భక్తిమార్గం ప్రాశస్త్యం

0
11

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భక్తిమార్గం ప్రాశస్త్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]క్తి చేతనే ఆత్మజ్ఞానం పొందవచ్చునని శాస్త్రాలు బోధిస్తున్నాయి. పరిశుద్ధమైన భక్తి వలన హృదయం పవిత్రం అవుతుంది. ఆలోచనలు తద్వారా మనం చేసే కార్యాలు పవిత్రం అవుతాయి. సర్వ జీవ సమానత్వం, సర్వ సమదృష్టి అలవడుతాయి. భగవంతుని కృప అందుబాటులోకి వస్తుంది. తల్లి బిడ్డని ఎల్లవేళలా సంరక్షించినట్లు భక్తి యోగం వలన ఆ సర్వేశ్వరుడు స్వయంగా అనుపలభ్యమైన తన రక్షణా కవచాన్ని భక్తులకు ప్రసాదిస్తాడు.

భగవంతుడిని దివి నుండి భువికి రప్పించగల శక్తి భక్తికి వుందని గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, ధృవ చరిత్ర, మార్కండేయ పురాణం ఇత్యాది ఇతివృత్తాలు చెబుతున్నాయి. ఈ మొత్తం సృష్టికి కారణమైన భగవంతుడు స్వయంగా భక్తుల హృదయాలలో నివసిస్తూ వుంటాడు. పరిశుద్ధమైన భక్తి చేత భగవంతుడిని తమ హృదయాలలో సదా సర్వదా నివసించేటట్లు చేయగల సామర్ధ్యం కేవలం మానవాళికే వుంది.

ముక్తిని పొందేందుకు భక్తి ఒక ప్రధాన మార్గమని భగవద్గీత ద్వారా భగవంతుడు బోధించాడు. జీవునికి, దేవునికి మధ్య వారధి భక్తి. కాల ప్రవాహానికి ఒడిదొడుకులకు అతీతమయినది భక్తి. సాధకులు, ముముక్షువులు  ఏ విధంగా ఉండాలో మనకు నారదభక్తి సూత్రాలు విపులీకరించాయి. ఇందులో ఏ ఒక్క సూత్రం తీసుకొని భక్తిశ్రద్ధలతో, చిత్తశుద్ధితో ఆచరించినా మోక్షం తప్పకుండా ప్రాప్తిస్తుంది. భక్తితో తన ఇష్ట‌దైవాన్ని ఆరాధిస్తే మనశ్శాంతి కలుగుతుంది. మనసులో చెడు ఆలోచ‌నలకు తావుండదు.. సన్మార్గ‌ములో నడిచేందుకు, ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండేందుకు, నిత్యజీవ‌నంలో ఒత్తిళ్ళకు, ఒడిదొడుకులను తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది.

అయితే భక్తిమార్గం చాలా కష్టం అని ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు. భక్తిమార్గ సాధనలో, సాధకుడు  తన శక్తి మొత్తాన్ని, తన ఇంద్రియాలు, మనస్సు మరియు భావోద్వేగాలను దైవిక ప్రేమతో ఏకం చేసే ప్రయత్నంలో అంకితం చేస్తాడు. భక్తిమార్గములో గట్టి పట్టుదల ఉండాలి. అడుగడుగునా అనేక సందేహాలు, సంశయాలు ఎదురవుతుంటాయి. మనస్సి తరచుగా విచలితమవుతుంటుంది. ఒక‌ దైవాన్ని నమ్మిన త‌ర్వాత విశ్వాసంతో ముందుకు క‌ద‌లాలి. దృఢమైన ప్రతిజ్ఞ చేసుకోవాలి అప్పుడే కార్యసాధకుడవుతాడు. భాగవతం ప్రకారం భగవంతుని పొందడానికి భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇలా తొమ్మిది రకాల మార్గాలు సూచించారు. వీటిలో ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకున్నా అంతిమంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది.

నిర్మలమైన భక్తికి భగవంతుడి అందదండలు ఉంటాయి, అనుగ్రహప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. నిశ్చల భక్తికి ధర్మరాజుకు ఒక చక్కని ఉదాహరణగా నిలిచాడు. కష్టాలను అనుభవిస్తున్నప్పుడే కాక కురుక్షేత్రం అనంతరం రాజ్యం చేతికి వచ్చాక కూడా అనేక భోగ భాగ్యాలను అనుభవిస్తున్నప్పుడు కూడా భక్తిమార్గాన్ని విడువక స్థిర చిత్తముతో వున్నాడు. భక్తి అంటే ప్రతి ఫలవాంఛ చేత కలుషితం కాని నిర్మల ప్రేమ. భక్తిమార్గంలో మనస్సును ఎప్పుడూ భగవంతుని పైనే నిలిపి వుంచాలి. ఏ దైవాన్ని ఆరాధించినా కూడా మన ప్రతీ మాట, చేసే ప్రతీ క్రియ ప్రేమతో నిండి పవిత్రముగా వుండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here