భలే ఆలోచన

0
8

[బాలబాలికల కోసం ‘భలే ఆలోచన’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]తా[/dropcap]తయ్య ఎక్కడ తిరిగొచ్చినా తను చూసిన విశేషాలు నన్ను పక్కన కూర్చోపెట్టుకుని అన్నీ చెప్పేవాడు.

ఓ రోజు తాతయ్య పక్క బజారుకి వెళ్ళివచ్చి సోఫాలో కూర్చుని, “ముకుందా ఓగ్లాసు చల్లని నీళ్ళు ఇవ్వరా” అన్నాడు. తాతయ్య నీళ్ళు తాగాక “తాతయ్యా ఈ రోజు విశేషాలు ఏమిటి?” అడిగాను.

కాస్తంత సేద తీరి తాతయ్య ఇలా చెప్పాడు.

“ముకుందా ఈ రోజు నా స్నేహితుణ్ణి చూద్దామని వెళ్ళాను కదా, వాడిని చూసి మాట్లాడి ఇంటికి వస్తున్నాను. మరి బజారు రోడ్డు దాటాలి కదా! దాటుదామని చూస్తే వచ్చే కార్లు పోయే కార్లు ఆటోలు, స్కూటర్లు వాటికేసి బేల చూపులు చూస్తూ ఎలా ఈ ట్రాఫిక్  ఎలా దాటాలబ్బా అనుకుంటుండగా నన్ను గమనించిన ఓ అబ్బాయి నా వెనుకే వచ్చి “రండి తాతా, నేను మిమ్మల్ని రోడ్డు దాటిస్తాను” అని జాగ్రత్తగా నా చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించి మరలా జాగ్రత్తగా రోడు ఆవలి వైఫుకు వెళ్ళాడు. కేవలం నన్ను రోడ్డు దాటించడానికే అతను నాకు సహాయం చేసాడు. చిత్రమేమిటంటే అతనికి కుడికాలు మోకాలునుండి లేదు! కర్ర ఊతంతో నడుస్తున్నాడు. అతని చేతిలోని ఊత కర్ర, నా పెద్దతనం చూసి ట్రాఫిక్ స్లో అయిపోయింది. అతని సహాయం చేసే గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాను.

“నిజమే తాతయ్యా అతన్ని మెచ్చకోవాలి. మనకు చేతనైనంత సహాయం అటువంటి వాళ్ళకు చెయ్యాలి, ఇంతకూ అతను ఎక్కడ ఉంటాడో కనుక్కున్నావా?” అడిగాను.

“అడిగాను, అతను పక్కన రాములవారి గుడి పక్కన సందులో ఉంటాడట” చెప్పాడు తాతయ్య.

“అవునా దగ్గరే ఒకసారి ఇద్దరం వెళ్ళి పండ్లు కొని ఇద్దాం” చెప్పాను.

“మంచి ఆలోచన రా ముకుందం”

ఓ ఆదివారం నేను తాతయ్య అతని ఇంటికి పండ్లతో వెళ్ళాము. అది ఒక పాత చిన్న పెంకుటిల్లు.

ఇంటి ముందరే కూర్చుని ఉన్నాడు అతను. మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయి, “ఏం కావాలి సార్?” అని తాతయ్యను అడిగాడు.

“ఏమీ వద్దు నీవు చేసిన సహాయం నా మనవడితో చెబితే నిన్ను చూసి నీకు థాంక్స్ చెప్పడానికి వాడు వచ్చాడు” చెప్పాడు తాతయ్య.

“ఆ చిన్నవిషయానికెందుకు సార్ థాంక్స్, పెద్ద వాళ్ళకి సహాయపడాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది” అని ఊతకర్ర సహాయంతో నిలబడటానికి ప్రయత్నించాడు.

“కూర్చో బాబు” అని తాతయ్య చెప్పాడు.

అతను కూర్చున్నాక పండ్లు ఇచ్చాను.

“ఇవన్నీ ఎందుకు సార్, మీ దీవెనలు చాలు” అని మంచి మనసుతో అన్నాడతను.

“నీ ఆరోగ్యం జాగ్రత్త.. చదువుకుంటున్నావా?” అడిగాడు తాతయ్య.

“అవును సార్ ఇంటర్ చదువుతున్నాను” చెప్పాడు. అతనికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళాము.

నాలుగు రోజుల్లో నా పుట్టిన రోజు వస్తోంది. మరి కేకులు, స్వీట్సు పంచకుండా గుర్తుండిపోయే మంచి పని చేద్దామనుకున్నాను. ఈ విషయం తాతయ్యతో చెప్పాను.

“మంచి ఆలోచన ముకుందం, ఇంతకూ ఏంచేద్దామనుకుంటున్నావు?”

“ఏం లేదు తాతయ్యా నీకు హెల్ప్ చేసిన ఆ కుర్రాడు బీదవాడు, కాలు ప్రాబ్లమ్ ఉన్నవాడు. చదువుకుంటున్నాడు. అందుకని నేను దాచుకున్న డబ్బు, మరికొంత నాన్నను అడిగి ఓ వీల్ చెయిర్ కొని అతనికి మా ఫ్రెండ్స్ అందరితో కలసి ఆ చెయిర్ ఇద్దామని అనుకొంటున్నాను” నామనసులోని మాట చెప్పాను.

“అబ్బా, భలే ఆలోచన రా, మీ నాన్నను డబ్బు అడక్కు, నేనే ఇస్తాను. అందరం కలసి ఆ అబ్బాయికి వీల్ చెయిర్ ఇద్దాము” చిరునవ్వుతో చెప్పాడు తాతయ్య.

“మా మంచి తాతయ్య” అని తాతయ్యను ఆప్యాయంగా కౌగలించుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here