తరంగాలు. ఈయనను జయదేవ అంశగా కూడా నమ్ముతారు.

భాగవతంలో కాళీయమర్దనలీల చాలా ప్రాశస్త్యాన్ని పొందింది. ఆ ఘట్టం చదివినా, విన్నా చాలా పుణ్యం అని నమ్ముతారు. ఈ వర్ణన తరంగాలలో కూడా చూడవచ్చు. దక్షిణాదిలో ఈ ఘట్టం చదివి, తరంగాలతో దేవునికి గానసేవ చేసుకోవచ్చు. ఆ ఘట్టంలో కాళీయుని భార్యలు శ్రీకృష్ణుని రక్ష కోసం ప్రార్ధించిన విధానాన్ని తరంగాలలో “నాగ పత్నికా తరంగం” అంటారు. శ్రీకృష్ణ తాండవ స్తోత్రం చేసి, ఈ తరంగం పాడుకుని భగవంతుని వేడుకుంటే కళ్యాణ ప్రాప్తి మరియు భర్తకు కలిగిన ఆరోగ్య పీడ తొలగిపోతుంది అని విశ్వాసం ఉంది. అలాగే విశేష పూజలు, పండుగల రోజులలో నామ సంకీర్తన, భజనల రూపంగా ఈ తరంగాలను గానం చేస్తారు. విశేష పూజా విధానాలు అనుసరించలేనివారికి నిత్య సంసార ఈతి బాధలు తొలగిపోవటానికి వీలుగా ఆరు తరంగాలు సూచింపబడ్డాయి.

1. కష్ట నివృత్తి : శరణం భవ కారుణామయి

2. భయ నివృత్తి : జయ వేంకటేశ, భయ కారణ వినాశ.

3. కార్య సిద్ధి, సఫలం సిద్ధి : పరమ కారుణయా మామ్ లక్ష్మీ సిద్ధిః పాలయ.

4. ఈప్సిత సిద్ధి : పూరయ మమ కామం.

5. కుటుంబ సౌఖ్యం : క్షేమం కురు గోపాల.

6. శాంతి సిద్ధి. : గోవింద ఘటయ పరమానంద.

ఈ తరంగాలు పాడుకుంటే చాలు భగవంతునికి ప్రత్యక్షంగా పూజ చేసుకున్నట్లే అని నమ్మిక. అందుకేనేమో మన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా తన రచనలలో ఎంతో ప్రాముఖ్యం పొందిన “వేయిపడగలు”లో భక్తిప్రధానమైన పాత్ర గిరిక ద్వారా ఎన్నో తరంగాలు ప్రస్తావించారు. ప్రత్యేకంగా ఈ నాగపత్నికా తరంగం యొక్క ప్రాముఖ్యతను తెలపటం కోసం ఆవిడ ఆలయంలో వేణు గోపాల స్వామిని తన పతిగా భావన చేస్తూ పాడటం ద్వారా ఇంక ఆమె భగవంతుని సొత్తు అని దృవీకరిచడం మనం చదవచ్చు.

పై విధంగా మన నిత్య జీవితంలో కూడా ఈ తరంగాలను భక్తితో గానం చేసుకుకోగలిగితే చాలు. శ్రీ కృష్ణాష్టమి పండుగకు మనము ఎన్ని విధాలుగా ఆ భగవంతుని సేవ చేసుకుంటామో కదా అలాగే ఒక్కసారి ఈ తరంగాలను కూడా పాడుకుని లేదా విని ఆ పరమాత్మను స్మరించుకుని తరిద్దాం. ఇటువంటి జ్ఞాన సంపదను మన తరువాత తరాలకు కూడా భజనల ద్వార, నామ సంకీర్తనల ద్వారా అందించే ప్రయత్నం చేద్దాం.

జై శ్రీ కృష్ణ

జై శ్రీ నారాయణతీర్థ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here